రోడ్డు మీద రివ్వున దూసుకుపోతున్న అంబాసిడర్ కారును చూస్తూ ఆగిపోయింది మహతి. కారులో నుంచి నోరునొక్కిపెడితే అరవడానికి ప్రయత్నిస్తున్న స్త్రీ మూలుగు విన్పించింది. "మహతీ త్వరగా కారెక్కు!" ఒక్క దూకులో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కిరణ్. మహతి ఎక్కగానే కారును రోడ్డు మధ్యకు తీసుకొచ్చి వేగం హెచ్చించాడు. "కిరణ్, దుండగులు ఒక స్త్రీని ఎత్తుకుపోతున్నట్టున్నారు". "అవును స్కౌండ్రల్స్" కారు తొంభై కిలోమీటర్ల వేగం పుంజుకుంది. "ఒక్కడివి, నువ్వేం చెయ్యగలవు. వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు వుంటాయి" "వుంటే వుండనియ్" "కిరణ్, ఏమిటీ మొండితనం? కారు వెనక్కు తిప్పు. పోలీసు స్టేషన్ లో రిపోర్టు ఇచ్చి పోదాం" "పోలీసులా? రిపోర్టా? ఈలోపల ఆ అమ్మాయి గతి ఏమౌతుందో తెలుసా?" "వాళ్ళెంత కయినా తెగించే వుంటారు" "ఒక ఆడదాని శీలం ఒక మగాడి ప్రాణం కంటే విలువైంది" స్పీడో మీటర్ లో ముల్లు 100 దాటింది. మహతికి నోరు ఎండిపోతోంది. భయంతో వణికిపోతోంది. ఆమె ఇంకేమీ మాట్లాడే స్థితిలో లేదు. దూరంగా కన్పించిన కారు రానురాను దగ్గరౌతున్నది. స్పష్టంగా కన్పిస్తోంది మహతికి. మరో పది నిముషాల్లో నల్ల అంబాసిడర్ ను అందుకున్నాడు. హెడ్ లైట్ల కాంతిలో ఒక స్త్రీ పెనుగు లాడటం వెనక అద్దంలో నుంచి కన్పించింది. ఇరుపక్కలా ఇద్దరు కూర్చుని ఆమెను సీటు మీదకు నొక్కిపెడుతున్నారు. ముందు డ్రైవర్ ఒక్కడే వున్నాడు. వెనక వస్తున్న కారును గమనించిన డ్రైవర్ వేగం పెంచాడు. కిరణ్ ఆ కారును ఓవర్ టేక్ చెయ్యదానికి ఒకసారి ప్రయత్నించాడు. కారు రోడ్డు పక్కకు దిగి, మళ్ళీ పైకి లేచి రోడ్డెక్కింది. మహతికి భయం కలిగింది. "కిరణ్! కిరణ్!" మహతి గాభరాగా అరిచింది. "భయపడకు మహతీ! స్టీరింగ్ నా చేతుల్లో వుండగా నీ ప్రాణానికి భయంలేదు. వాళ్ళు తప్పించుకునిపోలేరు" "నంబరు నోట్ చేసుకుని వచ్చే పోలీస్ స్టేషన్ లో రిపోర్టు ఇద్దాం కిరణ్" "వాళ్ళంత తెలివితక్కువ దద్దమ్మ లేం కాదు. సరిగ్గా చూడు. ఆకారుకు నంబరు ప్లేటు లేదు".
కిరణ్ మళ్ళీ ఓవర్ టేక్ చెయ్యడానికి ప్రయత్నించి, ఎదురుగా లారీ రావడాన్ని గమనించి తప్పుకున్నాడు. లారీని తప్పుకునే ప్రయత్నంలో అంబాసిడర్ రోడ్డు సైడుకు వచ్చింది. లారీ తప్పుకోగానే రోడ్డు ఎక్కించి స్పీడు అందుకోవడానికి ప్రయత్నించాడు డ్రైవర్. అంబాసిడర్ రోడ్డు మధ్యకు వచ్చే లోపలే ఓవర్ టేక్ చేశాడు కిరణ్. రెండు కార్లూ దాదాపు ఒకదాన్నొకటి గుద్దుకున్నంత పనైంది. అంతవరకూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్న మహతి రిలీఫ్ గా గాలి పీల్చుకుంది. "ఇప్పుడేం చేస్తావ్?" "నువ్వు వెనక్కు తిరిగి చూస్తుండు. ఎదురుగా వచ్చేబస్సునో, లారీనో ఆపుతాను. బస్సో, లారీనో అడ్డంవుంటే వాడే కారు ఆపుతాడు చూద్దాం" ఆమె వెనక్కు తిరిగిచూస్తోంది. "కిరణ్! కిరణ్! కారాగింది" మహతి గొంతురాచుకు పోయింది. కిరణ్ సడన్ బ్రేకువేశాడు. "అదుగో వాళ్ళు కారువెనక్కు తిప్పుతున్నారు" దాదాపు అరిచింది మహతి. కిరణ్ క్షణాల మీధకారు రివర్స్ చేసి స్పీడు నందుకున్నాడు. ఆగిన కారు నుంచి ఒక స్త్రీ కుప్పగా రోడ్డుమీదకు దొర్లింది. మరికొంత దూరం పోయి కారు ఆగిపోయింది. కారులో వాళ్ళుదిగి పొలాలకు అడ్డంపడి పారిపోయారు. "దుర్మార్గులు ఆమెనురోడ్డుమీదకు విసిరేసి పారిపోతున్నారు" కిరణ్ కసిగా అన్నాడు. నడిరోడ్డు మీద పడివున్న ఆ స్త్రీ పక్కగా కారాపాడు కిరణ్. మహతి కారుదిగి ఆమె వద్దకు పరుగు తీసింది. కిరణ్ కారు దిగి వచ్చాడు. ఆ యువతి ఇరవై రెండేళ్ళ వయసు వుంటుంది. ఆమె పక్కగా నల్లటితారురోడ్డు మీద ఎర్రటిరక్తపు మడుగు రాక్షసి నుదుటిబొట్టులా కారు హెడ్ లైట్సు వెలుగులో మెరుస్తోంది. మహతి కెవ్వున అరిచింది. కిరణ్ వంగి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాడు. ఆమె కళ్ళు తెరిచింది. కిరణ్ ముఖంలో చూపులు నిలిపి చూసింది. మరోక్షణంలో కళ్ళు మూతలు పడ్డాయి. కిరణ్ చేతుల్లోజారి పోయింది. "మహతీ! స్ప్రుహతప్పిపోయినట్టుంది. ఊ( త్వరగా" అంటూ కిరణ్ మహతిని హెచ్చరించాడు. ఇద్దరూ ఆమెను కారు వెనకసీట్లోకి చేర్చారు. మహతి ఆమె తలను వళ్ళో పెట్టుకుని వెనక సీటులో కూర్చుంది. కిరణ్ కారు స్టార్టు చేసాడు. మహతికి అంతా ఏదో కలలో ఉన్నట్టుగా వుంది. అది కల కాదనీ, వాస్తవమనీ గుర్తుచేస్తున్నట్లుగా స్పృహ లేకుండాపడి వున్నదా యువతికార్లో నిశ్చలంగా, గంభీరంగా కూర్చుని కారు నడుపుతున్నాడు కిరణ్. కారు ఆసుపత్రి గేటులోకి వచ్చేదాకా కిరణ్ గురించే ఆలోచిస్తూ కూర్చుంది మహతి. కారాగుతూండగా ఆమె కదిలింది. సన్నగా మూలిగింది. ఇంతకూ ఈమె ఎవరు? మహతి ఆ యువతి ముఖంలోకి చూస్తూ అనుకుంది.
తెల్లవారి తొమ్మిదయినా మహతికి మెలుకువ రాలేదు. తల్లి నిద్రలేపి కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. రాత్రి తల్లి పెట్టిన చీవాట్లు ఒక్కొక్కటే గుర్తు రాసాగాయి. ధీర ఉదాత్త లక్షణసమనితుడు, స్ఫూర ద్రూపి అయిన కిరణ్ కళ్ళల్లో మెదలగానే తన్నుతను మర్చిపోయింది. మధుర స్మృతులతోమనసంతా నిండిపోయింది. మంచంమీద నుంచిలేవడానికి ప్రయత్నించిన మహతికి వళ్ళంతా విరగ్గొట్టినట్టుగా అన్పించింది. బద్దకంగా ఉంది. ముఖం కడుక్కునే ఓపిక కూడా లేదు. కాఫీ తాగేసింది. మరో అర్ధగంట మంచంమీద పడుకొని లేచి బాత్ రూమ్ లోకివెళ్ళింది. తల స్నానం చేసి, పొడి టవల్ జుట్టుకు మెలిపెట్టి చుట్టుకొని తుడుచుకొంటూ హాల్లోకి వచ్చిన మహతి హటాత్తుగా ఆగిపోయింది. డ్రాయింగ్ రూం సోఫాలో మౌనంగా కూర్చున్న అతన్ని విస్మయంగా చూసింది. తడి జుట్టు ఆరబోసుకొని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది. అతడు ఆమె రాకను కూడా గమనించినట్టులేదు. దివాన్ మీద ఉన్న వీణను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అతని చేతుల్లో వీణ తీగ ఉంది. "హల్లో రవీ! ఏమిటి ఇంత పొద్దుటే వచ్చేశావ్?" అడిగింది. అతడు తలెత్తి ఆమె ముఖ్మలోకి చూసాడు. "తీరిక లేదా? వెళ్తాను" అంటూ రవి లేచి నిలబడ్డాడు. "నో! నో! నా ఉద్దేశం అదికాదు. అప్పుడే షాపులు తెరిచారా, తీగకొని తెచ్చావని!" "ఎనిమిదిన్నరకే షాపు తెరిచారు. ఇద్దామని వచ్చాను" వీణ పక్కన తీగపెట్టి తిరిగి చూడకుండా డోర్ దగ్గరకు నడిచాడు.