Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 10


    "అట్లనే సర్కార్ అమీన్ సాబ్ ను తీస్కపోత. ముందర మస్కూరోణ్ణి పంపుత. అటెన్క పోత..." అని ఏదో చెప్పబోయి ఆగిపోయినట్లు ముఖం పెట్టాడు గిర్దావరు.

 

    గ్రహించాడు తాసిల్దారు. అయినా అడగలేడు. "అచ్చా! అట్లానే పో. నెమలి మాంసం తినక శాన్నాళ్ళయింది. నెమళ్ళు ఏయించి పట్కరా. ఒక మనుబోతును ఎయ్యమను గాడ్దికొడుకులను, జనానా అంత తింటది." అన్నాడు.

 

    "అట్లనే సర్కార్ గాని ఒక్క అరజ్..."

 

    "చెప్పు"

 

    "వడ్డెర పీరిగాడు కుమిలి కుమిలి..."

 

    "మూ బంద్ కరో, ఇంటి సంగతులు నీ కెందుకు? ఎన్నడనున్నదా? జనాన్లకు వచ్చిన ఆడది మళ్ళ పోయినాది? ఇంకాడి మల్లి అది ఖదీజా అయింది? మళ్ళ ఆ సంగతి ఎత్తొద్దు. ఇగ నడువ్, వడ్డెరలం...కొడుకులు రాయి సరిగ్గ తెస్తాన్రో లేదో చూడు."

 

    "అచ్చాసర్కార్" అని సలామ్ చేసి బయటికి వచ్చాడు గిర్దావరు మనసులో మసులుకుంటూ. రాజ్యం తురకలది కాకుంటే తానే తాసిల్దారు కావలసినవాడు అనుకున్నాడు. సిగరెట్టు వెలిగించి గట్టిగ ఊదాడు. చింత చెట్టుకింద నుంచున్న తలారి శివడు కనిపించాడు. అతడు గడ్డువ కింద కర్ర పెట్టుకోని ఊగుతున్నాడు.   

 

    "అరె భంచత్ ఊగుతున్నా వేందిర? తాగుడు పోయించిండ ఎవడన్న ఇంత పొద్గాల?"

 

    కునుకుపాట్లు పడుతున్నవాడు తెప్పరిల్లి లేచి సలామ్ చేసి "తాగుడాడిది. బాంచను. పొయిల పిల్లి లేస్తలేదు. కాల్మొక్త చెప్పండి ఏమి హుకుమో గులాపోణ్ణి" అడిగాడు తలారి శివడు.

 

    "సర్కార్ కొలువుండి చస్తున్న వేమిర? కోయగూడెం పోయిరావలె. గిర్దావర్ దొర వస్తాండని చెప్పు. సున్వాయి (సెటల్ మెంట్)కి. ఇంతజాములు జోర్ జోర్ గ చేయించాలె ఎరికెనా? కోయగాడ్ది కొడుకులు కూడా తెల్వి మీరుతుంన్రు. ఎప్పుడు పోతవ్?"  

 

    "పొయ్యెడ్ది నా చేతులున్నాది, బాంచెను. దొరలు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోత. కాల్మొక్త. ఆడది నీళ్ళాటకున్నది. నాలుగొద్దులయి నెన్క పొమ్మంటె బాగుంటది. గులాపోణ్ణి."

 

    "అచ్చా అట్లనే చావుగని ఇంతెజాములు బాగ చేయించు. ఇగ చూడు అమీను సాబ్ కూడా వస్తాండని చెప్పు. తుపాకి చూస్తెగని మాటినరు లం...కొడుకులు. దొర బంగ్లకడ్తాండు, కట్టె కొట్టాల్నని చెప్పు, ఏమంటున్న?"

 

    "ఇంటున్న బాంచెను. గట్లనె చెప్పుత, పట్కరమ్మంటే గూడెం గూడెమే పీక్కొస్త గులాపోణ్ణి."

 

    "చెప్పినకాడికి చెయ్యిర గాడ్ది కొడక, గూడెం పీక్కొస్తుడట గూడెం కట్టెవడు కొడ్తడనుకున్నడో?"

 

    "అట్లనే బాంచను"

 

    "పోర హరామ్జాదే ఇంకెందుకో నిలబడ్డవు?" ఉరిమాడు గిర్దావరు.

 

    తలారి శివుడు కర్ర అందుకొని పరిగెత్తాడు.

 

    ఆ రాత్రి గిర్దావరు ఇంటికి మళ్ళీ వెళ్ళాడు పీరయ్య. తాసిల్దారు నజ్రానా చాలదన్నాడని చెప్పాడు గిర్దావరు.

 

    "ఉన్నయన్ని వలిచిస్తిని బాంచను. ఇంక యాడనుంచి తెస్తును. భూమి సుతకుదు వ పెట్టి తెచ్చిస్త, కాల్మొక్త, మల్లిని చూపిచ్చుండి." అని మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు.

 

    "అచ్చా! తే" అన్నాడు గిర్దావరు.

 

    పీరయ్య వెళ్ళిపోయాడు.


                                                               *  *  *  *


    వెంకయ్య ఆ జాగీరుకు పెద్ద సాహుకారు. అతనికీ బొర్ర ఉంది కాని తాసీల్దారంత కాదు. అతడు చొక్కా తొడగడు. నీరుకావి పంచె కట్టుకుంటాడు. అదీ మోకాళ్ళకంటె కాస్త కిందికి మాత్రమే. చొక్కా వేసుకోడు. భుజాన చిన్న పంచె వేసుకుంటాడు. అందరి గింజలూ అతని గరిసె నిండుతాయి. అందరి కుండలూ అతని గింజలతోనే ఉడుకుతాయి. అతడు తాసిల్దారుకే కాదు నవాబుకు కూడా అప్పులు పెడతాడు. ఇతని చీటికి కరెన్సీ నోటంత విలువ. అతని ఇంటి ముందు ఎప్పుడూ జనం పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఎవరికీ లేదనడు ఎవరికీ అడిగినంత ఇవ్వడు.

 

    వెంకయ్య కూతురు రుక్మిణి ఏదో నోము నోచుకుంటూంది. వాద్యం కావాలని మంగలి రావఁడిని పిలిపించాడు సాహుకారు. తాసిల్దారు మాలీసు చేయాల్సిన సమయమూ సాహుకారు ఇంట్లో బాజా వాయించాల్సిన సమయమూ ఒకటే అయినాయి. అయినా మాలీసు ముగించి సాహుకారు ఇంటికే వస్తున్నాడు. తోవలో అమీను పట్టుకున్నాడు. తన భార్యకు గడ్డ తగ్గలేదనీ, కట్టు కట్టాలనీ పట్టుకెళ్ళాడు. కట్టు కట్టి వచ్చేవరకు నోము పూర్తి అయింది. సాహుకారు గొంతు చించుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన బాకీ కక్కి కదలమన్నాడు. బాకీ ఎక్కడిదో అర్థం కాలేదు రావఁడికి.

 

    రావఁడి తండ్రి లక్ష్మయ్యకు నూరు రూపాయలు అప్పిచ్చాడు వెంకయ్య. లక్ష్మయ్య అడుగలేదు. వెంకయ్యే యిచ్చాడు. అందుకు వడ్డీ కింద ఆ యింటికి మంగలిపని, వైద్యము, బాజా వాయించడము ఉచితంగా చేయాలి. అలాగే చేస్తూ వచ్చాడు లక్ష్మయ్య. లక్ష్మయ్య పోయాడు రావఁడూ చేస్తున్నాడు. రావఁడు ఆలస్యంగా వచ్చినందుకు అక్కసు తీర్చుకోడానికి అడ్డం వేసుకున్నాడు సాహుకారు.

 

    "బాకీ యాడిదుండి, కాల్మొక్తా అయ్య తీసుకునే. అయ్యాళనే తీర్చె బాంచెను. ఇన్నేండ్ల నుంచి ఎట్టి చేస్తిమి, ఇంకేం బాకి గులాపోణ్ణి ఇక పైకమిస్తే పని చేసెడిది. లేకుంటే లేదు కాల్మొక్తా" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు రావఁడు.

 

    చెంప చెళ్ళుమన్నట్టయింది సాహుకారుకు. లోకం తల్లకిందులైనట్లు అయింది. తేళ్ళు, జెర్లు పాకినట్టు అయింది. ఏంచేయాలో తోచలేదు. మంగళ్ళు తెగబడ్డారు. వాళ్ళను లొంగతీయాలి. ఎలా? ఏదీ మార్గం? ఎవరిని పట్టుకోవాలి? ఎలా సాధించాలి? ఈ ఆలోచనలతో నిద్రపట్టలేదు. కాతా పుస్తకాలన్నీ తీశాడు. ఇచ్చిన వందను వేయి చేశాడు. రావఁడికి భూమి ఉండడమే పొగరుకి కారణం అనుకున్నాడు. ఈ బాకీ క్రింద ఆ భూమి కాజేయాలనుకున్నాడు. అందుకు ఎవరిని ఆశ్రయించాలి? తాసిల్దారు తనకు బాకీ వున్నా, నగదు నజ్రానా చెల్లించంది ఒప్పుకోడు. గిర్దావరు ఈ మధ్య చాలా హెచ్చిపోయాడు. మిగిలింది అమీను. అతనిని అంతవానివి, ఇంతవానివి అంటే చాలు. తన అధికారం సాగుతున్నట్లు అనిపిస్తేచాలు పొంగి పోతాడు. డబ్బు అట్టే యివ్వాల్సిన అవసరంలేదు. కాతాలో జమకట్టుకుంటే సరిపోతుంది. అది కూడా అడగాడేమో బహుశః కొత్తగా వచ్చిన అధికారం నరాల మీద పుండులాంటిది. ఊరుకోనివ్వదు. ఆలోచన మంచిదే ననుకున్నాడు. అమీనునే ఆశ్రయించాలనుకున్నాడు. అప్పుడుగాని నిద్రరాలేదు.

 

    తెల్లవారి అమీను దగ్గరికి వెళ్ళాడు వెంకయ్య, వంగి సలాం చేశాడు. అంతకే పొంగిపోయాడు అమీను. మంగళ్ళకు మదం వచ్చిందన్నాడు. వారిని వంగదీయడం తాసిల్దారుకు సైతం చాతకాదనీ, అమీనుకే చాతనౌననీ పొగిడాడు వెంకయ్య. ఆఖరికి భూమి తన పేర రాయించమన్నాడు. డబ్బు ఆశ చూపించాడు.

 

    మంగలి రావఁడి మీద కారాలు మిరియాలు నూరాడు అమీను. అతణ్ణి పట్టుకొని రావడానికి జవాన్ను పంపించాడు. వచ్చిన మంగలి రావఁణ్ణి చూచి, పళ్ళు పటపట కొరికాడు అమీను.

 

    "క్యాబే. బాకీ ఎందు కియ్యవ్?" కేక పెట్టాడు అమీను.

 

    "బాకీ యాడ్డిదొరా నీ కాల్మొక్త..." ఇంకా మాట పూర్తికాకుండానే మీద పడ్డాడు అమీను.

 

    "జవాబ్బీ చెప్పుతవ్ బే. కోమటోని సొమ్ము పున్నాని కొచ్చిందనుకున్నావ్? భూమి రాసియ్యి బాకీ కింద" అని బాదసాగాడు.

 

    "నీ కాల్మొక్త చెప్పేడ్ది యినుండి...."  

 

    "ఏది బే చెప్పేడ్ది? కుచ్ నై జాన్తా. కాయిదం రాసియ్యి" అని బాదసాగాడు.

 

    "బాకీ తీసుకోలేదండీ అంటాంటె బాదుత రేముండి? చంపుండి. చీరున్రి భూమి వదులుకోను బాంచను. అది పోరల నోటికాడి ముద్ద కాల్మొక్త" అన్నాడు దెబ్బలు తింటూనే.

 

    అమీను మండిపోయాడు. తనకు కాబట్టి ఇలా జవాబు చెపుతున్నాడనీ తాసిల్దారుకయితే ఇప్పటికే లొంగిపోయేవాడనీ అనుకున్నాడు. వెంకయ్యకు తన ప్రతిభ చూపించాలనుకున్నాడు. చేతిలో కర్ర మూలకు పారేసి జవాన్లను పిలిచాడు. "యాళ్ళాడ కట్టుండ్రి లం...కొడుకును. తడాఖా చూపిస్త. మస్తీ దిగాలె మంగలి గాడ్దికొడుకుల్ది" అని కేకవేశాడు.

 

    వెంకయ్య లేచి నుంచున్నాడు. గమనించాడు అమీను. "నువ్వుపో సావుకార్ వీణ్ణి వంగదీసి నీ కాడికి పంపుత" అన్నాడు అమీను.

 

    సాహుకారు జారుకున్నాడు.

 

    నలుగురు జవాన్లు కలసి దూలానికి తలక్రిందులుగా వేలాడతీశారు రావఁడిని. చింతబరిగెలు అందుకొని రావఁడిని బాదసాగాడు. అమీను. రావఁడు లబోదిబోమని మొత్తుకుంటున్నాడు. వళ్ళంతా దద్దులు వస్తున్నాయి. పది చింత బరిగెలు విరిచి అలసిపోయి నుంచున్నాడు అమీను. వళ్ళు మంటలకు మొత్తుకుంటున్నాడు రావఁడు.

 

    "ఏం బే భూమి రాసిస్తావా?"

 

    "పోరలేం తింటరు దొరా. నీ బాంచను. ఇడిచి పెట్టుండి నీ కాల్మొక్త" అని ఏడ్చాడు రావఁడు.

 Previous Page Next Page