సినిమాహాలు ఆవరణదాటి కారురోడ్డు ఎక్కింది. "కిరణ్ నీకు సినిమా చూడాలని ఉంది కదూ?" "ఉంది" "మరెందుకు నన్ను కూర్చోమని వత్తిడి చేయలేదు?" "ఇష్టం లేక" "అంటే నన్ను బలవంతంగా కూర్చోబెట్టడం ఇష్టం లేకనా?" "కాదు సినిమా ఇష్టం లేక" "అదుగో మాట మారుస్తున్నావ్. నిజం చెప్పు" ముందున్న లారీని ఓవర్ టేక్ చెయ్యడంలో నిమగ్నమై ఉన్న కిరణ్ సమాధానం ఇవలేదు. "వెళ్దామనగానే బయటికి వచ్చేశావ్?" "ఉండమని బలవంతం చేస్తాననుకొన్నావుగదూ?" "అవును కిరణ్" అతడి ముఖంలో ఏదో వెదకడానికి ప్రయత్నించింది. "అలా అనుకునే వెళ్దామన్నావా?" కిరణ్ పెద్దగా నవ్వేశాడు. "నో!నో!" అతడి నవ్వులో ఆమె మాట కలిసిపోయింది. 'క్వాలిటీ' ముందుకొచ్చి కారు ఆగింది. "కిరణ్!" అతనికేసి ఆశ్చర్యంగా చూసింది. "కమాన్!" అంటూ అతనుకారు దిగాడు. అతడికీ ఇతడికీ ఎంతతేడా? నిన్న తను బలవంతం చేస్తేగాని డిన్నర్ కు అంగీకరించలేదు అతను. ఇతనో? తాను అడక్కుండానే లంచ్ కు తీసుకొచ్చాడు. "ఇంకా కూర్చున్నావేం? దిగు!" కిరణ్ కార్లో ఆలోచిస్తూ కూర్చొన్న మహతి చెయ్యి పట్టుకొని కార్లో నుంచి దించాడు.
"కిరణ్! ఇటెక్కడి?" "అప్పుడే ఇంటి కెళ్ళేంచేస్తాం?" "మరిప్పుడెక్కడికెళ్దామని?" ఆదుర్దాగా అడిగింది మహతి. "లవ్ స్టోరీకి" "మళ్ళీ పిక్చర్ కా?" "బుర్రలో నుంచి ఆ బూజు తొలగిపోవాలి" "ఏ బూజు?" మహతికి ఏమిటో గా ఉంది. కాఉర్కు సడన్ బ్రేకుపడింది. పిచ్చివాడొకడు గొనె సంచి భుజం మీద వేసుకొని కారుకు అడ్డంగా నిలబడ్డాడు. మురికి బట్ట చుట్టి నకర్ర నొకదాన్ని ఎత్తిపట్టుకున్నాడు. కారు పక్కకువచ్చాడు. "మీ ఓటు నాకే ఇవాలి" కార్లో కి తల దూర్చి అరిచాడు. "ఇదివరకు వేసిందికూడా నీకే?" కిరణ్ నవకుండానే అన్నాడు. "అది అసెంబ్లీకి ఈసారి పార్లమెంటుకు వెయ్యి" "వేస్తాలే" "ఈ అమ్మాయి వెయ్యలేదు" మహతిని తీవ్రంగా చూస్తూ అరిచాడు. "ఈసారి వేస్తుందిలే" "వెయ్యకపోతేనీ కాళ్ళు విరగ్గొడతా. గొంతు పట్టుకొంటా" అంటూ విండోలోనుంచి తల తీశాడు. అదను చూసి కారు పోనిచ్చాడు కిరణ్. కదిలిపోతున్నకారు మీద దరువు వేసి మీ పవిత్రమైన మురికి ఓటు నాకే' అంటూ అరిచాడు పిచ్చివాడు. "పాపం! ఓట్ల పిచ్చి" "ప్రేమపిచ్చికీ ఓట్లపిచ్చికీ తేడా ఏమిటి?" కిరణ్ మాటలు ఆమె గుండెలో ములుకుల్లా నాటాయి. ముఖానికి పట్టిన చెమటను పైటకొంగుతో తుడుచుకుంది మహతి.
"మళ్ళీ ఎక్కడికి!" ఆమె ఆదుర్దాగా. "ఇంకా ఆరున్నరన్నా కాలేదు. ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావోయ్?" "నేను మా అంకుల్ దగ్గిరకెళ్ళాలి" గట్టిగా అంది మహతి. "ఆ పిచ్చి డాక్టర్ దగ్గరికా?" పక పక నవ్వాడు స్టీరింగ్ మీద వేళ్ళాడిస్తూ కిరణ్. "పిచ్చి డాక్టర్ కాదు. పిచ్చి వాళ్ళకు డాక్టర్" రోషంతో ఉడికి పోయింది మహతి. "అందుకే వెళ్తున్నావా?" ఆమె వళ్ళు చల్లబడింది. ముచ్చెమటలు పోశాయి. "ఆయన మా ఫాదర్ కు క్లోజ్ ఫ్రెండ్. మా ఫామిలీ ఫ్రెండ్" "ఫామిలీ డాక్టరా?" "కిరణ్ స్టాపిట్ హాస్యానికి కూడా హద్దుండాలి" "ఆ హద్దేదోనీకూ వర్తిస్తుంది" "ఇప్పుడు నేనేం హద్దు మీరానని?" కోపంగా అంది మహతి. ఆమె కళ్ళలోని ఎరుపును చూస్తూ అతడు ప్రశాంతంగా నవ్వాడు. "పైగా నవ్వుతావ్ సిగ్గులేకుండా?" "సిగ్గెందుకు డియర్లేడీ? ప్రేమపిచ్చి పట్టుకొన్న వాళ్ళకు సిగ్గుండదని నీకు తెలుసునని నాకు బాగా తెలుసు".
"కిరణ్ కారాపు!" మహతి అరిచింది. "ఏం? దిగిపోతావా?" "ఆ( నువ్విలా మాట్లాడితే---?" "నేను మాట్లాడితేనే నీకింత కోపం వచ్చిందే? మరి నువు చేసినపనికి నాకెంత...." "నేనేం చేశాను?" మహతికి ఇక ఏడుపే తక్కువ. "మీ అంకుల్ అదే ప్రొఫెసర్ పరశురాం దగ్గరకు నన్నెందుకు తీసుకెళ్ళావ్? నేను పిచ్చి వాన్ననే గానీ ఉద్దేశ్యం?" "అవును నీకు నిజంగా నే పిచ్చి అందుకే అంకుల్ దగ్గరకు తీసుకెళ్ళాను" కసిగా అంది మహతి. అతను హాయిగా నవ్వాడు. ఆమె ముఖానికి చేతులడ్డం పెట్టుకొని తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోవడానికి విఫలప్రయత్నం చేసింది. "మహతీ, ఏడుస్తున్నావా? ఛ! ఛ! ఊరుకో ఏదో తమాషాగా అన్నాను. ఇంత మాత్రానికే ఏడ్వాలా?" కిరణ్ రోడ్డుపక్క చెట్టుక్రింద కారు ఆపాడు. మహతి కళ్ళుతుడుచుకుని తలపైకెత్తి చూసింది. అప్పటికే కారు ఊరుదాటిపది కిలోమీటర్ల దూరం వచ్చింది. "ఎందుకిక్కడకు తీసుకొచ్చావ్?"
"ఆ సంగతేదో తెలుసుకొందామని?" ఆమెకు లోపల ఏదో భయంగా ఉంది. "ఏ సంగతి?" మొండిగా అంది. "మీ అంకుల్ నా గురించి ఏమన్నాడు?" "ప్రేమించిన వాళ్ళకు పిచ్చి పట్టించేమనిషి అన్నాడు" "నువు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?" "నువు నమ్మకపోతే నేనేమీ చెప్పలేను. అది నా దురదృష్టం" బాధగా అంది. "అయితే నువింకా ఆ స్నీకీబాస్టర్డ్ ను ఎందుకు చేరదీస్తున్నావ్?" అతని కంఠంలో కాఠిన్యంలేదు. మహతి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. కంటిమీద నీటి పొరలు ఆవరించి ఉన్నాయి. మహతిహృదయం కలుక్కుమన్నది. తాత్కాలికమే కావచ్చు. అయినా కిరణ్ ఇలా అయిపోతాడని తను ఊహించలేదు. "కిరణ్!" ఆమె కంఠం పూడిపోయింది.
"రవి మీద నీకంత ద్వేషం ఎందుకు కిరణ్? మనసు విప్పి మాట్లాడవూ? అతను నన్ను ఆరాధిస్తున్నాడనేనా?" అతని ముఖంలోకి లోతుగా చూస్తూ అంది. "కాదు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని" "ఒకవేళ నువు అనుకున్నట్టే రవి నన్ను ప్రేమిస్తున్నాడే అనుకో. అందుకు నువు అంతగా దేషించాల్సిన అవసరం ఏమిటి?" "ఏమో నాకు తెలియదు" "నేను అతడ్ని ప్రేమించడం లేదని నీకు తెలియదా?" "తెలుసు" "మరి అలాంటప్పుడు అతడి మీద నీకున్న ద్వేషం, పగ, కసి, అసూయ అర్ధంలేనివే కదా? అకారణమైనవేగా?" "ఆ సంగతి అతడికి తెలుసా?" "ఏదీ, నువతడ్నిదేషిస్తున్న విషయమా?" "కాదు" "మరి?" "నువతడ్ని ప్రేమించడం లేదన్న సంగతి?" మహతి ఓ క్షణం తటపటాయించింది. ఏం సమాధానం ఇవాలో తోచక అయోమయంగా ఆకాశం కేసి చూసింది. చెట్ల ఆకుల సందుల్నుంచి తదియనాటి నెలవంక చిన్నచిన్న ముక్కలుముక్కలుగా కన్పిస్తోంది. "మాట్లాడవేం మహతీ?" అతడి కంఠం వింటూనే త్రుళ్ళిపడింది. అది అదిరింపో, బెదిరింపో, ప్రాధేయపడటమో తేల్చుకోలేకపోయింది మహతి. "బహుశా తెలియదేమో!" "నన్ను చెప్పమంటావా?" "నువా!" ఆమె కాళ్ళకింద భూమి కంపించింది. నక్షత్రాలు ఊడి నేలమీద రాలుతున్నట్టుగా అన్పించింది. "నేనే--నేనే చెప్తాను" "ఎప్పుడు?" "వీలు చూసుకుని చెప్తాను రండి. చాలా సున్నితమైన మనసు. అతను బాధపడకుండా...."