సుజాత అక్కడికివచ్చి నెలరోజులయింది. నెలరోజులకే ఆ యింటి మనిషిలా ఎన్నో ఏళ్ళబట్టి వుంటున్నట్టు చనువు ఏర్పడి పోయింది అందరికి. పిల్లలయితే ఆంటీ, ఆంటీ అంటూ ఒక్కక్షణం వదలకుండా తిరుగుతున్నారు. కల్యాణి అయితే ఇంట్లో ఉన్నంతసేపూ 'సుజాతా' అంటూ ప్రతిదానికి పిలుస్తూ ఉంటుంది. ముసలావిడ ఆలనా పాలనా అంతా సుజాతే చూస్తూంటే ఆవిడ 'ప్రాణానికి సుఖంగా ఉందే అమ్మాయీ నీవు వచ్చాక అంటూ సుజాతని ఆప్యాయంగా చూస్తూంది.
ఆ యింట్లో సుజాత రాక నచ్చనివాడు నాయరు ఒకడే! వచ్చిన మర్నాటినించి సుజాత పెత్తనం చేతిలోకి తీసుకోడం, స్టోరు రూముకి తాళం పడడం-బజారు సరుకులకి తన చేతికి డబ్బు రాకపోవడం ఆఖరికి వంట సామానుకూడా కొలిచి యీయడం-ఇవన్నీ నాయరుకి వళ్ళుమండించే విషయాలుగా తయారయినా యేం చెయ్యాలో తోచని అసహాయ స్థితిలో సుజాతమీద కారాలు, మిరియాలు నూరడం, సణగడం, ఏం పని చెప్పినా విసుక్కుంటూ చేయడం, పొగరుగా సమాధానాలు చెప్పడం-అన్నట్టు నిర్లక్ష్యంగా, విసురుగా పనిచేయడం ఆరంభించాడు. మానేస్తానని బెదిరించడం ఆరంభించాడు. సుజాతకి, నాయరుకి యింట్లో రోజుకి కనీసం ఒకటి రెండుసార్లన్నా ఘర్షణ తప్పడంలేదు. సుజాత సాధ్యమైనంతవరకు నాయరు కోపతాపాలు, బెదిరింపులు లక్ష్యపెట్టకుండా తనపని తాను చేసుకుపోయేది. చూసీ చూడనట్లు వూరుకునేది. సుజాత చెప్పకపోయినా కొన్ని విషయాలు కల్యాణి చెవినిబడేవి. "కొన్ని కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వూరుకో సుజాతా. "మరీ కట్టడిచేస్తే వెధవ పోతాడేమో, మళ్ళీ ఇంకోడు దొరకడం కష్టం-ఇబ్బందవుతుంది" అనేది కల్యాణి.
"పోతే పోనీండి, వెధవ బెదిరింపూ వాడూనూ ఎలా చూస్తూ వూరుకోమంటారు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా యింటి యజమానులు త్రాగకుండా ముందుగా చిక్కటి ఫిల్టరు కాఫీ కలుపుకు తాగేస్తూంటే చూస్తూ వూరుకోమన్నారా? ఆయనంటే ఆలస్యంగా లేస్తారు. మీరు ఆరు గంటలకల్లా లేస్తారు గదా, కనీసం మీరన్నా తాగకుండా వాడు ముందు తాగుతుంటే రెండు మూడుసార్లు చెప్పినా వినడంలేదు. రెండుమూడుసార్లు చిక్కటి పాలు తీసుకుని గ్లాసుకు త్రాగి, ఆ వంతు పాలల్లో నీళ్ళుపోయడం, ఆ పనిమనిషికి వాడిష్టం వచ్చినప్పుడల్లా కాఫీ ఈయడం, వండమని ఇచ్చిన కూరలు, బియ్యం, పప్పులు సగం పనిమనిషికి ఇచ్చేయడం స్వయంగా చూశాను. ఇలాంటివన్నీ ఎంతకని చూస్తూ వూరుకోమన్నారు చెప్పండి. ఇవన్నీ చూస్తూ వూరుకోడానికా నన్ను మీరు పెట్టుకున్నది" సుజాతకి ఆవేశం వచ్చేసి వరసపెట్టి వాడి అరాజకం అంతా ఏకరువు పెట్టింది.
అన్నీ విని కల్యాణి "ప్చ్-నాకు తెలుసనుకో ఇవన్నీ నే చెప్పేది యేమిటంటే, వాడు మానేస్తే యిబ్బంది అవుతుందని భయం."
"మానేస్తే మానేయనీండి, వీడుచేస్తేమాత్రం వంట నాకూ వచ్చు. ఇంకోడు ఎవరన్నా దొరక్కపోయినా నేను చేసుకుపోగలను. అసలు ఈ వంటవాడితో గొడవ, దెబ్బలాటలు, హైరానాపడేకంటే ఆ వంటేదో నేనే వండుకుంటే ప్రాణానికి హాయిగా వుంటుందనిపిస్తుంది నాకు. వాడు మానేస్తానంటే యీసారి ఖచ్చితంగా చెప్పేయండి. చచ్చినట్టు ఉంటే ఉండు, లేకపోతే ఫో అనండి. మీకేం ఇబ్బంది లేకుండా నే చూడగలను" అంది సుజాత.
సుజాతవంక అభిమానంగా చూసింది కల్యాణి. "వంటకూడా నీచేత చేయించమంటావా; ఈ పనులన్నీ చాలక. సరే చూద్దాం. ఈసారి మరీ విసిగించినప్పుడు పొమ్మందాం. నీవు అంతా చూసుకోగలనంటే నాకు వాడి అవసరం యేముంది? హాయిగా యిల్లంతా నీ చేతిలో పెట్టేసి నిశ్చింతగా వుంటాను. వాడు పోతే మనశ్శాంతన్నా దక్కుతుంది నీకు" అంది కల్యాణి. నిశ్చింతగా బరువు, బాధ్యత అంతా సుజాతమీదే పెట్టి.
ఆ బరువు బాధ్యత అంతా సంతోషంగానే భుజాలమీద వేసుకుంది సుజాత.
8
అక్కడికి వచ్చిన రెండురోజులకి అన్ని విధాల ఆ ఉద్యోగం, ఆ ఇల్లు, యజమానులు నచ్చారని, ఉద్యోగంలో తను చెయ్యాల్సిన పనులు సులువైనవి, ముఖ్యమయినవి, అన్నివిధాలా తను ఆనందంగా సంతృప్తిగా వున్నానని, తన గురించి యే చింతా మీరు పడనక్కరలేదని తండ్రికి ఉత్తరం రాసి పడేసింది సుజాత.
అవును సుజాతకి ఆ ఉద్యోగం ఉద్యోగంలా అన్పించడంలేదు. ఏదో ఆ యిల్లు తన స్వంత యిల్లన్నట్టు, ఆ పిల్లలు తన పిల్లలన్నట్టు, తను పెళ్ళయి కాపురానికి వచ్చి, ఓ గృహిణిగా బరువు బాధ్యతలు చేపట్టి నట్టు అనిపించేది.
సుజాత దినచర్య-ఉదయం ఆరుగంటలకల్లా బెడ్ కాఫీ పట్టుకుని కల్యాణిని లేపడానికి వెళ్ళడంతో ఆరంభమవుతుంది. ఆవిడకి కాఫీ ఇచ్చి హాట్ వాటర్ బాయిలర్ స్విచ్ వేసి పిల్లలని లేపి, దగ్గిరుండి పళ్ళు తోమిస్తుంది. తరువాత క్రిందకి తీసికెళ్ళి పాలు త్రాగించి వాళ్ళకి చదవడానికి, రాయడానికి యేదో వర్కు యిచ్చి పుస్తకాలముందు కూర్చోపెడుతుంది. తరువాత నాయరుకి ఆ రోజు యేం టిఫిను చెయ్యాలో ఆ సామానుయిస్తుంది. ఆ తరువాత సరస్వతమ్మగారికి పళ్ళు తోమి కాఫీ ఇస్తుంది. ఈ లోపల కల్యాణికి స్నానం టైమవుతుంది. ఆరోజు ఆమె యేం చీర కట్టుకోవాలో యెంచడమూ సుజాత పనే! ఆవిడ వార్డ్రోబ్ లో హేంగర్లకి వ్రేలాడుతూ యేభై అరవై చీరలుంటాయి. ఆవిడ కట్టింది కట్టకుండా రోజు కొకటి చొప్పున కడుతుంది. ఆ అరవై చీరలు అయ్యే వరకు కట్టిన చీర కట్టడానికి రెండు నెలల తరువాతగానీ టర్న్ రాదు. రోజూ సుజాత ఒక చీర, మాచింగ్ బ్లౌజ్ తీసి పైన పెడుతుంది. కల్యాణి స్నానం చేశాక పిల్లలకి చేయించి వాళ్ళకి స్కూలు డ్రస్సులు, బూట్లు అని తొడిగి తొమ్మిదివరకు చదువునించి కదలకుండా కట్టడిచేసి క్రిందికి వస్తుంది. నాయరుకి వంటకి కావల్సినవన్నీ యిచ్చేసరికి కల్యాణికి టిఫిను టైమవుతుంది. కళ్యాణికి టిఫిను పెట్టి, ఆస్పత్రికి తీసికెళ్ళడానికి బోర్నవిటాకలిపి ఫ్లాస్కులో యిచ్చి ఆవిడని పంపిస్తుంది. కల్యాణి వెళ్ళేసరికి సగం పని తేరినట్టనిపిస్తుంది సుజాతకి. ఆవిడ అటు వెళ్ళగానే సరస్వతమ్మగారికి పనిమనిషి సాయంతో స్నానం చేయించి, బట్టలు మార్చి, హార్లిక్స్ ఈయటంతో అప్పటికి ఆవిడ పని ముగుస్తుంది. ఈ లోపల పిల్లల స్కూళ్ళకి టైమవుతుంది. వాళ్ళతోపాటు తనూ టిఫిను తిని, పిల్లల స్కూలు బ్యాగులు సర్ది వాళ్ళని స్కూలుకి పంపించేసరికి యిల్లు ఖాళీ అవుతుంది. నాయరు వంట పూర్తయ్యాక పిల్లలకి క్యారియరు సర్ది పనిమనిషి కిచ్చి సరస్వతమ్మగారికి యీయడంతో ఆ పూట పని పూర్తవుతుంది.