Previous Page Next Page 
మానవత పేజి 11


    జానకి పాల్ కళ్ళల్లోకి చూచింది.
    పాల్ జానకి కళ్ళల్లోకి చూచాడు.
    చూపులు రాచుకున్నాయి. అది అనుకున్నది కాదు. అనుకోకుండా జరిగిపోయింది.
    కాలం భారంగా సాగుతున్నది.
    "నన్ను గుర్తించనే లేదా?" పాల్ పెదవి కదిలింది.
    జానకి పాల్ ను తేరిపార చూచింది. ఏదో స్ఫురించింది. అయినా 'ఊఁహూ' అన్నది.
    "మనం కలిసి చదువుకున్నాం? మరిచిపోయారా?"
    "మీరు ఆ పాలా? అరే. గుర్తించనేలేదు. ఎంత మారిపోయారు?" పెదాలు గంతులేస్తున్నాయి. ఒక్కసారిగా బడి, ఆటలు అన్నీ మనోఫలకం మీద మెరిశాయి.
    "గుర్తుందా మీకు! పూల కోసం గోడ దూకాం. పట్టుపడ్డాం" అన్నాడు పాల్.
    "అది మరచిపోగలనా? వాళ్ళింట్లో పారిజాతం చెట్టుండేది. ఆ పూలంటే నాకిష్టం. ఇద్దరం పిట్టగోడ ఎక్కాం, దూకాం. పూలు ఏరుకుంటున్నాం. ఏదో అలికిడి అయింది. ఇంటివాళ్ళు వస్తున్నారనుకున్నాం, గోడ ఎక్కాం, దూకాం, ఉరికాం. ఉరుకుతుంటే నేను పడిపోయాను. కాలుకి రాయి గుచ్చుకుంది."
    "గాయం మానిపోయినా మచ్చ వుండాల్నే."
    "అవును, ఉంది, ఇదిగో" అని కాళ్ళమీది చీర తీయబోయి ఆగిపోయింది. సిగ్గు ముంచుకొని వచ్చింది.
    ఇంతలో బయటపక్క ఏదో అలజడయింది.
    "పేషెంట్లు వచ్చినట్లున్నారు, చూడండి. నేను వస్తాను మరి"
    "సరే, వస్తుండండి అప్పుడప్పుడూ_మీ మాటలు చల్లగా ఉంటాయి."
    "అలాగే వీలున్నప్పుడు...." అని లేచి వెళ్ళిపోయింది జానకి.
    రమాదాసి బయట రిక్షాతో సిద్ధంగా ఉంది, ఎక్కమంది. ఎక్కి కూర్చుంది జానకి. రిక్షా సాగిపోతూంది.
    "ఆడదానివి రిక్షా ఎందుకు తొక్కుతావు?"
    "కష్టపడేటోండ్లకు ఆడా, మగా ఏందమ్మా! పన్లే దొరుకుతలేవు. రిక్షా పట్టిన."
    "నువ్వు చాలా మంచిదానివి రమా!"
    "మీ కంటేనా?"
    "నీలాంటి దానివి రిక్షా తొక్కడం ఏం బావుండలేదు."
    "ఏం చేయమంటారమ్మా! అందరికి అనుకున్న పన్లు దొరుకుతాయా?"
    "రమా, మా ఇంట్లో పని చేస్తావా?"
    "అంతకన్ననా తల్లీ! చేస్త, తప్పక చేస్త."
    "అయితే మా నాన్నతో చెప్పి పెట్టుకుంటా."
    "మీరు పెట్టుకోలేరా అండి."
    "మా నాన్న వున్నారుగా _ పెద్దవారు."
    రిక్షా జానకి ఇంటి ముందు ఆగింది, జానకి దిగింది.
    "నువ్విక్కడే వుండు, పిలుస్తా" అని లోపలి కెళ్ళింది.
    ముకుందంగారు భాగవతం చదువుకుంటున్నారు, కూతుర్ని తలెత్తి చూచారు.
    "ఇంత ఆలస్యం చేశావేమమ్మా, ఏమైంది?" ధ్వనిలో భయం వుంది.
    "ఏం లేదు నాన్నా! ఒక పిల్లకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళాను...."
    "కిరస్తానీ డాక్టర్ దగ్గరకేనా?"
    "వైద్యుడు కిరస్తానీ ఏమిటి నాన్నా! 'వైద్యో నారాయణో హరిః' అని నువ్వే చెప్పావు."
    "వైద్యుడంటే మన వైద్యుడు, కిరస్తానీ డాక్టర్ కాదు. సరే, వంటింట్లో ప్రవేశించు."
    "నాన్నా! పనిమనిషిని తెచ్చా నాన్నా!"
    "ఏది? కిరస్తానీ కాదు కదా!"
    "అబ్బే! పేరు రమాదాసి. అచ్చం హిందువు. కిరస్తాన్లంటే మండిపడ్తుంది."
    "అలాగా, అయితే పిలువు."
    రమాదాసి వచ్చింది.
    "మొహాన బొట్టుందా?"
    "అదేందయ్యగారు_అట్లంటరు? చూడండి, కాసంత బొట్టున్నది."
    "అయితే రేపణ్ణుంచి రా, జానకి ఒక్కతే పని చేసుకోలేకపోతున్నది."
    "అట్లనే, రేపొస్త! వస్తానండమ్మగారూ" రమాదాసి వెళ్ళిపోయింది.
    "మంచిదానిలా వుంది" అనుకున్నారు ముకుందంగారు.
    జానకి వెళ్ళిపోయింది.
    "అల వైకుంఠ పురంబులో ...." పద్యం బిగ్గరగా చదువుతున్నారు ముకుందంగారు.


                                                             10


    చీకటి రాత్రి! చుక్కల వెలుగు మాత్రం వుంది. ఊరు నిద్రపోయింది. రామాదాసి చెంబు తీసుకొని బయలుదేరింది_ఊరి బయటికి. చీకటి చిక్కగా వుంది. కీచురాళ్ళు రొద చేస్తున్నాయ్. గబ్బిలాలు ఎగురుతున్నాయి. ఊళ్లోంచి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. రమాదాసికి భయం భయంగా వుంది, కొంతదూరం సాగింది. దూరంగా మంట కనిపించింది. అది చెట్టుమీద మండుతూంది. నిప్పు రవ్వలు కుప్పలు కుప్పలుగా రాలుతున్నాయి.
    దడుచుకుంది రమాదాసి.
    దయ్యం అనుకుంది_కొరివిదయ్యం! కొరివిదయ్యం అలాగే నిప్పు కురుస్తుందని విన్నది. ఆమె వణుకుతున్నది. తప్పుకోడానికి వెనక్కు వెళ్తూంది. మంటను చూస్తున్నది. అది తనమీద పడుతుందేమోనని భయం. "ఆంజనేయ_ఆంజనేయ" అని జపం చేస్తున్నది.
    ఏసుదాసు కూడా అటే వచ్చాడు_మరోవైపు. అతనూ మంటను చూచాడు. అతనికీ భయం అయింది. అతనూ వెనక్కు వెళుతున్నాడు. "ఏసుప్రభూ!" అని జపిస్తున్నాడు. భయం భయంగా సాగుతున్నాడు. ఎదురుగా రమాదాసి కనిపించింది.
    రమాదాసిని దయ్యం అనుకున్నాడు_దాసు.
    ఏసుదాసును దయ్యం అనుకుంది_దాసి.
    "అమ్మో దయ్యం" అని ఉరికింది దాసి.
    "అమ్మో సైతాన్" అని ఉరికాడు దాసు.
    ఇద్దరూ ఒకే పొదచుట్టూ తిరుగుతున్నారు_ఒకరికి ఎదురుగా ఒకరు. ఒకరిని ఒకడు ఢీకొన్నారు. ఒకరిని ఒకరు పట్టుకున్నారు.
    "అమ్మో! దయ్యం నన్ను పట్టుకున్నది ఆంజనేయా" అని వణుకుతూంది దాసి.
    "అమ్మో సైతాన్ నన్ను పట్టుకున్నది ఏసుప్రభూ" అని వణుకుతున్నాడు దాసు.
    ఇద్దరూ "నన్ను వదులు" అంటే "నన్ను వదులు" అని వణుకుతున్నారు. ఇద్దరూ గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇద్దరూ వదలడంలేదు. ఇద్దరూ వణికిపోతున్నారు.
    రమాదాసి కళ్ళు తెరిచింది. ఏసుదాసు కనిపించాడు. నమ్మలేదు. దయ్యమే అలా వచ్చాడనుకుంది. అయినా అన్నది_
    "నిజంగా ఏసుదాసువా? విడువు"
    ఏసుదాసు విడిచాడు.

 Previous Page Next Page