Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 11

"అవును ఆయన మా నాన్నగారికి ఫ్రెండ్! మీకెలా తెలుసు?"
"నేను సౌత్ జోన్ ని ఒకసారి రిప్రజంట్ చేశాను రంజీట్రోఫీలో" అన్నాడు.
తక్షణం ఆ అమ్మాయి కళ్ళలో నిర్లిప్తత స్థానే కొంచెం ఆశ్చర్యం, కొంచెం గౌరవం చోటు చేసుకున్నాయి. స్పోర్టుమాన్ లాగా బలిష్ఠంగా, ఆరోగ్యంగా ఉన్నాడతను. కొద్దిగా నలిగిన బట్టలు. "సో మీరు రంజీ ప్లేయరా? మరి మంచి ఉద్యోగమేం దొరకలేదా?"
భుజాలెగరేశాడు శ్రీమంత్.
"దేశంలో ఉన్న అన్ ఎంప్లాయ్ మెంట్ ప్రాబ్లెం గురించి మీకు తెలియదనుకుంటాను" దేశంలో నిరుద్యోగ సమస్యకి నీలాంటి వాళ్ళే కారణం అన్నట్లు అతను చూస్తుంటే ఇబ్బందిగా కదిలింది ఆ అమ్మాయి.
"ఇంకా ట్రాజెడీ ఏమిటంటే, నేను హిస్టరీలో పోస్టుగ్రాడ్యుయేట్ ని కూడా?"
"హిస్టరీనా?" అంది సాలోచనగా తరువాత అతని వైపు సానుభూతిగా చూస్తూ. "అయినా ఉద్యోగం దొరకలేదా? చిత్రంగా ఉంది." అంది.
"అదే మిస్టరీ!" అన్నాడు శ్రీమంత్ సరదాగా. "మీ నాన్నగారిని కలవమంటారా?" ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ అమ్మాయి. "నాన్నగారినా? ఉహు! వీల్లేదు!"
శ్రీమంత్ చిత్రంగా చూశాడు.
"ఎందుకని?"
ఏదో చెప్పబోయి మానేసింది. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్లు "మీ చదువూ వివరాలు - బయోడేటా అంతా రాసిచ్చి వెళ్ళండి. అవకాశ మొచ్చినప్పుడు కబురు చేస్తాను" అంది.
కొద్ది నిరాశగా చూశాడు శ్రీమంత్.
"ఐ యామ్ సారీ! కళ్యాణసుందరంగారి మాటమీద వెంటనే జాబ్ ఇవ్వలేకపోతున్నందుకు కానీ...సాధ్యమైనంత త్వరలో...ప్రయత్నిస్తాను. ఆయన రాసిన లెటర్ నాకు ఇవ్వండి. నాన్నగారికి చూపిస్తాను."
"థాంక్యూ!" అని వెనక్కు తిరగబోయి ఆగి, "మీ పేరు తెలుసుకోవచ్చా?" అన్నాడు అపురూపమైన వరం అడుగుతున్నట్లు.
"మృదుల!" అంది. తన అందం చూసి తలక్రిందులైపోయేవాళ్ళూ, తన పేరయినా తెలుసుకోవడం కోసం తలక్రిందులుగా తపస్సు చేసే వాళ్ళూ ఆ అమ్మాయికి కొత్తకాదు. అందుకే తనపెదిమలమీద గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది.
"వెళ్లొస్తాను" అంటూ వెనక్కు తిరిగాడు శ్రీమంత్.
మృదుల, తెల్ల డెనిమ్ జీన్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని, భుజం పోర్టికో స్థంభానికి ఆనించి వయ్యారంగా, దర్పంగా, హుందాగా నిలబడి, దూరంగా వెళ్ళిపోతున్న శ్రీమంత్ నీ, పాదాలకి స్ప్రింగులున్నట్లు చక్కని దేహ కదలికల సమన్వయంతో, ఠీవిగా పడుతున్న అతని అడుగుల్నీ సాలోచనగా, పరీక్షగా గమనించింది.
    
                                                                   * * *
    
సరిగ్గా నెల గడిచింది.
రేపే రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాల్సిన రోజు! రేపటినుంచీ తను 'మిసెస్ లతా శ్రీమంత్' అవుతుంది.
రెండ్రోజులు కాజువల్ లీవ్ అప్లయి చేసింది లత.
సంతోషంతో, ఎక్జయిట్ మెంట్ తో ఒళ్ళు వెచ్చబడి జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది.
మొదటిసారి రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇంత ఎదురు చూడడం, ఇంత వుద్విగ్నతా, సస్పెన్సు లేవు.
హఠాత్తుగా అప్పటికప్పుడు రోడ్డుమీద పెళ్ళి గురించి నిర్ణయం తీసేసుకుని, మార్నింగుషోకి వెళ్ళినంత సులభంగా రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు.
ఆ తర్వాత ఈ నెలరోజులనుంచీ ఇదే ఆలోచన తన మనసులో.
ఎందుకో ఆకలిగా కూడా అనిపించడంలేదు ఇవ్వాళ. భోజనం చెయ్యకుండానే తన పక్కవేసుకుని పడుకుంది. తను భోజనం చెయ్యకపోయినా ఆదుర్దా పడే వాళ్ళు ఎవరూ లేరు.
ఇదే అమ్మ అయితే!
అమ్మ ఉంటే తన పెళ్ళి మామూలుగానే అయ్యేదేమో! రిజిస్టర్ మారేజీ కాకుండా!
రాత్రి పదకొండయింది. మావయ్య మాత్రం మేలుకుని ఉన్నాడు. అత్తయ్యా, ఆమె కూతుళ్ళూ అప్పటికే మంచి నిద్రలోకి జారుకున్నారు.
పడక కుదరలేదు లతకి. నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ భంగిమ మార్చి పడుకుంటోంది. నరనరాల్లో ప్రవహిస్తున్న ఉద్వేగం లతని కుదురుగా పడుకోనివ్వడం లేదు.
బలవంతంగా నిద్ర పట్టించుకోవడానికి ప్రయత్నిస్తూ, బోర్లాపడుకుని, దిండుకింద చేతులేసి, దగ్గరగా లాక్కుని, గట్టిగా కళ్ళు మూసుకుంది.
దిండు కింద వున్న చేతులకి ఏవో తగిలాయి. తడిమి చూసింది.
కాయితాల్లాగా అనిపించాయి.
దిండు ఎత్తి చూసింది.
పుస్తకాలు.
పాకెట్ సైజు కంటే చిన్నవిగా వున్న పుస్తకాలు. పంచాంగాల్లా చిన్నవిగా, రంగురంగుల వార్నిష్ పెయింటు కవర్లతో...అట్టలమీద, బట్టలు లేని అమ్మాయిల ఫోటోలతో...
అవేమిటో మొదట అర్ధం కాలేదు లతకి.
రెండు క్షణాల తర్వాత అర్ధమైంది.
'రాత్రికి రా!' 'ఒంటరి పిల్ల' లాంటి టైటిల్స్.
సెక్సు బుక్సు!
ఎవరు పెట్టి ఉంటారు తన పక్కలో?
అనుమానంగా అత్తయ్య కూతుళ్ళ వైపు చూసింది.
గాఢనిద్రలో వున్నారు వాళ్ళు! వాళ్ళు తను లేనప్పుడు తన పక్క వేసుకుని రహస్యంగా చదివి, దిండు కింద పెట్టి మర్చిపోయి వుంటారా?
ఇంతలో పక్క గదిలో నుంచి దగ్గు!
మామయ్య దగ్గుతున్నాడు.
అది నిజం దగ్గు కాదు.
పడిశెపు దగ్గు కాదు.
లతని 'పడేసే' ప్రయత్నంలో సాభిప్రాయంగా, కోడ్ లాంగ్వేజ్ లాగా, ఎదుటివాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలా వుంది.
మామయ్య!

 Previous Page Next Page