Previous Page Next Page 
ముగ్ధ పేజి 11

 

       "ఏయ్ ముగ్దా! ఆ జంటను చూడు ఆ పల్లెటూరి అమ్మాయి ఎందుకలా కూర్చుందో చెప్పగలిగితే, నువ్వు ఎక్స్ పర్ట్ వని నేన్నమ్ముతానే" అంది నీలిమ.
    
    "స్వయంవరం మర్చిపోయారా...ఈ బాడీ లాంగ్వేజ్ గోలెక్కడ నుంచి వచ్చిందే" సురభి అంది.
    
    "ఈ ఒక్కటేనే తర్వాత నీ ఇష్టం." అంది నీలిమ మళ్ళీ.
    
    "అయితే విను ఇప్పుడు మనకు చలేస్తోందా లేదు కదూ కానీ ఆ అమ్మాయి చలెయ్యక పోయినా భుజాల నిండుగా పైట కప్పుకుంది. పల్లెటూరి అమ్మాయిలు సాధారణంగా పట్నాల్లో హోటల్స్ కి వచ్చినపుడు మమూలుగానే కూర్చుంటారు తప్పించి, కాలుమీద కాలు వేసుకొని కూర్చోరు. అవునా....ఆ వ్యక్తి చెపుతున్న దానిని ఆ అమ్మాయి అయిష్టంగా వింటోంది" అందరూ గమనించారు. మిగతా ముగ్గురూ ఆ అమ్మాయిని చూసి-
    
    "అవును" అన్నారు.
    
    ముగ్ధ పెదవులమీదకు చిరునవ్వొకటి వచ్చింది.
    
    "ఆ అమ్మాయి బాధ పడుతోంది" అంది ముగ్గురు ముఖాలవేపూ చూస్తూ.
    
    "ఎందుకూ బాధ" నీలిమ అంది.
    
    "ఆ అమ్మాయి బాత్ రూంకి వెళ్ళాలి. అందరి మధ్యా మొగవాడ్ని ఎలా అడగాలన్నది మొదటి ప్రశ్న కాగా, బాత్ రూం ఎక్కడుందో తెలీకపోవడం రెండో బాధ. ఇదే నిజమైతే మరో రెండు నిమిషాల్లో ఆ అమ్మాయి సీట్లోంచి లేస్తుంది చూడండి" నవ్వుతూ చెప్పింది ముగ్ధ.
    
    "నిజంగా" నమ్మలేనట్లు అందరూ ఆ అమ్మాయి వేపే చూస్తున్నారు. కరెక్టుగా రెండే రెండు నిమిహాలు జరిగాక, ఆ అమ్మాయి లేచి నిలబడడం, ఆ మగవ్యక్తి బాత్ రూం వేపు చెయ్యి చూపెట్టడం, ఒక్కసారి జరిగిపోయాయి.

        
    "హిప్...హిప్....హుర్రే". ఆనందాన్ని పట్టుకోలేక అరిచినంత పని చేసింది అలక.
    
    "యూ ఆర్ గ్రేట్ ముగ్దా" సురభి కంగ్రాట్స్ చెప్పింది.
    
    "అయితే ఆ బ్లూ సూట్ వ్యక్తి, ఎదుటి వ్యక్తి చెప్పిందాన్ని అయిష్టంగానే వింటున్నాడంటావా" నమ్మలేనట్టుగా అంది అలక.
    
    "కావలిస్తే వెళ్ళడుగు సబ్జెక్ట్ ఏదైనా సరే....అతను అయిష్టంగా వున్నాడా లేదా తెల్సిపోతుంది." ముగ్ధ అంది.
    
    అలక మనసులోని కోరిక ఆ కుర్రాన్ని ఎలాగయినా పలకరించాలని అతన్ని మొట్టమొదట ఆ హోటల్లోకి రావడంతోటే చూసి, అతని అందానికి, అతని 'హీమాన్ షిప్' కి ఆశ్చర్యపడింది అతన్ని చూడగానే ఆమెకు అమితాబ్ బచ్చన్ గుర్తుకొచ్చాడు. మిధున్ చక్రవర్తి గుర్తుకొచ్చాడు.
    
    "అయితే.... వెళ్ళనా..." అంది అందరివేపు చూస్తూ అలక.
    
    "స్వయంవరానికి అంకురార్పణ చేస్తున్నావన్నమాట" అంది నీలిమ చిన్నగా నవ్వుతూ.
    
    "విష్ యూ ఆల్ ది బెస్ట్" అంది సురభి.
    
    కుర్చీలోంచి లేచి నిలబడింది అలక.
    
    వచ్చే పోయే టూరిస్టులతో హోటల్ సందడిగా వుంది. ఒకపక్క స్పీకర్ లోంచి వస్తున్న పాప్ మ్యూజిక్ వింటూ - వయ్యారంగా నిలబడిన అలక వేపే అందరూ చూస్తున్నారు. అలక నెమ్మదిగా నడిచి, కుడివేపు కార్నర్ లో వున్నా ఆ సీటు దగ్గరివెళ్ళింది.
    
    టేబుల్ పక్కన సడన్ గా మెరుపులా నిలిచిన ఆ అమ్మాయి వేపు అబ్బాయి తల తిప్పి చూసాడు.
    
    "మై నేమీజ్ అలక.... అలకానంద..." అంది అలక మృదువుగా.
    
    ఒక్కక్షణం ఆమెవేపు చూసి-
    
    "ప్లీజ్ బీ సీటెడ్ వాట్ డూ యూ వాంట్ మిస్?" చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్ గా అడిగాడు. అతని వాయిస్ సురేష్ ఓబ్రాయ్ వాయిస్ లా ఎట్రాక్టివ్ గా వుంది అలకకు.
    
    అతని రిక్వెస్టుని కాదనలేక ఎదురుగా వున్న సీట్లో కూర్చుంది అలక.
    
    చుట్టుపక్కల టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళిద్దరిమీదే వున్నాయి.
    
    "మై నేమీజ్ గౌతమ్ జయాధ్యక్ష బాంటే" చెప్పాడు జయాధ్యక్ష.
    
    "ఇంతవరకూ మీరిద్దరూ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెల్సుకోవచ్చా."
    
    అలా అడిగిన అలకవేపు చూసాడు జయాధ్యక్ష ఆశ్చర్యంగా.
    
    "మీ కభ్యంతరం లేకపోతేనే" నెమ్మదిగా అంది అలక తిరిగి.
    
    "మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో, తెల్సుకుని వస్తానని మీ ఫ్రెండ్స్ తో పందెం కట్టారా" నవ్వుతూ అడిగాడతను.
    
    అవుననలేదు కాదనలేదు అలక.
    
    "మగవాడిని ఆడపిల్ల ఏంచూసి ప్రేమిస్తుంది? ఎందుకు ప్రేమిస్తుంది."
    
    ఈ సబ్జెక్టుమీద మా ఫ్రెండ్ తన అనుభవాలన్నీ చెప్తున్నాడు.
    
    వాటిని అయిష్టంగా వింటున్నానేను. అంతే అన్నాడు జయాధ్యక్ష.
    
    "అయిష్టంగానే వింటున్నారా" ఠక్కున అడిగింది అలక.
    
    "ఎస్."
    
    "ఏం."
    
    "ఒక మగవాడుతో ఇంకో మగవాడు ఆ విషయాల్ని డిస్ కస్ చేస్తే ఏంబావుంటుంది చెప్పండి బావుంటుందా." జయాధ్యక్ష తననే అలా ప్రశ్నిస్తాడని ఊహించలేదు అలక.
    
    "మీలాంటి రేఖలాన్తి రేర్ బ్యూటీస్ చెప్తే బావుంటుంది అవునా" మళ్ళీ అతనే అన్నాడు.
    
    ఆ మాటకు అలక మనసు ఇంద్రధనుస్సు మీద ఉయ్యాలలూగుతున్నట్టు అయిపోయింది.
    
    ఏ సుదూరతీరంలోనో ఒంటరి నదిలో ఏకాంత ప్రదేశంలో పరిగెడుతున్నట్టుగా అయిపోయిందామె మనసు.
    
    జయాధ్యక్ష అడిగిన దానికి జవాబు చెప్పలేకపోయింది అలక.
    
    "నేనడిగినడానికి మీరు జవాబుచెప్పాలి. ఎందుకంటే మీరడిగినడానికి నేను బుద్దిమంతుడిలా వెంటనే జవాబుచెప్పాను గనక" అలక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు జయాధ్యక్ష.
    
    ఆ కళ్ళ కాంతిని భరించలేకపోయింది అలక. లేచి నిలబడింది చటుక్కున.
    
    "కోపమొచ్చిందా?" అడిగాడు జయాధ్యక్ష నవ్వుతూ.
    
    "నాకెందుక్కోపం?" సూటిగా అతని ఎర్రటి పెదిమలవేపు చూస్తూ అంది అలక.
    
    "మరి నేనడిగిన ప్రశ్నకు మీదగ్గర జవాబు లేదా.... వుందా."
    
    "తెలీదు." అలక బుగ్గలు ఎరుపెక్కిన విషయం గమనించాడు జయాధ్యక్ష.
    
    "మీ దగ్గర జవాబుందని నాకు తెల్సు" ఒక్క సెకండ్ ఆగి.
    
    "సంపెంగపువ్వు సిగ్గుపడ్డం మీరెప్పుడయినా చూశారా?" అని అడిగాడు జయాధ్యక్ష.
    
    లేదన్నట్టు కళ్ళుతిప్పింది అలక.
    
    "మిమ్మల్ని చూస్తుంటే సంపెంగ పువ్వు సిగ్గుపడుతున్నట్టు వుంది."
    
    ఆ మాటతో కొంచెం ముందుకడుగేసి ఒకింత చొరవని కనబర్చింది అలక.
    
    "చూడండి మిస్ అలక. సాయంత్రం పద్మావతి గెస్టు హౌస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఎందుకో తెల్సా మీ జవాబు కోసం."
    
    ఆ మాట విన్పించుకొనట్టుగా గబగబా అక్కడ్నుంచి వచ్చేసింది అలక.

 Previous Page Next Page