కులశేఖరరావుగారికి ప్రత్యేకంగా వివరించి చెపుతున్నాడు తాసిల్దారు. కులశేఖరరావు ఆ జాగీరుకు గిర్దావరు - అంటే రెవెన్యూ ఇన్ స్పెక్టర్. తాసిల్దారు క్రిందివాడు. అతనికి అంతరంగికుడు. తాసిల్దారుకు చదివి వినిపించేది, అతడు వ్రాయమన్నట్లు రాసేది అతడే. అతడు బ్రాహ్మడు. అందుకే అతనికి వివరిస్తున్నాడు తాసిల్దార్. అతడు ఒప్పుకుంటే ఇతరులు కాదనడానికి వీలుండదు. కాదనడానికి గిర్దావరుకు గుండెలుండవు. అదీ తాసిల్దారు ఎత్తుగడ.
"చూచినవా నఖ్వా. ఇవి కమానులు. వాటికింద ఉన్నవి దేవళ్ళ ఖంభాలు."
కులశేఖరరావుగారి మనస్సు కలక్కుమన్నది. దేవాలయాల్లో పూజలు లేవు. జీర్ణమై ఉన్నాయి. నిజమే కాని వాటి స్తంభాలు విరక్కొట్టి తెచ్చి తురకవాని ఇంటికి పెట్టుకోవడం! అనేక దేవాలయాలు అప్పటికే కూలిపోయాయి. గోపాలస్వామి దేవాలయం బాపతు స్తంభాలు, విగ్రహాలు అప్పటికే ఊరినిండా, ఊరి బయటా పడి ఉన్నాయి. వాటిమీద జనం కూర్చుంటారు. ఇంకేవేవో చేస్తున్నారు. ఇప్పుడు దేవాలయాలకు ఈ గతి పట్టింది. అవీ ప్రతాపరుద్ర చక్రవర్తి నిర్మించినవి! ఇలాంటివే ఇంకేవేవో ఆలోచనలు వచ్చాయి. అయినా అణచి పెట్టుకున్నాడు గిర్దావరు.
"పాడుపడ్డ దేవుళ్ళు ఉండి మాత్రం ఏం ఫాయిదా! అందుకనే ఈ ఆలోచన చేసిన, ఏమంటవ్?" అడిగాడు తాసిల్దారు గిర్దావరును.
గిర్దావరుకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. తికమకపడ్డాడు. జనం యావత్తూ అతని వైపే చూడసాగారు. కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకోసాగింది అతని మనస్సు. ఒక వైపు ఉద్యోగము, తన జీవితం, అధికారం, ఒక వైపు మతం, తన విశ్వాసం - తన దేవుళ్ళు, ఏం చెయ్యాలి! ఏది వదులుకోవాలి? మతం మైనపు బొమ్మలాంటిది. అది కరుగుతుంది. మళ్ళీ గడ్డ కడుతుంది. ఆ బొమ్మ కాకుంటే మరో బొమ్మ తయారవుతుంది. ఉద్యోగం ప్రాణం లాంటిది. అది పోతే మళ్ళీ రాదు. కాక ఈ అధికారపు అండన తానెన్నో కొండలు కూల్చాడు. తన కొంప నిలపెట్టుకున్నాడు. అది పోతే తనను నిలువునా నరుకుతారు జనం. కాకులు గద్దలవలె పొడుచుకు తింటారు. తన అధికారం తాసిల్దారు అండన మాత్రామే సాగగలదు. అందుకే అతనికి తాను అండగా నిలవాలి. బాసట కావాలి అనుకున్నాడు. అన్నాడు.
"సర్కార్! మీరు శాన మంచిగ ఆలోచించిన్రు. దేవుడుంటేనే గుడి. దేవుడు లేనిది గుడికాదు. పాడుకొంప. పాడుకొంపను కూల్చటం తప్పుకాదు సర్కార్! అదికాక మీరు స్తంభాలను బంగళాకు చేరుస్తున్నరు. అందువల్ల హిందూ ముస్లిములు సర్కారుకు రెండు కళ్ళు అన్నట్టు అయితది. ఇందులో ఏతరాజ్1 ఎవరికి లేదు సర్కార్" అని తలవంచుకున్నాడు.
__________________________________________________________
1.అభ్యంతరం
తసిల్దారు ఉరిమాడు.
"ఇగో మజహబీ2 మాటలు మా దగ్గర తేవద్దు. హిందూలు ముసల్మానులు ఒక్కటెట్లయితరు. తాసిల్దార్ ముసల్మాన్, జాగీర్దార్ సాబ్ ముసల్మాన్. మన హుజూర్ ముసల్మాన్. సర్కార్ ముసల్మాన్లది. ప్రజలు హిందూలు. అట్లను ఒప్పుకుంట. ఏమంటవ్?"
ఏ మంటాడు గిర్దావరు? అనాల్సిందే అన్నాడు.
"అంతే సర్కార్ అసల్ సిసల్ మాటచెప్పిండ్రు. హం గులాం. ఆప్ సర్కార్. అందుకే మీరు స్తంభాలు పెట్టుకోవచ్చునన్న సర్కార్. మా ఏతరాజ్ ఏంది. ఎంత?"
చాలా గొప్పమాటన్నట్లు జనంవైపు చూచాడు. వారూ అందుకు సంతోషించినట్లే కనిపించారు.
"సరే. ఖంబాలుఖ్డయించి* తెస్తం. కాదన్నోడు లేడు కద! బంగ్ల కట్టాల్నంటే బంయాగాండ్ల మద్దతు కావాలె. ఇగ చెప్పున్రి ఎంతెంతిస్తరో! దోచుక తింటలేరా జనాన్ని?" సాహుకార్లపైన విసురు విసరాడు తాసిల్దారు. తన పని అయిపోయిందని తెలుసుకున్న గిర్దావరు బయటికి వచ్చి సిగరెట్టు కాల్చి గట్టిగా దమ్ములాగి లోలోన తాసిల్దారును తిట్టుకున్నాడు.
సాహుకార్లు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. అంతా వెంకయ్యనే చెప్పవలసిందని ప్రోత్సహించారు. వెంకయ్య నీళ్ళు నమిలాడు. వాస్తవంగా తాసిల్దారు లేకుంటే తాను బ్రతకలేడు. అప్పులు పెట్టాలన్నా అసూలు చేసుకోవాలన్నా అతడే నాథుడు. అతణ్ణి కాదంటే బాకీలన్నీ ఎక్కొట్టించవచ్చు. కాదనే వాడెవడు? ఆలోచించే అన్నాడు వెంకయ్య.
'హుజూర్! బండ్లకయ్యే కర్చేమిటి! వడ్డెరోళ్ళు రాయి ఎట్టికి కొట్టిరి. ఇటిక చేసేటోడు ఎట్టికి చేసె. కోయోండ్లు కల్పకొట్టి తెచ్చిరి. సుతారోండ్లు ఎట్టికి పని చేసిరి. ఇక ఎటుపడి పట్నంకెల్లి వచ్చినోండ్ల కర్చు కోమటోండ్ల నెత్తినేసుకుంటం. కాలం మారింది సర్కార్. బాకీలు వసూలు అయితలేవు. జర బెదిరించాలె." వెంకయ్య తెలివిని సాహుకార్లు మెచ్చుకున్నారు. కాని తాసిల్దారు మరో ఉచ్చు వేశాడు.
"ఎట్టి పోంగ ఎంత కర్చయితే అంత కోమటోండ్లు పెట్టుకోవాలె."
"తప్పుతాదుండి" అన్నారంతా ముక్తకంఠంగా.
అంతటితో ఆ తతంగం ముగిసింది.
ఇండ్లకు వెళ్ళేటప్పుడు అంతా తిట్టుకున్నారు తాసిల్దారును మనసుల్లో. గిర్దావరును సయితం తిట్టారు కొంత బయటికి. గుళ్ళు కూల్చడంవల్ల ఊరికి ఏమన్నా వస్తుందేమోనని భయపడ్డారు. కాదంటే తాసిల్దారు మంత్రాల భయం. రక్తం కక్కుకు చావల్సిందేనని నమ్మకం.
ఒకసారి జాగీర్దారు వేటకు వస్తానని వార్త పంపాడు. రావడం అంటే ఒక్కడు వస్తాడా? ఒక కుటుంబం వస్తుందా? ఒక రైలుకు రైలు దిగుతుంది. వంట వాళ్ళు, బాజాలవాళ్ళు, మంగళ్ళు, చాకళ్ళు, మిత్రులు, బంధువులు ఊరంతా వారితో నిండిపోతుంది. ఆ బలగాన్ని మేపాలి. మరి తాసిల్దారు ఎందుకు మేపుతాడు? నవాబ్ గారి వేట సుంకం వసూలు చేయమన్నాడు అధికారం యిచ్చాడు. గిర్దావరును పంపాడు పల్లెకు, కోయగూడాలకు, వెంట అమీనును యిచ్చి పంపాడు. నలుగురు పోలీసులు లొట్ట తుపాకులతో కదిలారు. సుంకం వసూలు చేశారు బోలెడు. ఇవ్వలేని వారికి బండ లెత్తారు. కట్టుగొయ్యలకు కట్టారు. పశువులు పట్టారు. జనం కన్నీరు కార్చారు. రక్తం ఒడిపారు. సుంకంలో కొంత గిర్దావరు సొంతం. అమీను కాజేసింది కాక తాసిల్దారుకు చేరిందే బోలెడు.
___________________________________________________
2.మతపు మాటలు. *స్తంభాలు ఊరుపెరికి
సుంకం సంగతి అలా వుండగా మళ్ళీ వెట్టి, జాగీర్దారు పటాలం దిగకముందే ఏర్పాట్లు జరిగాయి. గౌండ్లు తాటాకు కొట్టారు. కోయలు వాసాలు కొట్టి తెచ్చారు. బండ్లు ఎట్టికి కట్టారు రైతులు. వ్యాపారస్తులు బిర్యానీకి, పలావుకు అయిన సామాగ్రి ఉచితంగా యివ్వాలి. గొల్లవారు గొర్రెలు ఇవ్వాలి. మంగళ్ళు మసాలాలూ నూరాలి. చాకళ్ళు మేనాలు మోయాలి. డేగిచాలు తోమాలి. ఊరంతా వెట్టి చేయాలి - అధికార్లు తప్ప. అధికారులకు అది పండుగ. వారికి విందులు, తాగుడు, ఆటలు, పాటలు అన్నీ పట్నపు తరహాలో.
రసాలు బాగైనాయి. పందిళ్ళు వేయబడ్డాయి. జాగీర్దారు వారి స్పెషల్ దిగింది. అధికారులు వారికి స్వాగతం పలికారు. దండు దిగింది. దండిగా విందులు జరిగాయి. మంచినీరు కూడా జాగీర్దారువారికి పట్నం నుంచి రావాలి! నైజాం నవాబు లండన్ వెళితే నీరు హైదరాబాదు నుండి వెళ్ళిందట! ఊరంతా కటాన కదిలింది. గొల్లవారి గొర్రెలు తెగాయి. వ్యాపారస్తుల సామాగ్రి ఉడికింది. పట్నం నుంచి వచ్చిన సారాయి ప్రవహించింది. గానా బజానా ముషాయిరాలతో గ్రామం మారుమ్రోగింది.
జాగీర్దారుగారు వేటకు బయలుదేరారు. తెరలు కట్టిన మేనాల్లో బేగమ్ లు బయలుదేరారు. బండ్లు, పల్లకీలు, డప్పులు, బాజాలు అడవిలో పట్నం వెలిసింది. కోయలు మంచెలు కట్టారు. జాగీర్దారుగారు పులిని కొడ్తారు. ఆ వేడ్క చూడ్డానికి పట్నం నుండి జనం వచ్చారు. నవాబుగారు తెచ్చారు తమ తమ ప్రతాపం చూపడానికి.
నవాబు బేగం సహితంగా మంచె నెక్కారు. అది బాగా ఎత్తున కట్టబడింది. పులికి అందకుండా కట్టబడింది. కోయలు గుంపులు, గుంపులుగా వర్తులాకాలంగా జేరారు. డప్పులు కొట్టి, కొమ్ములు, బూరలు ఊది రొప్పుతున్నారు. పులి గాండ్రుమంటూంది. కోపంతో పంజా కొడ్తూంది. కొట్టినప్పుడల్లా ఒక కోయ ఒరుగుతున్నాడు. అతడు పులిని ఒక్క వ్రేటుకు కొట్టగలడు అయినా కొట్టరాదు. దాన్ని జాగీర్దారు కొట్టాలి.
మంచె మీద వున్న బేగం పరిహాసాలు ఆడారు. నవాబుగారి సూటినే శంకించారు. వారు పులిని కొట్టలేరన్నది. నవాబుగారికి రోషం హెచ్చింది. దేన్ని కొట్టమన్నారో చెప్పమన్నారు. వేలు పెట్టి చూపింది బేగం. అతడొక కోయ యువకుడు, రొప్పుతున్నాడు. గురిపెట్టారు నవాబుగారు. తుపాకి పేలింది. ఆ యువకుని తలలోంచి దూసుకుపోయింది. బేగం నవాబును కౌగిలించుకుంది. అక్కడ చేరిన వారంతా నవాబును మెచ్చుకున్నారు. చప్పట్లు కొట్టారు. కవులు పద్యాలు చెప్పేశారు. రక్తం మడుగులోపడి కొట్టుకుంటున్నవాడు ఏ కవికీ కనిపించలేదు. రొప్పటం సాగుతూనే వుంది. పులి రానే వచ్చింది. మంచెవైపు అమాంతం ఎగిరింది. నవాబు గారి తుపాకీ పేలింది. గురి తప్పింది. పులితొడకు తాకింది. పులి క్రోధంతో పొంగింది. కనిపించిన వాణ్ణలా కొట్టింది. కోయలు ఈటెలతో పొడిచారు. తుపాకులతో కొట్టారు. పులి కూలింది.