ఆమె గుండెల్లో ఏదో ఉద్వేగం ఎంతో దూరంనుంచి పరుగెత్తి, పరుగెత్తి వహ్చి కూలబడినట్టుగా అయిపోయింది అలక మనసు. అలల తాకిడితో ఉప్పొంగే సముద్రంలో స్విమ్మింగ్ చేసినట్టుగా వుంది అలకకు.
"ఏమైందే" దగ్గరకొచ్చిన అలకను అడిగింది సురభి.
"బాడీ లాంగ్వేజ్ లో ముగ్ధ నిజంగా ఎక్స్ పర్టు." ఆయాసాన్ని అణచుకుంటూ ముగ్ధవేపు చూస్తూ అంది అలక మెచ్చుకోలుగా.
"ఇంతకీ వాళ్ళిద్దరిమధ్యా నడుస్తున్న టాపిక్ ఏంటే" నీలిమ అడిగింది.
నీలిమ అడిగిన ప్రశ్నకు జవాబుచెప్పలేదు అలక.
మిమ్మల్ని చూస్తుంటే సంపెంగపువ్వు సిగ్గుపడుతున్నట్టుగా ఉంది జయాధ్యక్ష కంఠంలోంచి వహ్చిన ఆ పొగడ్తే అలక నరనరాన్ని పరవశింపచేస్తున్నాయి. హిప్నటిస్టు చేసిన హిప్నాటిజంలో చిక్కుకుపోయినట్టుగా అయిపొయిన్ధిఉ అలక. ఒకింతసేపటికి తేరుకుని నోరు తెరిచింది.
"నా కతడు నచ్చాడు. నేనతని వెనుక వుండి ఉత్తేజపరుస్తాను" అంది ఆత్మీయంగా అలక.
మిగతా ముగ్గురూ ఒక్కసారి హేళనగా నవ్వారు.
"అతను జెంటిల్ మన్ లా కనిపిస్తున్నాడు. అతనికి నువ్వు కొత్తగా ఇచ్చే ఉత్తేజం ఏముంటుంది? దారి తప్పినవారనే మనం సెలెక్టు చేసుకోవాలని మర్చిపోయావా? ఉయ్ ఆర్ సారీ! వ్యక్తిగత ఇష్టాలకు ఇక్కడ తావులేదు" నిర్మొహమాటంగా అన్నారంతా.
ఇక్కడిలా వుండగా అక్కడ మరో రెండు నిమిషాల తర్వాత జయాధ్యక్ష సీటులోంచి లేచాడు. పక్కకు తలతిప్పి అలకవేపు చూసి, కళ్ళతోనే వెళతానన్నట్టుగా చెప్పి ముందుకు నడిచాడు.
వెళుతున్న జయాధ్యక్షవేపు నిరాశగా చూసింది అలక.
"ఎవరా అమ్మాయి? ఇంతకుముందు నీకు తెలుసా?" జయాధ్యక్షను అతని ఫ్రెండ్ అడిగాడు.
"తెలీదు" జయధ్యక్ష ఠీవిగా సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు.
"అంతవరకూ మనం పాలిటిక్స్ గురించి కదా డిస్కస్ చేస్తున్నాం. మరి ఆ అమ్మాయితో ఇంకేదో విషయం డిస్కస్ చేస్తున్నామని ఎందుకు అబద్దం చెప్పావ్?"
అతడివేపు ఓరి పిచ్చివాడా అన్నట్టు చూశాడు జయాధ్యక్ష.
"ఎవరైనా ఆడపిల్ల మనతో మాట్లాడటానికి వచ్చినపుడు, ఆమెను ఎట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ నే మాట్లాడాలి. అందులోనూ ఆ అలక టీన్స్ దాటిన అమ్మాయికదా! ప్రేమలో పడే కరెక్టు వయసిదే. మగవాడు తనను అల్లుకుపోవాలని కోరుకునే వయసిదే. అంచేత అలాంటి అమ్మాయికి అలాంటి ఇష్టమైన సబ్జెక్టు" నవ్వాడు జయాధ్యక్ష.
"భలేవాడివే! ఆడవాళ్ళను ఎట్రాక్ట్ చెయ్యడం ఓ ఆర్ట్ ఆ ఆర్ట్ లో నువ్వు డాక్టరేట్ లా వున్నావ్" పొగిడాడు అతను.
"డాక్టరేట్ లా కాదు. డాక్టరేట్ నే" హస్కీగా అన్నాడు జయాధ్యక్ష.
"సాయంత్రం ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుందంటావా?"
"వెయిట్ అండ్ సీ" అని బయటికని 'ఈ జయాధ్యక్ష ఇష్టపడిన ఏ అమ్మాయీ దగ్గరకు రాకుండా పోలేదు. అలాగే తనకు నచ్చిన ఏ అమ్మాయినీ ఈ జయాధ్యక్ష వదలనూలేదు' అని మనసులో అనుకున్నాడు.
అదే సమయంలో వాళ్ళ ప్రక్కనుంచే నెమ్మదిగా నడుస్తూ ముఫ్ఫై రెండేళ్ళ వ్యక్తి లోనికడుగు వేశాడు.
ఆయనే సైంటిస్ట్ శ్రీధర్.
"మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడే" సురభి చేతిని గట్టిగా నొక్కుతూ అంది నీలిమ.
"ఒక గంట తర్వాత కాటేజ్ కొచ్చి కలుస్తానే" ఫ్రెండ్స్ తో చెప్పి రెస్టారెంట్ లోనికొచ్చి నాలుగువేపులా చూస్తున్న శ్రీధర్ దగ్గరికి నడిచింది సురభి.
"నమస్తే సర్!" పరాకుగా ఎటో చూస్తున్న శ్రీధర్ కంగారుపడ్డాడు.
"నమస్తే... నమస్తే నీ కోసమే చూస్తున్నాను" అన్నాడాయన.
"ఏమిటో బజార్లు రెస్టారెంట్లలా వుంటాయి. రెస్టారెంట్లు బజార్లలా వుంటాయి అంతా గందరగోళం కదూ" కళ్ళద్దాల్ని సర్దుకుంటూ అన్నాడు శ్రీధర్.
"అందుకే మనం గార్డెన్ లో కూర్చుని మాట్లాడుకుందాం సర్" నవ్వుతూ అంది సురభి.
"ఓ.కే.... ఓ.కే..." ఇద్దరూ రెస్టారెంటులోంచి బయటికొచ్చి ఎడమవేపు మలుపు తిరిగారు. అక్కడ ఓ ఇరవై అడుగుల దూరంలో డెడ్ ఎండ్. చుట్టూ ఇనపకంచే ఎత్తుగా ఎదిగిన పచ్చిక.
ఆ పచ్చికలో ఇద్దరూ కూర్చున్నారు.
సంభాషణని ఎలా ప్రారంభించాలో ఆలోచిస్తోంది సురభి.
"ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలన్నావ్....ఏమిటది?"
ఆ మాట అంటున్న శ్రీధర్ వైపు పరీక్షగా చూసింది సురభి. శ్రీధర్ కి ముఫ్ఫై రెండేళ్ళుంటాయి. సన్నగా పొడవుగా వుంటాడాయన.
నిరంతరం పరిశోధనలమధ్య, ప్రపంచం అంటే పట్టని శ్రీధర్, తిరుపతి నుంచి తిరుమల రావడం చాలా అరుదైన విషయం. ఆయన ఎన్నో ఏళ్ళుగా అక్కడుంటున్నా ఏనాడూ కొండెక్కలేదు.
నా పరిశోధనే నా దైవం... అంటాడాయన-
"ఏమిటో చెప్పు ఇంపార్టెంట్ విషయం" కుందనపు బొమ్మలా వున్న ఆ అమ్మాయివేపు చూస్తూ అన్నాడాయన.
"సర్ మీరు నాకో సలహా ఇవ్వాలి- నేనో వ్యక్తిని ప్రేమించాను. ఆ వ్యక్తికి ఇదివరలోనే పెళ్ళయింది. నేను ప్రేమిస్తున్న విషయం ఆయనకు తెలీదు. ఆయనకు నాకూ మధ్య దాదాపు పదేళ్ళ వ్యత్యాసం వుంటుంది. ఆయనతో ఈ విషయం ఎలా చెప్తే బాగుంటుందో, మీ సలహాకోసం." శ్రీధర్ వేపు చూస్తూ అంది సురభి.
"నేననుకున్నాన్లే ఈ వయసులో ప్రేమలు తప్ప, పరిశోధనలుంటాయా...ప్రేమిస్తున్నావన్నమాట... నువ్వాయాన్ని ప్రేమించే ముందు, నీకయన పూర్తిగా అర్ధమయ్యేడనుకుంటున్నావా? నువ్వు ఆయనగురించే ఆలోచిస్తున్నావ్.. మరి వాళ్ళావిడ గురించి ఏమాలోచిస్తున్నావ్? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా వుంటే, ఆయన నే ఎప్రేమనేలా స్వీకరించాగలడు? నువ్వంటే ఇష్టం వున్నాసరే.... తన భార్య స్థానంలో నిన్ను చూడలేడు... ఎందుకంటే, ఎన్నో ఏళ్ళుగా సంసారం చేస్తున్న స్త్రీ పట్ల ఆయనకు ప్రేమ లేకపోయినా, మమకారం వుంటుంది. అవునా" చెప్పడం ఆపి సురభివేపు చూసాడు శ్రీధర్.
సురభి తలొంచుకుని పచ్చికమీద గీతలు గీస్తోంది.
"భార్య ఆయన్ని ప్రేమిస్తోందా, ద్వేషిస్తోందా అనేది నాకక్కరలేదు సర్- నేనాయన్ని ప్రేమిస్తున్నాను- అన్ని కోణాల్లోంచి ఆయన్ని నేను అర్ధం చేసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్యా సదవగాహన లేదని మాత్రం నాకు తెలుసు. ఆ సదవగాహన లేకపోవడాన్ని నేను ఆసరాగా తీఉస్కుని ఆమెకు ద్రోహం చేస్తున్నారనుకునేరు. నేనాయన్ని చూసిన మొదటి క్షణం నుంచే ప్రేమిస్తున్నాను. నా వయసు కుర్రాడ్ని నేను ప్రేమించకుండా, వయసులో పెద్దయిన ఆయన్ని ఎందుకు ప్రేమిస్తున్నానా అని చాలా సార్లు ఆలోచించుకున్నాను. ఆ ఆలోచనను విరమించుకుందామనుకున్నాను. కుదరలేదు... అందుకే-"
చాలా ఉద్వేగంగా చెప్పింది సురభి ఆ మాటల్ని.
"నీ సైడ్ లో నువ్వు సీరియస్ గా వున్నావు కాబట్టి. ఆలస్యం చెయ్యకుండా, ఆయనతో ఈ విషయం మాట్లాడు ఏమంటాడో చూడు. తర్వాత మనం ఆ విషయం 'డిస్ కస్' చేద్దాం" శ్రీధర్ అమాయకంగా అన్నాడు.