'' అలాంటి విషయాల్లో తొందరగానే నిశ్చయానికొస్తాము. రావడం తొందరే కానీ, వచ్చినది మాత్రం తిరగని నిశ్చయం.''
చాలా సేపటివర కిద్దరమూ మౌనంగానే ఉన్నాము.
నా హృదయం మహతివీణే కాదు. మహామహతివీణె. వేయి తీగెలతో, వేయి మెట్లతో లోకాలు ఆవరించుకొన్న విప్రకృష్టమైన మహా మహతివీణె. ఆ అద్బుత పల్లకి తంతులలో తెలిసో తెలియకో పంచమ సర్వపూరితమైన ప్రాణ తంత్రిని మీటి నా జీవితాకాశంలో కాకలీ స్వరాలు మారు మ్రోగించినాడు త్యాగతి. ఎవరీ త్యాగతి? రాత్రల్లా సగం తెలిసిన నిద్ర. కలలుపూనిన కాళరాత్రి. గంభీర రూపాలు ఆవహిల్లిన అనంతదాయము. అందులో ఎచ్చటనో ఉన్నాడితడు.
15
నాకు యిద్దరు యువతీమణులు స్నేహితులున్నారు. స్నేహితులంటే చాలా సన్నిహితురాండ్రై నాతో జీవికాజీవులులాగ మెలిగేవాళ్ళని నా అభిప్రాయం. వీళ్ళు కాక నాతో చదువుకున్నవారు, నా సతీర్డులు అయిన చెలిమికత్తెలు చాలామంది ఉన్నారు. అందులో కొందరు కొంచెం దగ్గరగా ఉంటారు, కొందరు కొంచెం దూరం, ఇంకా కొందరు ఇంకా కొంతదూరంలోను ఉంటారు.
నేను కాలేజేలో టెన్నిస్ బాగా ఆడేదాన్ని. విద్యార్ధినీ బృందంలో నన్ను మించిన ఆటకత్తెలు లేనేలేరు, వరుసగా రెండేండ్లు నేనె ఛాంపియన్ షిప్ టెన్నిస్ కప్పు విజయం పొందాను. పరుగులో దిట్టమైన బాలికను. సంచి పందెము వగైరాలో ఒకటో స్థానమో, రెండో స్థానమో వచ్చేది. ఆ ఆటల సందర్బంలో ఎందరో బాలికలు స్నేహితురాళ్ళయ్యారు. వీరందరినీ కలుసుకుంటూ ఉంటాను. మా యింటికి విందుకు పిలుస్తూంటాను.
నాకు అత్యంత సన్నిహితులయిన ఆ ఇద్దరు స్నేహితురాండ్రనూ ప్రాణ స్నేహితురాళ్ళంటాను. మా ముగ్గురిలో రహస్యాలు లేవు. అక్క చెల్లెళ్ళు కూడా అంత దగ్గరగా ఉండరు. అక్క చెల్లెలికి రహస్యాలు చెప్పకపోవచ్చును. చెల్లెలు అక్కకు చెప్పకపోవచ్చును. కాని ప్రాణ స్నేహితురాండ్రు మాత్రం తమ తమ రహస్యాలన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు.
వెనుక కాలంలో ఆడవారిలో స్నేహితులు అంత సన్నిహితంగా ఉండేవారు కాదట. స్త్రీ తన రహస్యాలన్నీ ఎవరితోనూ చెప్పదనే అంటారు.అందులో నిజం లేకపోలేదు. మా హృదయాంతరాలలో ఉన్న రహస్యాలు సర్వాంతర్యామియైన భగవంతునికే తెలియనియ్యము. కాని చిన్నతనంలో ఈ స్త్రీ విద్యాదినాల్లో నెచ్చెలులకు కాస్త మా రహస్యాలు చెప్పుకుంటున్నాము.
పురుషులు రహస్యాలు దాచుకోలేరు. ఏ స్నేహితురానితోనో ఎంత నిగూఢ రహస్యాన్నైనా చెప్పేస్తారు. స్త్రీ పురుష సంబంధాలైన రహస్యాలేవన్నా బయటపడ్డాయంటే పురుషుని వల్లనే. అవి సంపూర్ణంగా నమ్ముతాను. ఇంతకూ నాకు ఉండే రహస్యాలేమిటి? నే నేమీ వ్యాపారాలు చేయటంలేదు. ఇంక నాకున్న ప్రణయ కార్యకలాపం అంత నిగూఢమైంది ఏముందిగనకా? అయినా నా మనసులో ఉన్న రహస్యభావాలు కాసిని, ఆ నా ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్ళతో చెప్పుతూ వుండడం, వాళ్ళ హృదయాలు వాళ్ళు నాకు తెలియజేయడం మాకు పరిపాటే. మేం ముగ్గురం ఎక్కడో కలుస్తూనే ఉండేవాళ్ళం.
అందులో ఓ అమ్మాయికి మద్రాసులో ఒక బాలికా పాఠశాలలో ఆంద్రోపాద్యాయిని పని అయింది. ఆమె రూపు రేఖా విలాసా లంటారా? ఉంటాయి ఒక మోస్తరు. ఆ అమ్మాయి అతి ఆడపిల్ల. చూపులో దగ్గర వస్తువులు కనబడతాయి. అందుకని షార్ట్ సైట్ అద్దాలు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయికి నేనె లోకేశ్వరి అని పేరు పెట్టినాను. ఆ అమ్మాయి అసలు ఊరు ఒంగోలు. అసలు పేరు దుర్వాసుల వెంకటరత్నమ్మ. నెల్లూరులో తన చుట్టాల ఇంటికడ ఉండి చదువుకొని, స్కూలు ఫైనలు ప్యాసయి చెన్న పట్నం ఇంటరు చదువుకని వచ్చింది.
అప్పటినుంచీ నాకూ, 'లోకా'నికీ చూపులతోనే ప్రేమ కుదిరింది. లోకం ఎంత తెలివైనది ! చెన్నపట్నంలో మాయింట్లోనే నాతోపాటే ఉండి చదువుకోమని పట్టుపట్టినాను. మా ఇంట్లోనే భోజనం చేసేది. మా నాన్న గారూ, మా అమ్మగారూ లోకం అంటే ప్రాణం ఇచ్చేవారు. కన్నా కూతురైన నాకన్న వాళ్ళిద్దరి దగ్గరా ఆమె ఎక్కువ చనువుగా ఉండేది. మాయమైపోయిన మా అక్కని మరపించేటంత ఆపేక్షగా వుండేది. మా అక్క ఫోటో తన గదిలో పెట్టుకొని పూలదండలు వేసేది. రెండు మూడుసార్లు మా అక్క బొమ్మను హృదయాని కద్దుకొని కంటినీరు పెట్టుకోవడం కూడా నేను చూశాను.
లోకమే మా అమ్మనీ, నాన్ననీ సినిమాలకు, నాటకాలకు అడయారుకు, బీచికీ తీసుకువెడుతూ ఉంటుంది.
మా అక్కను పూర్తిగా జ్ఞాపకం చేసుకోలేను. మా అక్క అమృత మూర్తట. దివ్య సౌందర్యవతట. నా ఆరవఏటనే మా అక్కకు పెద్ద జబ్బు చేసి వెళ్లిపోయింది. మా అక్క, నేనూ ఒక్కటే పోలిక. మా అక్క పోయేటప్పటికి పదహారేళ్ళది. నాకు పదహారేళ్ళు వచ్చినపుడు అచ్చంగా మా అక్కలాగే ఉన్నాను. మా ఇద్దరి ఫోటోలు పక్కపక్కగా పెట్టితే ఒక్కరి ఫోటోలే అని చెప్పవలసిందే. ఏ మాత్రమూ తేడాలేదు. ఆ రెంటికీ.
మా బావను తలచుకుంటే ఏదో కలలో చూసిన మనిషిలా జ్ఞాపకం వస్తాడు. నన్నస్తమానం ఎత్తుకునేవాడు. మా అక్క అంటే ప్రాణం ఇచ్చేవాడు. మా అక్క మా బావనూ, మా బావ మా అక్కనూ ఒక్క నిముషమూ వదిలి పెట్టి ఉండలేకపోయేవారు.
నా చిన్నతనంలో మా ఊళ్లోనే ఉన్న మా అక్కగారి అత్తగారింటికి వెళ్ళినా, మా అక్కా, బావా మా ఇంటికి వచ్చినా ఒక్క నిమిషం ఇద్దరూ వదిలి ఉండేవారా! నేను మా అక్క దగ్గరకు వెడితే ఇద్దరూ ఒక కుర్చీలోనే కూర్చునో, ఒక మంచంమీద ఇద్దరూ పడుకొని మాట్లాడుకుంటూనో ప్రత్యక్షం అయ్యేవారు.
ఈ ఈడులో ఆనాడు మా అక్కా, బావల ప్రణయం లోకాతీతమైనదని తెలిసింది నాకు. మా బావ ఇప్పుడెక్కడున్నాడో? బ్రతికివున్నాడో, లేదో ? ఇంతకూ మా లోకం మా అక్కను ఒక దేవతగా యెంచి, ఆమె ఫోటోను పూజించేది. ఆ ఫోటోపై పూలూ, కుంకుమా చల్లేది. రోజూ ఆ చిత్రానికి పూలదండలు వేసేది.