Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 14

దెబ్బతో ఫోర్సు సగం తగ్గినా, అతని పెదిమ చిట్లింది.
ఎడమచేతితో పెదిమకంటిన రక్తం తుడుచుకుంటూ లేచాడతడు.
పోలీస్ అతడి కాలర్ ని మెడదగ్గర పట్టుకుని, గెంటుకుంటూ చెప్పరాని బూతులు తిడుతూ బయటికి తీసుకెళ్ళాడు. బయట విజిటర్స్ రూంలో బెన్సన్ కూర్చుని వున్నాడు. శ్రీమంత్ ని లోపలికి పంపి, కాస్త దూరంలో కూర్చున్నాడు పోలీస్.
చిట్లిన అతడి పెదిమలు చూసి "అత్తగారింట్లో అప్పుడే వడ్డన మొదలయిందా బాస్!" అన్నాడు అదేదో జోకయినట్లు నవ్వుతూ.
పట్టించుకోకుండా "లత వచ్చిందా?" అన్నాడు శ్రీమంత్.
"అక్కడికి వచ్చింది. ఇక్కడికి రానంది."
మౌనంగా చూశాడు శ్రీమంత్.
"ఏమని చెప్పావు నువ్వు?"
బెన్సన్ జరిగినదంతా చెప్పాడు.
"షాకయిపోయి ఏమీ అఘాయిత్యం చెయ్యదు కదా?" అన్నాడు శ్రీమంత్. అతని మొహంలో మొదటిసారిగా కొంచెం ఆందోళన కనపడింది.
"ఆడపిల్లల్లాగా మాట్లాడకు! ఆమెని అనుక్షణం కనిపెట్టే ఉంటాం మేము! వర్రీ కాకు బాస్!"
పెదిమలు బిగించి తలూపాడు శ్రీమంత్ సాలోచనగా.
బెన్సన్ లేచాడు.
"ఎలా వుంది కూలర్?"
కన్నుగీటాడు శ్రీమంత్, "అన్నం ఒకొక్క మెతుకూ చిటికెన వేలంత వుంది. అందరికీ కంపల్సరీగా రోజూ నాన్ వెజిటేరియన్ మీల్సు - అంటే అన్నంలో పురుగులన్నమాట! బగ్స్..నల్లులు...బాబోయ్!"
"బగ్స్ సరే బగర్స్ ఏమంటున్నారు?" అన్నాడు పోలీస్ వైపు తల ఊపుతూ.
విజిలేశాడు శ్రీమంత్. "మామూలే"
బెన్సన్ నవ్వుతూ అతని భుజంతట్టి, "ఓకే! బాయ్! వెళుతున్నాను" అన్నాడు.
"బెన్సన్!"
భుజం మీదుగా చూశాడు బెన్సన్.
"లత!"
"ఆమె బాధ్యత నాది. ఓకే!"
శ్రీమంత్ లేవగానే అప్పటి దాకా పిన్నుతో పళ్ళుకుట్టుకుంటున్న పోలీస్ లేచాడు. అతనితోబాటు మళ్ళీ సెల్ లోకి నడిచాడు శ్రీమంత్. సెల్ దగ్గరికి రాగానే చటుక్కున ఆగాడు. పోలీస్ అదే వూపులో రెండు అడుగులు ముందుకు వేసేసి ఆగబోయాడు.
హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు బిగించి, అతని వెన్నెముక మీద మోకాలితో బలంగా తన్నాడు శ్రీమంత్.
కానిస్టేబుల్ సెల్ లో పడ్డాడు. ఉరికి అతని మీద పడ్డాడు శ్రీమంత్.
మరుక్షణంలో గందరగోళం! విజిల్స్! సైరన్స్! బూట్ల టకటకలు!
    
                                                                      * * *
    
వికలమైపోయిన మనసుతో రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఆటో ఎక్కిన లత పంటితో పెదిమని కొరికి పట్టుకుని అలా కూర్చుండిపోయింది.
ఆమె పరిస్థితి గమనించి, మాట్లాడకుండా ఒక వంద గజాలు పోనిచ్చిన తరువాత ఆటో అతను అడిగాడు.
"ఎటు వెళ్ళాలమ్మా?"    
".........."
"ఎక్కడి కెళ్ళాలి?" అన్నాడు మళ్ళీ.
"ఊ!" అంది లత, అప్పుడే అతని మాటలు వినబడినట్లు.
"ఎక్కడికెళ్ళాలి"
"టెలిఫోన్ ఎక్స్ ఛేంజి! లక్డీకాపూల్!" అని చెప్పి, నిస్సత్తువగా సీటుకి జారగిలబడిపోయింది లత.
ఆమెకి తల్చుకుంటే విస్మయం కలిగింది-
శ్రీమంత్ తో ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ ఛేంజిలో పరిచయం, రెండోసారి కలుసుకున్నప్పుడే అతను పెళ్ళి విషయం జోక్ గా చెప్పడం, ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే పెళ్ళిచేసుకొమ్మని తను కోరడం, కాఫీ తాగడానికి హోటల్ కెళ్ళినంత సునాయాసంగా తామిద్దరూ రిజిస్ట్రార్ దగ్గర అప్లికేషన్ దాఖలు చెయ్యడం.....పెళ్ళి రిజిస్ట్రేషన్ రోజున అతను జైల్లో వుండడం...
ఇదంతా నిజమేనా? లేకపోతే కలా! తనేనా, లతేనా,  హైస్కూలులో చదువుకుంటున్న టీనేజ్ అమ్మాయిలాగా అమాయకంగా ముక్కూ మొహం తెలియని అతని మాటలు నమ్మేసి పెళ్ళిమాటలదాకా రానిచ్చింది?
పెళ్ళిట!
పెళ్ళికోసం తపించిపోవడం లేదు తను! కానీ పెళ్ళి తప్పనిసరి అని ఒక భావన వుంది తనకు. ఈ లోకంలో సతీష్ లూ, రామారావు మామయ్యలూ అడుగడుక్కీ ఉండే ఈ ప్రపంచంలో పెళ్ళి కాకపోతే వచ్చే పేచీలు, పెళ్ళయితే భర్త వలన దొరికే భద్రతా తనకు తెలుసు!
ఆ సమయంలో  -
శ్రీమంత్ తో పరిచయం -
అది స్నేహంగా మారకముందే ప్రేమ!
ప్రేమ చిక్కబడక ముందే పెళ్ళి ప్రస్తావన!
ప్రేమబీజం నాటుకుంది తన మనసులో! అపుడే అది కొద్దిగా అంకురించింది. ఇంకా పూర్తిగా వేళ్ళు పాతుకోలేదు. చిగురించలేదు.
కానీ అది పుచ్చిపోయిన గింజ అని ఇప్పుడు తెలుస్తోంది.
అంకురించడంతోనే అంతరిస్తోంది!
అబ్బ! రౌడీలు-పోట్లాటలు-పోలీసులు-లాకప్పులు!
ఇంత జరిగినా ఏమీ జరగనట్లు మామూలుగా మాట్లాడుతున్న అతని ఫ్రెండు.
ఛీఛీ!
ఆటో ఆగింది.
దిగి పదిరూపాయలు అందించి, చిల్లర తీసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా లోపలికి పోబోయింది లత.
"అమ్మా! చిల్లర తీసుకోండి!" అన్నాడు ఆటో అతను.
యాంత్రికంగా అందుకుంది.

 Previous Page Next Page