Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 1

                                 

 

                                      గోరువెచ్చని సూరీడు
                                                                               ---కొమ్మనాపల్లి గణపతిరావు
 

                                
       "హెన్స్ ది ఇండస్ట్రియల్ గ్రోతాఫ్ ఎనీ కంట్రీ డిపెండ్స్ ఆన్ ది ఎకనామికల్ పోలసీస్ అఫిట్ గవర్నమెంట్..."    
    న్యూయార్క్ నగరం నడిబొడ్డున వున్న సెంటినరీ హాల్లో 'న్యూ డీల్ షేర్ కన్సల్టెన్సీ' ప్రతినిధిగా మాట్లాడుతున్న కృషి ఆగింది క్షణంపాటు...    
    ఆమెకు అభిముఖంగా సుమారు వందమంది దాకా అమెరికాలోని వివిధ వృత్తుల్లో సెటిలైన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూర్చుని వున్నారు. భారత ప్రభుత్వం ఆహ్వానంపై ఇండియన్ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వ్యక్తులు వాళ్ళంతా వారిలో సైంటిస్టులూ డాక్టర్లూ ఇంజనీర్లు మాత్రమే కాక ఇండియన్ ఎంబసీ ఉద్యోగులూ వున్నారు.    
    సూర్యాస్తమయ వేళ లాగార్డియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పక్షుల్లా ఎగిరే విమానాల్ని కాని, సమీపంలో నింగిని తాకుతున్నట్టుగా కనిపిస్తున్న మిస్ లిబర్టీ స్టేట్యూను గాని గమనించడం లేదు- ఇరవై మూడేళ్ళ కృషినే చూస్తున్నారు. ఆమెది మామూలు అందం కాదు. చూపుల భూపాలంతో సూర్యుడ్ని ఉదయింప చేసి ఆ కిరణాల కాంతిలో ప్రాణం పోసుకున్న అశేష తైలవర్ణ చిత్రం ఆమె..... రెప్పల పరదాల క్రింద ఏ అస్పష్టపు ఆర్తినో అదిమిపెడుతూ నా నివాసమ్ముతొలుత గంధర్వలోక మధుర సుషమా సుధాగాన మంజువాటి అని చెప్పే నిద్రాముద్రిత స్వప్న రహదారులు ఆమె నేత్రాలు...    
    నిజానికి వారిని ఆకట్టుకుంటున్నది ఆమె అందమో లేక ఇరవై మూడేళ్ళ వయసుకే కృషి ప్రదర్శించే మెచ్యూరిటీయో స్పష్టంగా తోచడం లేదు. కాని ప్రపంచంలో మోస్ట్ కమ్యూనికేటివ్ పీపుల్ గా పేరు పొందిన అమెరికన్స్ తో సమాన స్థాయిలో నిలబడి విషయాన్ని వ్యక్తం చేయగలుగుతోంది. ఆమె పుట్టింది భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో అయినా ఎంబియే పూర్తి చేసింది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కావడమో ఆమె ప్రజ్ఞకి కారణమని కొందరంటే ఆమె వచ్చింది ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబం నుంచి కావటమే అని మరికొందరి అభిప్రాయం.    
    "షేర్స్ వ్యాపారం నిజానికి రేస్ కాదు. గేంబ్లింగ్ కాదు. అలాంటిది కాదని నిరూపిస్తూ లాభాలని ఆర్జించాలంటే ముందు మార్కెట్ పై అవగాహన కావాలి. మీరు పెట్టుబడి పెట్టే కంపెనీల సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వుండాలి. షేర్ వ్యాపారంలో కోటాను కోట్ల రూపాయలు ఆర్జించిన వాళ్ళకీ సామాన్యమైన ఇన్వెస్టరులకీ భేదం ఒక్కటే- పరిశీలన, పరిశోధన ఉదాహరణకి.... ప్రేక్షకులవేపు దృష్టి సారిస్తూ పాలభాగంపై నర్తిస్తున్న ముంగురుల్ని సవరించుకుంది సుతారంగా.    
    "ఇండియా బడ్జెట్ లో ప్లాస్టిక్ కిటికీలు, తలుపులు తయారీపై ఎక్సైజు సుంకాన్ని పూర్తిగా మినహాయించారు. దానితో ప్లాస్టిక్ కిటికీలు, తలుపులతో బాటు ప్లాస్టిక్ వాటర్ టాంకుల్ని తయారు చేసే సింటెక్స్ షేర్ మార్కెట్ ధర విపరీతంగా పెరిగింది. భారతదేశంలో విధ్యుచ్చక్తి కొరత అధికంగా వుంది. కాబట్టి అనేక పరిశ్రమలు భారీ డీజిల్ జనరేటర్స్ ని సమకూర్చుకోవటం అవసరమైంది. అలాంటప్పుడు డీజిల్ జనరేటర్స్ ని ఉత్పాదకంగా తయారుచేసే కంపెనీల షేర్స్ కి డిమాండ్ వుంటుంది. ఈ పరిశీలనే ఇన్వెస్టర్స్ కి చాలా అవసరం."    
    "ఎక్స్ క్యూజ్మీ మాడమ్" ప్రేక్షకుల్లోంచి ఓ ఇండియన్ డాక్టర్ అడిగాడు. "బాంకు రుణాలపై వడ్డీ పెరిగితే అది మార్కెట్ పై తప్పకుండా ప్రభావం చూపుతుంది?"    
    "ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ మార్కెట్ పై తప్పకుండా ప్రభావం చూపుతుంది. అంతేకాదు. ప్రకృతి సిద్దమైన మార్పులూ మార్కెట్ ని శాసిస్తుంటాయి. ఉదాహరణకి భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలు సరిగ్గా పండక ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దేశంలోని విదేశీ ద్రవ్యపు నిధులు తిరిగి ధరలు అదుపు తప్పి ద్రవ్యోల్భణం పెరుగుతుంది. అలాగే బ్యాంకు రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే ఫైనాన్సు కంపెనీలు అందించే రుణాన్ని అనుసరించి అమ్మకం జరిగే కార్లు, ట్రక్కులు జీపుల ధర పెరుగుతుంది. అంటే వాటి షేర్సు ధర తగ్గుతుంది. అంతే కాదు. ఆటోమోబైల్స్ విడిపరికరాలు తయారుచేసే కంపెనీల, ఇంకా టైర్ల కంపెనీల షేర్ల ధరలు పడిపోతాయి..."    
    భారతదేశపు ఎగ్జిం పాలసీ మొదలుకొని ప్రస్తుతం మార్కెట్ స్థితిగతుల గురించి ప్రతి ప్రశ్నకీ తడబాటు లేకుండా జవాబులు చెప్పింది కృషి.    
    వయసుకి మించిన పరిపక్వత అసాధారణమైన విశ్లేషణతో కృషి అక్కడ సమావేశమైన భారతీయుల్ని ఎంతగా ఆకట్టుకుందీ అంటే ఆమె తమ దేశంలో పుట్టిన ఆడపిల్లయినందుకు మనస్పూర్తిగా అభినందించారంతా..   
    మరో అరగంటకల్లా సెమినార్ ముగిసింది.    
    అంతసేపూ డయాస్ పై ఆమె పక్కనే కూర్చున్న 'న్యూ డీల్ కన్సల్టెన్సీ' అధిపతి స్టీఫెన్ సీగల్ ఫోర్డు కారు వేపు నడుస్తూ అన్నాడు. "ఇట్స్ మార్వెలెస్ మిస్ కృషి సెమినార్ ని అద్భుతంగా జయప్రదం చేశారు."   
    సుమారు ఇరవై అయిదు సంవత్సరాల వయసున్న సీగల్ స్వతహాగా బిలియనీర్ మాత్రమేగాక స్టేట్స్ లో చాలా పేరున్న షేర్ కన్సల్టెంట్. కృషి అతడి దగ్గర జాబ్ లో చేరింది కేవలం రెండు నెలల క్రితం మాత్రమే అయినా అతడ్ని చాలా ఆకట్టుకుంది.   
    ఫోర్డ్ కారు రూజ్ వెల్ట్ ట్రై స్క్వేర్ లో వెళ్తుండగా అన్నాడు పక్కనే కూర్చున్న కృషిని తదేకంగా గమనిస్తూ. "ఇట్స్ రియల్ మిస్ కృషి. మీ విశ్లేషణ, మీ ఆలోచనల్లో క్లారిటీ నన్నే కాదు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అయామ్ ష్యూర్ మీ అండతో నా కన్సల్టెన్సీ ఫర్మ్ మరింత పెరుగుతుంది".    
    "నేను ఎగ్జాగరేట్ చేసి మాట్లాడం లేదు. చాలా మంది అభిప్రాయం విన్నాక అంటున్నాను."   
    ఇది తొలిసారి కాదు. ఇదే అభిపాయాన్ని ఈ మధ్య అతడు చాలాసార్లు వ్యక్తం చేశాడు.    
    అది అతడి వయసుకి సహజమైన పారవశ్యమో లేక ఆమెపై అతడు పెంచుకుంటున్న మక్కువకి తార్కాణమో ఆమె సమక్షంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శింస్తుంటాడు. "భారతదేశంపై ఒకనాడు పెద్ద సదభిప్రాయంలేదు కృషి. కాని మిమ్మల్ని చూశాక మీ దేశంపై ఆరాధన పెరిగింది."    
    "మీ కాంప్లిమెంట్ కి ఆనందిస్తున్నాను మిస్టర్ సీగల్.......కాని వేదాంత పరమైన ఆలోచనల్లో మీ దేశవాసులచేత కూడా అభినందించబడ్డ వివేకానందుడ్ని, అహింసా సిద్దాంత రీత్యా మీ లూథర్ కింగ్ కే ఆదర్శప్రాయుడైన గాంధీని మరిచిపోయి నాతో నా దేశాన్ని కొలవాలని ప్రయత్నిస్తున్నారు."    
    "పేట్రియాటిక్ గా ఆలోచిస్తున్నారనుకుంటాను."    
    "లేదు" నిర్మొహమాటంగా అంది కృషి. "నా దేశం ఓ భగవద్గీతగా ప్రచండ దేశాలే గుర్తించిన తరుణాన ఆ దేశం గురించి తక్కువగా అంచనా వేయటం మీలాంటి మేధావులకి సరికాదంటున్నాను..."  
    "యూ మేడ్ మి షట్ మై మౌత్" నవ్వేశాడు సీగల్. "నేనంటున్నది అది కాదు మిస్ కృషి..... మీరో కోటీశ్వరుడుకి గ్రాండ్ డాటర్ అయ్యుండీ ఇలా మీ కాళ్ళపై మీరు నిలబడడం దేశం కాని దేశంలో ఇలా బ్రతకాలనుకోవటం మీ దేశవాసుల అభిరుచికి, అలవాట్లకి భిన్నంగా అనిపించి అలా మాట్లాడాను."
    "బహుశా మా దేశంలోని మనుషుల సోమరితనం రాజీపడి బ్రతికే అలవాటుని ఉద్దేశించి ఇలా అంటున్నారనుకుంటాను. అయితే నా అభిప్రాయమూ వినండి. ఐక్యూ స్థాయి పరంగా చూస్తే భారతదేశ ప్రజలు మీ దేశం కన్నా ఉన్నత స్థాయి గలవారు. ఇది మీరూ అంగీకరించే సత్యమేగా. కాకపోతే విడిగా మేధావులుగా గుర్తించబడిన నా మనుషులు ఉమ్మడిగా అవకాశవాదులుగా ప్రవర్తిస్తుంటారు. దీనికి కారణాలు కలుషిత రాజకీయాలు, పొంతనలేని కొన్ని సాంఘికమైన సాంప్రదాయాలు కూడా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అక్కడ ప్రబల సెంటిమెంట్స్ మేధావుల ఆలోచనల్ని శాసించి పురోభివృద్దిని కుంటుపరుస్తుంటాయి."    
    విప్పారిత నేత్రాలతో చూస్తూ అన్నాడు "హి మిస్డ్ యు"    
    "ఎవరు" అంది టక్కున.    
    "మీ గ్రాండ్ ఫాదర్.... నిజం కృషి! మీలాంటి ఇంటెలిజెంట్ గాళ్ ని  తను మిస్ చేసుకుని నన్ను అదృష్టవంతుడ్ని చేశారు."        
    అతడు ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నాగాని ఉన్నట్టుండి ఆమె మొహంలో రంగులు మారిపోయాయి.    
    అది పట్టుదలో పలాయన వాదమో తెలీకుండా తాతయ్యకి దూరంగా బ్రతుకుతున్న కృషిని ఇప్పుడు తాతయ్య ఆలోచన ఎంతగా కలవర పరిచిందీ అంటే తల పక్కకు తిప్పి బయటికి చూస్తూ ఉండిపోయింది.    
    ఆ క్షణంలో ఆమెకు తెలీదు...        
    ఏ తాతయ్య గురించి ఆమె ఆలోచిస్తుందో అతడిప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డాడు కొన్ని గంటల క్రితమే.   
                                                                   *      *    *    *    
    భారతదేశంలోని హైద్రాబాదు నగరం.    
    సాయంకాలం అయిదు గంటల సమయాన అపోలో హాస్పిటల్ విఐపి రెస్ట్ రూంలో బడలికగా కూర్చుని వున్నాడు డాక్టర్ మహంతి.    
    అప్పటికే శ్రీ ఉపాధ్యాయకి సర్జరీ జరిగి ముప్పై ఆరుగంటలయ్యింది.    
    అరవై అయిదు సంవత్సరాల వయసున్న శ్రీ ఉపాధ్యాయ తెలుగువాడిగా రాష్ట్రంలోనే గాక పారిశ్రామికవేత్తగా జాతీయస్థాయిలోనూ ప్రముఖుడే...కాబట్టి ఫేక్టరీ ఎమ్ డి ఛాంబర్ ప్రొడక్షన్ మీటింగ్ లో ఉన్నట్టుండి కొలాప్స్ కాగానే అపోలోలో అడ్మిట్ చేయబడ్డాయి. ఒకరూ ఇద్దరూ కాదు నగరంలో ప్రముఖ వైద్య నిపుణులంతా అటెండ్ అయ్యారు. ఇంచుమించు ఉపాధ్యాయ వయసున్న డాక్టర్ మహంతి ఆయన ఫేమిలీ డాక్టరుగా సర్జరీ మొదలైన దగ్గర్నుంచీ హాస్పిటల్లోనే వుండిపోయాడు. నిజానికి డాక్టర్ మహంతి శ్రీ ఉపాధ్యాయ పర్సనల్ డాక్టర్ మాత్రమే కాదు మంచి స్నేహితుడు కూడా.   
    దేశంలోని వైద్య విజ్ఞానాన్నంతా కొనేయగల శ్రీ ఉపాధ్యాయకి బ్రెయిన్ సర్జరీ అవసరమని నిర్ధారించబడ్డాక డాక్టర్ మహంతి ప్రెసిడెంట్ ఆనరరీ సర్జన్ గోపీనాథ్ ని రప్పించాడు. ఆపరేషన్ జయప్రదంగా ముగిసినా ఇప్పటికీ ఏమవుతుందో తెలీని పరిస్థితి. ఇంకా స్పృహలోకి రాని ఉపాధ్యాయ అనుమతితో అవసరం లేనట్టు స్టేట్స్ లో వున్న కృషికి ఫోన్ చేశాడు.    
    కృషి వస్తుందన్న నమ్మకం లేదు.    
    పట్టుదలలో మొండితనంలో ఆ తాతయ్యకి మనవరాలిగా కృషి ఎందుకు దూరమైనా కాని ఇప్పుడు వస్తే బాగున్నని మనస్పూర్తిగా కోరుకున్నాడాయన.   
    డబ్బు వ్యక్తిగత గౌరవాన్ని పెంచడమే గాక అదే డబ్బు వ్యక్తుల అభిమానాన్నే గాయపరుస్తుంది. ఈ ప్రపంచంలో డబ్బు, పరపతి, దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప మరొకటి లేని శ్రీ ఉపాధ్యాయకి తన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు కృషి తప్ప...... ఆ విషయం గుర్తించనట్టు బ్రతకడం ఉపాధ్యాయకి అలవాటుగా మారితే అలాంటి తాతయ్యతో తనకు పనిలేదన్నట్టు కృషి ఆలోచిస్తోంది.    
    రెండు భిన్న ధోరణుల్ని వేరుచేసే చిన్న సరళ రేఖ అది. అసలు ఉపాధ్యాయ వ్యక్తిత్వమే వేరు డాక్టర్ మహంతి రెండు దశాబ్దాల పరిచయంతో ఉపాధ్యాయ అనారోగ్యం దృష్ట్యా బెడ్ మీద వుండడం ఇదే తొలిసారి. ఒక పారిశ్రామికవేత్తగా ఉపాధ్యాయ రోజూ రెండు గంటలకి మించి నిద్రపోడు. ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మార్చుకునే ఉపాధ్యాయ ఎక్కువగా విశ్రాంతి తీసుకునేది విమాన ప్రయాణాల్లోనే.... పరిశ్రమ అన్న పదానికి, అవిశ్రాంత పోరాటం అన్న విశేషణానికి నిజమైన ఉదాహరణ ఆయన.    
    "అంకుల్"    
    ఆలోచనల నుంచి తేరుకున్న డాక్టరు మహంతి తల పైకెత్తి చూశాడు.    
    కృషి నిలబడి వుంది అతడికి అభిముఖంగా.    
    ముందిది కలేమో అనుకున్నాడు.    
    ఫోన్ లేదు- వస్తానన్న సూచనలేదు. కాని ముప్పై ఆరు గంటల్లో కృషి ఇండియా వచ్చింది.    
    ఇది అనూహ్యమైన సన్నివేశమే అయినందుకేమో ఉద్విగ్నంగా పైకిలేచి ఆప్యాయంగా తల నిమిరాడు.    
    "గ్రాండ్ పా ఎలా వున్నారు"
    ముందాయన గొంతు పెగల్లేదు...."ప్రమాదం నుంచి బయటపడ్డారు."
    అనేశాడు కాని ఆయనకీ ఇంకా నమ్మకం లేదు. ఒకవేళ ఉపాధ్యాయ స్పృహలోకి వచ్చి మామూలు మనుషుల మధ్య తిరిగినా అది తాత్కాలికమే అని డాక్టర్ గోపీనాథ్ అన్న మాటలు అతడికింకా గుర్తున్నాయి.
    ఇద్దరూ నిశ్శబ్దంగా ఐసియులోకి వెళ్ళారు.
    ఒక అసాధారణమైనా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని శాసిస్తున్న తాతయ్య-నలభై సంవత్సరాల కాలంలో తన మెదడును వుపయోగించి  ఆ స్థాయిని చేరుకున్న వ్యక్తి- ఇప్పుడు బ్రెయిన్ సర్జరీలో ఈ క్షణంలో అయినా తనొక నిస్సహాయుడ్నని అంగీకరించినట్లు కనిపిస్తున్నాడు.
    డబ్బు కీర్తి ప్రతిష్టలనే సరిహద్దు రేఖల్లో బ్రతకడమే అలవాటైన ఓ వ్యక్తి ఇదిగో ఇక్కడ మరో తెరుచుకున్న కొత్త డైమెన్షన్ కి ఉదాహరణగా కనిపిస్తున్నాడు.
    కృషి భోం చేయలేదు ఇంటికి వెళ్ళలేదు.

Next Page