"అమ్మో బల్లి! అంత ధైర్యంగా పట్టుకుని ఆ తర్వాత అరుస్తారే?" అందామె ఆశ్చర్యంగా.
రిషి మొహం అంతా చెమట్లు పట్టాయి. ఏం చెప్పాలో తోచలేదు అతనికి.
"చూడండి ఎన్ని చెమట్లు పట్టాయో! అంత భయం అయినప్పుడు ఎందుకిలాంటి సాహసాలు చేస్తారూ?" అంది లేస్తూ.
రిషి జవాబు చెప్పలేదు. మనసు ఏదో అనబోతుంటే 'నువ్వు వెధవ్వి దట్సాల్! నో మోర్ డిస్కషన్స్' అన్నాడు.
ఆశ్రిత వంటింట్లోనుంచి పెద్దగా కేకపెట్టింది.
రిషి లేచి గాభరాగా- "ఏవైందీ?" అన్నాడు.
ఆశ్రిత అతనివేపు తిరిగి బిక్క మొహంతో - "బియ్యం ఎందుకో అన్నంగా మారలేదు. నల్లగా మాడిపోయాయి" అంది.
రిషికి ఆ గిన్నె చూడగానే పరిస్థితి అర్ధమైంది "వంట చెయ్యడం రాదా?" అన్నాడు.
"రాదనుకుంటాను" అందామె బాధగా.
అతనికి ఆ నిమిషంలో తనమీద తనకే చెప్పలేనంత చిరాకేసింది. ఎందుకొచ్చిన తంటా? ఈ పిల్లని ఎలా భరించటం అనుకున్నాడు.
"రిషీ! అమ్మ మీకోసం భోజనం పంపించింది" అంటూ వచ్చిన శ్రీజ అతని కళ్ళకి దేవతలా కన్పించింది.
"శ్రీజా ఈ అమ్మాయికీ అసలు ఏమీ రాదు" అన్నాడు చిరాకుగా.
"ఓ... అప్పుడే పరీక్షించేసావా?" కన్ను కొడుతూ అంది శ్రీజ.
రిషి బెదిరిస్తున్నట్లుగా వేలు చూపించాడు.
శ్రీజ చెంపలు వేసుకుని "సరే కానీ ఏమైంది?" అంది. రిషి చెప్పాడు. విన్నాక శ్రీజ పగలబడి నవ్వింది.
ఆశ్రిత సిగ్గుతో తల వంచుకుంది.
"రిషీ! ఓపని చేద్దాం! ఈ అమ్మాయి ధోరణి చూస్తే చాలా గొప్పింటి పిల్లలా వుంది. ఈ అమ్మాయి ఆచూకీ గురించి పేపర్ లో ప్రకటన ఇయ్యి. చాలా పెద్ద బహుమతి ఇస్తేకాని పిల్లని అప్పజెప్పనని చెప్పు" అంది శ్రీజ హుషారుగా.
రిషి ఆమె నెత్తిమీద కొట్టి- "ఏమ్మా! కిడ్నాపింగ్ బహిరంగంగా ప్రకటనలిచ్చి మరీ చేస్తున్నాడని నన్ను లోపలికి తోయించడానికా?" అన్నాడు.
ఆశ్రిత ఆ మాటకి కిసుక్కున నవ్వింది.
రిషి అదిరిపడి చూసాడు. ఆడపిల్ల నవ్వితే కాలి మువ్వలు గలగలా రాలిపడినట్లూ, మల్లె జలపాతంలా జలజలా జారిపడినట్లూ వుందని అతనికప్పుడే తెలిసింది.
శ్రీజ తన ధోరణిలో తాను "సరే సరే టీవీ లో ఈ అమ్మాయి ఫోటో వేయిద్దాం. రిషీ .... ప్లీజ్ పనిలో పని నా ఫోటో కూడా వేయించవా. టీ.వీ.లో కనపడాలని నాకెప్పటి నుండో కోరిక" అంటూ బ్రతిమాలింది.
"నీమొహం చూస్తే నువ్వు తప్పిపోయావంటే ఎవరూ నమ్మరు. ఇంకేదో బాపతు అనుకుంటారుగానీ.... ఆ అమ్మాయికి తన వివరాలేమైనా గుర్తొచ్చాయేమో అడుగు" అన్నాడు.
శ్రీజ అడుగుదామని వెనక్కి తిరిగి ఆశ్రిత చేస్తున్న పని చూసి కీచుగా అరిచింది.
శ్రీజ అరుపుకి వెనక్కి తిరిగి చూసిన రిషి అమాంతం అటు పరుగెత్తి ఆశ్రితని పట్టి ఆపాడు. అప్పటికే నుదురు బొప్పి కట్టేటట్లు తలుపుకేసి రెండుసార్లు తలబాదుకుంది ఆశ్రిత.
"ఏవిటీ పని? ఇప్పుడేమయిందనీ?" కంగారుగా అడిగాడు రిషి.
ఆశ్రిత ఏడుస్తూ "ఏం చెయ్యమంటారు? నాకేమీ గుర్తు రావడంలేదు. నేను ఎవర్నో, ఏమిటో,
ఇక్కడికెందు కొచ్చానో తెలీకుండా ఇలా ఎన్నాళ్ళు? నన్ను వదలండి. నేను చచ్చిపోతాను" అంది.
శ్రీజా చిరాగ్గా అరిచింది. "తలుపులకీ, గోడలకీ తలలు బాదుకుంటే చచ్చిపోరు! అనవసరంగా అవి బీటలు తీస్తాయి. ఇంటి ఓనర్ మా ప్రాణాలు తీస్తాడు. నా మాట విని ఓ పని చెయ్యి.... వెళ్ళి ఆ కొండ ఎక్కి అక్కడనుండి దూకెయ్యి. చస్తే గొడవేలేదు! ఒకవేళ బతికితే సినిమాలో లాగా గతం అంతా గుర్తు రావచ్చు!"
"శ్రీజా!" రిషి ఆపమన్నట్లు చూసి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు.
"అయినా నాకెందుకు? మీ తంటాలేవో మీరు పడండి. కానీ...." అంటూ శ్రీజ అతని పెదవుల మధ్య నుండి సిగరెట్ లాగి, రెండు దమ్ములు పీల్చి "వెధవ పీనాసితనం నువ్వూ, ఫిల్టర్ వున్న సిగరెట్ కొనచ్చుగా!" అంది.
రిషి ఏమీ మాట్లాడకుండా ఆమె నోట్లో నుండి సిగరెట్ తీసి కాల్చసాగాడు.
రిషీ! ఎంతకాలం ఈ గొర్రెతోక జీవితం లక్షలు సంపాదించే మార్గం ఆలోచించు! నువ్వూ, నేను ఖరీదైన బార్లో కూర్చుని ఖరీదైన లిక్కర్ కొట్టడం గురించి ఓసారి వూహించుకో" వూరిస్తున్నట్లుగా అంది శ్రీజ.
రిషి మౌనంగానే తలుపు దగ్గర నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న ఆశ్రితనీ, శ్రీజనీ మార్చి చూసాడు. ఒకే ఈడు పిల్లలు కానీ ఎంత వ్యత్యాసం! బహుశా పెరిగిన వాతావరణం పరిస్థితులు కారణం కావచ్చు అనుకున్నాడు.
శ్రీజ ఆశ్రిత దగ్గరకెళ్ళి పరీక్షగా చూస్తూ "ఈ పిల్ల ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చేమో మరోసారి ఆలోచించు!" అంది.
రిషి ఆమె మాటలు పట్టించుకోకుండా "అన్నం పెట్టు" అన్నాడు.
"ఇటువంటి వాటికన్నింటికీ .... నేను పనికి వస్తాను. నీకు.... అసలు సంగతొచ్చేటప్పటికీ...." అంటూ రిషి కోపంగా వేలు చూపించేసరికి ఆగిపోయింది.
శ్రీజ వంటింట్లోకి వెళ్ళి క్యారియర్ విప్పుతోంది.
ఆశ్రిత రిషి దగ్గరకెళ్ళి తలవంచుకుని "ఇందాక జరిగిన దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. చచ్చిపోవాలనిపిస్తోంది" అంది.
రిషి అర్ధం కానట్లు చూస్తూ "దేనికి?" అన్నాడు.
"మీరు.... మీరు అంత ఇదిగా వస్తే.... నేను మిమ్మల్ని డిసపాయింట్ చేసాను" అంది సిగ్గుపడుతూ.
"హుర్రే... విన్నావా?" మనసు ఆనందంగా కేక పెట్టింది. పైకి మాత్రం "ఏ విషయంలో?" అన్నాడు గంభీరంగా.