ఆశ్రిత తలపైకెత్తి "అదే.... ఆ విషయమే తలచుకుంటేనే సిగ్గేస్తోంది. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలో తెలీలేదు మొదటిసారిగా.... భయం వేసింది. మీరు చెప్పి వుంటే నేర్చుకునేదాన్ని" తప్పు చేసిన దానిలా అంది.
రిషి చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు. మనసు మాత్రం సువర్ణావకాశం వదులుకున్నావు కదరా ఈడియట్ అని తిడ్తోంది.
"ఈసారి అలా చెయ్యను. నేర్చుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రోజూ నేనే చేస్తాను." ఆమె పూర్తిచేస్తుండగానే రిషి నోట్లోనుండి అదో రకమైన శబ్దం అప్రయత్నంగా వెలువడింది.
"హా!" అన్నాడు.
ఆశ్రిత అతని కళ్ళల్లోకి చూస్తూ "తప్పా? నాకూ కావాలిగా. దేవుడు ఇద్దరికీ సమానంగానే పెట్టాడుగా ఆకలి!" అంది.
"ఆ....క....లా?" రిషి అతికష్టం మీద మాట్లాడాడు.
"అవును! మీరంత ఆకలితో వస్తే నేను అన్నం వండటం రాక మాడ్చేసాను. పాపిష్టిదాన్ని బియ్యంలో నీళ్ళు స్టౌ మీద పెట్టాలని మీరు చెప్పి ఉండవచ్చుగా. అందుకే అంటున్నాను. ఇక నేర్చుకుంటాను. వంట ప్రతిరోజూ నేనే చేస్తాను. జరిగినదానికి నాకు చచ్చే సిగ్గేస్తోంది."
ఆమె మాటలకి అతని కళ్ళకి కమ్మిన ఒక్కొక్క పొరా విడివడినట్లయింది. మాట్లాడ్తున్నది శ్రీజ లాంటి అమ్మాయి కాదు. గచ్చకాయలు, బొమ్మలాటలు తప్ప మరో ఆట తెలీని ఆడపిల్ల అని అర్ధమయింది.
"నన్ను క్షమించండి!" ఆశ్రిత అమాయకంగా అంది.
"క్షమించను గాక క్షమించను" మనసు గుర్రుమంది.
"సర్లెండి.... భోంచేద్దాం రండి" అతను నిరుత్సాహంగా లోపలకు నడిచాడు.
"నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతోంది రిషి" శ్రీజ వడ్డిస్తూ అంది.
"ఎందుకు?" కోపంగా అడిగాడు.
"చెవులు లేనివాడు కళ్ళజోడు పెట్టుకోవాలన్నట్లుగా వుంది పరిస్థితి" శ్రీజ నవ్వుతూ అంది.
"నోర్ముయి" రిషి ఎర్రబడిన మొహంతో అన్నాడు.
భోజనాలయ్యాక ముగ్గురూ కలసి ఆ ఊర్లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళారు. మూడు నెలల్లో రిటైరవ్వబోయే ముసలి డాక్టరు అప్పారావు ఆయాసపడుతూ కూర్చునున్నాడు. అప్పటికే హైమ ఆశ్రిత సంగతి చెప్పినట్లుంది. ఆయన ఆశ్రిత వైపు సానుభూతిగా చూస్తూ "కూర్చో అమ్మా" అన్నాడు. "ప్రొద్దుట్నుండీ ఆలోచిస్తే ఏమైనా గుర్తొచ్చిందా? పేరు గానీ, మీ వూరుగానీ, ఇంట్లో వాళ్ళుగానీ...." అని ఆగి ఆమె ముఖంలోకి పరీక్షగా చూసాడు.
"మిమ్మల్ని చూస్తేంటే అచ్చు...." అని ఆగింది ఆశ్రిత.
రిషితో బాటుగా అందరూ వుత్కంఠగా చూసారు.
"అచ్చు మీలాంటి ముసలాయనే నాకు తెలుసు" అంది ఆశ్రిత.
డాక్టరుగారు ఉత్సాహంగా "ఎవరు? ఎక్కడుంటారు?" అని అడిగాడు.
రిషి టెన్షన్ గా చూడసాగాడు.
ఆశ్రిత గుర్తు చేసుకుంటున్నట్లుగా ఓ క్షణం కళ్ళు మూసుకుని "ఆయన పేరు.... ఆ!
అల్లురామలింగయ్య.... కరక్టే.... అదేదో సినిమాలో ఇలాగే ఆయాసపడ్తుంటాడు" అంది ఆనందంగా.
రిషి రిలాక్స్ డ్ గా వెనక్కి వాలాడు.
డాక్టరుగారు వుస్సూరుమని నిట్టూర్చి "చూసావటయ్యా సినిమా అనేది ఎంత పవర్ ఫుల్ మీడియానో, జ్ఞాపకశక్తి అంతా పోయినా ఈ సినిమా కబుర్లు మరిచిపోలేదు అమ్మాయి" అన్నాడు.
శ్రీజ చప్పున ముందుకి వంగి "బోయ్ ఫ్రెండ్స్ ఎవరైనా వుండేవారా? వాళ్ళతోబాటు ఇంగ్లీషు సినిమాలకి వెళ్ళేదానివా గుర్తు తెచ్చుకో!" అంది.
"శ్రీ----నువ్వుండు" హైమ మందలించింది.
డాక్టర్ ఓ నిమిషం ఆయాసపడి "అమ్మయ్యా! అందింది.... అందింది" అన్నాడు.
"ఏవిటి?" అడిగింది శ్రీజ.
"ఊపిరి. ఆ! ఇప్పుడు చెప్పమ్మా. నీ పేరేమిటి? బుజ్జీ, చంటీ, పాపా లాంటి పేర్లతో పిలిచినట్లుగా గుర్తుందా?" అడిగాడు డాక్టర్.
ఆశ్రిత తల అడ్డంగా ఊపింది.
"మీ ఊళ్ళో చార్ మినార్ కానీ, తాజ్ మహల్ గానీ వేయి స్థంభాల గుడి కానీ, ఎర్రకోట గానీ వుందా?" అని వూపిరి పీల్చుకోడానికి అవస్థ పడసాగాడు.
ఆశ్రిత వెక్కి వెక్కి ఏడ్వడం మొదలెట్టింది.
"ఏమైందమ్మా?" ఆయన చాతీ మీద రాసుకుంటూ కంగారు పడ్డాడు.
"ఇలా మరో నాలుగు ప్రశ్నలేసేసరికీ మీకు పూర్తిగా వూపిరి అందడం మానేస్తుందేమో అని ఏడుస్తున్నట్లుంది!" చెప్పింది శ్రీజ.
ఆశ్రిత వెక్కిళ్ళు పెడ్తూనే అంది. "నాకేమీ గుర్తు రావడంలేదు. గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే చాలా నెప్పిగా.... తల పగిలి పోతున్నట్లుగా అనిపిస్తోంది" అంది.
ఆయన ఆయాసపడ్తూనే "పరిస్థితి ప్రమాదకరంగా వుంది" అన్నాడు.
ఏం చేద్దామంటారు డాక్టర్" హైమ బాధగా అడిగింది.
"త్వరగా పడుకోబెట్టి మెడక్రింద ఎత్తుగా ఓ దిండు పెట్టు" ఆయన ఆయాసపడ్తూ చెప్పాడు.
హైమ వెంటనే "ఎస్ డాక్టర్" అంటూ ఆశ్రితని ప్రక్కనున్న బెడ్ దగ్గరికి చేర్చింది.
"ఆ!.... అమ్మాయిని కాదు.... నన్ను" డాక్టర్ అతికష్టంమీద అనగలిగాడు.
శ్రీజ ఫక్కున నవ్వేసింది. రిషీ, ఆశ్రితా నవ్వు ఆపుకోలేక తలలు పక్కకి తిప్పుకున్నారు.
హైమ డాక్టర్ గార్ని బెడ్ మీదకి చేర్చి ఇంజెక్షన్ ఇచ్చింది.
రిషి నమస్కారం చేసి "మీ పరిస్థితి బాగలేనట్లుంది పాపం! ఉంటే ఉదయం కలుద్దాం" అంటూ బైటికి నడిచాడు. వెనకాలనించి హైమ పిలిచి "ఆగు రిషీ! అమ్మాయికి తలలో బాధ తగ్గి రాత్రి హాయిగా నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఇస్తాను" అంటూ లోపలికి నడిచింది. రిషి ఆమెతో డిస్పెన్సరీలోకి వెళ్ళాడు. ఆశ్రిత బయటికి నడిచింది.