Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 9


    కమల నవ్వుకుంటూ వయ్యారంగా నడిచి వెళుతూవుంటే "కాకి ముక్కుకు దొండపండు. తినేసేను జాగ్రత్త!" అంటూ అరిచింది విమల.

 

    సునందకు ఆశ్చర్యంతోపాటు వాళ్ళ ప్రవర్తనకు అసహ్యం కూడా కలిగింది. తన గదిలోకి వెళ్ళబోతూ తన కాళ్ళ దగ్గర ఏదో పడటంతో ఆగిపోయింది.

 

    సుజాతా, విమలా ముందకు పరుగుతీసి "పచ్చిమిరపకాయ"ను చూచి ఆగిపోయారు.

 

    "నీకే!" అన్నది సుజాత.

 

    "కాదు. నీకే!" అన్నది విమల.

 

    "సుశీలకేమో?" అన్నది సుజాత.

 

    "కాదు" అంటూ సుశీల సునందకేసి చూసింది అర్ధయుక్తంగా.

 

    సుజాత, విమలకూడా అదోలా నవ్వుతూ సునంద ముఖంలోకి చూశారు సాలోచనగా.

 

    వాళ్ళ చూపులు సునందకు ఏవగింపు కలిగించాయి. వంటిమీద గొంగళి పురుగులు పాకుతున్నట్లు అనిపించింది.

 

    "కొత్త సంకేతం! కొత్తవాళ్ళదే అయివుండాలి."

 

    "అవును! ఆ పిలుపు సునందకే!"

 

    "హాయ్! ఫరవాలేదు. సునంద కూడా గ్రంథంలోకి దిగింది."

 

    "బలే సంకేతంలే? అతనెవరో గట్టివాడిలా వున్నాడు. సునంద స్వభావాన్ని చక్కగా గ్రహించాడు."

 

    "ఇంకా నిల్చున్నావేం? గుడ్ లక్, గో ఎ హెడ్."

 

    "ఎవరో ఆ హీరో?"

 

    "ఆపండి! ఛీ! సిగ్గులేదూ?" గట్టిగా అరచింది సునంద.

 

    సునంద కోపంతో నిలువెల్లా వణికిపోతూ వుంది. పెదవులు అదురుతున్నాయి. ముక్కోళ్ళు ఎర్రబడ్డాయి. మనస్సు జుగుప్సతో చీదర చీదరగా వుంది.

 

    సునంద విసురుగా వార్డెన్ క్వార్టర్స్ వైపుకు నడవసాగింది.

 

    "అరే! ఈ అమ్మమ్మ వార్డెన్ దగ్గిరి కెళుతున్నట్టుంది. మనవాళ్ళను హెచ్చరించాలి" అన్నమాటలు వెళ్ళిపోతున్న సునంద చెవుల్లో పడ్డాయి.

 

    సునంద వార్డెన్ గది తలుపులు దబ దబా బాదింది.

 

    తలుపులు విసురుగా తెరచుకున్నాయి.

 

    చిరాగ్గా తలుపులు తీసిన వార్డెన్ సునందను చూడగానే ప్రసన్నంగా నవ్వింది.

 

    సునంద అంటే వార్డెన్ కు చాలా అభిమానం.

 

    "ఏమిటి సునందా? ఏం జరిగింది? అలా వున్నావేం?" ఆదరణగా అడిగింది వార్డెన్.

 

    సునందకు వెంటనే మాటలు పెగల్లేదు. కోపంతో ఇంకా పెదవులు అదురుతూనే వున్నాయి.

 

    మనస్సు అవమానంతో దహించుకుపోతూ వుంది. ఒక పట్టాన గొంతు పెగల్లేదు.

 

    "చెప్పు సునందా! ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా?" భుజంమీద చెయ్యివేసి సానునయంగా అడిగింది వార్డెన్.

 

    "ఒక్కసారి హాస్టల్ గేటుదగ్గరకు రండి మేడమ్! బాయ్స్ వచ్చి నానా అల్లరీ చేస్తున్నారు" అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు సునందకు.

 

    వార్డెన్ సునంద వెనకే హాస్టల్ వైపుకు నడవసాగింది.

 

    గేటువైపుకు వస్తున్న సునందతో వార్డెన్ ను చూసిన అబ్బాయిలూ, అమ్మాయిలూ గాభరాగా ఎవరిదారిన వారు పారిపోయే ప్రయత్నంలో పడ్డారు.

 

    మగ పిల్లలు తమతమ వాహనాలమీద, స్నేహితురాళ్ళతో సహా పారిపో జూస్తున్నారు. అమ్మాయిలు మాత్రం వాహనాలు దిగి హాస్టల్లోకి పారిపోయే ప్రయత్నంలో పడ్డారు. ఆ గందరగోళంలో కమల చీరకొంగు కారు డోర్ లో ఇరుక్కుంది. సులోచన చీర కుచ్చెళ్లు సైకిల్ చైన్లో చుట్టుకుపోయాయి. లలిత దుపట్టా (పంజాబీ డ్రస్ లో వున్న యువతి) స్కూటర్ చక్రానికి చుట్టుకుపోయింది. విమల పైట స్కూటర్ చక్రంలో నలిగి చిరిగి సగం మాత్రమే వంటిమీద మిగిలిపోయింది.

 

    కొందరు అబ్బాయిలూ, అమ్మాయిలూ కిందపడిపోయారు. అంతా గందరగోళంగా వుంది.

 

    వార్డెన్ గేటు చేరుకొనేటప్పటికే విద్యార్ధులు అందరూ పారిపోయారు. విద్యార్ధినులు మాత్రం అపరాధుల్లా తలలు వంచుకొని నిల్చున్నారు, అస్తవ్యస్తంగా వున్న బట్టల్లో.

 

    "సిగ్గులేదూ ఇంకా రోడ్డుమీదే నిలబడటానికి? పదండి లోపలకు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ హాస్టల్ కు ఇంత చెడ్డపేరు వుంది. మిమ్మల్ని రేపే హాస్టల్ నుంచి వెళ్ళగొట్టిస్తాను. ప్రిన్సిపాల్ కు రిపోర్టు చేస్తాను. అందర్నీ డిస్ మిస్ చేయిస్తాను" వార్డెన్ అరుస్తూ వుంది.

 

    ఆడపిల్లలంతా చిన్నగా తప్పుకున్నారు.

 

    వార్డెన్ ఇంకా ఏదేదో అంటూనే వుంది.

 

    సునంద కోపం చల్లారింది. అలా వెళ్లిపోతున్న విద్యార్ధుల్ని చూస్తూంటే జాలివేసింది, తను తప్పు చేశానేమోనని బాధ కలిగింది.

 

    నిజంగా వార్డెన్ వీళ్ళందరి మీదా రేపు రిపోర్టు ఇస్తుందేమో?

 

    ఇవ్వాల్సిందే! లేకపోతే ఇలాంటి వాళ్ళకు బుద్ధి ఎలా వస్తుంది?

 

    కాని వాళ్ళను వార్నింగ్ తో వదలరేమో? ఒకరిద్దర్నయినా డిస్ మిస్ చేస్తారు. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ధనవంతులైతే ఫర్వాలేదు. కాని తనలాంటి అతిసాధారణ కుటుంబాల పిల్లలైతే ఏం కావాలి? తన నాన్న తనమీద పెట్టుకొన్నట్టే వారి తల్లిదండ్రులు వాళ్ళమీద ఎన్ని ఆశలు పెట్టుకొని, ఎన్ని యిబ్బందులకు గురై వాళ్ళ చదువులకు డబ్బు పంపిస్తున్నారో? సునంద కళ్ళలో తండ్రి ధర్మయ్య కదిలాడు. ధర్మయ్య లాంటి మరికొందరు తండ్రులు మెదిలారు సునంద బుర్రలో.

 

    సునంద నిలువెల్లా చలించిపోయింది.

 

    "ఇక నువ్వెళ్ళు సునందా! వెళ్ళి చదువుకో. వీళ్ళ సంగతేదో నేను రేపు చూస్తాను."

 

    సునంద చివ్వున తలెత్తి వార్డెన్ ముఖంలోకి చూసింది.

 

    "మేడం!" సునంద కంఠం వణికింది.

 

    "ఏమిటి?" అన్నట్టు వార్డెన్ సునంద ముఖంలోకి కుతూహలంగా చూసింది.

 

    "నిజంగా రేపు వాళ్ళమీద రిపోర్ట్ చేస్తారా మేడం?"

 

    "చేస్తాను. ఇక వీళ్ళను భరించడం నావల్ల కాదు. చూసీ చూడనట్టు ఊరుకుంటూ వుంటే, రోజురోజుకూ మితిమీరిపోతున్నారు. ఈ నలుగురైదుగురు వెళ్ళిపోతే హాస్టల్ బాగుపడుతుంది."

 

    "వద్దు మేడం! పాపం? చాలా సిగ్గుపడిపోయారు. చూశారుగా? ఇక జాగ్రత్తగా వుంటారు" అన్నది సునంద ప్రాధేయ పూర్వకంగా.

 

    "అబ్బే! వాళ్ళకు బుద్ధిరాదు. ఆఁ చూడు సునందా! ఆ మగపిల్ల లెవరో నువ్వు చూశావా? వాళ్ళమీద కూడా రిపోర్టు ఇస్తేగాని అందరి జలుబూ వదల్దు" అన్నది వార్డెన్.

 

    "వాళ్ళ జలుబేమోగాని మన జలుబుమాత్రం వదలగొడ్తారు" అనుకున్నది సునంద మనస్సులో.

 

    "వద్దు మేడం! అంతపని చెయ్యకండి. ఈసారికి వాళ్ళను క్షమించండి. నా కోసం క్షమించండి. వాళ్ళలో ఎవరికి కష్టం కలిగినా, ఎవరి భవిష్యత్తు నాశనం అయినా కారణం నేనే అవుతాను" సునంద దిగాలుగా అన్నది.

 

    "నువ్వెందుకు భయపడతావ్! ఈసారి మాత్రం వీళ్ళను నేను వదలదల్చుకోలేదు" ఖచ్చితంగా అన్నది వార్డెన్.

 

    సునంద కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. వార్డెన్ ఏదో మాట్లాడుతూనే వుంది.

 

    "మేడం కొంచెం తాపీగా ఆలోచించండి. మీ రిపోర్టు కారణంగా ఒకరిద్దర్నయినా కాలేజీ నుంచి తొలగిస్తారు. విద్యార్ధి లోకం చూస్తూ ఊరుకుంటుందా? అల్లర్లు జరుగుతాయి. సమ్మెలు ప్రారంభం అవుతాయి. అవి ఎంత దూరంపోతాయో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వూహించలేం! యువరక్తం ఉడుకు రక్తం. ఎంతకైనా తెగిస్తారు. చివరకు అధికారులు తలవంచక తప్పదు. మీ పేరూ? నా పేరూ పేపర్లకు ఎక్కడ తప్పదు. పైగా అందరూ మళ్ళీ మామూలుగా జీవితం సాగిస్తారు. కాని నేను మాత్రం ఇక్కడవుండి చదవలేను. చదవ నివ్వరు. మిమ్మల్ని ఈ ఊళ్ళో బతకనివ్వరు. బాగా ఆలోచించండి మేడం!" అన్నది సునంద.

 

    వార్డెన్ నీరుకారి పోయింది.

 

    "నిజమే సునందా! వాళ్ళంతా పెడ మార్గాలు పడుతున్నారనే ఆందోళన కొద్దీ రిపోర్టు ఇవ్వాలనుకున్నాను. కాని లాభంలేదు. ఈ రోజు విద్యార్ధులు ఏం చేసినా చూసీ చూడనట్టు వెళ్ళిపోవడమే మంచిది" అన్నది వార్డెన్ నీరసంగా.

 

    "థాంక్స్ మేడం!" అన్నది సునంద.

 

    "సునందా! ఇప్పుడైనా నిన్ను తిన్నగా కాలేజీకి రానిస్తారా? ఈపాటికే రేపు నిన్ను ఎలా ఏడ్పించాలో ప్లాన్సు వేస్తూ వుంటారు. వాళ్ళందరికీ నీమీద కోపంగా వుంటుంది, జాగ్రత్తగా వుండు!"

 

    "అలాగే మేడమ్!"

 

    సునంద వార్డెన్ దగ్గర శెలవు తీసుకొని తన గదికి వెళ్ళిపోయింది.

 

    సునందా, లలితా ఒకే గదిలో వుంటున్నారు. సునంద గదిలో అడుగుపెట్టేసరికి లలిత చీర మార్చుకుంటూ వుంది. కుర్చీమీద నజ్జునజ్జుగా చిరిగిపోయిన నైలాన్ దుపట్టా వేసివుంది.

 

    సునందను చూసి లలిత ముఖం తిప్పుకుంది.

 

    "క్షమించు లలితా! నేను వార్డెన్ కు కావాలని రిపోర్టు ఇవ్వలేదు. నువ్వెళ్ళిపోయాక, వాళ్ళు నన్ను...."

 

    "నువ్వేమీ చెప్పక్కర్లేదు. వట్టికుళ్ళు, సినిక్ వి, నీకూ మగపిల్లలతో తిరగాలని వుంటుంది. కాని ధైర్యంలేదు. అందుకే మేమంటే నీకు ఏడుపు" లలిత గబగబా అనేసింది.

 

    సునంద మనస్సు చివుక్కుమన్నది. లలితతో వాదించి లాభం లేదని తెలుసుకొని మంచానికి అడ్డం పడింది. చదివే మూడ్ లేదు. మనస్సంతా చిరాకుగా వుంది. దిగులుగా వుంది. కళ్ళుమూసుకొని ఆలోచిస్తూ పడుకుంది.

 

    వీళ్ళంతా తనను సినిక్ అనుకుంటున్నారా? తను వాళ్ళను చూసి కుళ్ళిపోతుందా? ఏడుస్తుందా?

 Previous Page Next Page