Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 15


    అప్పుడింక విశ్రాంతిగా యే సోఫాలోనో కూర్చుని పేపర్లు, పత్రికలు, పుస్తకాలు చదువుతూ కల్యాణి వచ్చేవరకు గడపుతుంది. కల్యాణి రాగానే ఆమెతోపాటు సుజాతా భోజనానికి కూర్చుంటుంది. కల్యాణి నిద్రకి వెళ్ళిన తరువాత తనకి నిద్ర అలవాటు లేదు గనక ప్రక్కమీద వాలి ఏ పుస్తకమో చదువుతుంది. ఈ లోపల యెవరన్నా సీరియస్ కేసంటూ వస్తే వెళ్ళి చూసి నిజంగా సీరియస్ కేసయితే కల్యాణిని లేపాలి. ఆ తర్వాత పిల్లల ఆరిన బట్టలు తెచ్చి ఇస్తీ చేసేసరికి కల్యాణి లేస్తుంది. ఆవిడకి, సరస్వతమ్మగారికి కాఫీ యిస్తుంది.
    సాయంత్రం పిల్లలు రాగానే మళ్ళీ హడావిడి ఆరంభం: వాళ్ళు రాగానే పాలు, బ్రెడ్ యిచ్చి, మొహాలు కడిగించి బట్టలు తొడిగితే ఆడుకోడానికి వెడతారు. తరువాత సుజాత ముస్తాబయి, ఆ పూట వంటకి అన్నీ యిస్తుంది. పిల్లలు ఆదుకుని రాగానే దగ్గిర కూర్చోపెట్టుకుని హోం వర్కులు చేయించి ఎనిమిదివరకు చదువు చెపుతుంది. అప్పుడు పిల్లలకి భోజనాలుపెట్టి, నిద్రపోగొట్టి సరస్వతమ్మగారికి అన్నంపెట్టి కల్యాణి రాకకోసం చూడడం, ఆమె రాగానే భోజనంచేసి తలుపులు వేసుకుని మేడ యెక్కుతుంది. తొమ్మిదిన్నరకి పడుకోడం-ఇదీ ఆమె దినచర్య!
    చెప్పుకోడానికి పెద్ద కష్టపడే పనిలేనట్టు కనిపించినా ఉదయం లేచింది మొదలు ఒక్క క్షణం తీరనంత బిజీగానే వుండేది సుజాత. కాని ఆమెకి ఆ పనులన్నీ ఎటెండ్ అవడంలో విసుగు, అలసటగాని వుండేది కాదు. చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ చకచక పనులు చేసేసేది. ఎండలో ఆపసోపాలు పడుతూ, బస్సుకోసం పడిగాపులుపడి, రోజల్లా ఆఫీసులో కూర్చుని చేసే ఉద్యోగం కంటే, ఇంటిపట్టున వుండి చేస్తే యెంతో హాయిగా వుంది. అంతేకాక నిజం చెప్పాలంటే అక్కడికి వచ్చాక రకరకాల టిఫిన్లు, సుష్టుగా భోజనం హాయిగా ఫేనుకింద సుఖాలు అలవాటయి మనసులో దిగులు, ఆలోచనలు పోయి రెండు మూడు నెలల్లోనే సుజాతకి వళ్ళు వచ్చి రంగు వచ్చి మిసమిస లాడుతూంది!
    సుజాత అక్కడికి వచ్చి మూడు నెలలయినా ఆ యింట్లో యింటి యజమాని విషయం యే మాత్రం అర్ధంగాలేదు! ఆయన సంగతి, ఆయన ప్రవర్తన, ఆ యింట్లో భార్యాభర్తల నడవడి అంతా విచిత్రంగా కనిపించింది. అన్నాళ్ళయినా ఆ భార్యాభర్త లిద్దరూ మాట్లాడుకోవడం అన్నది ఒక్కసారీ సుజాత చూడలేదు. మాట్లాడుకోకపోవడమే కాక ఆయన పిల్లలు, ఆవిడ కలిసి యెప్పుడూ భోజనం చెయ్యడం, టిఫిన్ చేయడం కూడా సుజాత చూడలేదు. ప్రతీ సంసారంలో మాదిరి భార్య భర్తల అనుబంధం యే విషయంలోనూ ఆ యింట్లో భార్యా భర్తల మధ్య కనపడకపోవడం సుజాతకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
    రంగారావు దినచర్యే ఆశ్చర్యంగా వుండేది సుజాతకి. ఆయన పడుకోడానికి, లేవడానికి, భోంచెయ్యడానికి, ఇంట్లోంచి వెళ్ళడానికి, రావడానికి దేనికీ ఓ టైమంటూ వున్నట్టు సుజాతకి కనిపించలేదు. ఓరోజు ఉదయం పదకొండు గంటలకి లేస్తే మరో రోజు తొమ్మిది, పది-ఆయన యిష్టం! ఆయన లేవగానే బెల్ నొక్కితే నాయర్ కాఫీ తీసి కెడతాడు. స్నానం అదీ అంతా పైనే గనక యెప్పుడు స్నానం చేసేది సుజాతకి తెలియదు. ఓ రోజు తొమ్మిదికో, పదికో టిఫిను తినేవాడు. ఒకరోజు పదకొండుకి భోజనం చేసేవాడు. లేనిరోజున అదీ లేదు. ఒకరోజు ఇంటికి రెండుగంటలకి వచ్చి భోజనం చేసేవాడు. ఆయన భోంచేసినా మానినా, ఫలహారం తిన్నా తినకపోయినా అన్నీ అలాగే వుండిపోవాలి తప్ప చేయడం మానడానికి వీలులేదు. ఏ టైముకొచ్చి ఏది పెట్టమంటారో యెవరికీ తెలియదు గనక యధావిధిగా అన్నీ చేసివుంచాలి! ఆయన రాత్రి యింటికెప్పుడు వస్తాడో సుజాతకి తెలియదు. క్రింద పడుకునే నాయరు తలుపు తీస్తాడు.
    ఆయన యెక్కడికి వెడుతున్నదీ, ఏం చేస్తున్నది ఆ యింట్లో కల్యాణి యెప్పుడూ పట్టించుకోకపోవడం యేమిటో, భర్త తింటున్నదీ మానిందీ కూడా కనీసం అడగకపోవడం యేమిటో యెంత ఆలోచించినా అర్ధమయ్యేది కాదు. ఆ యింటిలో భార్యాభర్తలు యిద్దరూ యేదో ఒక హోటల్లో చెరో గదిలో వుండే అపరిచిత వ్యక్తుల్లా కనిపించేవారు.
    ఆయన కనీసం పిల్లలతోనయినా మాట్లాడడం, పిల్లలని ప్రేమగా దగ్గరకి తీసుకోడం సుజాత కంట యెప్పుడూ పడలేదు. ఆయన ఇంటిలో వుండేదే చాలా తక్కువ! ఆ వున్న టైములో నిద్రపోవడం.....మేలు కుంటే నాయరుని ఐసు తెమ్మనడం, గ్లాసుల చప్పుళ్ళు, తర్వాత యేవో పిచ్చిమాటలు, ఆ తర్వాత క్రిందకి వచ్చినప్పుడు మనిషి స్థిరంగాలేకుండా తూలిపోవడం- అది చూసి త్రాగుతారు కాబోలు అన్న సంగతి కొన్నాళ్ళకి గ్రహించింది సుజాత.
    ఆ యింటిలో ఆ భార్యాభర్తల మిస్టరీ గురించి సుజాతకి యెవరిని అడగాలో, ఏం అడగాలో తెలిసేదికాదు. మధ్య మధ్య మాటల్లో నాయరు యేవో వ్యంగ్యపు విసుర్లు విసురుతూండేవాడు. సుజాత మామూలుగా యేదన్నా అన్నప్పుడు.

 Previous Page Next Page