Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 11

ఇంద్రనీల్ కనుబొమ్మలు చిట్లించి "అతనిగురించి మీకు వివరాలు తెలియనక్కరలేదా?" అన్నాడు.
"అక్కర్లేదు! నేను చూసిన విషయాల్నే ఎక్కువగా నమ్ముతాను. ఐ లైక్ హిమ్" అంది.
"అతను అంగీకరిస్తాడనుకుంటున్నారా?" అడిగాడు.
ఆమె లేచి "నేను రేపుపొద్దుట ఈ గదిలోకి వచ్చేసరికి అతను 'గుడ్ మార్నింగ్' అంటే అంగీకరించినట్లు, 'నమస్తే' అంటే లేనట్టు" అని బయటికి వెళ్ళిపోతూ "బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంద్రనీల్! మీరు నాకు నచ్చినంతమాత్రాన నేను మీకు నచ్చాలని రూలేం లేదు. మీరు ఒప్పుకోకపోయినా మనం ఫ్రెండ్స్ గానే వుంటాం. గుడ్ నైట్....నిద్రపోకుండా ఆలోచించండి" అనేసి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళినవైపు చూస్తూ అతను నవ్వుకున్నాడు.
'తాచుపాముని ఆలోచించకుండా పట్టుకున్న నాకన్నా ఈ అమ్మాయి ఎక్కువ రిస్కే తీసుకుంటోంది. ఒక అపరిచితుడ్ని మొదటి పరిచయంలోనే పెళ్ళి చేసుకోమని అడగడం ద్వారా!" అనుకున్నాడు.
శక్తి ఆలోచనలు ఇంకోవిధంగా వున్నాయి.
'పెళ్ళిచూపుల్లోకూడా ప్రథమపరిచయంలోనే కదా డిసైడ్ చేసుకునేది. వరుడి అటు మూడుతరాల వంశచరిత్రా, కులగోత్రాలూ తెలిసినంత మాత్రాన అతడినైజం ఎలా పట్టుకోవడం? దానికన్నా ఇది లాజికల్ గానే వుంది. ఇతని మెంటాలిటి నేను కొంత స్టడీ చేశాను' అనుకుని తృప్తిపడింది.
ఆస్పత్రిలో బయట వరండాలో కూర్చున్న శక్తి మనసంతా ఆలోచనలతో గజిబిజిగా వుంది. ఆమెని అతను ఒప్పుకుంటాడా, లేదా? అన్న విషయం అతలాకుతలం చేస్తోంది. ఆమెకి ఎందుకో అతను నచ్చాడు.
తన కోసం ప్రాణాలొడ్డడం అన్న విషయం ఆమెని కదిలించకపోవడానికి ఆమె అందరు ఆడపిల్లల్లో మినహాయింపేమీ కాదు. అతని రూపం, మాట్లాడేటప్పుడు నిష్కల్మషంగా కనిపించే కళ్ళు ఆమెని ఆకర్షించాయి. ముఖ్యంగా అతనికి ఎవరూ లేకపోవడం ఆమెకి బాగా నచ్చింది.
ఆస్పత్రి ఆవరణ బయట కనిపిస్తున్న మర్రిచెట్టు కింద చేరిన ఫకీరెవరో "గూడూ.... చిన్నబోయేరా.... రామచంద్రా..." అని పాడుతున్నాడు.
చేతికి వేసుకున్న నాలుగు మట్టిగాజుల్నీ పైకీ కిందకీ జరుపుకుంటూ ఆమె లీలగా వినిపిస్తూన్న ఆ పాట వినసాగింది. చలిగాలి రివ్వున కొడుతూంటే పైటకొంగు నిండా కప్పుకుని మునగదీసుకుని కూర్చుంది. లోపల గదిలో అంతగా చలి వుండదని తెలుసు. కానీ..... పెళ్ళికాకముందే ఒక యువకుడితో ఒకేగదిలో వుండటం తప్పనుకునే పరిస్థితుల్లో ఆమె పెరగడంవల్ల ఆ ఊహని తోసిపుచ్చింది.
తెలతెలవారుతుండగా మర్రిచెట్టుమీద నిద్రపోతున్న పక్షులన్నీ నిద్రలేచాయి.
పండక్కి ఇంటినిండా చుట్టాలొచ్చినంత సందడిగా వుంది మర్రిచెట్టు ఆకు ఆకూ నోళ్ళు తెరిచి కూస్తున్నట్లుగా హడావుడిగా మారింది.
శక్తి లేచి చీరకుచ్చిళ్ళు సవరించుకుంది. ఆమెకి అతని గదివైపు అడుగు లేస్తుంటే కాళ్ళు తడబడ్డాయి. బహుశా సీతాదేవికి కూడా రాముడు హరివిల్లు ఎత్తేటప్పుడు ఇంతే టెన్షన్ గా వుండివుంటుంది. కానీ ధైర్య వంతులు మాత్రమే కార్యాలని సాధించగలరని ఆమెకి తెలుసు. అతనూ రాత్రంతా జాగరణ చేసి ఈ విషయం గురించి ఆలోచిస్తాడని వూహిస్తూ ఆమె గదితలుపు తోసింది.
ఇంద్రనీల్ ఆదమరిచి నిద్రపోతూ కనిపించాడు. అతనిముఖం చాలా ప్రశాంతంగా వుంది.
శక్తి అతని దగ్గరగా వెళ్ళి "ఏవండీ..." అంది అలా పిలిచినందుకు సిగ్గుపడి ఇంద్రనీల్ గారూ..." అంది.
అతను కళ్ళు విప్పలేదు.
ఇంక గత్యంతరం లేక భుజంపట్టుకుని కుదుపుతూ "మిమ్మల్నే.....లేవండి" అంది.
అతను కుడిచెయ్యి ఎత్తి ఆమెచేతిని పట్టుకుని "పిల్లలు లేచారా? లేవకపోతే ఓ ఐదు నిముషాలు నా పక్కన పడుకుంధూ.... వెధవ ఆఫీసు ఎప్పుడూ వుండేదే గదా!" అన్నాడు.
ఆమె విప్పారిన కళ్ళతో ఆశ్చర్యంగా "ఏయ్.... ఏవిటా మాటలు?" అంది.
"రాత్రి నలిగిన మల్లెపూలు కైపుగా వాసన వేస్తున్నాయి కదూ! నా బుగ్గకి అంటిన కాటుకమరకలు నీ కొంగుతో తుడు" అన్నాడు.
"ఏవంటున్నారు..... ముందు కళ్ళు తెరవండి!" అంటూ శక్తి జగ్గులోంచి చేతిలోకి  నీళ్ళు తీఉస్కుని అతని కళ్ళమీద చల్లింది.
అతను వెంటనే కళ్ళు తెరిచి "ఏవైంది?" నా ముఖాన నీళ్ళు కొట్టిందెవరు?" అన్నాడు.
శక్తి చిరుకోపంగా "నేనే... ఏం కలత నిద్రయిందా?" అడిగింది.
"కలత కాదు. కళ చెదిరింది. ఎంత నిరంకుశంగా తియ్యని కళ చెదర గొట్టేశారో తెలుసా?" అన్నాడు.
"ఏవిటో అంత తియ్యటి కల?" తెలిసీ అడిగింది.
అతను కొద్దిగా పైకి జరిగి మోచేతి ఆసరాతో కూర్చుని "మనకి ఇద్దరు పిల్లలు పుట్టారుట! ఒకడేమో ఆదివారం జూకి వెళదామనీ, ఇంకొకడేమో హోటల్ కి వెళదామని గొడవచేస్తున్నారట. నువ్వేమో కనకాంబరం రంగుచీర కట్టుకుని జడనిండా బంతిపూలు పెట్టుకుని తయారయ్యావుట!"
శక్తి చిరాగ్గా "కహ్డు! బంతిపూరంగు చీర కట్టుకుని, జడనిండా కనకాంబరాలు పెట్టుకుని వుంటాను" అంది.
"అదేలే... నేను స్కూటర్ స్టార్ట్ చెయ్యగానే నువ్వు అరే.... మర్చేపోయాను. వంటింట్లో డబ్బాలో పాలకాయలూ, అరిసెలూ వున్నాయి. తీసుకొస్తే పిల్లలు తింటారు అన్నావు!"
"నేనలా మర్చిపోను అన్నీ ముందురోజు రాత్రే సర్ది పెట్టుకుంటాను" అంది శక్తి.
"కానీ కలలో అలానే అన్నావు. అంతేకాదు. మీ నాయనమ్మ తద్దినానికి చేసిన గారెలుకూడా స్టీలు డబ్బాలో వున్నాయి తెస్తానన్నావు."
"ఛ! తద్దినం గారెలు డబ్బాలో దాచుకుని, పిల్లలకి జూలో పెట్టడమా? అన్నీ సన్నాసి ఊహలు" శక్తి చిరాకుపడింది.

 Previous Page Next Page