Previous Page Next Page 
మధుకీల పేజి 14

    పలకలేదతను.
    "ఈ సంసారాన్ని ఒక గట్టుకి చేర్చవలసిన వాడివి ఇక నీవే! నీ చెల్లెలు పెళ్ళి బాధ్యత అంతా నీపైనే వుంది. దాన్ని ఓ తగిన అయ్య చేతిలో పెట్టి ఆ మూడు ముళ్ళూ వేయిస్తే నీ ధర్మం నిర్వర్తించినట్టవుతుంది--- జయకి అన్నివిధాలా తగినవాడు ఫణి. వాళ్ళిద్దరికీ జత బాగా వుంటుంది... కానీ ఫణి జయని చేసుకోవాలంటే నీవు... నీవు..." ఎంత చెప్పినా ఆ విషయం చెప్పివచ్చేసరికి సుందర్రావుకి నోరు పెగల్లేదు.
    "చెప్పండి నాన్నగారూ!"
    "లతని చేసుకోవాలి"
    కొన్ని క్షణాలు గడిచాయి. మౌనంగా వున్న కొడుకుని చూసి "మధూ" అని పిలిచేడు ఆయన.
    జవాబులేదు.
    "మధూ!"
    "నాన్నగారూ"
    "ఇది త్యాగమే బాబు! కాదన్ను కానీ చెల్లెలికోసం."
    "నాన్నగారూ!"
    "ఏం బాబూ!"
    "జయకోసం యీ త్యాగం చేయటానికి నేను సిద్ధమే. కానీ..."
    "చెప్పు బాబూ!"
    "లతకూడా తీసి వేయ తగ్గదికాదు---"
    "మరి..."
    "కానీ నేను ఇంతకు పూర్వమే. ఒకచోట కమిట్ అయ్యాను."
    "మధూ!"
    "అవును నాన్నగారూ! మీతో ఈ విషయం ప్రస్తావించాలని చాలారోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ సమయం రాలేదు. పైగా జయపెళ్ళి కానిదే నేను పెళ్ళి చేసుకోవటం బావుండదని ఆగాను."
    సుందర్రావు గుండెల్లో రాళ్ళు పడ్డాయి.
    "ఇది మీకు చాలా దుఃఖాన్నీ, నిరాశనూ కల్గిస్తుంది. కానీ లతకి మరో మంతి సంబంధం చేసి ఫణికి జయనిద్దాం."
    "గొప్ప నిర్వాకమేలే! విశాలాక్షి తన కూతురికి మొగుడ్ని వెతకలేని స్థితిలో లేదు. దాని కొడుక్కసం ఎవరైనా దాని కాళ్ళదగ్గరికి వస్తారు. మనం ఏమీ చెయ్యక్కరలేదు."
    అప్పుడే అటుగావచ్చిన అన్నపూర్ణ అడిగింది "యేమిటండీ" అని.
    "చూశావా పూర్ణా! నీ కొడుకెంత వాడయ్యాడో! ఎవర్నో పరేమించాడట, మనసిచ్చాడట. అందుకని లతని చేసుకోలేడట. నేనిచ్చిన మాటకంటే వాడిమాటే విలువైందట. పైగా లతకి ఎక్కడో మంచి సంబంధం చూస్తాడట... చూశావా! అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలొచ్చాక బిడ్డలా! గడ్డపారలు కానీ! వీళ్ళు మన ఆశల్ని కూలదొయ్యటానికి మన మనస్సుల్ని పాతెయ్యటానికీ పుట్టారేకానీ మనల్నుద్ధరించటానికి కాదే! పుణ్యంకొద్ది పిల్లలన్నారు. మనమేం పాపం చేశామో! చెప్పినమాట వినని కొడుక్కంటే హృదయశల్యం మరోటి వుండదు... ఛ! ఛ! మనిషి తన స్వశక్తి మీద ఆధారపడాలే కానీ యితర్లమీద ఆధారపడి బ్రతకకూడదు పూర్ణా! ఆ యాక్సిడెంటులో కళ్ళకంటే ప్రాణం పోయివుంటే---"
    "ఏమండీ" కేక వేసింది అన్నపూర్ణ.
    మధ్యలో ఆగిపోయాడు సుందర్రావు.
    "ఎందుకలా మీకై మీరు కించ పరుచుకుంటారు! మీరేమా దిగులుపడకండి. జయప్రదకి ఆ సంబంధమే ఖాయం చేస్తాను. విశాల కాళ్ళు పట్టుకుని అయినా పెళ్ళి చేయిస్తాను. ఈ వెధవ అంగీకరించకపోతే ఆగిపోతుందా పెళ్ళి! ఇంకో వెధవ వున్నాడుగా వాడినీ అడిగిచూద్దాం. అదీ కాదనిపించుకుంటే."
    "వద్దు పూర్ణా! మర్యాద పోయాక మనస్సుకి నెమ్మది వుండదు. అడిగి లేదనిపించుకునేకంటే--"
    "నాన్నా!"
    పలుకలేదు సుందర్రావుగారు.
    "అమ్మా!"
    అన్నపూర్ణ పలకలేదు.
    "మీరు నా పరిస్థితి విచారిస్తే నాపై ఇంతకోపం తెచ్చుకోరు. దయచేసి రేపటివరకూ ఆగండి. తర్వాత మీ ఇష్టం" అని లేచి వెళ్ళిపోయాడు మధు.
                           *        *        *
    'ఏమయ్యా సుందర్రావు? ఎలా వున్నావు?'
    పాపయ్యగారు వచ్చి పలుకరించారు, ఆ గొంతుక గుర్తుపట్టాడు సుందర్రావు.
    'నమస్కారం నమస్కారం! రండి పాపయ్యగారూ! కూర్చోండి. చూశారా నా గతి ఎలా అయిందో?'
    ఆత్మీయులనుకున్నవాళ్ళు పలకరిస్తే దుఃఖం రావటం సహజం.
    'ఊరుకో! ఊరుకో! ఏడిస్తే పోయిందిరాదు' 'పూర్వ జన్మకృతం పాపం వ్యాధి రూపేణా బాధలే! అన్నారు. అనుభవించక తప్పదు దేన్నయినా!'

 Previous Page Next Page