"అయ్యగారా ఆయనెందుకు పని చెయ్యడం, అమ్మగారు సంపాదిస్తున్నారుగా, సంపాదించడం అమ్మవంతు. ఖర్చుచేయడం అయ్యగారి వంతు!"
"అయ్యా పని నిండా బాగుంది! చక్కగా యెంత డబ్బు కావల్సినా అమ్మ యిస్తుంది. క్లబ్బులో పేకాడడం, తాగడం, తిని పడుకోడం, హవ్వా అందరి మొగాళ్ళకి అమ్మగారిలాంటి పెళ్ళాలుంటే యెంత బాగుంటుంది!"
"అయ్య మేడమీద యేం చేస్తారా? బుడ్లు పెట్టుకుని తాగుతాడు. ఆ తర్వాత నిద్రపోతాడు!"
ఇలా మాట వచ్చినప్పుడల్లా సుజాత యేదన్నా ఆయన విషయం ఎత్తే సరికల్లా హేళనగా నవ్వుతూ యేదో మాట విసిరేవాడు నాయరు. పనిమనిషి, నాయరు యిద్దరూ ఆవిడ గురించి ఆయన గురించి నిరసనగా, హేళనగా మాట్లాడుకోవడం చాలాసార్లే వింది సుజాత ఇంటి యజమానుల గురించి పనివాళ్ళు అంత నీచంగా మాట్లాడుకోవడం బాధనిపించేది.
వాళ్ళ మాటలు నమ్మకూడదనుకున్నా, ఇంటిలో పరిస్థితి చూస్తే నిజమని నమ్మక తప్పలేదు సుజాతకి. ఆ భార్యా భర్తలమధ్య సంబంధం అలా ఎందుకుందో దాని కథ యేమిటో మాత్రం ఆమెకి తెలియలేదు.అసలు విషయం పనివాళ్ళకీ తెలియదని సుజాత గ్రహించింది.
కల్యాణి దగ్గిర ఆయన ప్రసక్తి తెచ్చే ధైర్యం సుజాతకి లేక పోయింది. సుజాత వచ్చిన రెండో రోజున మాత్రం గాబోలు - "చూడు సుజాతా, ఆ గది మావారి గది, ఆయన యింటిలో లేని సమయాల్లో ఆ గదిలోకి వెళ్ళి కాస్త అన్నీ సర్దాలి. ఎక్కడి వక్కడ పారేస్తారు. స్టేండునిండా మాసినబట్టలుంటాయి. చూసి ఉతికించాల్సినవి ఉతికించి, చాకలికి వేయల్సినవి వేయించు. ఆయన యింటిలో లేనపుడే గది అదీ తుడిపించాలి. ఉండగా యెవరూ వెళ్ళడం ఆయన కిష్టం వుండదు" అని మాత్రం చెప్పింది. తరువాత ఆయన ప్రసక్తి యే విషయంలోనూ కల్యాణి ఎత్తలేదు.
తరువాత సుజాత ఒకసారి "రవి నాన్నగారు భోజనానికి సరిగా యింటికిరారే? రోజూ ఫలహారాలు, భోజనాలు వేస్టు అయిపోతున్నాయి" అంది. ఆ మాటకి పేపరు చదువుతున్న కల్యాణి ఒక్కక్షణం సుజాత మొహంలోకి చూసి పేపరు మొహానికి అడ్డుపెట్టుకుని. "ఆయనకి లక్ష మంది ఫ్రెండ్స్, క్లబ్బులు ఎక్కడో తినేస్తూంటారు. ఏం చెయ్యడం? ఏ వేళకి యింటికి వస్తారో తెలియదు గదా. భోజనం వుంచకపోతే యెలా?" అంది.
"మీరు చెప్పకూడ...."
మధ్యలోనే ఆవిడ మొహం చిట్లించి "చెపితే వినేరకం అయితే బాగానే వుండును. కానీ ఎవరి కర్మానికి ఎవరు కర్తలు" అంది. ఇంకేమడగలేక వూరుకుంది సుజాత.
9
కాలింగ్ బెల్ వినిపించి సుజాత ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోసి మేడమీదకి బయలుదేరింది. రంగారావు గదిలోకి అడుగుపెడుతూంటే ఆమెకి కాస్త భయం అన్పించి చెయ్యి వణికింది. ఆయన గదిలో వుండగా సుజాత ఆ గదిలోకి వెళ్ళడం అదే మొదటిసారి!
ప్రక్కమీద అస్తవ్యస్తంగా పడుకుని వంటిని వున్న లుంగీ చెదిరిపోయిన సంగతి కూడా గుర్తెరగనట్టు పడుకున్న ఆయన్ని చూసి సుజాత తొట్రుపడి ఒక్క అడుగు వెనక్కి వేసింది. అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచిన రంగారావు గుమ్మంలో నిల్చున్న సుజాతని చూసి కాస్త చకితుడయి లేచి కూర్చుని "నాయరు ఏడి?" అనడిగాడు. సుజాత బిడియంగా "నాయరు నిన్నటినించి పనిమానేశాడు" అంది కప్పు ఆయన మంచానికి దగ్గిరగా వున్న టీపాయ్ మీద పెడుతూ.
"ఏం? ఎందుకు?"
"చాలా రోజులనించి మానేస్తానంటున్నాడు, అసలు నేను వచ్చిం దగ్గిరనించీ మానేస్తానంటున్నాడు. ఆఖరికి నిన్న దెబ్బలాడి మానేశాడు" అంది.
ఆయన విసుగ్గా మొహంపెట్టి "బాగుంది. వాడుపోతే నాకెలా" అంటూ అర్దోక్తిలో ఆపేసి కప్పు అందుకున్నాడు. సుజాత చప్పున గది లోంచి బయటికి వచ్చేసింది.
నాయరు మానేయగానే ముందుగా సుజాతకి గుర్తువచ్చిన విషయం రంగారావు సంగతి. ఇన్నాళ్ళూ ఇంటిల్లిపాది పనులన్నీ తను చేస్తున్నా ఆయన పని యేదీ తను చెయ్యలేదు. ఆయనకి కాఫీ అందించడం ఎప్పుడొస్తే అప్పుడు భోజనం వడ్డించడం, రాత్రి తలుపుతీయడం అన్నీ నాయరు చూసుకునేవాడు. ఇప్పుడింక ఆయన పనికూడా తనే చూసుకోవాలన్న సంగతి గుర్తువచ్చింది సుజాతకి. మూడు నెలలుగా యింటిలోవున్నా ఆయన కంటపడితే సందర్భాలు చాలా తక్కువ. ఆయన గదిలోకి వెళ్ళి ఆయన అవసరాలు చూడాలంటే సుజాతకి కాస్త బిడియం బెరుకు అనిపించింది. ఆమాట కల్యాణే అంది. "చచ్చాం, ఈ నాయరు గాడు మానేశాడు. మరొకడు దొరికేవరకు తక్కిన పనులు యెలావున్నా నీవు చూసుకో గలిగినా ఆయనగారి పనులకి యెలా?" అంది.
"ఆయనకి ప్రత్యేకం చెయ్యడానికి యేముంది? సగం టైము యింట్లోనే వుండరు. కాఫీ యీయడం తప్ప పెద్ద పనేం చెయ్యాలి" అంది సుజాత.
"అది కాదు ఆయన గదిలో నీవు...." అప్రసన్నంగా సుజాత అక్కడికి వెళ్ళడం యిష్టం లేదన్న భావం స్ఫురిస్తూండగా అంది కల్యాణి. ఆయన త్రాగుడు మైకం సంగతి తెల్సిన కల్యాణి, సుజాతకి ఏం చెప్పాలో తెలియక "ఆయనకోసమన్నా ఎవరినయినా పెట్టుకోవాలి" అంటూ గొణిగింది.