Previous Page Next Page 
దీప పేజి 14


    "అత్తయ్యా! ఫాషన్స్ మార్చుకోలేనివాడు రేపు తనకి నచ్చిన పిల్లను కాదని నీవు మెచ్చిన పిల్లను పెళ్ళాడుతాడా? ఉహూ, నాకా నమ్మకంలేదు. సరేగాని అత్తయ్యా! నీకు నచ్చని పిల్లని తాను మెచ్చి ఆ పిల్లనే పెళ్ళాడుతానని మనూ అంటాడనుకో నీవేం చేస్తావు?"

 

    అన్నపూర్ణమ్మ ఆలోచిస్తూ వుండిపోయింది. కాసేపాగి "ఇలాంటి విషయాలు సమయం వచ్చినప్పుడు ఆలోచించవచ్చులే. ఇప్పటినుంచి అనవసర కంగారు" అంది.

 

    దీప ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఓ అరగంట తన ఇంటి విషయం దీప చెబుతుంటే వింటూ కూర్చుంది అన్నపూర్ణమ్మ. "ఈ పిల్లకి ఎంత ముందుచూపు! ఏం తెలివి? ఎంత జాగ్రత్త? ఏం ధైర్యం" అనుకుంది దీప గురించి. దీప వెళతానని లేచింది.

 

    "అప్పుడప్పుడు వచ్చి కనబడుతుండు. ఈ మధ్య రావటం తగ్గించేశావ్, నాలుగు రోజులకో సారయినా నిన్ను చూడకపోతే నాకు తోచదే దీపా!"

 

    "రోజూ నన్ను చూడొచ్చు. ఓపని చెయ్యరాదత్తయ్యా!"

 

    "ఏం చేయమంటావ్?"

 

    "నీకా వంటమనిషి అవసరం వుంది. మాకు సంసారం గడవటానికి డబ్బు కావాలి. నాన్నలాగా అప్పులతో సంసారం నడపటం నాకిష్టంలేదు. మీ ఇంటిలో రెండుపూట్లా వంట చేస్తాను. భోజనం మా ఇంటిలోనే చేస్తానుగాబట్టి వందరూపాయలిచ్చేసెయ్యి. దీంతో నీ రెండు సమస్యలు, నా ఒక సమస్య తీరుతుంది."

 

    "నీకేమన్నా పిచ్చి పట్టిందటే దీపా!"

 

    "ఉహూ! వంటకో మనిషి కుదురుతుంది. రోజూ నన్ను చూసినట్లూ వుంటుంది. మా సంసారానికి నెలకో వంద కావాలి. నా సమస్య తీరుతుంది. వంట చేయటం నేరంకాదే! ఈ ప్రపంచంలో దొంగతనం, రంకుతనం తప్ప మరేమీ తప్పుకాదు. నిజం అత్తయ్యా! పని చేయటానికి నేను సిగ్గుపడటం లేదు. అవసరం నన్నీ పని చేయమంటున్నది. ఇది సిగ్గు పడే విషయమా? తప్పా?"

 

    "తప్పా? తప్పున్నరా! ఎవరైనా వింటే నవ్విపోగలరు. ఓ నాడు మీ సంసారం జమిందారీ ఫాయిలో నడిచింది. పరిస్థితులు తారుమారయాయా, అలా అని-

 

    "ఆ అనే నలుగురికి నాలుగువేళ్ళు నోట్లోకి పోవటానికి ఇబ్బంది ఉండి వుండదు. ఏం చేస్తారు. ఏదో ఒకటి అనకపోతే వాళ్ళ నోరు ఊరుకోదు కుక్క మొరిగినట్లు మొరిగేబదులు, మాకో తోడునీడ చూపించవచ్చు కదా! ఓ మంచి పని చేయటానికి నలుగురు పోగుకారు. ఇది చెడ్డపని వేలెత్తి చూపటానికి మాత్రం వందమంది తయారవుతారు. అదీ అంటే లోక ధర్మం. లోకులు అని సమర్ధంపు."

 

    అన్నపూర్ణమ్మకి ఏం మాట్లాడాలో తెలియలేదు.

 

    "అత్తయ్యా! ఆ నలుగురిలో నువ్వూ ఓ దానివా! లేక అర్ధం చేసుకుంటావా, అత్తయ్యా! ఏదో ఒకటి చెప్పెయ్యి. రమ్మంటే రేపటినుంచి వంటచేసి పోతాను."

 

    "ఛీ... వంట చేయటం ఏమిటే దీపా!"

 

    "నేను తప్పనుకోటం లేదు. నీ దృష్టిలో తప్పయితే చెప్పమన్నానుగా!"

 

    "తప్పొ వొప్పో నాకు తెలియదు. చిన్నదానివి. ఈనాడు చితికిపోయిన సంసారం అయినా ఆనాడు హోదాగానే వుండేవారు. ఈనాడు కష్టం వచ్చిందని వంటలక్కవవుతావా? నువ్వు పదిసార్లు అడిగినా ఈ పని మాత్రం నా ఇంట్లో చేయనివ్వను. నా వద్ద ముఖమాటం దేనికే దీపా! డబ్బవసరమయితే కావలసింది పట్టుకెళ్ళు. వీలయితే తిరిగి ఇద్దువుగాని లేకపోతే లేదు." దీప మాటలకి మొదట నొచ్చుకుని తర్వాత స్పష్టంగా చెప్పింది అన్నపూర్ణమ్మ.

 

    "నేనం ముష్టిదాన్ని కాదు అత్తయ్యా. అప్పుచేస్తే తీర్చలేను. దానం స్వీకరించలేను."

 

    "ఛా....ఛా...అవేం మాటలే దీపా."

 

    "ఉన్నమాటే అత్తయ్యా."

 

    "తిరిగి ఇద్దువుగానిలే. డబ్బు కావాలంటే తీసుకెళ్ళవే దీపా."

 

    "ప్రస్తుతం అవసరంలేదు. ఇహపై అవసరం రావచ్చు. ముందు చూపుతో దారి చూసుకుంటున్నాను. వంటపని చేయటం తప్పయితే పోనీ, హోటల్ నడుపుతాను. పూరికూర, ఇడ్లీ, సాంబార్, పెసరట్, మినపట్, కాఫీ, టీ, ఓహ్ ఇన్ని పదార్ధాలున్న హోటల్ ఈ ఊరి మొత్తంమీద లేదు. ఎలావుంది అత్తయ్యా."

 

    "నా ముఖం లాగావుంది. ఇవేం బుద్ధులే దీపా. వింటే అమ్మ బాధపడదూ?"

 

    "అమ్మ, ఆవిడది నీ వయసే గాబట్టి బాధపడవచ్చు. అలవాటయితే ఏ బాధ వుండదు. అప్పుడే హోటల్ పెట్టానా, ఏమన్నానా? ముందుగా నువ్వు బాధపడిపోతున్నావు? ఆలోచించి అవసరాన్ని బట్టి ఏదో ఒకటి చేయాలి కదా! వస్తాను."

 

    దీప వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ వద్ద సెలవు తీసుకుని.

 

    "భగవంతుడా, ఈ పిల్ల సంగతి, వీళ్ళ సంసారం నువ్వే చూడాలయ్యా" వెళుతున్న దీపను చూస్తూ ఎక్కడో దేముడితో విన్నవించుకుంది అన్నపూర్ణమ్మ.

 

                                                                 13

 

    దీప ప్రయివేటుకి వెళ్ళబోతున్నది. పోస్టు రామయ్య ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. కవరుమీద లలిత పేరుచూసి అక్కను పిలిచి ఇచ్చింది. అక్క పేర బావరాసే ఉత్తరాలు దీప చదవదు.

 

    లలిత సంతోషంతో పొంగిపోతూ కవరు చించి లోపలున్న మడతలు పెట్టబడ్డ కాగితం తీసి చదివింది. సాంతం చదివి శోకాలు పెట్టింది. అది చూసి ఆదిలక్ష్మమ్మ "ఏమొచ్చిందే అమ్మా! ఏం జరిగిందే నా తల్లీ!" అని తనూ శృతి కలిపింది.

 

    దీప అక్క చేతిలో కాగితం లాక్కుని పూర్తిగా చదివి "ఆపండి, ఏమిటా ఏడ్పు. ఎవరూ చావలేదు" అంది.

 

    ముందు ఆదిలక్ష్మమ్మ దీప మాటలు వింటూనే నోరు మూసుకుంది. లలిత ఏడ్పు ఆపకుండానే అంది. "నీదేం పోయిందే, పోయేదేదో నాకు. అందుకు నే నేడుస్తున్నా. అప్పుడే మా మాట విన్నట్లయితే నాకీ కష్టం ఉండేది కాదు కదా!"

 

    "బావ ఏం రాశాడే!" ఆదిలక్షమ్మ అడిగింది.

 

    "ఏం లేదమ్మా, చిన్న బెదిరింపు లేఖ." "తాను మగ మహారాజుట. తానేం చేసినా లోకం ఏమీ అనదుట. తన్ని పెళ్ళాడటానికి ఆడపిల్లలు క్యూలో నిలబెడతారుట. తనకో కొడుకు కావాలి గాబట్టి పెళ్ళి త్వరలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. దీపతో ఈ సంగతి చెప్పి పెళ్ళి విషయం తాడో పేడో తేల్చు. నేను నీ వాడిగానే వుండాలంటే దీప నా భార్య కావాలి. అప్పుడు దీప నీవు సుఖంగా ఓ ఇంట్లోనే వుండవచ్చు. దీప కాదంటే నేను వేరేపిల్లను పెళ్ళాడుతాను. నీకూ ఆ వచ్చే పరాయి పిల్లకి పడకపోవచ్చు. అందుకని నీవు శాశ్వతంగా పుట్టింట్లోనే వుండే గతి పడుతుంది. దీపని వప్పించి నాకు ఏ విషయం ఉత్తరం రాయి" ఇదీ బావ రాసింది" దీప చెప్పింది.

 

    "ఎంత తేలికగా చెపుతున్నావే దీపా! నువ్వాయన్ని పెళ్ళాడకపోతే నా గతి శాశ్వతంగా ఇక్కడ కదే!" తలమీద పిడికిలి బిగించి మోదుకుంది లలిత.

 

    ఆదిలక్ష్మమ్మ నోరు తెరవలేదు.

 Previous Page Next Page