Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 9

    సురేష్ మోహంలో రంగులు మారాయి. ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు. ఏదో స్థిర నిశ్చయనికొచ్చి, "చూడు రూపా! టూ టెల్ యు ప్రాంక్ లీ. ఉద్యోగం వచ్చినా ఐదేళ్ళ లోపు పెళ్ళిమాట తలపెట్టను. నా సంపాదనతో హాయిగా ఫ్రీగా కొన్నాళ్ళయిన ఎంజాయ్ చెయ్యాలి నేను పెళ్ళి, సంసారం యీ జంజాటంలో దిగే ముందు ఐ వాంట్ టు ఎంజాయ్ లైఫ్. ఆ తర్వాత ఐదేళ్ళంటే చాలా ఎక్కువ టైము. ఈ లోపల ఎన్నైనా జరగవచ్చు. నా మనసు మారచ్చు, నీ మనసు మారచ్చు. అప్పుడు నాకు నిన్ను చేసుకోవాలని లేకపోతే.... ఎందుకీ గొడవంతా? అన్నాళ్ళు ఒకరికోసం వెయిట్ చెయ్యడం మంచిదికాదు. మీ వాళ్ళు తెచ్చిన సబంధం ఏదన్నా చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం" నిష్కర్షగా అన్నాడు.
    రూప మొహం ఎర్రబడింది. తీక్షణంగా చూసింది. కోపం, ఆవేశం పట్టలేకపోయింది. "అంటే.....నన్ను చేసుకోడం నీకిష్టం లేదన్నమాట. ఇన్ని మాటలెందుకు, ఈడొంక తిరుగుడేందుకు? ప్రాంక్ గా నీతో ఎంజాయ్ చెయ్యాలనుకున్నాను? తప్ప పెళ్ళాడే ఉద్దేశం లేదని చెప్పకూడదూ సురేష్ చీ నీవింత నీచుడవని తెలియక గోతిలోకి దిగాను నీ అంత నీచుడు, హీనుడు...."
    "మైండ్ యువర్ లెంగేజ్ మేడమ్ " సురేష్ కర్కశంగా అన్నాడు.
    "నీకు.....నీకో మర్యాద ఇవాలా ఇంత దగాకోరువని ఎన్నడూ అనుకోలేదు. ఇంత మోసగాడివని ఇంత నీచుడివని తెలిస్తే....."రూప గుండెలు ఎగిసిపడ్డాయి.
    "ఇప్పుడు తెల్సిందిగా. ఇంకా దూరంగా వుండు" హేళనగా ఎత్తి పొడిచాడు.
    "హు అవును. ఇంక నీ మోజు తీరిపోయింది. దూరంగానే వుంటావు ఇంక. నేనెంత పిచ్చిదాన్ని. నేనేకాదు, మా ఆడపిల్లలు ఎంత అమాయకంగా మీ మగాళ్ళని నమ్ముతారు. ఎన్ని వందలమంది, వేలమంది యిలా మోసగించబడ్డా మళ్ళి మళ్ళి  దీపం చుట్టూ చేరి మాడిపోయే శలభాలం మేము."
    "ఓహ్, కవిత్వం బాగానే వచ్చే" నవ్వాడు వేళాకోళంగా.
    "షటప్ సిగ్గులేదు నవ్వేలా వస్తోంది మొహానికి. ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే నవ్వడం సంస్కారం అనుకుంటున్నావా చదువుకున్నావు గాబోలు, సంస్కారంలేని ఆ డిగ్రీ లెందుకు......" రూప ఆవేశం పట్టలేక అరిచింది. నడిరోడ్డు అయింది కానీ లేకపోతే చెంప చెళ్ళు మనిపించాలన్నంత ఆగ్రహం, కసి పుట్టింది ఆమెకి.    
    "మీ ఆడపిల్లలకి  చాతనయింది ఎడుపెగా....ఏం, నేను కాదంటే ఏడవడం.....చేవ వుంటే, గో టూ హెల్ అని మరోకడ్ని పెళ్ళాడి చూపాలి....అది ధైర్యం అంటే."
    "హు ఈ దేశంలో మగాళ్ళందరు నీ బ్రదేర్సేగా. మీకు ఎన్నైనా వీక్ నెస్ లు వుండవచ్చు కానీ పోరాపాటునైనా మాకు బలహినతలుండరాదు. ఇలాంటి మగ వెధవలున్న దేశంలో నన్ను పెళ్ళాడటానికి ఏ మగాడు ముందుకొస్తాడంటావు?" రూప తిరస్కారంగా చూస్తూ హేళనగా అంది.
    "పోనీ పెళ్ళి కాకపోతే ఏడవాలా? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఆకలేస్తే అన్నం తిన్నట్టు, చక్కగా నచ్చినవాడితో ఎంజాయ్ చెయ్యొచ్చు. అలా అయితే రోజుకో హోటల్లో తిన్నట్టు, ఇంటి భోజనం విసుగేత్తినట్టు వుండదు."
    "ఆహాహా. ఏం ప్రోగ్రెసి థాట్స్......రియల్లి అలాగే రేపు పొద్దుట నీ పెళ్ళాన్ని ఆమె ఇష్టం వచ్చిన వాడి దగ్గిరకి పంపిస్తూ వుందువుగాని, సురేష్! నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఈ  వేళాకోళాలు మాని ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెళ్ళి చేసుకుంటావా లేదా?" చాలా సీరియస్ గా చూస్తూ అడిగింది.
    "డోంట్ బీ క్రేజీ. ఇంకెన్ని సార్లు చెప్పాలి!"
    "సురేష్ ! ఈ గేమ్ మీ మగాళ్ళకి అలవాటయిన ఆటే. ఇలా ప్రేమించడం, మోసగించబడడమూ మా ఆడపిల్లలకి అలవాటే ఇన్నాళ్ళు ఒకే గేము ఆడారు. ఎప్పుడూ గెలుపు మీదే అయింది. ఈసారి మాత్రం గెలుపు నీకు దక్కనివ్వను. ఇన్నాళ్ళు తిరిగి, నన్ను వాడుకుని, కూల్ గా పెళ్ళి చేసుకోను ఫో - అంటే ఏడుస్తూ  ఏ నుయ్యో గొయ్యో చుసుకోవడమో, అమ్మా నాన్న తెచ్చిన వాడిని పెళ్ళాడాడమో చేసేంత దద్దమ్మని కాను. ఎలా చేసుకోవో నేనూ చూస్తాను. అంతా నీ ఇష్టమే కాదు" ఏదో చెయ్యాలి సురేష్ కి బుద్ది చెప్పాలన్నా కసితో ఆవేశంగా అంది. సురేష్ మనసులో ఒక్కక్షణం బెదిరాడు.
    "ఏం చేస్తావేం ?" రెట్టించాడు.
    "నలుగురిలో నిలబెట్టి అంతా చెప్తాను మీ ఇంటికెళ్ళి మీ నాన్నగారితో చెప్తాను."
    "అపుడు పోయేది నీ పరువే" నిర్లక్ష్యంగా అన్నాడు.
    "ఇంకా నాకో పరువు మిగిలిందేమిటి. పోయిన పరువు ఎలాగో పోయింది. నిన్ను మాత్రం వదలను. మర్యాదగా ఒప్పుకో."
    "యూ డెవిల్ బెదిరిస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చెయ్యి గో టూ హెల్"
    ఆడపిల్ల బెదిరిస్తుంటే తగ్గిపోవడానికి మగ అహం అడ్డువచ్చి తీవ్రంగా జవాబిచ్చి విసవిస నడిచి వెళ్ళిపోయాడు సురేష్. వెడుతున్న సురేష్ ని చూస్తూ చెంపలెంబడి కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోవడం మరచి అలా కూర్చుండిపోయింది ఆ చీకట్లో.
    వాడిపోయిన మొహంతో, వాచిన కళ్ళతో యిల్లు చేరిన రూపని చూడగానే పద్మావతి సగం సంగతి అర్ధమైపోయింది. ఆమె గుండెలు దడదడలాడాయి. ఏం వినాల్సి వస్తుందోనని ఆమె బెదిరింది మనసులో. గంటనించి ఆరాటంగా ఎదురుచూస్తోంది పద్మావతి. రూప తల్లి చూపుల నుంచి తప్పించుకుని తిన్నగా పడకగదిలోకి వెళ్ళి పక్కమీద వాలిపోయింది. పద్మావతి  గబగబ గదిలోకి వచ్చి.....
    "ఆ అబ్బాయిని కలుసుకున్నవా ఏమన్నాడు? అన్ని విషయాలు అడిగావా?" ఆరాటంగా అడిగింది మంచం మీద కుర్చుంటూ.
    రూప జవాబివ్వలేదు.
    "ఏమన్నాడే. అలా వున్నావేమిటి?" కూతురి వంటిమీద చెయ్యి వేసి మరింత ఆరాటంగా అడిగింది.
    అటు తిరిగి పడుకున్న రూప కళ్ళెంబడి నీరు కారింది. తల్లికి మొహం చూపలేక తలగడలో దాచుకుంది.
    పద్మావతి గాభరాగా "రూపా! ఏమయిందే, పెళ్ళి చేసుకోనన్నాడా? ఏం జరిగిందో ముందు చెప్పవే" గట్టిగా అడిగింది.
    రూప తల అడ్డంగా ఆడించింది.
    "చేసుకోనన్నాడా ఎందుకు? ఏం?" వివర్ణమైనా  మొహంతో అంది పద్మావతి.
    "అతని చదువవాలిట, ఉద్యోగం రావాలిట, ఇదారేళ్ళ వరకు చేసుకోడట, ఇంకా అతని అన్నయ్యకే పెళ్ళి కాలేదట. ఇప్పుడు సంపాదన లేకుండా పెళ్ళి ఎమిటన్నాడు" రూప గొంతు పెగుల్చుకుని అంది.
    "నాకు తెలుసు ఈ జవాబు వస్తుందని. చదవన్నా పూర్తి కాకుండా ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు. పోనీ ఉద్యోగం వచ్చాక చేసుకుంటానన్నాడా?" అనుమానంగా చూసింది.
    "అది సరిగా చెప్పలేదమ్మా ఎప్పుడో ఐదారేళ్ళ సంగతి ఇప్పుడెం చెప్పను అన్నాడు" బేలగా అంది రూప తల్లి వంక భయంగా చూస్తూ.  

 Previous Page Next Page