Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 10

    "హు....తెల్సిందా! ఈ ప్రేమలు ఎలాంటివో. ఇప్పటికన్నా బుద్దొచ్చిందా. ప్రేమించడం ఒక హాబీ ఈ కుర్రాళ్ళకి. అది పెళ్లిదాకా రానివరన్నా బుద్ది జ్ఞానం నీకు లేకపోయింది. వాళ్ళు చక్కగా కట్నాలు, తీసుకుని అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలు చేసుకుంటారు మళ్ళి. అమ్మాయిలని ప్రేమించడం తిరగడం అంతా ఫేషన్ మళ్ళి.
    మళ్ళి పెళ్ళి మాత్రం చక్కగా ఆచారం ప్రకారం సంప్రదాయాలు చూసి చేసుకుంటారు. వాళ్ళెంతమంది అమ్మాయిలతో తిరిగినా వాళ్ళు పెళ్ళాడే అమ్మాయి మాత్రం గుమ్మం దాటని బుద్దిమంతురాలయి ఉండాలి మగాళ్ళకి. ఇలాంటివి ఎన్ని చోట్ల వినడంలేదు. చూడడం లేదు. అందుకనే ఆడపిల్లల తండ్రులు కూతుళ్ళని జాగ్రత్త పెట్టుకోవాలని ఆరాటపడతారు. ఎటొచ్చి ఎటుపోయినా నష్టపోయేది ఆడపిల్లలు. వాళ్ళని కన్న తల్లిదండ్రులు. రూపా! నీ తెలివితక్కువ  తనం ఎంత చేటుకి దారితిసిందో ఇప్పటికన్నా తెల్సిందా. ఇప్పుడు మీ నాన్న నా ప్రాణాలు తీస్తారు ముందు. మధ్య నాకు చావొచ్చిపడింది." భయం, బాధ, ఆరాటం, ఆవేదన అన్నీ కలిసి పద్మావతి మతిపోగొట్టాయి.
    ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను.
 ఈలోగా సంబంధం నిశ్చయం చేసుకుని తంబులాలు తీసుకుందాం. మా నాన్న వెళ్లి మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చయం చేస్తారని నెమ్మదిగా నచ్చచేప్పకపోయావా?"
    "అది చెప్పానమ్మా.....ఏ ఉద్యోగం వచ్చినా ఐదేళ్ళలోపు చేసుకోవడం, అన్నాళ్ళు తరువాత ఏమో ఎవరి బుద్ది ఎలా వుంటుందో. నా మనసు మారచ్చు. ఇంట్లో చెపితే నీకు ఇప్పుడు పెళ్ళి తొందరేం వచ్చిందని తిడ్తారు అన్నాడమ్మా. అతడికి చేసుకునే ఉద్దేశం వుంటే ఉద్యోగం రాగానే చేసుకుందాం అనేవాడు. నేను ఎంత చెప్పినా దానికి ఒప్పుకోలేదు. ఏదో సరదాగా తిరిగాం ఇప్పుడేం కొంప మునిగిందన్నాడు.
    "రాస్కెల్ సరదాగా తిరిగాడా.....వాడికి అక్క చెల్లెళ్ళుండి వుంటారు, ఆ చెల్లెళ్ళని ఇలా సరదాగా తిరిగి రమ్మని పంపుతాడా రేపోద్దుట పెళ్ళాన్ని పంపుతాడా?
    వాదించి ఏం లాభం. నీకసలు బుద్ది వుంటే ఇలా ఎందుకు చేస్తావు వెధవ అబద్దాలాడి ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు ఇప్పుడేం చేస్తావు. మీ నాన్నకి ఏం చెప్తావు?" పద్మావతి కోపంతో కూతురిని తిట్టసాగింది.
    "వాడేందుకు చేసుకోడో నేనూ చూస్తాను. వాడింటికెళ్ళి వాడి నాన్నతో అంతా చెప్తాను. అందరిముందు నిలబెట్టి వాడి మొహానా పేడనీళ్ళు కొట్టి బుద్ది చెప్తాను." రూప పౌరషంగా అంది.
    "నోరుమూసుకో. పిచ్చి మాటలు మాట్లాడకు. చేసింది చాలక ఇంక పౌరుషం కూడాను. ఆడపిల్లవు నీకుండాలి జాగ్రత్త మావాడికెందుకు అని నీ మొహానా పేడనీళ్ళు కొట్టి పంపిస్తారు. అందరూ" కోపంగా అంది పద్మావతి. ఆమెకి ముందు సమస్య భర్తకి ఏం చెప్పాలా అన్నది.
    ఈ సంగతి ఎందరికి తెల్సిందో, దీనివల్ల పర్యవసానం ఎలా వుంటుంది కూతురి పెళ్ళికి ఇదో సమస్య అవదు కదా అన్నది మరో భయం.
    "అవునమ్మా ఇద్దరం తిరిగాం. ఎంజాయ్ చేశాం. అంత సులువుగా వదిలేసి పోనిస్తానా. అంత చాతకాని దద్దమ్మలా ఊరుకొను. ఊరుకుంటుంటే మరింత చేస్తారు. కనీసం ఒక్కడికైనా బుద్ది చెప్పాలి" ఉక్రోషంగా అన్నది రూప.
    'ఏమిటే నీవు చేసేది? నీకు నేనేమన్నా పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేశానా అంటాడు. నీ దగ్గిర జవాబుందా దానికి. వాళ్ళ తల్లితండ్రులు మంచివాళ్లయినా కొడుకు చేసుకోనంటే బలవంతంగా చేస్తారా. ఒకవేళ చేసినా ఆ కోపం, కసి నీమీద చూపి హింసించడా పెళ్ళయ్యాకా. ఇవన్ని ఉత్తి కబుర్లు. మగాడి కిష్టం లేకపోతే మనం చెయ్యగల్గింది ఏం లేదు" నిస్పృహగా అంది.
    "కోర్టు కిడుస్తాను" కసిగా పళ్ళు కొరికి అంది రూప.
    "ఆ అక్కడా ఇదేమాట అడుగుతారు. ఇష్టపడి తిరిగావా లేదా, బలవంతం చేసినట్లు సాక్ష్యం వుందా అంటారు. ఏం చేస్తావు? రూపా! చిన్నతనం, ఆవేశంలో ఏదో మాట్లాడడం తప్ప ఇదేం లాభం లేదు. ఇప్పటికయినా మేల్కొన్నావు పూర్తిగా మునగక ముందే. అదృష్టవంతులమేం. ఏదన్నా అయితే మొహం ఎత్తుకోలేకపోయేవాళ్ళం. ఇంక నోరు మూసుకుని ఇంట్లో పడివుండు. ఇల్లు వదులు చెప్తా. ఇచ్చిన స్వతంత్రన్ని దురినియోగాపరిచి అల్లరి పాలయ్యావు. ఇంక బుద్ది తెచ్చుకో" పద్మావతి మాట్లాడుతుండగానే విశ్వనాధం గదిలోకి వచ్చాడు. అతను ఆఫీసునించి వచ్చిన సంగతన్నా ఇద్దరూ గుర్తించలేదు.
    తల్లి, కూతురు అతన్ని చూసి గాభరాపడ్డారు. కళావిహినంగా వున్న ఇద్దరి మొహాలు అయన దృష్టినించి దాటిపోలేదు.
    "ఏమిటి గూడుపుఠాని చేస్తున్నారు ఇద్దరూ ఏం జరిగింది?" గంభీరంగా అన్నాడు విశ్వనాధం.
    "ఏం లేదు" పద్మావతి తడబడ్తు "కాఫీ తెస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. "ఏం లేకపోవడం యేమిటి. నీ కూతురు సంగతి ఏమయింది! అడిగిందా ఏమన్నాడు" కూతురు వంక చూస్తూ అడిగారాయన!
    రూప భయంగా తలదించుకుంది.
    పద్మావతి మరోవైపు చూసింది.
    "ఏమయిందంటే మాట్లాడరేం?" ఒక్క కసురు కసిరారు అసహనంగా.
    "ఆ అబ్బాయి చదువది అవలేదు, చదువయి ఉద్యోగం వచ్చి ఐదారేళ్ళ వరకు చేసుకోడట...." పద్మావతి గొణిగింది.
    "అయిందా......నాకు తెలుసు ఇలాంటి జవాబోస్తుందని ఇప్పుడింక ఏం చేస్తుందిట నీ కూతురు. ఊరు వాడా తెలిసింది ఈ సంగతి" కూతురి వంక తిరస్కారంగా చూశారాయన.
    "ఇదివరకు తెలియకపోయినా ఇప్పుడు మీ కేకలకి అంతా తెలుసుకుంటారులెండి. ముందు మిరే వెళ్ళి అందరికి చాటించేలా వున్నారు." అక్కసుగా అంది పద్మావతి భర్తను చురచుర చూస్తూ.
    "ఇదిగో ఇలాగే పిల్లల్ని వెనకేసుకు వచ్చి ఇన్నాళ్ళు పాడు చేశావు. అది ఆడించినట్లాడావు. తల్లి కూతురు కలిసి నాటకం ఆడారు నాకు తెలియకుండా ఇన్నాళ్ళు. ఇప్పుడు పాడుచేశావు. అది ఆడించినట్లాడావు. ఇప్పుడు ఆడండి ఇద్దరూ కల్సి గంగలో దుకండి. నాకు నీ కూతురి సంగతి అనవసరం. ఇంక దాని సంగతి ఎత్తితే అడుగు. ఇద్దరు ఏం చేస్తారో చేసుకోండి. వాడి కాళ్ళు పట్టుకుని పెళ్ళిచేస్తావో మరేం చేస్తావో చెయ్యి." అయన కోపంగా విసురుగా గదిలోంచి వెళ్ళిపోయారు. పద్మావతి నిట్టూర్చి రూపవంక ఒకసారి చూసి గదిలోకి వెళ్ళింది, మాడిపోయిన మొహంతో రూప పక్కమీద వాలిపోయింది.
    రాత్రి పదిన్నర అయింది. రేపు వాదించాల్సిన కేసు గురించి ఆఖరిసారిగా చదివి పాయింట్స్ నోట్ చేసుకుంటుంది సుమతి. ఆ పని పూర్తిచేసి నిద్రపోవాలి అనుకుంటూ ఆవలింతలు వస్తున్నా నిద్ర ఆపుకుంటూ చకచక కాగితాలు తిరగేస్తుంది సుమతి.
    బయట కాలింగ్ బెల్ మోగింది. ఇంతా రాత్రి ఎవరొచ్చారు చెప్మా అనుకుంది. వంటావిడ వెంకమ్మాగారప్పుడే వంటింటి  నడవాలో గుర్రుపెట్టి నిద్రపోతోంది. సుమతి ఆవిడ లేచి తలుపు తీస్తుందేమోనని కాసేపు చూసి - బెల్ మరోసారి మోగడంతో లేచి వీధి తలుపు తీసి ఆశ్చర్యపడింది.
    "ఎవరమ్మా నీవు . ఏం కావాలి?" అంది.
    "నమస్కారమండి. మా ఇల్లు ఈ ముందు సందులో వుంది. మీతో పనుండి వచ్చాను. లోపలి రావచ్చాండి అంది నమస్కారం చేసి.
    "ఇప్పుడా! ఇంత రాత్రా! రేపు రాకుడదూ. అంత అర్జంటా. నీ వేవరమ్మయివి ఇంతకీ? ఒంటరిగా ఇలా రాత్రి....సందిగ్ధంగా అంది సుమతి.

 Previous Page Next Page