"పీటర్ ఫోరా?" అనుకుంది లత మనసులోనే.
ఆమెకి అర్ధం కాలేదని గ్రహించాడు బెన్సన్.
"పీటర్ ఫోర్ అంటే పోలీస్ వ్యాన్ అన్నమాట! కోడ్ పదం!"
అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది లత. అతనికి దూరంగా జరిగింది.
బెన్సన్ ఏదో చెపుతూనే ఉన్నాడు.
సగం వినపడుతోంది. సగం వినపడడం లేదు. సగమర్ధమౌతోంది. సగమర్ధమవటంలేదు.
పీటర్ ఫోర్... రెడ్డి... ముషీరాబాద్... లాకప్... కుంటి శివుడు... కమీషనర్... బెయిల్... రిజెక్టెడ్...
తర్వాత వినబడటం మానేసింది.
తల భారంగా అయిపోయింది.
శ్రీమంత్ కి ఆత్మవిశ్వాసం ఎక్కువనుకుంది. అతి కొద్దిగా పొగరనుకుంది.
కానీ ఇలా...
రెగ్యులర్ గా పోలీసులని కలుసుకుంటూ ఉండాల్సిన అవసరం రావటం...కొట్లాటలు... రౌడీలతో పరిచయాలూ, పోలీసుకార్ల ముద్దు పేర్లూ...
"ఎలాంటి మనిషి!"
లత ఒళ్ళు జలదరించింది.
"ఛీఛీ!"
"వస్తాను" అని చెప్పింది బెన్సన్ తో.
"లాకప్ కి వచ్చి శ్రీని చూస్తారా ఒకసారి!"
"చూస్తాను" అంది లత 'ఆలోచిస్తాను' అన్న భావం పలికిస్తూ.
"పెళ్ళి వచ్చేవారం పెట్టుకోవచ్చు" అన్నాడు బెన్సన్.
"పెళ్ళా! నన్ను కాదు. పీటర్ ఫోర్ ని చేసుకోమని చెప్పండి" అంది లత, పోతున్న ఆటోని ఆపి, ఫలాని చోటికని చెప్పకుండా ఎక్కేస్తూ.
* * *
అది ముషీరాబాదు సెంట్రల్ జైలు.
ఎత్తయిన కాంపౌండు వాల్. ఆ గోడ మీదనుంచి ఖైదీలు దూకి పారిపోయే ప్రయత్నం చెయ్యకుండా ఎలక్ట్రిక్ వైర్లు, గోడమీద అక్కడక్కడ ప్రకాశవంతమైన లైట్లు.
ఒక సెల్ లో కటిక నేలమీద వెల్లకిలా పడుకుని, తల కింద చేతులు పెట్టుకుని, ఎడమకాలు మడిచి, కుడికాలు ఎడమకాలు మీద వేసుకుని ఆడిస్తూ 'రోలింగ్ స్టోన్స్' ది పాత ట్యూన్ ఒకటి హమ్ చేస్తున్నాడు శ్రీమంత్. జైల్లో పడినందుకు బాధగానీ, అవమానం గానీ, అతని మొహంలో కనబడటంలేదు. తనకిది అలవాటే అన్నట్లు నిస్సంకోచంగా కనబడుతున్నాడు. జైలు వాతావరణానికి కొత్తవాడిలా లేడు అతను. ఆ సెల్ లో ఇంకా ముగ్గురు వున్నారు. వాళ్ళు ముగ్గురూ గుడంబా చేసేవిధం గురించి చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
"నానా చెత్తావేసి మురగబెడితేనేరా, గుడంబాకి కిక్ వచ్చేది" అన్నాడొకడు చేతికున్న స్టీల్ కంకణం పాలిష్ చేసుకుంటూ.
"ఔ! కుళ్ళిపోయిన యాపిల్ పండ్లూ, అరటి తొక్కలూ గూడా వేస్తారంట!"
"సూరత్ దేఖో! నీ యవ్వ! యాడ యాపిల్ పండ్లు బే, చచ్చిన పురుగులకెల్లి బల్లితోకల్ దాకా వేస్తరు" అన్నాడు కంకణం. అతని పేరు మహేష్.
మూడోవాడు విస్మయంగా చూశాడు. అతనికి తను తాగిన 'గుడంబా' చప్టీలన్నీ గుర్తొచ్చి కడుపులో తిప్పింది.
"చచ్చిన పురుగులేస్తరా! నేను నమ్మజాల!" అన్నాడు.
"ఖాదర్ పహిల్మాన్ పేరు విన్నావా తమ్మీ?" అన్నాడు శ్రీమంత్, తనకు సహజమైన సరదా ధోరణిలో కలగజేసుకుంటూ.
ఆ ముగ్గురూ తిరిగి చూశారు.
"ఏ ఖాదర్ పహిల్మాన్? ముసా..."
"కాదు! బాంబే! 'దాదర్ ప్రాంతానికి దాదా!' ఖాదర్!"
ఆ ముగ్గురిలో ఇద్దరు తెల్లకాయితాల్లాంటి మొహాలతో ఏ భావం లేకుండా చూశారు. మహేష్ మాత్రం కొంచెం కదిలాడు. అతని మొహంలో ఆసక్తి కనబడుతోంది.
"అవును! విన్నాను."
"ఖాదర్ పహిల్మాన్ కి కోపమొస్తే వళ్ళు తెలియదు. అతని ముఠాలో ఒకడు పోలీసులకి దొరికిపోయి ముఠా రహస్యాలు కొన్ని చెప్పేశాడు" అంటూ వాళ్ళ మొహాల్లోకి చూశాడు శ్రీమంత్.
ఉత్కంఠతో చూస్తున్నారు వాళ్ళు. "అప్రూవర్ గా మారినందువల్ల రెండేళ్ళ శిక్ష మాత్రమే పడింది వాడికి. రెండేళ్ళ తరువాత వదిలాక ఖాదర్ కి దొరికిపోయాడు వాడు. వాడికి కోర్టువారు చేసిన శిక్షకంటే పదింతలు శిక్ష వెయ్యదలుచుకున్నాడు ఖాదర్. రెండేళ్ళు జైల్లో వున్నాడు వాడు. రెండు పదులు ఇరవైవేళ్ళు - రెండు చేతులవీ, రెండు కాళ్ళవీ నరికాడు ఖాదర్. ఆ వేళ్ళు తన గుడంబా బట్టీలో పడేస్తే... దేఖ్ ర రాజా! 'ఆ రుచి ఎన్నేళ్ళయినా మర్చిపోలేం!' అనుకున్నారు ఆరోజు గుడంబా తాగిన జనం. ఎన్నేళ్ళు గడిచినా తెగినవేళ్ళు వాడు మర్చిపోలేనట్లు."
"నువ్వు బాంబేలో వుంటివా అన్నా?" అన్నాడు మహేష్ సగౌరవంగా.
"దాదర్!" అన్నాడు శ్రీమంత్ నిర్లక్ష్యంగా.
కటకటాల అవతల ఇనుపమడమల రెగ్యులేషన్ బూట్ల శబ్దం. "శ్రీమంత్ ఎవడుబే" అన్నాడు అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ పరుషంగా.
శ్రీమంత్ నిశ్చలంగా చూశాడు అతడిని.
"చప్పుడు చెయ్యరేమిట్రా? వీడేనా శ్రీమంత్?" అన్నాడు పోలీస్.
శ్రీమంత్ నిశ్చలంగా చూసి "నేనే" అన్నాడు తొట్రుపడకుండా.
"నీ కోసం ఎవడో వచ్చిండు! నడు!" అని అతనితో చెప్పి, తర్వాత మహేష్ వైపు తిరిగి, తను అడగగానే సమాధానం చెప్పనందుకు తిట్టిన బూతు తిట్టకుండా రెండు నిమిషాలసేపు తిట్టాడు పోలీస్. పోలీసుల్ని ఎదురించడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు మహేష్ కి. అందుకే నోరెత్తకుండా వుండిపోయాడు.
శ్రీమంత్ నిదానంగా లేచి బట్టలు దులుపుకున్నాడు.
"నీది ఏ భాష" అన్నాడు పోలీసుతో.
"ఏమంటున్నావ్" అన్నాడు అతను అర్ధం కానట్లు.
"నీ మాతృభాష తెలుగయినా, ఉర్దూ అయినా, ఫార్సీ అయినా, బ్రదర్! ప్రతిభాషలోనూ మర్యాదగా మాట్లాడే పద్దతి ఉంటుంది. ఏ స్కూల్లో చదివావు నువ్వు? లేకపోతే అసలు స్కూలు కెళ్ళలేదా?"
రెండు కిలోల తూకం రాయిలావున్న పిడికిలితో శ్రీమంత్ దవడ మీద శక్తి కొద్దీ కొట్టాడు పోలీసు అతని చేతి విసురుతో సమానంగా చటుక్కున పక్కకి తిరిగాడు శ్రీమంత్.