ఉన్న ఒక్క కూతురు అలా కావటం, కట్టుకున్న భర్త యిలా మరణించడం చూసి ఆ తల్లి పేద హృదయం దహించుకుపోయింది.
ప్రపంచమంటే విసుగుపుట్టి సంసారబంధాల్ని తెగిన వాటిని మరీ తెంపుకుని బెంగుళూరు వెళ్ళి సన్ గా చేరిపోయింది. అక్కడనుంచి కూడా ఫారిస్ వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారు మురళీ ఆమె విషయం విచారించటానికి?"
"నీవు లేవా వేణూ? నీవు చాలదా ఆమెకి?"
అతని మాట సిరిగావున్నా తన అశక్తతకి దుఃఖపడుతున్నాడు.
"నేను....నేను....ఏం చేయగలను మురళీ? ఆడపిల్లలా ఏడ్వటం తప్ప"
పేరుమోసిన డాక్టరూ, విజ్ఞానవంతుడూ, తోటి డాక్టర్లచే అదృష్టవంతుడూ, వివేకవంతుడూ అనిపించుకున్నవాడూ, ప్రజలపాలిటి సాక్షాత్తూ దేవుడూ అనిపించుకున్నవాడూ, తల్లి దండ్రులకి వెలుగు అయిన మిత్రుడు అంత బేలగా మాట్లాడటం అంత తేలికగా అవటం చూసి కరిగిపోయాడు మురళి.
మనిషి శక్తికీ, సంపదకి, శౌర్యానికీ వివేకానికీ లౌకిక జ్ఞానానికీ, విజ్ఞానానికీ అతీతమయిందే దుఃఖంకాబోలు! ఎన్ని నీతులుచెప్పినా ఎంతగా వాటిని ఆచరణలో పెట్టినా ఎంత విజ్ఞాని అయినా వేదాంతి అయినా దుఃఖం దుఃఖమే? దాని కోటా అది పూర్తి చేసుకోంది అది వదలదు. వదిలించుకోవాలని యత్నించేకొద్దీ మనిషి చుట్టూ యింకా ముసురుకుంటుంది. భయపడితే పరిగెత్తే వాడివెంట ఆకలిగొన్న పులిలాగా.
"కొందరికి తమ శక్తి తెలియదు. తమ శక్తిమీద నమ్మకం వుండదు. కొందరికి ఎవరో చాటునవుండి ప్రేరేపించి చేయిస్తే అద్భుతమైన కార్యాన్ని సాధిస్తారు.... మన ఫ్రెండ్ సూర్యారావు విషయం చూడటంలేదూ? మనం ప్రోత్సహిస్తూ మెచ్చుకుంటూ తీరిగ్గా తప్పొప్పులు చెబుతూ వుంటే వారానికోనవల వ్రాసేస్తాడు. కానీ అదే ఎవరూ పలకరించకుండా వుంటే ఏళ్ళు గడిచినా కలం ముట్టుకోడు. తను రచయితననే విషయం కూడా మరచిపోతాడు. నీవూ అలాంటివాడివే! నీవెంతవాడివో నీకు తెలియదు. అయినా అదీ ఒకందుకు మంచిదే అనుకో_గర్వం అనేది తలెత్తదు__"
విషయాన్ని తేలికపరచాలని యత్నిస్తూ అన్నాడు. "ఆ చూడు వేణూ! నీ వద్ద ఆమె ఫోటోయేదీ లేదా?"
నిర్లిప్తంగా మందహాసం చేశాడు. అందులో జీవంలేదు. ముసురులోంచి తొంగిచూసిన సూర్యుడిలా వుంది ఆ నవ్వు.
"ఆనాటి మా వయసు ఫోటోలు తీయించుకోవటం దాచుకోవటం అంటే ఏమిటో తెలియనిది. ఫోటో విషయంవదలి ఇప్పుడామె ఎలా వుంటుందోకూడా ఊహకి అందటంలేదు. కానీ చక్రాల్లా విశాలంగా వినూత్నమూ విచిత్రము అయిన కాంతులీనుతూ తళతళా మెరిసేకళ్ళూ గులాబీ రేకులకే వన్నె తెచ్చే విశాలమైన చెక్కిళ్ళు, చక్కని నాశికాతప్ప మరేమీ గుర్తులేవు. ఆ ముఖంకూడా గుర్తు అందలేదు. కానీ ఛాయగా ఆనాటి విరజమాత్రం గుర్తుంది. నేను ఆర్టిస్టునుకూడా కాదాయె. దాన్ని ఆధారంగా చేసుకొని బొమ్మ గీసుకోటానికి."
నిట్టూర్చాడు....అతనితోపాటు తనూ నిట్టూర్చటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో క్రుంగిపోయిన సూర్యుడిలా మండుతున్న మనసుతో అతన్ని బయల్దేరదీసి నడకసాగించాడు.
చంద్రోదయమౌతోంది. వెలుగు రేఖలు వస్తాయి. వెన్నెల విరుస్తుంది అనే ఆశవున్న పధికుడికి మార్గం అంధకార బంధురమైనా లెక్కలేదు. కానీ ఆ ఆశకూడా లేనివాడి గతి? ఏం చెప్పగలం?
6
"బావా!"
"డ్రెస్ చేసుకుని బయటకి వెళ్ళబోతూ రంగపిలవటం విని తిరిగి వచ్చాడు వేణు.
బాహ్యంగా ఆ పనిలో ఏ బాధ కనిపించకపోయినా చాలారోజుల్నుండి అతని మనసులో అగ్నిగుండం జ్వలిస్తూనే వుంది.
గాఢంగా చూచేవారికి అతని కళ్ళల్లో విరజకోసం నిరీక్షణ స్పష్టంగానైనా కనిపించకపోదు. అతనుచేసే ప్రయత్నాలు రేఖాసూచనగా కనిపించక మానవు. తళతళ విజ్ఞానంలో మెరిసే అతనికళ్ళచాటుని కారుమబ్బులు ప్రత్యక్షం కాకపోవు.
జీవితంలో ఏదో నిరాశ నిస్పృహలతో తీవ్రంగా బాదింపబడినవాడిలా అతన్లోవాడు, అప్పుడప్పుడూ ఆత్మీయులవద్ద బయటపడుతూ వుంటాడు. దుఃఖం అనేది కొందరిపాలిటి శాపమయితే మరి కొందరుపాలిటి వరం అవుతుంది.
రంగకు దగ్గరగావచ్చి మంచంమీద కూర్చుని ప్రశ్నించాడు. "ఏం కావాలి రంగా?"
కళ్ళమీద వేసిన పట్టిని మెల్లగా నిమురుతూ అడిగాడు.
"ఇంకా ఎన్ని రోజులిలా వుండాలి బావా?"
రంగ అతని మరిది మేనమామగారి కుమారుడు. సావిత్రమ్మ తమ్ముడు, అతనివద్ద వుండి చదువుకుంటానికి వచ్చాడు మంచి స్పోర్ట్సు మన్.
పచ్చటి శరీరచ్చాయతో బలంగా మెరుస్తున్న బంగారంలా వుంటాడు. పచ్చని ముఖంలో నల్లగా మిలమిలలాడుతూ చేపల్లాంటి అతని కళ్ళు ఎవర్నయినా అట్టే ఆకర్షిస్తాయి.
ఎర్రగా జంటగా అందాన్నంతా ఓడుతున్న పెదాలమీద యిప్పుడిప్పుడే యేర్పడుతున్న మీసం చాయగా కనిపిస్తూ అతని పట్టుదలని సూచిస్తుంది.
క్రికెట్ మేచ్ ఆడుతూ అనుకోని విధంగా బాల్ కళ్ళకి తగలటంతో తలత్రిప్పి మూర్ఛపోయాడు.... కంటికి కట్టుకట్టివారం రోజులైంది.
ఎప్పుడూ ఉత్సాహంగా స్నేహితులతో ఆడుకుంటూ తిరుగుతూ అభిమానంగా అందరితో స్నేహం చేసుకుంటూ ప్రీతితో మాట్లాడుతూ మంచి మంచి సినిమాలు చూస్తూ శ్రద్ధ విడువకుండా తన పాఠాలు చదువుకుంటూ తీరికవేళల్లో మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఒక్క క్షణం కూడా సోమరిలా వుండకుండా యంత్రంలా విశ్రాంతికూడా అనుకోకుండా తిరిగే రంగకి అలా పడుకోవటం బాధగా వుంది. అయినా భరించటం మానవుల వంతు.
"ఇంక రెండు రోజులకి కట్టు విప్పేస్తాను. ఆ తర్వాతకూడా ఓ పదిరోజులు నీ అల్లరి, నీ చదువు మానెయ్యాలి. లేకుంటే కంటికిప్రమాదం రావచ్చు....చాలా దెబ్బ తింటావ్" మృదువుగా హెచ్చరించాడు వేణు.
"బావా....! నీవూ అలా అంటే ఎలా బావా-నాకు ఏడుపు వస్తుంది బయటికివచ్చిన కన్నీరుకూడా ఈ డ్రెస్సింగ్ క్లాత్ ని దాటి రాలేకపోతుంది.
మెల్లగా అతని గుండెలమీద చేతులువేసి నిమురుతూ అన్నాడు.
"తప్పుకదూ? అలా ఏడవచ్చా? ఎక్కడైనా మగవాళ్ళు ఏడుస్తారా? ధైర్యంగా ధీరంగా వుండాలి?"
"ఏడుస్తారు బావా! ఏడిచేది మగవాళ్ళే! నేను ఎన్నో నవలలని చదివాను కదా? వాటిల్లో ఎక్కువగా ఏడిచేది మగవాళ్ళే? ఏడవటం సహజలక్షణం అనే ఆడవాళ్ళే వీళ్ళని ఏడిపిస్తారు."
కొద్దిగా మందలించే ధోరణిలో అన్నాడు "నీకు ఈ నవలాధోరణి తగ్గాలి రంగా! ఎప్పుడూ ఊహా చిత్రాలతో నిండివుండే నవలలని చదివి జీవితంకూడా అంతే అనుకుంటే ఎలా? వాస్తవిక ప్రపంచంలో తిరిగీ అనుభవాన్ని సంపాదించుకుని అదే కాచి వడపోసిన జీవిత సత్యం అనుకోవాలి. కానీ ఎప్పుడూ పుస్తకాలు చదివి జీవితం అంతే అని ఊహించుకోరాదు.... సహించుకోవటం కష్టం.
తన శ్రేయోభిలాషి, ప్రీతిపాత్రుడూ పెద్దవాడూ అయిన బావగారూ చెప్పే బోధన విని మందహాసం చేసి అన్నాడు__
"నిజం బావా! నీవు ఒక్క నవల అయినా చదివావా చెప్పు? వాటి జోలికి వెళ్ళకుండానే వాటిలో వేషాలు వెతికితే ఏం చెప్పేది? రచయితలు కూడా మానవులే కదా బావా! వాళ్ళు జీవితంలో తిరిగి అనుభవం సంపాదించుకుని ఆ కాచి వడపోసిన జీవితాన్ని సత్యాన్ని నలుగురికి చెబుతారు బావా? ఆ చెప్పటంలోనూ సామాన్య మానవుడు చూచినదాన్ని తను విశిష్ట దృక్పధంతో చూచి దానిలోని వింత వెలుగును బయటికి తెస్తాడు. అసలు రచయిత అంటే తన అనుభవాన్ని విజ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టేవాడు. మీరు శరీరానికి చికిత్సచేస్తే రచయితలు మనస్సుకి చికిత్స చేస్తారు బావా! సంఘంలో మీరెంత అవసరమో రచయితలూ అంతే అవసరం."
"సరే! అలాగా కానీ! నీ మాటలని కాదనటం ఎందుకు? నీవే కరెక్టు సరేనా! ఇక విశ్రాంతి తీసుకో ఎక్కువగా మాట్లాడావ్ ఇప్పటికే కళ్ళు నొప్పాయ్. ఇక నే వెళ్ళిరానా?"
"వెళ్ళిరా బావా, వెళ్ళిరా! నీకేం హాయిగా బయటికి వెళతావు. మీ మురళీబాబుతో ముచ్చట్లాడతావ్. తీయతీయగా అతను చెప్పే కబుర్లుని వింటావ్. ప్రశాంతమైన సాయంకాలాల్లో ఊపిరి దూరంగా నది ఒడ్డున కూర్చొని మనోహరమైన సంధ్యాదేవి అందచందాలు చూస్తావు. అస్తమిస్తున్న సూర్యకాంతి పడి మిల మిలా మెరుస్తున్న నీటిలో నీ ఛాయను చూసి మురుస్తావు. యేం చెప్పను బావా! ఆ అందం! ఆనందం! ఆ వేళల్లో నిశ్శబ్దంలో అలలు అలలుగా తేలుతూ వచ్చే నీ అష్టపదులూ.... నీ జావళుళు.... అదృష్టవంతుడివి బావా! నేనేమో యిలా ఒక్కడినే ఇక్కడే కూర్చుని ఏమీ ప్రొద్దుపోక మనస్సుకి తోచక ఆలోచనలతో సతమతమవుతూ బాధపడుతూ మనస్సులోనే కుళ్ళుతూ ఉండాలి. ఛీ! ఛీ! ఎంతకష్టం వచ్చింది? ఆ తగిలే క్రికెట్ బాల్ కంటికికాక కణతకే తగిలుంటే ఎంత బావుండేది?"