Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 15

   

      భర్త శత్రువుగా భావించే వ్యక్తిని, భర్తను అవమానించే వ్యక్తిని భార్య నిరసిస్తే ఆ భర్తకు కొండంత ఆనందాన్నిస్తుంది. తన భార్య తననే సమర్ధిస్తుందని, తనుపడే కష్టాన్ని గుర్తిస్తుందని ఆ భర్త గమనిస్తే ఆమె కోరికలు చాలావరకు తీరిపోతాయి. వాటిని తీర్చేందుకు భర్త రాత్రింబవళ్ళు ఆనందంగా శ్రమిస్తాడు.
   
    కాని ఇరిటేట్ చేయడం, శాసించడం తమ హక్కనే భావిస్తారు. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత మధ్యతరగతి ఆడది సాధిస్తున్నది శూన్యం..."
   
    మౌనికకు అవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి.
   
    "అలాగే మధ్యతరగతి యువతిలో చాలా మంచి కూడా ఉందమ్మా! ఆ మంచి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. కాని నీకు అలవాట్లు, బలహీనతలు తెలిస్తేనే మంచిదని చెప్పాను"
   
    "కట్టుబొట్టు ప్రత్యక్షంగా చూడాలంకుల్..... బయటకు వెళదామా?" అంది లిఫ్ట్ కేసి నడుస్తూ.
   
    మరికొద్ది నిమిషాల్లో రమణయ్య, మౌనిక ఒక గూడురిక్షాలో వున్నారు.
   
    "కోరి కష్టాల్ని కొనితెచ్చుకుంటున్నావేమోనమ్మా..."
   
    "లేదంకుల్.... ఐ షుడ్ బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ జె.జె. ఎంఫైర్- అది వారసత్వంగా రావడంతో నాకానందం లభించదు, సాధించుకుంటేనే సంతృప్తి...."
   
    రిక్షా మెల్లగా కదిలింది. రోడ్డు గతుకులుగా వుండడంతో రిక్షా కుదుపులకు లోనవుతుంది.
   
    రమణయ్య అంత పొడగరి కాకపోవడం, రిక్షా అలవాటుండడంతో రిక్షా ప్రయాణం అతనికి మామూలుగానే వుంది. కానీ మౌనిక పొడగరి కావడంతో రిక్షా టాప్ తగులుతోంది. పైగా కుదుపులు.... తలవంచుకుని ముడుచుకుని ఒద్దికగా కూచుంది.
   
    రిక్షా స్లోగా వెళుతోంది.
   
    "మీ దగ్గిర పనిచేసే వాళ్ళు కూడా రిక్షాలో వెళ్ళే స్థాయి దాటిపోయారు. మెర్సిడస్, బెంజ్ లలో దర్జాగా వెనుక సీటులో జారగిల పడవలసిన మీరు కొన్నివేల కోట్ల రూపాయల ఆస్థులకు వారసులయిన మీరు ఇలా ఒక అతి సాధారణ రిక్షాబండిలో, మెయిన్ రోడ్ లో వెళుతున్నారని ఎవరికయినా తెలిస్తే..." రమణయ్య ఆశ్చర్యం నుంచి కొద్ది కొద్దిగా తేరుకుంటూ అన్నాడు.
   
    గాలికి ముఖమంతా పర్చుకుంటున్న నల్లని పట్టుకుచ్చులాంటి జుత్తును అలవోకగా పైకి నెట్టుకుంటూ చిరునవ్వు నవ్వింది.
   
    రిక్షా చటుక్కున ఆగిపోయింది.
   
    "ఎందుకు రిక్షా ఆపావు...?" రమణయ్య రిక్షావాలాను ప్రశ్నించాడు.
   
    "మీ మీద రిక్షా ఎక్కేప్పుడే అనుమానం వచ్చింది. ఎక్కడికి పోవాలంటే అన్ని రోడ్లు తిప్పు అన్నారు. ఇప్పుడింకో అనుమానం వచ్చింది. ఇప్పుడేమో కోట్లు కోట్లు ఆస్థీ అంటున్నారు. అసలు నా రిక్షా డబ్బులిస్తారా అని పూర్తిగా అనుమానం వచ్చే ఆపాను" అన్నాడతను తలగుడ్డను విదిలించి తిరిగి తలకు పాగా చుట్టుకుంటూ.
   
    రమణయ్య ఆశ్చర్యపోయాడు.
   
    మౌనిక వసంతం వర్షించినట్లు ఫక్కున నవ్వేసింది. ఇంకా నవ్వుతూనే వుంది.
   
    ఒకింత సేపటికి రమణయ్య కూడా తేరుకుని నిండుగా నవ్వాడు.
   
    మౌనిక పర్స్ లోంచి ఓ వందనోటు తీసి రిక్షావాలాకు అందించింది.
   
    ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది.
   
    రిక్షా కదిలింది.
   
    "అదేంటమ్మా అంతిచ్చావ్?"
   
    "తక్కువా...?" అందమైన కనురెప్పల్ని అలల్లాడిస్తూ అడిగిందామె.
   
    "చాలా ఎక్కువ..."
   
    "పోనిద్దురూ..."
   
    బారులు తీరిన షాప్స్ వేపు ఆసక్తిగా చూస్తూ అంది.
   
    "అమ్మగారు..... ఇంతకీ నాకిచ్చింది నిజమైన నోటేనా?" తల వెనక్కి తిప్పి అమాయకంగా ప్రశ్నిస్తున్న రిక్షావాలను చూసి పెద్దగా నవ్వేశారు ఆ ఇద్దరు మరలా.
   
    మౌనిక వీధులవెంట నడచి వెళుతున్న యువతుల్ని పరిశీలనగా చూస్తోంది.
   
    సరిగ్గా రాత్రి 8-30కి రిక్షాను ఆపించాడు రమణయ్య.
   
    "కొద్దిగా ఆయాసం తీసుకొస్తానయ్యా" అంటూ రిక్షావాలా ప్రక్కనే వున్న టీ బంక్ లోకి వెళ్ళిపోయాడు.
   
    "నేను రెండు చుక్కలు టీ తాగేసి వస్తానమ్మా" అంటూ రమణయ్య రిక్షా దిగి ప్రక్కనే వున్న ఓ బంక్ కేసి నడిచాడు.
   
    మౌనిక మెడనొప్పిగా వుండడంతో ఒకింత రిలాక్స్ అవడానికన్నట్లు తనూ రిక్షాదిగి చుట్టుప్రక్కలకు చూపులు సారించింది.   
    ఆ ప్రక్కనే మూడడుగుల దూరంలో ఫుట్ పాత్ మీద కనిపించిన దృశ్యం మౌనికను ఆకర్షించింది.
   
    అక్కడ ఓ నడివయస్సు స్త్రీ మిరపకాయ బజ్జీలు వేడివేడిగా వేస్తుంటే ఆ ప్రక్కనే వున్న ఓ కుర్రాడు ఎగబడుతున్న కస్టమర్స్ దగ్గర డబ్బు తీసుకుంటూ బజ్జీలు అందిస్తున్నాడు.
   
    వాళ్ళు అవి చేతుల్లో పడుతూనే ఆత్రంగా తినేస్తున్నారు.
   
    మౌనికలో ఆసక్తి పెరిగి తనూ అక్కడకు వెళ్ళి వందనోటు తీసి ఆ కుర్రాడికి అందించింది.
   
    "ఎన్ని రూపాయలకు కావాలి?" ఆ కుర్రాడు ప్రశ్నించాడు.
   
    "అన్నీ కావాలి" అందామె నోరూరుతుండగా.
   
    కుర్రాడు ఆశ్చర్యపోతూ పెద్ద ప్లాస్టిక్ సంచిలో బజ్జీలు నింపి ఆమె కందించాడు.
   
    ఆమె వెంటనే ఒక బజ్జీని తీసి కొంత కొరికింది సుతారంగా.
   
    కారం కారంగా, ఉప్ప ఉప్పగా గమ్మత్తయిన రుచిని ఆస్వాదించింది. వెంటనే ఒకటి పూర్తిగా తినేసింది. కొంచెం కారమనిపించింది. మరొకటి కూడా పూర్తిగా తినేసరికి, నాలిక, పెదాలు మంటెత్తుతూ ఆమె కళ్ళవెంట నీళ్ళు రాసాగాయి.
   
    అంతలో రమణయ్య అక్కడకు వస్తూనే "ఏంటమ్మా..." అని ప్రశ్నించాడు.
   
    మౌనిక మంటగా వున్న నోటితో చెప్పలేక కళ్ళతో సైగచేస్తూ చూపించింది.
   
    "బజ్జీలా? ఆ సంచినిండా అవేనా? నువ్వు తినగలవామ్మా.... ఇంతకీ ఎన్ని కొన్నావు?"
   
    "ఒన్ హండ్రెడ్... ఓన్లీ ఒన్ హండ్రెడ్ కి ఇన్నిచ్చాడేం అంకుల్? బాగున్నాయి కాని ఇలా మంటపుడుతున్నాయి ఏంటీ?" నీళ్ళు నిండిన కళ్ళతో అమాయకంగా ప్రశ్నిస్తున్న మౌనికను చూసి ఆయనకో క్షణం బాధపడ్డాడు. అంతలోనే పెద్దగా నవ్వేస్తూ "ప్రతి దానికి వంద, వంద ఇవ్వక్కర్లేదమ్మా! డబ్బు నీ చేతితో ఖర్చు పెట్టే అవసరం నీకింతవరకు రాకపోవడంతో ఈ ఇబ్బందులొస్తున్నాయ్... ఆ మిగతావి తినకమ్మా... అలవాటు లేక అరగక యిబ్బంది పడాల్సి వస్తుంది" అంటూ ఆమె చేతిలో ప్యాకెట్స్ ని రమణయ్య తీసేసుకున్నాడు.
   
    రిక్షా తిరిగి బయలుదేరింది. మంటను తగ్గించుకునేందుకు రెండు పెదవుల్ని సున్నాలా చేసి గాలి పీలుస్తూ "మాధుర్ ని ఎప్పుడు చూపిస్తారంకుల్?"
   
    "ఇలాంటి కష్టాలు చాలా ఎదురవుతాయమ్మా..." అతనికింకా ఆమెనా ప్రయత్నం నుంచి విరమింప చేయాలనే వుంది.
   
    ఆమె విని కూడా "మాధుర్ ఎలా వుంటాడంకుల్?" అని ప్రశ్నించడంతో ఆమె పట్టుదల ఆయన కర్ధమయిపోయింది.
   
    "ప్రశాంతమైన వాతావరణంలో, వందల ఎకరాల మధ్య నిర్మించిన అద్భుతమైన బంగ్లాలో, పచ్చటి లాన్స్, ఫ్లవర్ బోర్డర్స్ ఎత్తుగా పెరిగిన అందమయిన చెట్లు, ఎగిరే పక్షులు, పట్టు పరుపులు, పర్షియన్ కార్పెట్స్, ఇజ్షియన్ ఫర్నిచర్, జపాన్ సౌండ్ సిస్టమ్స్, జర్మన్ ఫోటోగ్రాఫిక్ థింగ్స్, చైనా పింగాణి, రోమ్ సాండిలర్స్, ఫ్రాన్స్ స్ప్రేలు, అమెరికన్ గోల్డ్ మైన్స్ మధ్య, రోల్స్ రాయిస్, మెర్సిడస్, హోండా, క్రిస్ లర్ కార్లపై తిరగవలసిన నువ్వు ఎందుకో నా మనస్సును సరిపుచ్చుకోలేక పోతున్నానమ్మా...?"
   
    రమణయ్య బాధను ఆమె అర్ధం చేసుకోగలిగింది.
   
    "మీ బాధ నాకర్ధమయిందంకుల్. వారసత్వంలో తృప్తి లేదంకుల్. తాత, తండ్రులు శ్రమించి నిర్మించిన కొట్లలో కేవలం వారసత్వపు హక్కుగా మహారాణిలా బ్రతికినా తృప్తి వుంటుందా? వ్యక్తిత్వం వుంటుందా? ఈ వ్యవస్థ గౌరవిస్తుందా? సెల్ఫ్ మేడ్ లో ఎంత ఆనందముంటుందంకుల్? ఆ తృప్తి మా తాతగారికే సొంతం కావడం నాకెంత ఈర్ష్యగా వుంటుంది?   
    కష్టపడి పైకెదిగిన కోటీశ్వరుడు తన పిల్లలు సుఖంగా, ఏ కష్టమూ ఎరక్కుండా పెరగాలనుకుంటాడు. ఎంత స్టుపిడ్ లవ్ అది... అతను మరలా నేను కష్టపడి పైకొచ్చాను..... సెల్ఫ్ మేడ్ మేన్ ని అని చెప్పుకొని గర్వపడతాడు. ఇతరులు చెప్పుకుంటూండగా విని ఆనందిస్తాడు. తన పిల్లలు మాత్రం ఏ కష్టమెరక్కుండా సోమరిపోతులై సుఖించాలనుకుంటాడు. కెన్ ఉయ్ ఎక్స్ క్యూజ్ దెమ్...? నో... వాళ్ళను క్షమించకూడదు. తామంటే ఇదీ అని చెప్పుకునే బ్యాగ్రవుండ్స్ తో బ్రతికేవార్ని వారి ముందు గౌరవించినా వెనుక నవ్వేస్తారు. అలాంటి అసహ్యమయిన ఎదుగుదల, బ్రతుకు, సుఖాలు నాకు అక్కర్లేదు..." ఆమె గొంతులో ధ్వనించిన పట్టుదలకు, మొండితనానికి, అతఃమ విశ్వాసానికి రమణయ్య థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడు.

 Previous Page Next Page