6. జనులారా! మహావృద్ది కర్త, మహామహుడగు ఇంద్రునకు సోమము అర్పించండి. జ్ఞానవంతుడగు ఇంద్రుని ఎంతో స్తుతించండి. వరదా! ఇంద్రా! హవి అర్పించు వారికి ప్రత్యక్షమగుము.
7. అన్నప్రదుడు, విజయప్రదాత, ఉత్సాహి, ధనికుడు, నరోత్తముడగు ఇంద్రుని యజ్ఞమునాకు ఆహ్వానించుచున్నాము.
ఇంద్రా! నీవు మాస్తుతులు వినువాడవు. ఉగ్రుడవు. అరి భయంకరుడవు. రాక్షసహంతవు. శత్రు ధనాపహారివి. రక్షించుమని నిన్ను పిలుచుచున్నాము.
8. అన్నములు కోరువారు ఇంద్రునకు స్తుతులు, హవిస్సులు అర్పించండి. వసిష్టా! నీవు సహితము యజ్ఞమందు ఇంద్రుని మహాస్తుతులతో అర్చించుము. ఇంద్రా! నీవు లోకములను వర్ధిల్ల చేయువాడవు. నేను నిన్ను ఉపాసించుచున్నాను. నా మాటలు వినుము.
9. ఇంద్రుని ఆయుధము అంతరిక్షమున స్థాపించబడినది. ఆ ఆయుధము ఇంద్రుని కొరకు జలములను వశపరచుకున్నది. భూమి మీద మిగిలిన నీరు ఓషధులందు చేరుచున్నది.
పదకొండవ ఖండము
ఋషులు :- 1. అరిష్టనేమి 2. భరద్వాజుడు. 3. విమదుడు. 4,5,6,9. వామదేవుడు. 7. విశ్వామిత్రుడు. 8. రేణు. 10. గోతముడు.
1. తార్క్ష్యుడు ప్రసిద్దుడు. అన్నవంతుడు. దేవతల ప్రేరణ కలవాడు. శక్తిమంతుడు. శత్రు రథభంజకుడు. అరిష్టనేమి. పదునైన ఆయుధముల వాడు. శత్రుంజయుడు. శీఘ్రగామి. మంచిరెక్కల వాడు. శుభములు కలుగవలెనని అతనిని ఈ యజ్ఞమునాకు ఆహ్వానించుచున్నాము.
(వాయుర్వై తార్క్ష్యః అని కౌషీతకి. స్వస్త్యయనం వై తార్క్ష్యః అని ఐతరేయము. తార్క్ష్యుడు వాయువు, శుభము అగును.
ఈ మంత్రద్రష్ట అరిష్టనేమి. అరిష్టనేమి అనగా ఎదురులేని రథము లేక ఆయుధము పదునైన ఆయుధము.
అరిష్టనేమి తండ్రి తార్క్ష్యుడు.)
2. త్రాతారమిన్ద్రం హువే = రక్షకుడగు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. అవితారమిన్ద్రo హువే = కోరికలు తీర్చు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
ఇంద్రుడు సకల సంగ్రామములకు ఆహ్వానించబడువాడు. శూరుడు. సకల శక్తిమంతుడు. పురుహూతుడు. అట్టి ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ధనవంత ఇంద్రుడు ఈ హవిని స్వీకరించును గాక.
3. ఇంద్రుడు కుడిచేతి వజ్రము పట్టువాడు. రథముల నియంత. హర్యశ్వముల రథికుడు. అట్టి ఇంద్రుని యజామహే = పూజించుచున్నాము. ఇంద్రుడు సోమపానము చేసి గడ్డము కదలాడగా ప్రత్యక్షమగును. తన సేనలతో శత్రువులను గడగడలాడించును. అతడు నానావిధ ధనములను స్తోతలకు ఇచ్చును.
శ్శశ్రుభిః = గడ్డము మీసములతో అని అర్ధము. ఇంద్రునకు గడ్డము మీసములు ఉన్నవని సూచన. మత్తెక్కిన వాని గడ్డము కదలుచుండును.)
4. ఇంద్రుడు శత్రుహంత. దడిపించువాడు. శత్రువులను తరుమువాడు. గొప్పవాడు. అపారుడు. వజ్రహస్తుడు. అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము. మేము స్తోతలము.
ఇంద్రుడు వృత్రహంత. అన్నదాత. అపార ధనవంతుడు. అతడు ధనములు దానము చేయును.
5. ఒకడు మమ్ము దండించుటకు మా మీదకు దండెత్తెను. ఒకడు అహంకారమున, క్షీణించు ఆయుధములతో ఎదిరించ గల మా ప్రజమీద దండెత్తెను. అట్టి వారినుండి రక్షణలకు ఆబోతుల వలె ఎగబడుదుము. వారిని తరిమి వేతుము గాత.
6. యుద్దములందు స్పర్ధించు నరులు ఎవనిని పిలిచెదరో, ఆయుధము లెత్తి పోరుసల్పువారు ఎవనిని పిలిచెదరో, వీరులను ప్రసాదించుమని ఎవనిని పిలిచెదరో, జలముల కొరకు ఎవనిని పిలిచెదరో, వర్షము కొరకు ఎవనిని ఆశ్రయింతురో, యజమానులు హవి అర్పించి ఎవని బలమును పెంచుదురో అతడు ఇంద్రుడు అగును. ఇంద్రుడే అగును.
7. ఇంద్ర, పర్వతములారా! మేము మిమ్ము ప్రార్ధించుచున్నాము. మహా రథముల మీద రండి. మాకు వీర పుత్ర సహిత అన్నములను ప్రసాదించండి.
ఇంద్ర, పర్వత దేవతలారా! మా యజ్ఞములందలి హవిని ఆరగించండి. మేము అర్పిమ్చు అన్నములకు ప్రసన్నులు కండి. మా స్తుతులు వినండి. వర్ధిల్లండి.
8. ఇంద్రుడు యజ్ఞముల వలన భూలోక ద్యులోకములను, రథపు రెండు చక్రములను ఇరుసువలె పట్టి నిలిపిఉంచినాడు. అట్టి ఇంద్రుని బిగ్గరగా ఆకాశమునకంటు ధ్వనిచే స్తుతించండి. అవి ఆకాశ జలములకు ప్రేరణ కలిగించును గాత.
9. ఇంద్రుడు పైకి ఎగురగలవాడు అయినాడు. విశాల అంతరిక్షమునకు చేరుకున్నాడు. స్తోతలు ఇంద్రప్రియస్తుతులు గానము చేసి అతనిని ప్రత్యక్షము చేసికొనుచున్నారు. ఈ యజ్ఞమునాకు కాంతి మంతుడై విచ్చేయు ఇంద్రుడు నా తండ్రికి పౌత్రుని ప్రసాదించును గాక - "పితుర్నపాతమ్".
(నాకు కొడుకునిమ్ము అనవచ్చును. కాని పితామహుడు పౌత్రుని చూడ వలెనని భావము.)
10. హర్యశ్వములు వీరకృత్యములు చేయునవి. తేజస్వులు. శత్రువులకు అందనవి. యజ్ఞాదులకు ఇంద్రుని చేర్చుటకు రథమునకు తగిలినవి. వానిని స్తోత్రములు, మంత్రములు చదివి నియంత్రించగలవాడు ఏడి?
రథమును లాగునట్టి ఈ అశ్వములను స్తుతించువాడు ఆయుష్మంతుడు అగుచున్నాడు.
పన్నెండవ ఖండము
ఋషులు :- 1. మధుచ్చందుడు. 2. మాధుచ్చందుడు. 3,6. గోతముడు. 5,8. తిరశ్చి. 4. అత్రి. 7. నిపాతిథి. 9. విశ్వామిత్రుడు. 10. శంయు.
1. శతక్రతో! నిన్ను ఉద్గాతలు గానము చేసి స్తుతించుచున్నారు. అర్కిణులు పూజనీయ ఇంద్రుని మంత్రములచే ప్రశంసించుచున్నారు. ఇతర బ్రాహ్మణులు వెదురు గడను వలె నిన్ను ఉన్నతుని చేయుచున్నారు.
(వెదురుగడ మొన పట్టి నాట్యము చేయువారు గడను పైకి ఎత్తుదురు.)
2. ఇంద్రుడు రథికులందు శ్రేష్ఠుడు. అన్నములకు ప్రభువు. సజ్జన పోషకుడు. సముద్ర గభీరుడు. అతనిని సమస్త స్తుతులు వర్ధిల్లచేసినవి.
3. ఇంద్రదేవా! ఇది ప్రశంసనీయ, ఆనందదాయక, అమృత, అభిషుత సోమము. ఇది యజ్ఞ సదనమున దీప్తమై ధారలుగా నీ ముందుకు చేరుచున్నది. ఈ సోమమును సేవింపుము.
4. విచిత్రుడు, వజ్రి, సంపన్నుడగు ఇంద్రుడు మాకు ఇవ్వదలచిన ధనము ఈ లోకమున లేదు. ఇంద్రా! నీవు మాకు రెండు చేతులతో ధనమును అందించుము.
5. ఇంద్రదేవా! నేను 'తిరశ్చి' ని. నీకు స్తుతులతో సపర్యలు చేయుచున్నాను. నా స్తుతులు వినుము. నన్ను వీర పుత్రులు, గోవులు, ఇతర ధనములతో పరి పూర్ణుని చేయుము. మహాంఅసి - నీవు ఎంతో గొప్పవాడవు.
6. ఇంద్రదేవా! నీ కొరకు సోమము సిద్దమైనది. నీవు బలశాలివి. శత్రు తిరస్కర్తవు. విచ్చేయుము. సేవింపుము. సూర్యుడు అంతరిక్షమును వెలుగులతో పూరించినట్లు ఈ సోమము నిన్ను పరిపూర్ణుని చేయును గాత.
7. ఇంద్రా! ఈ 'నిపాతిథి' స్తుతులు వినుటకు హర్యశ్వముల మీద చేరుకొనుము. నీవు స్వర్గ పాలకుడవు. నీవు విచ్చేసినంత నేను సుఖింతును. దీప్తివంతా! ఇక స్వర్గమునకు విచ్చేయుము.
8. స్తుతియోగ్య ఇంద్రా! సోమము సిద్దమైనది. మా స్తుతులు - రథములు గమ్యమును వలె- నిన్ను చేరుచున్నవి. ధేనువులు దూడలను వలె స్తుతులు నిన్ను పిలుచుచున్నవి.
9. రండి. రండి. త్వరపడండి. శుద్దిచేయు సోమము తోను, శుద్దిచేయి మంత్రములతోను శుద్దుడగు ఇంద్రుని స్తుతించండి. పాపరహితుడై వర్దిల్లిన ఇంద్రుని శుద్ద స్తోత్రములు, పాలు కలిపిన సోమము ఆనందింప చేయును గాత.
(ఇంద్రుడు వృత్రాదులను వధించినాడు. తనకు బ్రహ్మహత్యా పాతకము తగిలినది అనుకున్నాడు. దానిని వదిలించు మని ఋషులను కోరినాడు. ఇది శాట్యాయనక బ్రాహ్మణము నందలి వృత్తాంతము. ఈ మంత్రము దీనికి సంబందించినది.)
10. ఇంద్రా! మరింత ధనవంతము, ప్రకాశవంతము యశస్వంతమగు సోమము నీ భక్తులకు ధనము ప్రసాదించుచున్నది. సోమాధిపతి ఇంద్రా! అభిషుత సోమము నీకు ముదము కూర్చును గాత.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంద్ర వచన సామవేద సంహిత పూర్వార్చి యందలి
మూడవ అధ్యాయము సమాప్తము.