తన వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారని గ్రహించిన తర్వాత జస్వంతరావు వేపు తిరిగాడు.
"రండి! డాక్టర్లు పోస్ట్ మార్టమ్ ని మసి పూసి మారేడుకాయ చేసేలోపల మనం అక్కడికి చేరుకోవాలి! అర్జెంట్!" అని పరిగెట్టడం మొదలెట్టాడు.
జస్వంతరావు కూడా మిలటరీలో పనిచేసినవాడు కావడం వల్ల అలుపులేకుండా రాజాతోపాటు పరిగెడుతూనే ఉన్నాడు.
కొంతదూరం వెళ్ళాక -
అక్కడో రైల్వే ట్రాక్ ఉంది.
ఆ ట్రాక్ దగ్గర హటాత్తుగా ఆగిపోయాడు రాజా.
"ఏమిటి?" అన్నాడు జస్వంతరావు.
మెల్లిగా చెయ్యి జాపి చూపించాడు రాజా.
అటువైపు చూశాడు జస్వంతరావు.
అక్కడ -
పట్టాలకి ఉన్న షిప్ ప్లేట్లు తొలగించి ఉన్నాయి.
బహుశా ఇదికూడా బంద్ లో భాగం కావచ్చు -వాళ్ళ లీడరు చస్తే వాళ్ళకి బాధాకని ప్రజల ప్రాణాలంటే ఎవరికి లెఖ్ఖ?
బంద్ కాకపోతే ఇంకేదో ఉద్యమం కావచ్చు - సిద్దాంతం కావచ్చు.
ఎటుపోయి ఎటొచ్చినా - చచ్చేచావు చచ్చేది ప్రజలే!
హటాత్తుగా ఏదో అనుమానం తోచి, ఒంగి , పట్టాలకి చెవి ఆనించి విన్నాడు రాజా.
రెండు మూడు కిలోమీటర్ల అవతల ఎక్కడో రైలు వస్తున్నట్లు అర్ధం అయింది అతనికి! అతని వినికిడి శక్తి అమోఘం!
రైలు వచ్చేస్తోంది! వచ్చేస్తోంది!
రైలుని ఆపకపోతే ఘోరప్రమాదం తప్పదు!
కానీ ఆపడం ఎలా? ఎలా?
పట్టాలు రిపేరు చేసే పరికరాలు ఇక్కడ లేవు - కనీసం రైలు ఆపడానికి ఎర్రజెండా కూడా తన దగ్గర లేదు.
అతనికి ఆ క్షణంలో తనకి రాబోయే పదివేల కోట్లరూపాయల ఆస్తి గుర్తు రావడం లేదు!
ప్రమాదంలో ఉన్న పదివందలమంది పాసెంజర్లు మాత్రమే మనసులో మెదులుతున్నారు.
ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ శరవేగంగా వచ్చేస్తుంది.
ఆ ట్రెయిన్ లో - ఎయిర్ కండిషన్డ్ కోచ్ లో పడుకొని డేనియల్లి స్టీల్ నవల తాలూకు చివరి పేజీ చదువుతోంది - ట్రస్టీ సుందరం గారి గారాబాల కూతురు అయేషా ! మిస్సిండియా!
ఎలా? ఎలా? ఎలా?
క్షణంలో సగంలో - స్పురించింది రాజాకి. తాను ఏం చెయ్యవలసింది!
అక్కడ పట్టాలమధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ దగ్గర ఒక పట్టా అంచు కత్తిలా షార్ప్ గా ఉంది.
ఒక్కసారిగా ముందుకు వంగాడు రాజా.
తన ఎడమ భుజాన్ని పట్టాలఅంచుకు ఆనించి - బలంగా నొక్కాడు. రైలు పట్టా అంచు అతని భుజంలోకి దిగాబదిపోతున్నట్లు గుచ్చుకుంటోంది.
భుజాన్ని అలా నొక్కి పట్టి ఉంచి, ముందుకి జరిగాడు రాజా.
రైలుపట్టా అంచు అతని భుజాన్ని పట్టుకుని చీల్చడం మొదలెట్టింది!
ఎర్రటి కండ బయటికి వచ్చింది!
రక్తం ధారగా కారటం మొదలెట్టింది.
చటుక్కున లేచి నిలబడ్డాడు రాజా. జస్వంతరావు వేపు తిరిగి , "మీ షర్టు విప్పి ఇలా ఇవ్వండి" అన్నాడు.
మల్లెపువ్వులాంటి తెల్లటి షర్టు వేసుకుని ఉన్నావు జస్వంతరావు.
అర్జెంటుగా తన షర్టు విప్పి రాజాకి ఇచ్చాడు.
గాయంలో నుంచి స్రవిస్తున్న రక్తాన్ని బ్లాటింగ్ పేపరులాగా పీల్చేయ్యడం మొదలెట్టింది షర్టు.
క్షణాల్లో తెల్లషర్టు కాస్తా ఎర్రమందారంలాగా అయిపొయింది.
పట్టాల దగ్గర నిటారుగా నిలబడ్డాడు రాజా. ఎర్రగా మారిపోయిన జస్వంతరావు షర్టుని చేతిలో పట్టుకుని, దాన్నే ఎర్ర జెండాలాగా ఉపడం మొదలెట్టాడు.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ తుఫానులా దూసుకు వచ్చేస్తోంది.
ఇంజన్ డ్రయివర్ గంగారాం తుపుక్కున బయటకు ఉమ్మేసి, ట్రెయిన్ స్పీడు ఇంకాస్త పెంచాడు.
"లేట్ రన్నింగ్ తమ్మి! కాస్తనయినా కవర్ చేస్తే బాగుంటుంది!" అన్నాడు తన అసిస్టెంట్ యాకూబ్ తో.
గంగారాంకి యాభై ఏళ్ళు ఉంటాయి. అతని అసిస్టెంట్ యాకూబ్ కి పాతికేళ్ళు ఉంటాయి.
యాకూబ్ నీగ్రో ముస్లిం , కొన్ని తరాలక్రితం నైజాములు తనకి రక్షకులుగా ఉండడానికోసం అఫికానుంచి నీగ్రోలని తెచ్చి తమ కొలువులో వుంచుకున్నారు. వాళ్లనే సిద్దీలంటారు.
హైదరాబాద్ లో వాళ్ళు ఉండే క్యాంపు పేరు ఆఫ్రికన్ కేవలరీ గార్డ్స్, దాన్నే ఇప్పుడు ఏసీగార్డ్స్ అంటున్నారు.
"తమ్మీ! లేట్ రన్నింగ్ అని మనల్ని తిడతారు! ఇందాక వాడెవడో చెయిన్ లాగి మధ్యదారిలో దిగిపోయిండు! మరి లేట్ గాక ఏమవుతుంది? న సూపర్ ఫాస్ట్ లేదు! న తుఫాన్ మెయిల్ లేదు! అన్నీ లేట్ రన్నింగ్! అర్రే! ఈ చిత్రం ఇన్నావ్ తమ్మీ?"
"లేద్సార్!" అన్నాడు యాకూబ్ ఏమిటని అడక్కుండానే.
"మన రైల్వే మినిస్టర్ ఉన్నాడా?"
"ఉన్నాడు సర్!"
"ఆయన బిడ్డ బెంగుళూరు దగ్గర ఒక చిన్న ఉళ్ళో ఉంటది. ఆ పిల్ల రోజు మద్రాసు వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీలో చదువుకుంటది. ఆ అమ్మాయి రోజూ మద్రాసు వెళ్ళి రావడం కోసం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు కూడా ఆ చిన్న ఉళ్ళో అపుతున్నారు! అర్రె మినిస్టర్ లే ఇట్ల చేస్తుంటే ఇక పబ్లిక్ చెయిన్లు లాగారురా భాయ్?"
"అరె ఇస్కి!" అన్నాడు యాకూబ్.
ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ దడదడ ముందుకు దూసుకెళ్ళిపోతోంది.
రాబోయే ప్రమాదాన్ని గహించలేడు ఇంజన్ డ్రయివర్ గంగారాం.
పట్టాలకి ఫిష్ ప్లేట్లు తొలగించబడివున్నచోట నిలబడిన డైమండ్ రాజా ఎర్రజెండా లాంటి షర్టుని చూపిస్తూనే ఉన్నాడు.
మళ్ళీ తుపుక్కున ఉమ్మేసి యాకూబ్ తో అన్నాడు ఇంజన్ డ్రయివర్ గంగారాం.
"క్యారే యాకూబ్! నీకు షాదీ అయిందా?"
"లేదు సాబ్!" అన్నాడు యాకూబ్ సిగ్గుపడుతూ.
"మంచి పన్జేసినవ్! పెళ్ళిమాత్రం చేస్కోకు బిడ్డ! పరేషానయి మిడత లెక్క చస్తావ్!"
"వచ్చే ఇత్వారం నాడు నా నిఖా ఉంది సాబ్!" అన్నాడు యాకూబ్.
"చచ్చిందిర గొడ్డు!" అన్నాడు గంగారం నేట్టికోట్టుకుంటూ. "అరె హౌలే! షాదీ అయితే పిల్లలు పుడ్తారు! పిల్లలు పుడితే ఆళ్ళని ఇస్కుల్ కి పంపాల! మల్లా వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాల! సంపాదించి నీ వాల్లకి బెట్టాల! అందుకోసం అప్పులు చెయ్యాల! అడ్వాన్సులు తియ్యాల! జీతాలు పెర్గుతాయ్! కానీ అంతకు నూరు రెట్లు ధరలు పెరుగుతాయ్! పన్నులేయ్యడం పెర్గుతది. ఆఖరికి ముష్టోల్లు కూడా ఇన్ కమ్ టాక్సు కట్టాల్సినరోజులోస్తాయ్! అప్పుడు నీ హలత్ బురీ హలత్ అయిపోతుంది. నా లెక్క అయిపోతావ్! అర్రే యాకూబ్! మార్చిలోగా నేను ఇరవై వేలు ఇన్ కమ్ టాక్సు కట్టల్రా! ఎక్కడనుంచి తెస్తను బిడ్డా?"
"కట్టకుండా ఉర్కో ఉస్తాద్!" అన్నాడు యాకూబ్.
ఎక్స్ ప్రెస్ రైలు డైమండ్ రాజా నిలబడి ఉన్నచోటికి చాలా దగ్గరయిపోతుంది. ఘోరప్రమాదం ముంచుకు రాబోతుందని తెలియని గంగారాం అసిస్టెంట్ తో తన కడుపుమంట వెళ్ళగక్కుతూనే ఉన్నాడు.
"ఇన్ కంటాక్సు కట్టకుండా మనం ఉరుకుంటే సర్కార్ ఉరక ఉంటుందిర? ఇదే రైలుగాడి కింద తలపెట్టి సావమంటుంది. గరీబ్ గాళ్ళు పన్నులు తప్పక కట్టాలే తమ్మీ!"
"అమీరులు కట్టనక్కర్లేదా ఉస్తాద్?"
"నీ యవ్వ! నూటికి తొంభై పన్నులు గరీబులే కడతర్రా! - అమీరులు కట్టరు!"
"అర్రే! అట్లెట్ల ఉస్తాద్?" అన్నాడు యాకూబ్ ఆశ్చర్యంగా.
"ఇంటావా చెబుతా! నీకు జగన్ జీవరాం గుర్తా"
"పేరు విన్నాను సాబ్!"
"అయన సెంట్రల్ మినిస్టర్ గా ఉండే! ఆ బడా సాబ్ పదేళ్ళపాటు టాక్సు కట్టలేదు! ఎందుకు అంటే "యాద్ మర్చినా!" అని చెప్పిండు సలగ్గా"
"అరె ఇస్కి"
"ఇంకా ఇను తమ్మీ! ఈ సంవత్సరం టాక్సు బకాయిలిస్టు చూసినావా?"
చూళ్ళే!"
"ఇను ఇను! లక్షకి పైన బాకీ పెట్టిన వి.ఐ.పీ. లు వున్నారు. ఎవరంటావా - రాజేష్ ఖన్నా - మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ! మాజీ ఎంపి. అమితాబ్ బచ్చన్ - కొత్త ఎం.పీ. కాబోయే మానేసిండులే - శత్రుఘ్నసిన్హా గాయాన! ఇంకా ఎన్టీ రామారావు!"
"అరె! బడాబడా పేర్లు!"
"ఇంకా ఇను తమ్మీ! పొద్దుగాల నుంచి రాత్రి పడుకునే దాకా బీదోళ్ళ గురించి మాట్టాడే షభానా అజ్మి, రేఖా, డింపుల్ కపాడియా, సయిరాబాను, సంజయ్ ఖాన్, అస్రానీ, గోవింద, శశికపూర్.........."
"అర్రె ఇస్కి.........ఈళ్ళీవరి దగ్గరా డబ్బులు లేవంటావా ఉస్తాద్?"