మా అమ్మ వాక్ ప్రవాహానికి అడ్డుపడుతూ వచ్చి నావిడ అడిగింది. " మి కెంతమంది కొడుకులండీ?" అని...
" ఒక్కడే అబ్బాయండి" అంది మా అమ్మ.
అసలు విషయం విన్న ఆవిడ అరగంటదాకా నవ్వుతూనే వుందిట.
అప్పటినుంచీ మా అమ్మ ఏదో ఓ పేరుతోనే పిలవటం మొదలుపెట్టింది.దానికీ చుక్కెదురే అయింది." అంటూ ఆగి కర్చీఫ్ తీసి నుదుట పట్టిన చెమటను తుడుచుకున్నాడు అబ్బులు.
అబ్బులి కధలో యిరిక్కున్న జయచిత్ర మహాఆతృత పడిపోతూ " ఆ తర్వాతేమయిందండీ" అంది.
" అలా దారికిరా అమ్మడూ!" అనుకున్నాడు అబ్బులు.
" కొయ్రా నాయనా కొయ్" అనుకున్నాడు వ్యాకర్ణ.
అబ్బులు మళ్ళీ మొదలు పెట్టాడు.
" ఓసారి మా బందువొకాయన కోర్టు పనిమిద మా యింటి కొచ్చాడు. ఆయనపేరు ఆంజనేయులు.
ఆయనపేరు కూడ నా పేరులో తోకలా తగిలించారు లెండి. ఆంజనేయులుం గారు మెచ్చుకుంటారని మా అమ్మ ఆయన పేరుతో అనగా నా పేరులో ఓ భాగం విడదీసి పిలవటం మొదలుపెట్టింది.
ఎలా అంటే? "ఒ రేయ్ ఆంజనేయులూ! కాఫీ వెచ్చపడ్డాది తాగిపోమ్మా!", " బాబూ! ఆంజనేయా! యిలారామ్మా? అంజానేయుడూ! అలా పొమ్మా!" అంటూ మా అమ్మ ఆయనకి వినపడేటట్లు నన్ను పేరుతో పిలిస్తూనే వుంది.
ఆ సాయంత్రం దాకా వచ్చిన ఆంజనేయులు గారి పేరే గాక బుద్దికూడా వంకరే.ఊరికి వెళ్ళేటప్పుడు మా అమ్మని పిలిచి కోపంగా మూతి యింత పొడుగున జాపి...
" అమ్మయ్! నీకు మంచీ మర్యాద తెలియదు. పెద్ద వాడిని చెట్టంత మనిషిని నా పేరు వాడికి పెడితే మాత్రం. నా ఎదురుగా ఆంజనేయులూ అంటావా? పెద్దంతరం చిన్నంతరం అక్కరలేదా?" అంటూ కోప్పడి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత..." అక్కడితో ఆగాడు అబ్బులు.
" ఆ... ఆ తర్వాతే మయిందండీ?" అంది జయచిత్ర మహా మహా ఆతృత పడిపోతూ.
మళ్ళీ మొదలు పెట్టాడు అబ్బులు మహాఉత్సాహంగా.
" కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు మరో అతిధి దిగాడు మా యింట్లో.
ఆయన మాఇంట్లో రెండు రోజులుండి టైమ్ ప్రకారం సుష్టుగా భోంచేసి తను వచ్చినపని కానిచ్చుకిని వెళ్ళేటప్పుడు మా అమ్మని నాలుగు మాటలని వెళ్ళాడు." అంటూ మళ్ళీ అబ్బులు ఆగిపొయ్యాడు.
" మి ఆమ్మెం చేసిందిని?" అంది జయచిత్ర సస్పెన్ క్రైమ్ నవల మధ్యలో సడన్ బ్రేక్ పడినట్లు చింతిస్తూ.
" అబ్బులూ! బాగా సబ్బు అరగదీస్తున్నావు. కానియ్ కానియ్" అనుకున్నాడు వ్యాకర్ణ.
" మా అమ్మేం చేయలేదండి. వచ్చిన అతిధి పేరు శంకరం.
అప్పుడు మా అమ్మ నన్ను శంకరం అని పిలుస్తుండేది. అప్పుడు నాకు పదేళ్ళు. అప్పుడు నేను చాలా అల్లరి చేస్తుండే వాడిని. అప్పుడప్పుడు మా అమ్మని విసిగిస్తూ వుండేవాడిని. అప్పుడు...
" మి అప్పుడు చప్పుడు త్వరగా కానిచ్చి అసలు విషయంలోకి రండి" అంటూ కోప్పడింది జయచిత్ర.
" అప్పుడు విషయం యిప్పుడు చెప్పవలసి వచ్చింది కదండీ! అప్పుడేం జరిగిందో తెలియాలంటే అప్పటి విషయం చెప్పాలి. అప్పుడు సంగతి అయిందిలేండి.
అప్పుడు ఆయన అనగా శంకరంకి జరిగిన అవమానం యిదండి. ఏంటంటే మా మామ్మ నన్ను- "ఒ రేయ్ శంకరం వెధవా! ఓరి పనికిమాలిన శంకరమా! శంకరాయ్ నీకేం తిప్పువచ్చిందిరా! అంటూ శంకరం పేరుతో తిట్టిందండీ.
అది విన్న అతిధి శంకరానికి అప్పుడు అనుమానం వచ్చింది. తన పేరుగా కొడుకుని పిలుస్తూ తనని తిట్టిపోస్తున్నదీ అని. అదేమాట మా అమ్మతో అని మరీవెళ్ళాడు. అప్పుడు జరిగింది అదండి. దరిమిలా మా అమ్మకి ప్రతిబంధువుతో వారినా పేరుతో బాధతప్ప ప్రయోజనం కనపడలేదు.