5. అగ్నిదేవా! మాకు విషయవాసనలందు కలిగిన దోషములను హతమార్చుము. శరీరమును శుష్కింప చేయు రోగములను దూరము చేయుము. పాప బుద్దిని తొలగించుము. మా శత్రువులను సంహరింపుము. మా సకల దుర్గతులను దూరము చేయుము. మాకు పుత్ర, పౌత్రాది సహిత ధనమును ప్రసాదించుము.
రెండవ సూక్తము - 7
వినియోగము :-
1) లౌకిక, వైదిక ఆక్రోశము, బ్రాహ్మణ శాపము, భ్రష్టు కంటిదృష్టి, యక్షపిశాచుల భయము కలిగినపుడు యవ మణి కొరకు హోమము చేసి అభిమంత్రించి కట్టవలెను.
2) గ్రహ నక్షత్రాదుల వలన కలిగిన రోగములు, భయముల నివారణకు భార్గవీ మహా శాంతి చేయవలెను.
1. ఈ యవలు రాక్షస, పిశాచముల వలన కలిగిన బాధలను నివారించునవి. దేవతల వలన కలిగిన శాపాదులను తొలగించునవి. నీరు శరీరపు మురికిని తొలగించినట్లు ఈ యవలు నానుండి శాపాదులను తొలగించును గాక.
5. శాపము పెట్టు వాని మీదికే శాపము మరలును గాక. మాకు అనుకూలుడు మాతో పాటు సుఖించును గాక. మా విషయమున దుర్భావము కలవాని మరియు చాటుమాటుగ చాడీలు చెప్పు వారి కన్నులు పొడిచి వేతుము - ప్రక్కటెముకలు విరిచి వేతుము.
మూడవ సూక్తము - 8
వినియోగము :-
1) వంశపారంపర్యముగా వచ్చు కుష్ఠు, క్షయ, సంగ్రహణి మున్నగు రోగ శాంతికి మొదటి మంత్రముచే నిండు నీటికుండను హోమము, అభిమంత్రణము చేసి ఇంటి బయట రోగికి స్నానము చేయించవలెను.
2) ఆ వ్యాధులకు అదే రీతిగా రెండవ మంత్రముచే ఉషః కాలమున స్నానము చేయించవలెను.
3) మూడవ మంత్రముచే మద్దికర్ర, యవల పొట్టు, మంజరిసహిత నవ్వులను ఒకచోట చేర్చి అభిమంత్రించి కట్టవలెను. వట్టి మట్టి లేక పొలము మట్టిని చర్మములలో చుట్టి కట్టవలెను.
4) నాలుగవ మంత్రముచే నీటి కుండను అభిమంత్రించి ఎద్దులు కట్టిన నాగలి కింద స్నానము చేయించవలెను.
5) శూన్య గృహమున ఐదవ మంత్రముచే హోమము చేయవలెను. దగ్గర నున్న పాత గుంతలో హోమము చేయవలెను. గుంతలో 'శాలాతృణము' పరచి, దాని మీద రోగిని కూర్చుండబెట్టి, ఆ నీటితో ఆచమనము చేయించవలెను. నీటిని రోగి మీద చల్లవలెను.
1. తేజస్వియగు 'విచ్రుతి' అను నక్షత్రము ఉదయించినది. "క్షేత్రియస్య" వంశము నుంచి వచ్చిన పాశముల వంటి రోగబంధములు శరీరపు, పై భాగమును, దిగువ భాగమును 'ముంచతాం' విడుచును గాక.
వ్యాఖ్య - రోగములు వంశపారంపర్యముగా వచ్చునని ఆనాడే కనుగొన్నారు. 'వంశము' అనిన తల్లిదండ్రులు అని మాత్రము అర్ధము కాదు. వ్యాధులు, గుణగణములు, స్వభావము మున్నగునవి అన్నియు తండ్రి పక్షపు ఏడు తరముల నుండి, తల్లి తరపు ఏడు తరముల నుండి సంభవించుచున్నవి. అందుకే పెండ్లి "ఏడేడు జన్మల బంధము' అగుచున్నది.
ఒకవ్యక్తికి వ్యాధులు సహితముగ సర్వము వంశ పారంపర్యము కావుననే ఆస్తులు, అప్పులు సహితము వంశ పారంపర్యమగుచున్నది.
ఇస్లాం ధర్మమున సుదూర బంధువులకు సహితము ఆస్తిలో భాగము కల్పించబడినది.
నేటి పాశ్చాత్య వైద్య విధానమున "కుష్ఠు" వంశ క్రమానుగతముగ వచ్చిన వ్యాధి కాదు అనుచున్నారు. పరిశోధనకు అంతము గాని నిర్దిష్టత గాని లేవు. నేడు అవునన్నది రేపు కాదనుట, కాదన్నది ఔననుటకు అనేక ఉదాహరణలు ఉన్నవి.
సృష్టి యందు పరిపూర్ణత దేనికిని లేదు!
2. ఉషః కాలము చీకట్లను మాయము చేసినట్లు ఈ క్షేత్రీయ వ్యాధిని మాయము చేయును గాక. రోగ శాంతి కారకులగు ఆదిత్యాదులు ఈ వ్యాధిని శాంతింప చేయుదురు గాక. అపస్మారాది రోగ కారకములను పిశాచాదులు పారి పోవును గాక. క్షేత్రీయ వ్యాధుల ఓషధులు సహితము ఈ వ్యాధ`ులను దూరము చేయును గాక.
వ్యాఖ్య - కొన్ని వ్యాధులు నిర్మూలము కానివి ఉన్నట్లున్నవి. అవి నేడు కూడ ఉన్నవి. ఉషస్సులు చీకట్లను తరుమును. నిర్మూలించలేదు. చీకట్లు మరల వచ్చినట్లు క్షేత్రీయ వ్యాధులు మరల మరల వచ్చునని చెప్పుచున్నట్లున్నాడు. నేడు మధుమేహము, రక్తపు పోటు మున్నగు వానికి నివారణ తప్ప నిర్మూలన లేకున్నది.
అనువంశిక వ్యాధులకు ఇది తప్పనట్లున్నది!
3. కపిల వర్ణ అర్జున కర్ర, యవల పొట్టు, తిల సహిత మంజరితో చేసిన మణి వ్యాధిని దూరము చేయును గాక. క్షేత్రీయ వ్యాధుల ఓషధులు సహితము ఈ వ్యాధులను దూరము చేయును గాక.
4. రోగశాంతి కలిగించు ఎద్దులు కట్టిన నాగలికి నమస్కారము కాడికి, కర్రకు నమస్కారము. క్షేత్రీయ వ్యాధుల ఓషధులు సహితము ఈ వ్యాధులను దూరము చేయును గాక.
5. తెరచి ఉన్న గవాక్షముల శూన్య గృహములకు నమస్కారము. వదిలి వేసిన పాత గుంతలకు నమస్కారము శూన్య గృహాది క్షేత్రపతికి నమస్కారము. క్షేత్రీయ వ్యాధుల ఓషధులు సహితము ఈ వ్యాధులను దూరము చేయును గాక. నాలుగవ సూక్తము - 9
వినియోగము :-
1) మోదుగు, బూరుగు, నేరేడు, కంపిలాదులలో ఒక దానిని పది ముక్కలు చేసి లక్క, బంగారము తో మణిని చేసి, వానిని పెట్టి ఈ సూక్తముచే సంపాత, అభిమంత్రములు చేసి - బ్రహ్మ గ్రహశాంతి కొరకు - కట్టవలెను.
2) దశ బ్రాహ్మణ, బ్రహ్మ గ్రహములు పట్టిన వానిని ఈ సూక్తము జపించుచు తాకవలెను.
1. దశవృక్షమణీ! ఇతనిని బ్రహ్మరాక్షసి బంధము నుండి విడిపింపుము. అమావాస్యాది పర్వము లందు పట్టిన బ్రహ్మరాక్షసి నుండి విడిపింపుము. గ్రహావేశమున మృత ప్రాయుడైన వానిని మరల బ్రతికింపుము.
2. గ్రహ విముక్తుడైన వాడు మరల ఈ లోకమునకు వచ్చును గాక. అతడు బంధువులతో కూడును గాక. తన సంతానమునకు తండ్రి అగును గాక. తన సేవకులకు స్వామి అగును గాక.
ఇతడు పరమ భాగ్యవంతుడు అగును గాక.
వ్యాఖ్య - మరణము వలన కోల్పోయిన సమస్త వాక్కులు మరల పొందవలెనని.
3. గ్రహ విముక్తుడు అంతకు ముందటి వేదాధ్యయనాదులను మరల గుర్తుకు తెచ్చుకొనును గాక. తన నివాసములను గుర్తించును గాక.
మణి బంధనమా! వందల వైద్యులు, వేల మందులు చేయు పనిని నీవు చేసినావు!
4. మణీ! గ్రహబాధలు నివారించు, గ్రహములను తిరస్కరించునట్టి నీ ప్రభావము దేవతలకు తెలియును. బ్రాహ్మణులు ఓషధులు మిత్రావరుణులు అందరు భూమిమీద గల నీ శక్తిని ఎరింగి ఉన్నారు.
5. ఈ మణి బంధన ప్రక్రియను ఏర్పరచిన వాడే వైద్యతముడు అగుచున్నాడు. అతడే నీకు వైద్యము చేయును గాక. అతడే నిన్ను వైద్యము చేసి ఆరోగ్యవంతుని చేయును గాక.
ఐదవ సూక్తము - 10
వినియోగము :-
ఇంతకు ముందు చెప్పిన క్షేత్రీయ వ్యాధుల శాంతికిగాను నాలుగు బాటల కూడలిలో
నిండు కుండను ఈ సూక్తముచే సంపాత అభిమంత్రణలు చేసి 'కంపిల' చెక్క కట్టి,
నెమలి ఈకల కట్టతో స్నానము చేయించి, చల్లవలెను.
1. వ్యాధిగ్రస్తా! నిన్ను క్షేత్రీయ వ్యాధుల నుండి, మృత్యు పరిష్వంగము నుంచి, రక్తసంబంధీకుల ద్రోహముల నుండి, వరుణ పాశముల నుండి విముక్తుని చేయుచున్నాను.
"అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే ద్యావాపృథివీ ఉభేస్తాం" - మంత్ర మహిమతోనే నిన్ను అపరాధ రహితుని చేయుచున్నాను. ద్యావాపృథ్వులు రెండును నీకు శివములు అగును గాక.
వ్యాఖ్య - "న తత్ సర్వం మత్సామర్ధ్యే కరోమి. అపితు మన్త్ర ప్రభావేనేతి తాత్పర్యః" అని సాయణాచార్యులు ఇవన్నియు నా సామర్ధ్యమున కాక మంత్ర ప్రభావమున చేయుచున్నాను అని తాత్పర్యము.