జానకి విన్నది.
జానకి గుండె చెరువైంది.
మేరీలోని ఆతురత, అమాయకత ఆమెను కలచివేశాయి.
మేరీని ముద్దు పెట్టుకోవాలనుకుంది_కౌగిలించుకోవాలనుకుంది. అసలు మేరీని ఓదార్చాలనుకుంది.
భుజంమీద శారద కదలడం లేదు.
ఎదుట మేరీ కరిగిపోతూంది. మేరీ కళ్ళల్లో గుండెల దడదడలు వినిపిస్తున్నాయి.
ఏం చేయాలో అర్థం కాలేదు జానకికి క్షణం.
ఏసుదాసు ఇటు చూచారు_ఉరికి వచ్చాడు. శారదను అందుకున్నాడు.
"టీచర్ ఎలా వుంది శారద....శారద ఎలా వుంది టీచర్?" మేరీ గొంతులో ఏడుపు నిండింది. తల పైకెత్తి అడుగుతూంది. అడుగు దూరాన ఉంది మేరీ జానక్కి.
"మేరీ ఎంత మంచి పిల్లవమ్మా నువ్వు" జానకి మేరీని ఎత్తుకుంది. ముద్దాడింది. పైట కొంగుతో చమట తుడిచింది.
"టీచర్ శారద ఎలా ఉంది?" చేతుల్తో కళ్ళు తుడుచుకుంటూ అడిగింది మేరీ!
"రామ్మా! చూద్దాం" మేరీని తీసుకొని ఆస్పత్రిలో అడుగు పెట్టింది జానకి.
ఏసుదాసు బల్లమీద పడుకోబెట్టాడు. ఇంకా స్పృహ రాలేదు. మేరీ బల్ల దగ్గరికి చేరింది. జానకిని చూచింది. కళ్ళలో నీళ్ళున్నాయి. "ఎలా వుంది టీచర్?" అడిగింది.
"డాక్టర్ వస్తారు, చూస్తారు. చెప్తారు"
బయట సంచలనం వినిపించింది. జానకి బయటికి వురికింది. శారద తల్లిలా వుంది. ఏడుస్తూ, తల బాదుకుంటూ వస్తూంది. వెంట ఆమె భర్త వున్నాడు_శారద తండ్రి. సుడిగాలిలా వచ్చింది తల్లి. కూతుర్ను పట్టుకొని ఏడుస్తూంది. గోడుగోడున ఏడుస్తూంది.
బయట రిక్షా ఆగింది. జానకి గుమ్మంలోకి వురికింది. డాక్టర్ పాల్ దిగాడు. మెట్లెక్కాడు. జానకిని చూచాడు. ఆగిపోయాడు. జానకిని చూస్తున్నాడు. జానకి తడబడ్డది. పైట సర్దుకుంది. "పేషెంటును చూస్తారా! నన్ను చూస్తారా?"
"అయామ్ సారీ. మీరు..."
"ముందు పేషెంటును చూడండి. స్కూల్లో డ్రిల్లు చేస్తూ పడిపోయింది" అని ముందు నడిచింది జానకి. పాల్ అనుసరించాడు. టేబుల్ దగరికి చేరాడు డాక్టర్. శారద తల్లి డాక్టర్ను చూచింది. కాళ్ళూ కడుపూ పట్టుకుంది. కూతుర్ని కాపాడమని వేడుకుంటూంది.
"కాస్త ఊరుకో తల్లీ! పరీక్ష చేయనీ. మందివ్వనీ" అన్నాడు డాక్టర్. తల్లి గుడ్లనీరు కుక్కుకొని పక్కన నుంచుంది.
చకచకా పరీక్ష చేశాడు డాక్టర్. ఇంజక్షనులిచ్చాడు. ముక్కుకు ఏదో వాసన చూపించాడు. కొంతసేపు గడిచింది.
శారద కళ్ళు తెరిచింది.
తల్లి ఆనందం చెప్పలేం.
జానకి ముఖం విప్పారింది.
మేరీ మనసుకు మొలిచిన రెక్కలు కళ్ళలో కనిపించాయి.
"ఏమైందమ్మా నాకు?" శారద తల్లినడిగింది. తల్లికి ఏమీ తెలియదు. అది తెలుసుకోవాలనే ధ్యాస కూడా లేదు. తల్లి జానకిని చూచింది. జానకి ముందుకు వచ్చింది.
"టీచర్ వచ్చారా?"
జానకి శారద తల నిమిరింది. జరిగిందంతా కొద్దిలో చెప్పింది. "మేరీ ఏది?" శారద అడిగింది.
మేరీ దూరంగా చేతులు కట్టుకొని నుంచుని వుంది.
జానకి చూసింది.
శారద చూచింది. చేయి చాచింది. రమ్మన్నట్లు చూచింది. చేయి కలపమన్నట్లు చూచింది.
మేరీ శారద తల్లిని చూచింది. శారద తల్లి మేరీని చూచింది. మెడలో వ్రేలాడే శిలువను చూచింది. శారద ముందుకు జరిగింది. మేరీ కనిపించకుండా చేసింది.
శారద చిన్నబుచ్చుకుంది. జానకిని చూచింది. జానకి చూపు వాల్చుకుంది.
"డాక్టర్! శారదను తీసికెళ్ళమంటారా?" అడిగింది తల్లి.
"తీసుకెళ్ళొచ్చు. రేపొకసారి తీసుకురండి. అవసరం అయితే ఇంజక్షన్ ఇస్తాను."
శారదను తీసుకొని బయటికి వెళ్ళింది తల్లి. తండ్రి అనుసరించాడు. దాసి రిక్షా సిద్ధంగా వుంది. శారదను ఎక్కించింది. తల్లి ఎక్కింది.
శారద మేరీని చూచింది. చేయి చాచలేదు.
మేరీ శారదను చూచింది. ముందడుగు వేయలేదు. రిక్షా సాగిపోయింది.
చూపు అందినంతసేపు చూచారు మేరీ, జానకి.
"వెళ్తా టీచర్"
"వెళ్తావా? వెళ్ళు. శారదకి పర్వాలేదు. చూచావుగా." లేని సంతోషాన్ని కనబరచ ప్రయత్నించింది.
మేరీ వెళ్ళిపోయింది.
జానకి ఆస్పత్రిలో అడుగు పెట్టింది. డాక్టర్ చేతులు తుడుచుకుంటూ కుర్చీలో కూర్చుంటున్నారు. జానకిని చూచాడు. "రండి కూర్చోండి" అని కుర్చీ చూపించాడు.
"డాక్టర్! ఒక పాప ప్రాణం కాపాడారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు" జానకి కుర్చీలో కూర్చుంటూ అన్నది. ఆమె గొంతు కృతజ్ఞతా భావంతో నిండి వుంది.
"అది మా డ్యూటీ. అభినందించాల్సింది మిమ్మల్ని. పాపను భుజాన వేసుకొని పరిగెత్తి వచ్చారు. రమాదాసి అంతా చెప్పింది. గడియలు ఆలస్యం అయినా ప్రమాదమే! సమయానికి చేసిందే ట్రీట్ మెంట్! మించిపోయిం తరవాత మేమేమీ చేయలేం"
పొగడ్త విని జానకిలో సిగ్గు పొంగింది. ముఖంలో కనిపిస్తుందేమోనని తల వంచుకుంది. ఏమనాలో అర్థం కాలేదు. కాస్త తడబడ్డది. వేళ్ళ గోళ్ళు చూచుకున్నది.
రామాదాసి లోనికి వచ్చింది. జానకి చూచింది. అమాంతంగా స్ఫురించింది.
"నాదేముందండీ! అసలు అభినందించాల్సింది ఈమెను. సమయానికి రిక్షా కనిపించకుంటే...."
"నాదేముందండమ్మా _ నా బతుకే అదాయె"
"ముగ్గురు కలసి కాపాడిన్రు" ఏసుదాసు అన్నాడు.
"ఇద్దరు క్రైస్తవులు _ ఇద్దరు హిందువులు కలిసి ఒక హిందూ పాపను రక్షించారు" డాక్టర్.
"మనమంతా మనుషులం కామా? నలుగురు కలసి ఒక సాటి ప్రాణిని రక్షించారనుకుంటే?" జానకి.
డాక్టర్ ఉలిక్కిపడ్డాడు. మనసులో ఒక పచ్చని చేను వెలసినట్లుంది. పూల తోట పరిచినట్లుంది.
"జానకిగారూ! మీరు మహోన్నతులు. మనిషిని మనిషిగా గుర్తించడం కంటే ఘనత లేదు. మతాల, కులాల, దేశాల రంగులు పూసి మనిషిని చూడమంటుంది లోకం! అది నాకు గిట్టదు. నేను చూచేది మానవతను_మతాన్ని కాదు. అయినా నేనూ అన్నానంటే ఆ తల్లిని చూస్తే అలా అనిపించింది. మేరీ పాపం పసిపాప. శారద చేయి చాచింది మేరీ కోసం. తల్లి అడ్డం నుంచుంది. కూతురును తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకూ? మేరీ మెడలో శిలువ వుంది. అంతేగా? మరి నా మెడలోనూ శిలువ వుంది. నా సేవలు ఎలా పనికి వచ్చాయి? ఆ పాపం ఆర్తి, ఆరాటం, ఆప్యాయత_వారిని దూరంగా ఉంచడం ఎంతో బాధ కలిగించింది. అందువల్ల అలాంటి మాట వచ్చింది. మన్నించండి_మీ మనసు నొప్పిస్తే."
"మీ మనసు ఎంత వ్యధ చెందితే అలా అన్నారో గమనించగలను. వాళ్ళ పద్దతే అంత. అవసరం అయితే అన్ని ఆచారాలూ మార్చుకోగలరు. అక్కర్లేనప్పుడు అన్నిటికీ దూరంగా ఉండగలరు."