"వెంటనే చిన్నాడు 'నాకు గారెలొద్దు.... క్రీమ్ బిస్కట్స్ కావాలి' అంటూ కాళ్ళు బాదుతూ రాగం మొదలుపెట్టాడు. నువ్వు వాడి ముక్కుకారుతుంటే నీ కొంగుతో తుడిచి అలాగే కన్నా! అని ఊరుకోబెట్టావు."
"ఛీ.... నాకొంగుతోనా! ఛస్తే తుడవను" శక్తి వెలపరంగా కొంగుచివర వాసన చూస్తూ అంది.
"అబ్బా.... కలలోనే కదా!" అన్నాడు.
"కలలో కూడా అలాంటి పనులు చేయను" కచ్చితంగా చెప్పింది.
"పిల్లలు దూరంగా ఆడుకుంటుంటే, మనం ఇద్దరం ఒకరి వొళ్ళో ఒకళ్ళం పడుకుని..."
"ఇంపాజిబుల్! ఒకేసారి ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు పడుకోవడం జరగదు" అతని మాటలకి అడ్డుపడింది.
"ఏదోలే... నేనే నీ ఒళ్ళో పడుకుని కబుర్లు చెబుతుంటే నువ్వు తన్మయంగా వింటున్నావట."
"అంతమాత్రానికి జూ కెందుకూ? మన ఇంట్లో బెడ్ రూం లేదా? పిల్లల్ని గాలికొదిలేసి నీ గాలికబుర్లు వినాలా?" విసుగ్గా అడిగింది.
ఇంద్రనీల్ కోపంగా లేచికూర్చుని "కొత్తగా పెళ్లయినప్పుడు ఆ మాత్రం ముచ్చట్లు వుండవా?" అన్నాడు.
"కొత్తగా పెళ్ళయితే ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు? కలైనా కొంచెం అర్ధం వుండాలి" చిరాకుపడింది.
"పెళ్ళయ్యి పదేళ్ళయింది. పిల్లలు కొత్తగా పుట్టారు..."
"కొత్తగా పుడితే దూరంగా పోయి ఎలా ఆడుకుంటారు?"
"పిల్లలుపుట్టి చాలా ఏళ్ళయింది. కొత్తగా జూకెళ్ళాం."
"కొత్తగా జూ కెళితే జూలో జంతువుల్ని చూడాలి కానీ నీ మొహం నేనూ, ణ అమోహం నువ్వూ చూడటం ఎందుకూ?" నవ్వాపుకుంటూ అడిగింది శక్తిమతి.
"ఇలా ప్రతిదానికీ "ఔనంటే....కాదంటావా?" బుంగమూతి పెట్టి అడిగాడు.
"కాదు!"
అతను ఆశగా చూశాడు.
ఆమె నాలిక కరుచుకుని "అనుకోకుండా కాదనేశాను చూశారా? అది నా స్వభావం" అంది.
అతను నవ్వి "ఆ తర్వాత ఇద్దరం పిల్లలతో ఇల్లు చేరేసరికి చాలా రాత్రయింది. ఇంటికొచ్చి చాలా అలసిపోయి పోయాం" అన్నాడు.
"మళ్ళీ తప్పు! ఇంటికి అలసిపోయి చేరివుంటాం" అంది.
అతను కొంటెగా కన్నుగీటి "కాదు.... ఇంటికి చేరి అలసిపోయాం" అన్నాడు.
సహజంగా చాలా చురుకైన శక్తిమతికి అతని భావం అర్ధం అవడానికి ముఫ్ఫైసెకన్లు పట్టింది. అది ఆమె పెరిగిన వాతావరణ ప్రభావం. అర్ధం అవగానే ఆమె బుగ్గలు ఉదయిస్తున్న సూర్యుడిరంగులోకి మారాయి.
"నువ్వు నిద్రలేపుతుంటే నేను నీ నడుంచుట్టూ చేతిని వేసి ఇలా నా పైకి లాక్కున్నాను" అతను ఆమెని తన పైకి లాక్కున్నాడు.
అదాటుగా ఆమె అతని గుండెలపైన పడి "ఏయ్... ఏమిటిది?" అంది చిరుకోపంగా.
"ఇలాగే అరిచి కలని పాడుచేశావు! అందుకు పెనాల్టీగా ఇప్పుడు నిజం చేయాలి" అన్నాడు.
శక్తి లేచే ప్రయత్నం చెయ్యకుండా "అంటే.... నా ప్రపోజల్ కి అంగీకరించినట్లేనా?" అంది.
"నెవర్ సే నో టు గుడ్ థింగ్స్ అన్నారు పెద్దలు" అన్నాడు.
శక్తి అతని కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తూ "నా షరతులన్నింటికీ ఇష్టపడే ఈ మాట అంటున్నారా?" అంది.
"నీ షరతులని కాదు, నిన్ను ఇష్టపడి ఒప్పుకుంటున్నాను..." అన్నాడు.
"థాంక్యూ" మనఃస్ఫూర్తిగా చెప్పింది.
"కానీ.... నాకూ కొన్ని షరతులున్నాయి. అవి నువ్వు ఒప్పుకుంటేనే..." అన్నాడు.
"ఉద్యోగం చెయ్యడం... నామీద అధికారం చెలాయించడం తప్ప ఏవైనా సరే ఒప్పుకుంటాను" అంది.
అతను చిన్నగా నవ్వి "నెలలో ఓ వారం నాకు సెలవు కావాలి. ఊరెళ్ళి వస్తాను." అన్నాడు.
ఆమె విస్మయంగా "ఊరా!? నీకెవరూ లేరన్నావుగా!" అంది.
"అసలు ఎటువంటి ప్రశ్నలూ వేయకుండా ఈ షరతులకి ఒప్పుకోవాలి" అన్నాడు.
శక్తి అతనిమీదనుంచి లేచి, పెదవి మునపంటితో బిగపట్టి ఆలోచనలో పడింది.
"మిగతా మూడు వారాలూ ఓ హౌస్ వైఫ్ ఏమేం చేసి ఉద్యోగం చేసే తన భర్తకు ఆనందం కలిగిస్తుందో అవన్నీ చేస్తాను. నిన్నేం అడగను. ప్రామిస్" అన్నాడు.
"మరి ఐదేళ్ళవరకూ నువ్వు ఉద్యోగం చెయ్యవని కాంట్రాక్ట్ రాసుకుందామా?" అడిగింది.
"నా జీతం మూడువేలుగా ఫిక్స్ చేసి ఐదేళ్ళవరకూ టెర్మినేట్ చెయ్యనని ఎగ్రిమెంట్ రాయి" అన్నాడు.
ఆమె ఆలోచనగా చూసి "ఒకవేళ నువ్వు నన్ను హింసిస్తే, ఏ కారణంగానైనా నిన్ను నేను భరించలేకపోతే..." అడిగింది.
ఇంద్రనీల్ తన చేతివేళ్ళు ముడుస్తూ "ఒకవేళ ఈ ఐదేళ్ళలో నాకు బహ్యంకరమైన రోగాలేమైనా వచ్చినా, లేక నిన్ను మానసికంగా కానీ, శారీరకంగా కానీ బాధించినా, ఇవేమీ కాకుండా నీకు మరొకవ్యక్తిమీద మనసు కలిగినా కానీ నన్ను నువ్వు వదిలేయవచ్చని కూడా రాసుకుందాం. విడాకులకి కూడా ఈజీ అవుతుంది" అన్నాడు.
ఆ చివరి మాటలకి శక్తి చలించి, కన్నీళ్ళతో చూసింది.
"దారుణంగా ప్రవర్తించే మనుషుల్నీ, ఈ వివాహవ్యవస్థనీ చూసి ఇలా మారిపోయాను ఇంద్రనీల్. ఇంకా పెళ్ళిపీటలు ఎక్కకముందే విడాకులగురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది" అంది.
"ఐ కెన్ అండర్ స్టాండ్" అతను ఆమెచేతిని స్నేహంగా నొక్కి వదిలాడు.
శక్తి తనచేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చెయ్యలేదు. అతని స్పర్శ ఎంతో హాయిగా వుండటాన్ని గమనించింది.