"అంతా చెప్తాను. ఈరాత్రే ఎందుకు వచ్చానో మీకర్ధం అవుతుంది. మానాన్నగారి పేరు విశ్వనాధంగారు. అయన బ్యాంకు ఆఫీసరు. మీ ఇంటిఎదురుగా చాలా సార్లు వెళ్ళుతూ మీ బోర్డు చూశాను. మీనించి ఒక సహాయం కోరి ఇలా వచ్చాను. నా పేరు రూప. ప్లీజ్.....ఒక్క పది నిమిషాలు నాకు టైము ఇవ్వండి" అర్ధిస్తూ అడిగిన రూపను చూసి, పరువు మర్యాదల గల ఓ ఇంటి ఆడపిల్ల అని అర్ధం చేసుకుని ఇలా ఒంటరిగా ఏం పని మీద వచ్చిందని ఊహించడానికి ప్రయత్నిస్తూ.
"రా! లోపలికి రామ్మా" అంది సుమతి. దారికి అడ్డు తొలకి రూప లోనికి రాగానే తలుపు వేసి ఆఫీసు గదిలోకి తీసికెళ్ళి కుర్చీ చూపి, తనో కుర్చీలో కూర్చుంది. లైటు వెలుగులో రూపని ఒక నిమిషం పరీక్షగా చూసింది.
"చెప్పమ్మా! ఏం పనిమీద ఇలా వచ్చావు. ఇలా నీవు వచ్చినట్టు మీ ఇంటిలో తెలుసా! ఒంటరిగా ఎందుకు వచ్చావు?" కుతూహలంగా చూస్తూ అడిగింది.
లాయరు సుమతి ముప్పై అయిదేళ్ళు దాటిన అవివాహిత యువతి. మంచి ఫిగర్ తో చక్కటిరంగు, మంచి ఫీచర్స్ తో హుందాగా, అందంగా వున్న వయసుకి పదేళ్ళు తక్కువున్నట్టు వుంటుంది. అందం, చదువు, మంచి ప్రాక్టీసు అన్నీ వున్న ఆమె ఎందుకు అవివాహితగా వుండిపోయిందో ఎవరికీ తెలియదు. నలభైయ్యో వడిలో పడినా ఈనాదు ఆమెని వివాహం ఆడడానికి చాలామంది మగాళ్ళు ముందుకు వస్తారు. మంచి ఇల్లు కట్టుకుంది.
వంట మనిషి, దాసి, కారు, డ్రైవర్.....వుండాల్సిన హంగులన్నీ వున్నాయి. ఇన్నాళ్లూ ముసలి తల్లి వుండేది ఆవిడ పోయి మూడేళ్ళు అయింది. తర్వాత ఇంతరితనం భరించలేకేమో ఓ ఆడపిల్ల పదిహేను ఏళ్ళున్న ఓ అమ్మాయిని అనాధ శరణాలయం నించి తీసుకొచ్చి చదువు చెప్పిస్తూ పెంచుకుంటోంది.
ఆ అమ్మాయి వచ్చాక ఆమె జీవితానికో వెలుగొచ్చినట్లు, జీవితానికో అర్ధం ఏర్పడినట్లు లాయరు సుమతి మోహంలో సంతోషపు ఛాయలు కనిపిస్తున్నాయి. నిర్లిప్తంగా వుండే ఆమెలో ఓ నూతనోత్సాహం కనిపిస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఆమె స్నేహితులు, తోటి లాయర్లు, హితులు ఆమెని వివాహం చేసుకోమని చెప్పి చెప్పి ఒప్పించలేక అందరూ వదిలేశారు. పోనీ ఏదో ఒక పిల్లని చేరదీసింది కాస్త కాలక్షేపం అని సంతోషించారు అందరు. ఆమెని లాయరుగా హైకోర్టులో మంచి పేరుంది. చాలా ఉదార సభావురాలని హెల్పింగ్ నేచరని అందరు ఆమెతో స్నేహం వుంచుకోడానికి ఆరాటపడ్తారు.
కానీ సుమతి అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే అందరినీ దూరంగా వుంచుతూ తన పని తను చేసుకునే స్వభావం కలది. ఆమె ప్రాక్టీసు పెట్టిన ఇన్నాళ్ళలో.....ఇలా ఒకమ్మాయి రాత్రిపూట ఒంటరిగా రావటం ఆశ్చర్యం కల్గించింది. ఈ కేసు ఏమిటి చెప్మా అన్న సందిగ్ధంలో పడింది.
"లాయరుగారు నా పేరు రూప. బి.ఎ. పరిక్ష రాశాను. మా ఇల్లు ఈ ముందు లైన్లో వుంది. నేనిలా యింట్లో ఎవరికి తెలీకుండా మిమ్మల్ని కలవాలని వచ్చాను దయచేసి నేను చెప్పే విషయాలు మీరు రహస్యంగా వుంచాలి. మా వాళ్ళతో అసలు చెప్పకూడదు...."
"అసలు ఏమిటి విషయం. లాయరుగా నా సలహా సంప్రదింపుల కోసం వచ్చావా ఏదన్నా, కోర్టు కేసులో నా సలహా కావాలా?".....సుమతి ఆశ్చర్యంగా అడిగింది.
"లాయరుగారు.....నేనసలు మీ దగ్గర కేందుకొచ్చానో నాకే తెలియదు. మిరేదన్నా సలహా ఇస్తారని, నాకేదన్నా చెయ్యగలరేమోనన్న ఆశతో వచ్చాను.
"మీరెంతవరకు నాకు సహాయపడగలరో, అసలు సహాయం గురించి నాకు తెలియదు. నే చెప్పింది విన్నాక అప్పుడు మీరే అలోచిద్దురుగాని, నాకట్టే టైము లేదు. ఓ అరగంటలో వెళ్ళిపోవాలి."
"అసలు ఇంట్లో తెలీకుండా ఎలా వచ్చావు?" అనుమానంగా అడిగింది.
"ఇంట్లో అంతా పడుకున్నారు. నా రూమికి పైన తాళం పెట్టి ఇలా వచ్చాను. మధ్యలో మా అమ్మ లేవదు. లేచినా నా రూములోకి రాదు."
"సరే చెప్పు" సుమతికి కుతూహలంగా వుంది. రూప వచ్చిన విషయం తెల్సుకోడానికి.
రూప ధైర్యంగా జంకు గొంకు లేకుండా తన గురించి, తన ఫామిలి గురించి ముందు క్లుప్తంగా చెప్పి తరువాత సురేష్ తో తన పరిచయం, ప్రేమ అతను నిరాకరించడం, ఇంట్లో తల్లిదండ్రి తిట్టడం, వారి బాధ అన్నీ వివరంగా చెప్పింది సుమతి.
చాలా శ్రద్దగా, కుతూహలంగా వింది.
"ఇందులో నేను నీకు చెయ్యగల్గిన సహాయంకాని, ఇచ్చే సలహాగాని, ఏం వుంటుందమ్మా.......ఇలాటి కధలు వందలు, వేలు విన్నా....ఇది పాతకధే కదా......"
"అవును లాయరుగారూ ఇది పాతకధే. ఈ పాత కధని కొత్త మలుపు తిప్పాలని,
దానికి మీరేమన్నా సహాయం పడగలరేమోనని వచ్చాను" రూప ఆశగా ఆమె మొహంలోకి చూసింది. సుమతి సందిగ్ధంగా రూప వంక చూసింది.
"నాకేం అర్ధంకావడంలేదు. ఇందులో నేనేం సహాయం చెయ్యగలనమ్మా....."
"లాయరుగారూ నేను....నేను నెలతప్పానని అనుమానంగా వుంది" తల దించుకుని అంది సుమతి తెల్లబోయింది.
"ఎలా....ఎలా" అంది.
"అదే నాకూ అర్ధంకావడం లేదు. సురేష్ జాగ్రత్తపడ్డాడు. ఒకరోజు హడావుడిలో ఏం జరిగిందో ఫేలయింది. నా కెప్పుడు కరెక్ట్ గా వస్తాయి పీరియడ్స్. ఈసారి పదిరోజులు దాటిపోయింది. ఇన్నాళ్ళు ఎందుకో అనుకున్నాను గాని ఈరోజు ఉదయం వాంతి అయింది. అదే....అదే అనుమానం లేదింక" వణుకుతున్న గొంతుతో అంది.
"ఉదయం నుంచి ఆలోచించాక మిమ్మల్ని కలవాలన్న ఆలోచన వచ్చింది. లాయరుగారూ ఈ పదిరోజులుగా ఒక్క క్షణం కునుకుపట్టలేదు భయంతో. కాని ఉదయంనించి ఆలోచించాక ఇప్పుడు ఏదో మొండి ధైర్యం, తెగింపు వచ్చేశాయి నాకు. ఏం జరిగినా ఎడుర్కొగలనన్న నిబ్బరం కల్గుతోంది. నన్నీ స్థితిలో పడేసిన ఆ సురేష్ ని వదలను లాయరుగారూ.....నన్ను నలుగురి ముందు తలెత్తుకోకండా దోషిగా చేసినా ఆ సురేష్ కీ ఇందులో భాగం వుందని, అతను దోషి అని నిరూపించి వాడు తలెత్తుకోలేకుండా చేసేవరకు నా పగ, కసి చల్లారదు లాయరుగారూ. దానికి మీ సహాయం కావాలి."
రూప మొహం నిండా చెమటపట్టింది. ఆమెలోని ఆవేశం, కసి మాటల్లోనే తెలుస్తుంది. సుమతి ఆమె ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని మెచ్చుకున్నట్టు చూసింది.
కానీ ఆమెకింకా తననించి ఏం సహాయం ఆశించిందో అర్ధంకాలేదు.
"లాయరుగారూ! ఆ సురేష్ ని కోర్టుకిడ్పించి, కోర్టు ద్వారా న్యాయం పొందాలని అనుకుంటున్నాను. వాడు నన్నిలా ప్రేమించి, అవసరం తిర్చుకున్నాక వదిలాడని, వాడి ద్వారా నేను బిద్దతల్లి నవబోతున్నందువల్ల నా బిడ్డకు తండ్రిగా కోర్టులో నిరూపించాలని నా కోరిక. దానికి మీరు నాకు సహాయపడగలరా.....లాయర్ గా మీ సలహా సంప్రదింపుల కోసం వచ్చాను" రూప సూటిగా చూస్తూ అడిగింది.
సుమతి ఆ ధైర్యానికి విస్తుపోయింది. సాధారణంగా ఈ పరిస్థితిలో పడిన అమ్మాయిలు తమ తప్పు, పాపం బయటికి రాకుండా గుట్టుగా కదిగేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఈ అమ్మాయి ఇలా ధైర్యంగా న్యాయం కోసం కోర్టు కెక్కి పోరాదాలనుకోడం ఏదో వింతగానే అన్పించింది. రూప పట్టి పట్టి చూస్తూ ఆలోచించింది.
"కాని కోర్టు కెక్కితే...ముందు ఈ విషయాలన్నీ బట్టబయలు అవుతాయి. నీ పరువు, నీ తల్లితండ్రుల పరువు, మీ కుటుంబ గౌరవం ఇవన్నీ ఆలోచించావా?"