చదువుతున్న వీక్లీని పక్కకిపెట్టి లేచి వెళ్ళి తండ్రివద్ద కూచున్నాడు మధు. తను వచ్చినట్లుగా ఆయన పాదాలపై చేతులు వేశాడు.
"మధూ!"
"ఏం నాన్నగారూ!"
"కాఫీ తాగావా బాబూ!"
"తీసుకున్నానండీ"
ఓ క్షణం ఆగేడు సుందర్రావు.
"చూడు బాబూ! ఈ ఇంటికి యిప్పుడు అన్నిటా పెద్దదిక్కువి నీవే!"
"అలా అనకండి నాన్నగారూ! మీమాటే మాకు శిరోధార్యం. అంతా మీమాటే చెల్లిస్తాం."
జవాబు చెప్పలేదు సుందర్రావు.
"మీరు మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి నాన్నగారూ! మనోవ్యధ అన్ని జబ్బులకంటే ఎక్కువ.
నిట్టూర్చి అన్నాడు సుందర్రావు.
"జయప్రద పెళ్ళి చెయ్యాలి బాబూ!"
"తప్పకుండా నాన్నగారూ! విశాలత్తయ్యని అడిగొచ్చారుగా, మళ్ళీ నేను వెళ్ళి వస్తాను."
"విశాల వప్పుకుంది బాబూ"
"అయితే ఫణి ఒప్పుకోలేదా?"
"ఫణి అలాంటివాడు కాదు బాబూ! చాలా వినయవంతుడు. తల్లిమాట జవదాటడు."
"మరి..."
"అప్పుడు విశాల ఓ కండిషన్ పెట్టింది."
"కట్నం ఎక్కువ అడిగిందా?"
"ఆ ప్రసక్తే లేదు బాబూ"
"అయితే---"
"ఎలా చెప్పాలో నాకు తెలీటం లేదు."
"ఏమిటి నాన్నగారూ!"
"లతను నువ్వు చూశావా?"
"చూశాను"
"నీ అభిప్రాయం ఏమిటి"
'నా అభిప్రాయమా?'
'అవును. లత ఎలా వుంటుంది' కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అడిగాడు.
'లతకేం. చాలా బావుంటుంది, బంగారు తీగలా వుంటుంది.'
"లత గురించి ఇంకేం తెలుసు."
"ఏమీ తెలీదు నాన్నగారూ" బొంకేడు మధు.
"చూడటానికి లతలో ఏదైనా లోపంవుందా?"
"ఛ! ఛ! లతకేం? ఎవరో శత్రువులు తప్ప మరోమాట అనటానికి వీల్లేదు."
"కానీ..." సంకోచించారు సుందర్రావు.
మధు రెట్టించలేదు.
"కానీ- లతకు ఓ లోపంవుంది మధూ"
"ఏమిటి నాన్నగారూ?"
"ఆ అమ్మాయికి రేచీకటి బాబూ!"
"ఓస్ అదో పెద్దజబ్బా! ఏ విటమిన్స్ లోపిస్తే ఆ జబ్బు వస్తుంది. డాక్టర్ ని సంప్రదించేక మందు తీసుకుని కొంత ఆహారం మారిస్తే అయిదారు నెలల్లో చక్కనవుతుంది అంటారు."
"అదికాదు మధూ. ఆమెకి 'నిక్ట్ లోపియా' డాక్టర్ లాభం లేదన్నారు."
"అలా అయినా సూక్ష్మమైన వస్తువులు తప్ప అన్నీ కనిపిస్తాయిగా, ఇంకేం చిక్కు."
"అలా కాదు! ఆ అమ్మాయికి బొత్తిగా చూపులేదు రాత్రుళ్ళు నాలాగే."
"నాన్నగారూ!" కొత్తగా తెలిసినట్టు వింతగా వున్నట్టు ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును మధూ! అందుకే లతకి సంబంధాలు రావటం లేదు. జబ్బు దాన్ని పెళ్ళిచేసి తర్వాత లేనిపోని నిందలూ, బాధలూ పడేదానికంటే ముందుగా అన్నీ వివరించి అంగీకరించిన వాడికే ఇచ్చి చేస్తే లత జీవితం చక్కబడుతుంది."
"ఎవరు ఒప్పుకుంటారు నాన్నగారూ!"
ఆ మాటలు సుందర్రావులో భయాన్ని కలిగించాయి.
"గుడ్డివాడినయిన నన్ను ఇంత ప్రేమగా మీరు చూడటం లేదా? అలాగే..."
ఆయన మాటలకి అడ్డొస్తూ "మీ విషయం వేరు నాన్నగారూ! ఇరవయిదేళ్ళు కాపురం చేసిన అమ్మా, ఇరవయ్యేళ్లు పెంచి పెద్దచేసిన నేనూ, తమ్ముడు, చెల్లాయి- మీరు కన్నవారు. పెంచినవారు- మిమ్మల్ని బాగా చూసుకోవలసిన బాధ్యత, ధర్మంమాది పైగా మీది ఏక్సిడెంట్- మా విషయం వేరు ఆ విషయం వేరు."
"కొడుకుల్లో మాత్రం ముసలివాళ్ళయినా తలిదండ్రుల్ని వాళ్ళ గతికి వదిలి వెళ్ళేవారు లేరా?"
జవాబు చెప్పలేదు మధు.
"పోనీలే మధూ! ఇతర్లతో మీకు పోలికేమిటి? నేను దశరధునిలా గర్వించతగిన పిల్లలు మీరు. అందుకే నీపై ఓ గురుతర బాధ్యత మోపుతున్నాను... నిర్వహించవలసిన బాధ్యత నీపై వుంది."