Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 7

    " అద్దెకొచ్చారా? ఎవరి నడిగి? ఎప్పుడు? ఎందుకు? ఎట్లా?" అంది మితృలను ముఖం ఎర్రజేసుకుని చూస్తూ.

    అబ్బులు, వ్యాకర్ణ గతుక్కుమన్నారు. " ఈ పిల్లెవరురా బాబూ! ఉరమని పిడుగులా వూడిపడింది. ఈ యిల్లు కూడా మనకి ప్రాప్తం లేదా" అనుకున్నారు.

    బామ్మాగారిని పొగిడినట్లు ఎర్రతేలులా వున్న ఈ పిల్లనీ పొగిడితే! జాలిగా ఆద్దెయిళ్ళుకోసం తాము ఎన్ని విధాల బాధపడిందీ కధగా చెప్పేస్తే? వ్యాకర్ణ, అబ్బులు కళ్ళతోనే మాట్లాడుకుమ్న్నారు. అల మాట్లాడుకోవటం అప్పుడప్పుడు వాళ్ళ కలవాటే.

    " అద్దెకి ఎప్పుడో నా ఫ్రెండ్స్ కిచ్చాను. మా నానంమకి తెలీదు. అందుకే మికు మాటిచ్చింది. మిరు మరో యిల్లు వెతుక్కోండి" ఏమనుకుందో గాని బామ్మగారి మనుమరాలు జయ శాంతంగా చెప్పేసింది.

    ఈ జయ అనే పిల్ల అబద్ధమాడుతుందని గ్రహించారు మిత్రులు. లాభం లేదని రంగంలోకి దిగారు.

    " నా పేరు వ్యాకర్ణ" ఓ అడుగు ముందు కేసి పాంటు జేబులో చెయ్యి దూర్చుకుని గంభీరంగా అన్నాడు వ్యాకర్ణ.

    " వ్యాకర్ణమో గోకర్ణమో మి పేరువడిక్కావాలి? నా పేరు జయచిత్ర అయినా నా పేరు చెప్పుకున్నానా? అంది జయచిచ్ర.

    " అవునవును. ముందుగా చెప్పుకోలేను గాని యిప్పుడు మి పేరేదో చెప్పేశారు. ఓహో ! ఎంత చక్కని పేరండి జయచిత్ర!

    అన్నట్లు జయచిత్ర అనే సినీతార మి ఫేవరేట్ గాబోలు. జయచిత్ర నా ఫేవరేట్ కూడానండ. జయచిత్రంటే నే పడిచస్తాను."

    జయచిత్ర నిప్పులు కళ్ళనుంచి కురుపించలేదు గాని మొత్తానికి అలా చూసింది వ్యాకర్ణని.

    " నిజం చెప్పాలంటే జయచిత్ర నటించిన చిత్రం మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే . బంగారు బొమ్మల్లో నాగేశ్వరరావు ప్రక్కన జయచిత్ర ఎంత గొప్పగా నటించింది!

    ఎ. ఎస్. ఆర్. మరీ పందొమ్మిదేళ్ల కుర్రాడిలా ఎలా నటించాడనుకుంటున్నారు. పక్కనే జయచిత్ర వుండబట్టి ఆయనలో పడుచుదనం పరవళ్ళు తొక్కి... తొక్కి..." జయచిత్ర ముఖ కవళికలు చూసి తను తప్పు మాట్లాతున్నట్లు గ్రహించుకున్నాడు వ్యాకర్ణ.

    అప్పటికే ఆలస్యం అయిపోయింది. అబ్బులు వ్యాకర్ణ చెవి పుచ్చుకు వెనక్కులాగి భూతద్దాల కళ్లజోడు సరిజేసుకుంటూ ముందుకొచ్చాడు.

    " క్షమించాలి జయాగారూ! మావాడికి పైత్యం చెస్తుంటుంది. బంగారు బొమ్మల్లో ఎ. ఎన్. ఆర్. పక్కన నటించిన వాణిశ్రీ అని తెలియక మిరనుకున్నాడు సో... సారీ! మి పేరు జయచిత్ర అనుకున్నాడు. వీడి  ముఖం వీడికేం తెలుసండి. వాణిశ్రీకి జయచిత్రకి భేదం తెలియకపోయె పైగా-

    అబ్బులి మాట పూర్తిగాకముందే జయచిత్ర విరగబడి నవ్వింది. ఆ పిల్ల అలా పడి పడి నవ్వటం దేనికో వీళ్ళిద్దరికి అర్ధం కాలేదు. వేపకాయంత వెర్రి వుందేమో అనుకున్నారు.

    " ఏమిటే  ఆ వెర్రినవ్వు?" అంటూ బామ్మగారు కోప్పడటంతో జయచిత్ర చప్పున నవ్వపేసి " నానమ్మా, వీళ్ళి ద్దరూ పుట్టింది బందరులో" అంది.

    " అరే, నీకెలా తెలుసు జయా?" అంది బామ్మగారు ముళ్ళకిరీటాన్ని సరిచేసుకుంటూ, బోలెడంత ఆశ్చర్యంతో.

    " బందరు పిచ్చళ్ళని అంటుంటారు. నీ వేప్పుడూ వినలేదా నానమ్మా! ఇదిగో వీళ్ళు అలాంటి బాపతు బంగారు బొమ్మల్లో జయచిత్రా లేదు వాణిశ్రీ లేదు. మజులుంది" అంటూ మరోసారి విరగబడి నవ్వింది జయచిత్ర.

    ఎవరి నాలుక వాళ్ళే కొరుక్కున్నారు అబ్బులు, వ్యాకర్ణలు , ఈ పిల్ల పిల్ల కాదు. పిడుగు. చూస్తుంటే మతిపోతున్నది. మాటలు వింటుంటే ఎదుటి వారికే నాలుక తిరగబడుతున్నది. బామ్మగారికి తగ్గ మనుమరాలు కాదు. పిల్ల రాక్షసి . కాకపోతే అందంగా వుంది. అంతే అనుకున్నారు. బామ్మగారి యింటిమిద కూడా నీళ్ళు వదులుకున్నారు.

 Previous Page Next Page