"గుడ్! మీకు కొంతలో కొంత సౌందర్య గురించి అవగాహన వున్నట్టుగా వుందే.... అందుకే A man like a train and a woman like the world అన్నారు పెద్దలు...." మాట్లాడుతూ నీళ్ళల్లోకి దిగిందామె.
నిజంగానే ఆమె గొప్ప అందకత్తె... ఏరోటిక్ పర్సనాలిటీ.... ఏ మగాడి దృష్టినైనా కొద్దినిమిషాలు తనవైపు తిప్పుకోగల బ్రీత్ టేకింగ్ బ్యూటీ..... అయినా అవేమీ అతని దృష్టికి రాలేదు.
జరిగింది జరుగుతున్నది ఎందుకు జరుగుతుందో అర్థంకాని విచిత్రమయిన పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు మైత్రేయ.
అరగంట గడిచింది. ఒడ్డుకి జలకన్యలా వచ్చి, అలా పచ్చికలో కూర్చుండి పోయింది మోహిత.
"నన్ను చాలా దగ్గరగా చూడాలని వుందా మీకు?" ఆమె ప్రశ్నలో కవ్వింపు లేదు. ఆసక్తి మాత్రం వుంది.
ఆ సమయంలో అలాగే ఆలోచిస్తున్న మైత్రేయకి, ఆ ప్రశ్న వింతగా అనిపించలేదు.
మోహిత తన పొడవాటి శిరోజాలను గుండెలమీద కప్పుకుంది.
"రండి! దగ్గరిగా రండి.... నన్ను దగ్గరగా చూడండి. కోరికలు లేకుండా స్త్రీ శరీర సౌందర్యాన్ని దగ్గరగా చూస్తేనే, ఆమె మానసిక సౌందర్యాన్ని ఎప్పటికయినా చూడగలుగుతారు."
నెమ్మదిగా లేచి ఆమెకు సన్నిహితంగా కూర్చున్నాడు మైత్రేయ. మసక వెన్నెల వెలుగులో మెరుస్తున్న ఆమె దేహంవేపు చూస్తున్నాడు.
శరీరంలో ఏదో కంపన... ఉచ్ఛ్వాస, నిశ్వాసలో వేగం పెరగడం అతనికి తెలుస్తూనే వుంది.
"నాలో ఏ రకం స్త్రీని చూస్తున్నారు మీరు? అంటే నేననేది..... ప్రేమ నాయికల గురించి కాదు. శృంగార నాయికల గురించి....."
"శృంగార నాయికలంటే.....?" ప్రశ్నించాడతను.
"చాలామంది ప్రేమ, శృంగారం ఒకటే అనుకుంటారు. శృంగారం దేహానికి సంబంధించిన విషయం, ప్రేమ ఆత్మకు సంబంధించిన విషయం, ఆత్మలో నిరంతరం వెలిగే ఆరని జ్యోతి లాంటిది శృంగారం. ఒక ఆడ, మగ మధ్య వున్నది నిజమైన ప్రేమ అనుకున్నప్పుడు, శృంగారం అన్నది నిమిత్తమాత్రం. ప్రేమించడం పూర్తయితే, సగం శృంగారం పూర్తయిపోయినట్లు అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. కేవలం ప్రేమించాం గానీ, శృంగారంలో పాల్గొనలేదు గనుక, శీలం పోలేదనుకుంటారు కొందరు. ఇవన్నీ నాకు అర్థంగాకుండానే మిగిలిపోతున్నాయి. అరబ్బీ శృంగార కవి షేక్ నెఫ్ జవీ రాసిన శృంగార గ్రంథం మీరు చదివారా?" అడిగిందామె.
"లేదు!"
"షేక్ నెఫ్ జవీ స్త్రీను ముప్ఫై ఎనిమిది రకాలుగా విభజించాడు. దానికి అతను చెప్పిన ఆధారాలేమిటో తెలుసా?"
"తెలీదు."
"మీకు చాలా చెప్పాలి నేను...." అని నవ్వి "స్త్రీ దేహావయవాల బట్టి, స్త్రీలను విభజించాడాయన. ఒక్కొక్క దేహావయవం ఒక్కో ఆత్మజ్యోతిగా పేర్కొన్నాడు. అలాగే పురుషుల్ని కూడా....." అలాంటి సమయంలో ఇలాంటి విషయాలను ఎందుకు చెప్తోందామె? ఆ సన్నివేశం అతనికి కలలో దృశ్యంలా వుంది.
"నన్ను కౌగిలించుకోవాలని వుందికదూ?" పక్కకు వత్తిగిలి, ఓరగా అతని వేపు చూస్తోందామె. ఆ ప్రశ్నకు బిత్తరపోయాడతను.
"ఒక స్త్రీ నగ్నదేహాన్ని, ఒక పురుషుడు ఎంతసేపు చూడగలడు చెప్పు?" మళ్ళీ ప్రశ్నించిందామె.
ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
"తెలీదా?"
నిజంగా ఆ ప్రశ్నకు జవాబు తెలీదు మైత్రేయకి.
"అయిదు నిమిషాలసేపు మాత్రమే..... అంతకుమించి చూసే మగవాడిలో కామరాహిత్యం ఏర్పడుతుందని కామసూత్ర గ్రంథాలు చెపుతున్నాయి" ఆమె చెప్పటం ఆపి అతనికేసే చూస్తోంది.
అతనికి అదంతా కొత్త ప్రపంచంలా వుంది. పురుష సహజమయిన కోర్కెక్రమంగా అతనిలో అతనికి తెలియకుండానే రాజుకుంటోంది. కంఠం తడారిపోయి, గుండె వేగం హెచ్చి, అనూహ్యమయిన ఉద్వేగం ఏదో అతని నరనరాన చోటు చేసుకుంటోంది. హార్మోన్స్ కి అంత శక్తి వుంది మరి. అతనికి తెలియకుండానే మృదువుగా ఆమెచేతిని పట్టుకున్నాడతను. ఆ చేయి చల్లగా వుంది.
"మీ చేయి చాలా వేడిగా వుంది. అంటే మీరు నన్ను కాంక్షతో చూస్తున్నారన్నమాట....." అందామె.
తన ప్రతీ మనోభావాన్నీ ఎలా పసిగడుతోందీమె. తనద్వారా ఏం ఆశిస్తోంది?
"మగవాడు ఎంతసేపు నిగ్రహం పాటించగలడో తెలుసా?" ప్రశ్నించిందామె.
"తెలీదు!"
"ఆడది మనసారా ఆహ్వానించేవరకూ....." గలగల నవ్వుతూ చెప్పి, గబుక్కున లేచి నిలబడి గబగబా దుస్తులు ధరిస్తోంది.
ఏదో జరుగుతుందని వూహించిన మైత్రేయ ఒక్కసారి డీలా పడిపోయాడు.
మోహిత ఒక్కసారి జ్వాలలాంటి ఆకర్షణనూ పెంచగలదూ.... కామాన్నీ పెంచగలదు. అంతలోనే దానిని త్రుంచగలదు. షీ ఈజ్ జీనియస్.... మనసులోనే అనుకున్నాడు మైత్రేయ.
ఇద్దరూ మట్టిబాట వెంబడి ఇంటివేపు నడుస్తున్నారు.
ఆమె సంభాషణ ద్వారా మొదట్లో ఆమెపై నెగెటివ్ ఆలోచన వచ్చినా, ఆమె ప్రవర్తన వల్ల ఆ ఆలోచనలను చెరిపేశాడు.
"మీరిప్పటివరకూ ఎవర్నీ ప్రేమించలేదు. ఎవరితోనూ మీకు సంపర్కమూ లేదనే విషయం నాకర్థమయింది....." మట్టిబాటమీంచి గుట్ట ఎక్కువతూ అంది మోహిత.
మోహితలో వున్న సైకాలజిస్ట్ గురించి, పరిశీలనా శక్తి గురించి ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
* * *
` భర్త వెంకటయ్య చెప్పిన పిడుగులాంటి వార్త విని, ఆచేతనురాలైపోయింది ఇందు తల్లి సావిత్రమ్మ.
"మైత్రేయ ఖూనీకేసులో ఇరుక్కున్నాడా? జైల్లో వున్నాడా?" ఆ మాటలు వినగానే కళ్ళనీళ్ళ పర్యంతమయిపోయింది ఇందుమతి.
"అసలేం జరిగిందండీ? ఇదంతా నిజమేనా? ఎవరు చెప్పారిదంతా?" ప్రశ్నించింది సావిత్రమ్మ.
"మైత్రేయ పనిచేసే ఆఫీసులో చెప్పారు. మైత్రేయ రూమ్మేటు చంద్రబోసు అనే కుర్రాడున్నాడు. వాడు చెప్పాడు..... మైత్రేయ ఇలా చేస్తాడని అనుకోలేదు" బాధగా అన్నాడాయన.
"అదికాదు నాన్నా..... ఏం జరిగిందో వివరంగా చెప్పండి" ప్రశ్నించింది ఇందుమతి ఏడుపును లోలోనే దిగమింగుకుంటూ.
"కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదట..... ఓ అమ్మాయి వలలో పడ్డాట.... అక్కడి ఎమ్మెల్యేని హత్య చేశాడట..... ఇప్పుడు జైల్లో వున్నాడట....." బాధగా చెప్పాడాయన.
"నేనమ్మను..... అమ్మాయి వలలో బావ పడ్డాడంటే నేనమ్మను" కళ్ళనీళ్ళ తుడుచుకుంటూ అంది ఇందుమతి.
"అంటే.... నేను హైదరాబాద్ నుంచి వస్తూ, ఓ కట్టుకథ అల్లానంటావా..... నిజానిజాలు తెల్సుకుని, వాడ్ని విడిపించడానికి, వాళ్లాఫీసు వాళ్ళు ఇవాళో రేపో కొంతమంది మనుషుల్ని మైసూర్ పంపుతున్నార్ట" అన్నాడాయన.
"ఆ అమ్మాయి ఎవరు?" ప్రశ్నించింది ఇందు.
"నాకేం తెల్సు?" కోపంగా అన్నాడాయన.
బావ ఎవరో అమ్మాయి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయి కారణంగా వుచ్చులో యిరుక్కున్నాడా..... బావా విషయంలో సరోజ హెచ్చరించిన హెచ్చరికే నిజమయింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది ఇందు.
"ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు.....?" సావిత్రమ్మ ప్రశ్నించింది.
"మనమేం చేస్తాం..... బుద్ధిమంతుడనుకున్నాను. ఎవరి ఖర్మ వాళ్ళది! వంశ ప్రతిష్ట మంటగలిపాడు.... నా ఆశలన్నీ అడియాసలు చేశాడు...." అన్నాడాయన విసుగ్గా.
"అలాగని వూరుకుంటారా? అసలేం జరిగిందో, వాడక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో, తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదా?" కూతురువేపు చూస్తూ అంది సావిత్రమ్మ.
"అక్కడకు నన్నెళ్లి, ఆ జైలుచుట్టూ, పోలీసులు చుట్టూ తిరగమంటావా? ఇంటా వంటా లేదు" విసుక్కున్నాడాయన.
ముగ్గురి వ్యక్తుల ,మధ్య గంభీరమయిన వాతావరణం నెలకొంది.
పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వ్యక్తి వెంకటయ్య..... ఆయన కోరుకునేది మచ్చలేని వ్యక్తిత్వం. రేపు జైలుకెళ్ళిన మేనల్లుడు, అల్లుడైతే లోకుల మాటలకు తను తలదించుకోవాలి.
నిజంగా మైత్రేయ తప్పు చేస్తే, ఇందుకు బయటి సంబంధం చూడడమే మంచిది. అందుకు తను మైసూర్ వెళ్ళి నిజానిజాలు తేల్చుకుని వస్తేనే మంచిది. దృఢ నిర్ణయానికొచ్చిన వెంకటయ్య-
"రేపు నేను మైసూర్ వెళుతున్నాను.... మైత్రేయ రూమ్మేటు చంద్రబోసుని కూడా అక్కడికి రమ్మంటాను.... యిప్పుడే హైదరాబాద్ కి ఫోన్ చేస్తాను...."
భుజమ్మీద కండువా సర్దుకుని, లేచి బయటికెళ్ళాడు వెంకటయ్య.
"బావ హత్య చేసాడంటే నేన్నమ్మను.....' అనుకుంటూ, ఏడుపు ముఖంతో లోన గదిలోకెళ్ళిపోయింది ఇందు.
* * *
` రాత్రి ఎనిమిది గంటలు దాటింది.
అప్పుడే వంట చేసొచ్చి, డ్రాయింగ్ రూమ్ లో కొచ్చింది మోహిత.
ఆమె చేతిలో వున్న పీటర్ స్కాట్ ఫుల్ బాటిల్, ఐస్ క్యూబ్స్, రెండు గాజుగ్లాసుల్ని టేబిల్ మీద పెట్టింది. ప్లేట్లో జీడిపలుకకులు, సోడాలు.
"మీకలవాటుందా అని అడగడం, ఈ రోజుల్లో అసభ్యత...." అంటూ రెండు లార్జ్ పెగ్గుల్ని కలిపి అతనికో గ్లాసు యిచ్చింది. తను నెమ్మదిగా సిప్ చేస్తోంది.
"ఇంతవరకూ లేడీస్ కంపెనీతో కల్సి తాగలేదా.... మొహమాటపడుతున్నారు...... ప్లీజ్ హావిట్!" అందామె.
తను అప్పటివరకూ నాలాంటి వ్యక్తి, మీకెదురు పడలేదనుకుంటాను.... అందుకే నా ప్రతి చర్యా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తోంది కదూ..... చెప్పండి" అడిగిందామె.
ట్యూబ్ లైట్ వెలుగులో, పల్చని నైటీ మాటున ఆమె అందాలు స్పష్టస్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.
"ఈ అడవిలో ఒంటరిగా ఎందుకుంటున్నారు. ఎలా వుండగలుగుతున్నారు?" ప్రశ్నించాడు మైత్రేయ డ్రింక్ సిప్ చేస్తూ.
"జనారణ్యంలో, కాంక్రీట్ జంగిల్ లో బతికే బతుకుపై నాకు రోత పుట్టింది. అందుకే ఈ స్వచ్ఛమయిన అడవిబతుకు కోరుకున్నాను. ఇక్కడ మీకు బోరుగా వుందా?"
"బోరుగా వుందో? సంతోషంగా వుందో....?
నాకేం అర్థంకావటంలేదు. ఈ వాతావరణం, మీ మనస్తత్వం..... నేను అరెస్ట్ కావటం , తప్పించుకు రావటం, మిమ్మల్ని ఏదో చేద్దామని నేను రావటం, వచ్చాక నామీద కేస్ లేదని తెలియటం..... ఇవేవి నాకర్థం కావటంలేదు."