" కర్ణంటే మావాళ్ళ కిష్టంగాబట్టే నాకా పేరు పెట్టారండి మా యింటిపేరు వ్యామోహంవారు. కర్ణ నా పేరు. పరు పెట్టగానే సరాం డి. ఆ పేరు నిలుపుకోవాలి కదా. ఎలాగూ దాన విర శూర కర్ణుడ్ని మా యింటి పేరులో మొదటక్షరం కలుపుకుని వ్యాకర్ణ అని చెప్పుకుంటున్నాను.
మా అబ్బునాధం వున్నాడాం డీ. వీడు మహా టక్కరి. ఏదో ఒకటి అడిగి తీసుకుంటాడు. తిరిగి అడిగితే కర్ణ పేరుకే అపకీర్తి తెలుస్తునావురా అంటూ నా నోరు మూస్తాడు. నా పెరుకన్నా వీడిపేరు వెయ్యివిదాల నయమనుకోండి" అంటూ ముగించాడు వ్యాకర్ణ.
" అబ్బులు అంటే ముద్దు పేరా నాయనా?" అని అడిగింది బామ్మగారు.
అబ్బులు కాలరు కంఠము ఒకేసారి సవరించుకుని తర్వాత కళ్ళజోడు సవరించుకుని నుంచుని చెప్పాడు. " బామ్మగారూ! నా అబ్బులి పేరు వెనుక ఓ బుల్లి కధ వుంది.
నా నామకరణ మహోత్సవం బంధుమిత్రుల సమక్షంలో చిన్న పెళ్ళికి ఖర్చుయేటంత ఖర్చుతో అయింది.
మా నాన్నగారికి బోలెడు ముఖమాటం.చచ్చిన బతికిన బంధువులందరి పేర్లు కలిపి ఎవరి మనసూ నొప్పించకుండా వుండటానికి నాకు పద్నాలుగు కిలోమీటర్ల దూరం రాసేతంత పేరు పెట్టారు! ఏ దేవుడికి ఏ బంధువుకి అన్యాయం జరక్కుండా నా పేరులో అందరి పేర్లు కలిశాయి.
శ్రీ శాయి వెంకట శ్రీనివాస మధుమోహన దుర్గాగోవింద సీతాకృష్ణ రామాంజనేయ వీరూపాక్ష నారాయణ నర్మదేవ వీర విక్రమ సూర్యచంద్ర విఠల మనోహర సుబ్రమణ్య నాగకుమార శంకర ప్రకాశ విష్ణువర్ధన..."
" నాన్నమ్మా! నీ దగ్గర దేముడి దండకాల పుస్తకాలున్నాయి. దాంట్లో చూడు, ఈయనగారి పూర్తి నామధేయం తెలుస్తుంది" అంది మధ్యలో అడ్డు తగిలిన జయచిత్ర.
బామ్మాగారు చిద్విలాసంగా మనుమరాలి మాటలకు నవ్వి ఓ పర్యాయుం ముళ్ళకిరీటం సరిచేసుకుని " అబ్బులనే పేరు నీ పేరులో చివరి భాగమా?" అంది.
" కాదు" అన్నాడు అబ్బులు.
" మధ్య భాగమా?" అంది జయచిత్ర నవ్వపు కుంటూ.
అబ్బులు లోలోపల వుడుక్కుని పైకి అమాయకంగా ముఖం పెట్టి " నా పేరుంది చూశారూ?" అన్నాడు.
" లేదు లెండి అసలు విషయాని కొస్తాను. నా పేరు పెద్దది కావటానికి కారణం చెప్పకదా! ముద్దు పేరు విషయాని కొస్తాను.
మా అమ్మనా పేరుని రకరకాలుగా పిలిచేది. ఓసారి కృష్ణా అంటే ఓసారి రామా అనేది.
అలాగే ఎవరితో నయినా మాటల మధ్యలో కోడా చెప్పేదే. ఓసారి కొత్తగా మా యింటి కొచ్చిన ఓ ఆవిడతో మా అమ్మయిలా అంది-
" మా రామం ఉత్త కొంటె కోణంగి అనుకోండి. పేరు కృష్ణుడు చేసేవి దొడ్డ పనులు. మా చంద్రాని కోసారి జ్వర మొచ్చింది. డాక్టరుగారి హస్తవాశి మంచిది కాబట్టి మంచాని కంటుకుపోయిన మా సూర్యం లేచి కూర్చున్నాడు. శంకరాయ్ విషయంలో..."