Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 9


    ఒరిగింది. గుర్రుమంటూ పడిపోయింది. నవాబు వేట ముగిసింది. చెమటలు పట్టాయి వారికి. బట్టలు తడిశాయి. వేరే దుస్తులు వేసుకొని తుపాకితో పులి పక్కన నుంచొని ఫోటోలు తీయించుకున్నారు. పులిని తెచ్చారు. పెద్ద విందులు చేశారు. పత్రికల్లో వారి బొమ్మ వచ్చింది. వారు పట్నం చేరారు.

 

    నవాబుగారు వెళ్ళిపోయేప్పుడు తమకు అయిన ఖర్చంతా తాసిల్దారుకు యిచ్చి వెళ్ళారని వదంతి బయలుదేరింది. అయినా అడిగే ధైర్యం ఎవరికీ కలుగలేదు. గొల్ల మల్లన్న మాత్రం ధైర్యం చేసి తాసిల్దారు దగ్గిరకు వెళ్ళాడు. మందలన్నీ అయిపోయినాయనీ, తాను దివాళా తీశాననీ, కొంత కాకుంటే కొంత అయినా యివ్వమని వేడుకున్నాడట; తాసిల్దారు కోపగించలేదట. తెల్లవారివచ్చి తీసికెళ్ళమన్నాట్ట. ఆ రాత్రి అతడు రక్తం కక్కుకొని చచ్చాడట!

 

    ఆ తరువాత ఎన్నడూ తాసిల్దారు అన్నదానికి అడ్డు చెప్పలేదు. 'ఇవ్వను' అనలేదు. అనలేకపోతున్నారు. ఇప్పుడు మాత్రం ఎలా అనగలరు?

 

    మరుసటి రోజు నుంచి బంగళా నిర్మాణపు ప్రయత్నాలు ప్రారంభమయినాయి గిర్దావరును అన్నింటికీ బాధ్యుణ్ణి చేశాడు తాసిల్దారు. అవసరం అవుతే అమీను సహాయం పొందుతున్నాడు. తొలుత కావలసింది రాయి. రాయి కొట్టేవారు వడ్డెర గూడెం కదిలింది. రానివాడు ఒక్క భీముడు. అతడు పీరయ్య కొడుకు. వట్టి సోమరి. పనిచేయడు. తాగుడు ముండలు తప్ప వేరే లోకం లేదతనికి. అతన్ని వదులుకున్నాడు పీరయ్య. తన కొడుకు కాదనుకున్నాడు. అసలు గూడెమే వదులుకున్నది భీమన్నను. కొడుకు ఇలా అయినాడు. కూతురును తాసిల్దార్ పట్టుకుపోయాడు. దుఃఖంతో కుమిలిపోతున్నాడు పీరయ్య. అయినా కులంతో కదిలాడు.

 

    వడ్డెర్లు గిర్దావరు ఇంటికి చేరారు. ఇంటి ముందు కూలబడ్డారు. ఎంతో సేపటికిగాని గిర్దావరు బయట పడలేదు. రావడం రావడమే అన్నాడు "అరె లంజకొడుకుల్లారా! తాసిల్దారు దొర బంగ్ల కడ్తాండు. రాయి కొట్టిపెట్టాలె. నఖ్రాల్చేసిన్రో నల్లులొలె నలిపేస్త. కుక్కిన పేలోలె పడుండిన్రి. రాయి కొట్టుండి. పైసడిగిన్రో చింత చెట్టుకు కట్టి తోళ్ళొలిపిస్త. పని రేపటి నుండి మొదలు పెట్టాలె. ఏమంటరు? గుడిసె కైదు రూపాయలు. రేపు పొద్దుగూకెటాలెకల్ల నాకు చేరాలె. ఇయ్యనోణ్ణి తాసిల్దార్ దొరముందర పెట్త. రాయి కొట్టనంటున్నడంట. ఇగ పానాలుండవనుకో. పీనిగల బొందలకు పోతరు. ఏమంటరు?"

 

    "చేస్తం. నీ కాల్మొక్త. తప్పుతాది. బాంచను. ఊళ్ళ ఉంటాన్నం. దున్నుక బతుకుతున్నాం. గులాపోణ్ణి దొరా! నీ బాంచను, తోళ్ళువలిచి చెప్పులు కుడ్త. ఎంతియ్యమంటె అంతిస్త, గులాపోణ్ణి. పోరిని పట్కపోయిన్రు" పీరయ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. మాట పెకలలేదు. కళ్ళవెంట ధారాపాతంగా నీరు వస్తూంది. "ఒక్కతే బిడ్డ దొరా, దాన్ని పట్క పోయిన్రు. కాల్మొక్త. ఒక్కసారి చూస్త దొర మల్లిని. నా మల్లిని. ఒక్కసారి చూపించు నీ కడుపున పుడ్త" అని గిర్దావర్ కాళ్ళమీద పడ్డాడు. కాళ్ళను కన్నీళ్ళతో తడిపాడు. కాళ్ళ మీద నుంచి తల కదపలేదు. కాళ్ళు విడవలేదు.

 

    గిర్దావర్ కులశేఖరరావు మాత్రం కరగలేదు. అతని ఎదలో కదలే పదార్ధం వున్న జాడ ఎక్కడా కనిపించలేదు. అతని ఆలోచన మరోవైపు పరిగెత్తింది. పీరయ్య దగ్గర కొంత కాజేయవచ్చు. ఈ విషయంలో తాసిల్దారు తన మాట వినడని తెలుసు. అయినా వస్తున్నది ఎందుకు వదులుకోవాలి.

 

    "అరే పీరిగా లే. చూద్దం రేపు. నజ్రానా పట్టుకు రా, చెప్పి చూస్తం" అన్నాడు.

 

    ఆశ అంకురించింది పీరయ్యలో. "దొరా మీరు ధర్మదొరలు, ఇయ్యాలనే తెస్త దొరా? రేపటిదా కెందుకు, మల్లి నా మల్లిని చూడాలె దొరా! కావాల్నంటే, నీ బాంచను, పానాలిస్త" అన్నాడు.

 

    "అట్లనే పోరి. రేపటినుంచి రాయికొట్టాలె. లేకుంటే పానాల్తీస్త" అన్నాడు.

 

    "అట్లనే బాంచను. కొడ్తం. కాల్మొక్త" అని అంతా వెళ్ళిపోయారు.

 

    ఆ సాయంకాలమే ఉన్న తృణమో పణమో తాకట్టుపెట్టి నజ్రానా అందించాడు పీరయ్య గిర్దావర్ కు. గిర్దావర్ గంభీరంగానే ఉన్నాడు. తాసిల్దారుకు చెపుతానన్నాడు. కాని తాసిల్దారుకు అది చాలదన్నాడు. కాళ్ళూ కడుపులూ పట్టుకొని బ్రతిమిలాడాడు పీరయ్య. పుట్టిన పోరడు పోయాడన్నాడు. తన భార్య పీరమ్మ మంచం పట్టిందన్నాడు. వైద్యానికి కూడా డబ్బులేదన్నాడు. ఏదో విధంగా ముట్ట చెపుతా నన్నాడు. మల్లిని ఒక్కసారి చూపించమన్నాడు. మల్లి తల్లి బ్రతికిపోతుందన్నాడు. రక్షించవలసిందన్నాడు. తల గడపకు కొట్టుకున్నాడు. రక్తం చూచి గిర్దావరు కరుగుతాడనుకున్నాడు. అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. అయినా గిర్దావరు నుంచి ఒక సాంత్వన వాక్యం రాలేదు.

 

    "మంది తెలివి మీరిపోతాన్రు. తాసిల్దార్ బంగ్లాకు పోయింది మల్ల వచ్చి నాదిరా? బుద్దులు పుడుతున్నాయి మీకు. ఇగి బాగుపడేటంద్కు రాలేదురా! యాది లేదు గౌండ్ల పుల్లిని దొర తెచ్చుకుంటే దాని మొగుడు గడబిడ చేసేవాణ్ణి "లాల్ ఖాన్"కు కట్టి చావగొట్టి పీన్గెల బొందలెయ్యలె. సర్కారంటే భయం లేకుండా పోతోంది. ఇంత ధైర్యం చేస్తావుర మల్లిని చూస్తనని వస్తావు?"

 

    పీరయ్య బిక్కుచచ్చిపోయాడు. ఆశ అంతరించింది. రోషం రావలసింది. క్రోధం పొంగాల్సింది కాని, దుఃఖం వచ్చింది. "దొరా నీ కాల్మొక్త, ఎట్లనన్న చెయ్యి. ఒక్కసారి చూస్త. బంగ్లల్నే ఉంచమను బయటకెల్లి చూసొస్త. ముసల్ది చూస్తది. గులాపోణ్ణి, గుండె పగిలింది దొరా బ్రతికేటట్లు లేదు. బాంచను." అని ఎదలోని రక్తంతో తడిసి బయటపడిన పలుకులు, దుఃఖపు మాటలు, బాధల బంధాలు వాటితోనే పీరయ్య ఊపిరి బయట పడింది.

 

    "సరే చూస్తంలే మల్లరా" గిర్దావరు అన్నాడు. అవి శూలాలు అయినా వాటిలో ఏదో ఆశను చూచాడు పీరయ్య. అతడు గిర్దావరు కాళ్ళు పట్టుకున్నాడు. "ఎట్లనన్న చూడురి" అని వెళ్ళిపోయాడు.

 

    ఆ తరువాత చాలా సార్లు వచ్చాడు పీరయ్య.

 

    గిర్దావరుకు తీరుబాటు లేకుండా ఉంది. ఇటుక చేసే వాళ్ళతో, సున్నం కాల్చేవాళ్ళతో, బండ్లవాళ్ళతో, కూలీలతో, తాపీ పనివాళ్ళతో, వెట్టి చేయించడానికి ఒప్పిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు. తన మామూళ్ళు వసూలు చేసుకుంటున్నాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. తాసిల్దారు బంగళా ఎప్పటిలో కాని తన బొక్కసం నిండుతూంది. వెట్టిచేయని వాళ్ళ దగ్గర ఎక్కువా, చేసేవాళ్ళదగ్గర తక్కువా, మొత్తానికి తన పనే బాగుందనుకున్నాడు. అధికారం అమీనుకంటే తనదే ఎక్కువ నడుస్తూంది. మురిసిపోయాడు మీసం మెలేశాడు.

 

    గిర్దావరు కులశేఖరరరావుగారు ఠీవిగా, కొత్తగా చేతికి వచ్చిన కర్రతో తాసిల్దారు ఇంటివైపు బయలుదేరాడు. దారిలో చాలామంది వంగి దండాలు పెట్టారు. వారిని చీత్కారంగా చూచాడు గిర్దావరు. తాసిల్దారు బంగళా చేరేవరకు ముగ్గులు పోసిన చోట పునాదులు తవ్వుతున్నారు. దాని పర్యవేక్షణ చేశారు. అక్కడ్నుంచి బయలుదేరితే వడ్డెర్లు బండ్లతో రాయి తెచ్చివేస్తున్నారు. ఏదో నెపంతో వారిని బూతులు తిట్టాడు. ఇంతలో పీరయ్య కనిపించాడు దూరంగా. సగం అయినాడు మనిషి. ఎముకలే మిగిలాయి. ఎక్కడో ఏకోశానో జాలి కలిగినట్లయింది ఇంతలో ఎవడో అప్పులవాడు వెంటపడ్డట్టనిపించింది. వెంటనే తాసిల్దారు దర్వాజాలోకి దూరాడు. తాసిల్దార్ కనిపించాడు, తీరిగ్గా కూర్చున్నాడు. హుక్కా పీలుస్తున్నాడు. అతన్ని చూసి గిర్దావరు గుండె 'ధడల్లు'మన్నది. తాను ఈ రోజు మంచి దుస్తుల్లో వున్నాడు. చేతిలో కర్రవుంది. ముఖంలో ఏదో ఠీవి ఉంది. తసిల్దారు వీటిని సహించడు. ఈ విషయం తనకు తెలుసు. అందుకే గుండెదడ పుట్టింది. సవినయంగా మూడుసార్లు సలాం చేశాడు.

 

    "ఆదాబ్ గిర్దావర్ సాబ్! ఏమో శాన జోరుగున్నవు" అని మనిషిని ఎగాదిగా చూశాడు తాసిల్దారు.

 

    "ఏమ్ లేదు సర్కార్. మంది మాటింటలేరు. అందుకే కర్ర పట్టుకున్న"

 

    "అయితే, సర్కార్ చలాయిస్తున్న వన్నమాట. తాసిల్దారు వైతవా? తాలుక్దారువైతవా?"

 

    ఆ మాటలకు గిర్దావరుకు చిరుకోపం వచ్చిన మాట నిజమే. మనసులో తురక తాసిల్దారును గురించి మసిలిపోయిన మాట నిజమే. కాని అదేదీ వ్యక్తపరచనివ్వకుండా "హుజూర్! మేమేం సర్కార్ చెలాయిస్తం? మీ కింద పడుంటెటోడ్లం. సర్కార్! వడ్డెరగాడ్ది కొడుకులు రాయి తెస్తాన్రు. కూలోండ్లు పునాదుల్తవ్వుతాన్రు. ఇటిక చేసెటోండ్లకు చెప్పినపని సురు చేసిన్రు. ఇంకేం హుకుమ్ సర్కార్! మాదేంది హుకుమ్ తామీల్ చేసేటోడ్లం!1" అన్నాడు గిర్దావరు.

 

    "గిర్దావర్ సాబ్ కోయగూడాలకు పోవాలెగద! కట్టె కొట్టించొద్దు! బంగ్లకు పట్టె కట్టంత కొట్టాలని చెప్పు. దున్నుకుంటలేరా సర్కార్ భూములు. వాండ్లకు భీ జర మస్తెక్కినట్లున్నది. వస్తలేవు మామూళ్ళు. కాబడ్తె అమీన్ను తీస్కపో. ఈడ ఏమి చేస్తాండు? దిక్కులు చూస్తాండు. ఏమన్న చోరి ముకద్దములు2న్నాయా? ఖతళ్ళు3 అయితాన్నయా?"
_______________________________________________
1.ఆజ్ఞ పాలించేవాళ్ళం. 2.దొంగతనపు కేసులు. 3.హత్యలు.

 Previous Page Next Page