చటుక్కున అర్ధమైపోయింది లతకు.
పనిమనిషి యాదమ్మ చెయ్యి పట్టుకొన్న మామయ్య.
తను చీరె మార్చుకుంటున్నప్పుడల్లా 'కాకతాళీయంగా' లోపలకు తొంగి చూస్తుండే మామయ్య.
తనెప్పుడన్నా అకస్మాత్తుగా వెనుతిరిగి చూస్తే, తనవైపే గుడ్లప్పగించి చూస్తూ కనబడే మామయ్య.
ఆయనేనన్నమాట ఈపుస్తకాలు తన దిండు కింద పెట్టింది!
మళ్ళీ దగ్గు వినబడింది.
లత చాలా ధైర్యస్తురాలే!
కానీ ఆ క్షణంలో ఏదో చెప్పలేని భయం ఆవహించింది.
తను ఇక ఆ రాత్రికి నిద్ర పోలేననుకుంది. అలాగే కళ్ళు తెరచుకుని పైకప్పు వంక చూస్తూ, నిముషాలు లెక్క పెట్టసాగింది.
ఆ పుస్తకాలు చదివి, వెర్రెక్కిపోయి, తనవెంట పడుతుందనుకున్నాడు కాబోలు!
తన నిస్సహాయ పరిస్థితి మీద తనకే కోపమొచ్చింది లతకి.
మామయ్య రాత్రి చాలాసేపు దగ్గుతూనే ఉన్నాడు. తెల్లవారు ఝాము అవుతుండగా అత్తయ్య కాస్త పొర్లి, నిద్రలోనే, "ఏమిటా దగ్గు? రేపు డాక్టర్ దగ్గరకెళ్ళి చూపించుకోండి మర్చిపోకుండా!" అని మళ్ళీ నిద్రలోకి జారిపోయింది.
ఆ తర్వాత ఇంక దగ్గు వినబడలేదు.
* * *
ఐదింటికల్లా లేచేసింది లత. తలకి నూనె రాసుకుని, వంటినిండా పసుపు రాసుకుని, తీరిగ్గా తలంటుకుంది. తలంటిపోసుకుంటూంటే చిత్రమైన ఆలోచనలు! ఏవీ? మంగళవాయిద్యాలేవీ? మామిడితోరణాలేవీ? సన్నాయి ఏదీ? సన్నజాజి మాలలేవీ?
ఏవీ లేకుండానే తన పెళ్ళయిపోతోంది.
ఏమీ వద్దు తనకి! ఇష్టంగా చూసుకునే భర్త. కాస్త సెక్యూరిటీ ఉన్న జీవితం చాలు!
కిందటి వారం జీతం రాగానే పెళ్ళిరోజు కట్టుకోవడానికని ఆకుపచ్చరంగు వెంకటగిరి జమీచీర కొనుక్కుంది తను. ఆ చీరె శ్రద్దగా, అందంగా కట్టుకొంది లత. తను బాగా పొడుగ్గా ఉంటుంది. దాదాపు ఐదడుగుల ఆరంగుళాలు. అందుకని ఏ చీరె కొన్నా వెడల్పు సరిపోనట్లే ఉంటుంది. ఎంతో ప్రయత్నిస్తేగాని అందంగా కుచ్చెళ్ళురావు. అలా అని ఊరుకోదు తను. చాలా జాగ్రత్తగా మడిచిపెట్టిన జపాన్ విసనకర్రలా కుచ్చెళ్ళు వచ్చేటట్లు కట్టుకుంటుంది చీరె! తిలకానికి బదులుగా, కాస్త పెద్దదిగా, పావలాకాసంత కుంకుమ బొట్టు పెట్టుకుంది.
జాకెట్టు హుక్సు పెట్టుకోబోతుండగా తలుపులు తెరుచుకున్నాయి.
మామయ్య!
అప్రయత్నంగా నుదురు చిట్లించింది లత.
'నువ్వుటే' అంటూ వెళ్ళిపోయాడాయన.
టైమెంతైందో!
త్వరగా వెళ్ళాలి తను! శ్రీమంత్ కి సహనం తక్కువ!
రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర తనని తిట్టుకుంటూ నిలబడతాడు లేటైతే!
కంగారుగా ఆటో ఎక్కేసి, రిజిస్ట్రార్ ఆఫీస్ కి చేరింది లత.
శ్రీమంత్ లేడక్కడ!
వాచ్ చూసుకుంది.
పది ముప్పావు దాటుతోంది. లత మనసు తేలిక పడింది.
అమ్మయ్య! తను లేటేమో, శ్రీమంత్ కి కోపం వస్తుందేమోనని భయపడింది.
శ్రీమంత్ దే ఆలస్యం!
లేకపోతే అంతకుముందే వచ్చి, కాసేపు ఎదురుచూసి కాఫీ తాగడానికేమన్నా వెళ్ళి ఉంటాడా?
అతను అక్కడికి తనకంటే ముందు వచ్చి ఉండనందుకు మొదట సంతోషించిన లత, పావుగంట తర్వాత 'ఇంకా అతను రాలేదే!' అని మధనపడటం మొదలెట్టింది.
పదకొండుంబావు అయింది.
శ్రీమంత్ రాలేదు.
"బాభీ" అని వినబడిందొక గొంతు.
బెన్సన్!
అతన్ని అంతకుముందు ఒకసారి శ్రీమంత్ తో చూసింది లత.
రంగువెలిసిన డెనిమ్ ప్యాంటూ, కొద్దిగా నలిగిన మాసిన చీజ్ కాటన్ షర్టు, మెడలో తెల్లటి సన్నటి స్టీల్ చెయిన్ కి శిలువ!
"మీ ఫ్రెండ్ ఏరీ?" అంది లత.
"సారీ బాభీ! వాడు రాలేడు ఇవాళ! కూలర్ లో పెట్టారు బగర్ ని."
"ఊ?" అంది లత ప్రశ్నార్ధకంగా.
తేలిగ్గా నవ్వాడు బెన్సన్. "వాడిని పోలీస్ లాకప్ లో పెట్టారు. రెండ్రోజులయింది" అన్నాడు చాలా మామూలు సంగతి చెబుతున్నట్లు.
నిశ్చేష్టురాలై పోయింది లత.
"నువ్వు కంగారుపడతావేమోనని నన్ను పంపించాడు. నథింగ్ టు వర్రీ! బగర్ విల్ బీ అవుట్ ఇన్ ఎ వీక్! వారంలో వదిలేస్తారు. వచ్చే వారం పెట్టుకోవచ్చు పెళ్ళి."
మాటలు మర్చిపోయిన దానిలాగా చూస్తోంది లత.
జైల్లో పెట్టారా? శ్రీమంత్ నా? ఎందుకు?
అదే అడిగింది అయోమయంగా.
"మొన్న మారేడ్ పల్లి టీమ్ తో క్రికెట్ మాచ్ ఆడాం. మాచ్ తరవాత సిసిల్ గాడి జావా వెనుక కూర్చున్నాడు శ్రీ! బాస్టర్డు అంతకుముందు రోజే బ్రాన్ సన్ మూవీ ఏదో చూసి ఉంటాడు. తనే బ్రాన్ సన్ ఐనట్లు రాష్ గా జావాని మెలికలు మెలికలు తిప్పుతూ నడిపించాడు. ఒక టర్నింగులో శ్రీగాడి బ్యాటు ఇంకో స్కూటర్ గాడికి తగిలింది. వాడు పడ్డాడు. పడినప్పుడు దెబ్బ తగల్లేదు వాడికి. శ్రీగాడిని ఏదో అన్నాడు. శ్రీ బాటు తీసుకుని ఫుల్ టాస్ బాల్ ను కొట్టినట్లు కొట్టాడు వాడిని. అప్పుడు తగిలింది దెబ్బ వెస్పావాడికి!"
చార్మినార్ సిగరెట్ నోటికి ఒక మూలగా నిర్లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు బెన్సన్. అతని పెదిమలతోబాటు కదుల్తోంది సిగరెట్. ఆ సిగరెట్ లా ఊగిసలాడుతోంది లత మనసు.
"అదే టైమ్ లో పీటర్ ఫోర్ వచ్చింది అటువైపు."