Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 8


    "మంచిది బాబూ! నీకు శుభం కలుగుతుంది" అంటూ లేచి నిల్చున్నాడు ధర్మయ్య, వెళ్ళే వాళ్ళందర్నీ సాగనంపటానికి.

 

    "జానకిరామయ్యా! సాయంకాలం ఒకసారి కన్పిస్తావా?" ఆనాడు ధర్మయ్య వీధిగుమ్మం దాటుతున్న జానకిరామయ్యతో.

 

    "ఊ!" అంటూ వెళ్ళిపోయాడు జానకిరామయ్య.

 

    జానకిరామయ్య కోపానికి కారణం అర్ధం చేసుకున్న ధర్మయ్య నవ్వుకుంటూ లోపలకు వచ్చాడు.

 

    "ఎవరా కుర్రాడు? చక్కగా, ముచ్చటగా వున్నాడు?" లోపలకు వస్తున్న ధర్మయ్యను భార్య అడిగింది.

 

    "శేఖరం! రావుసాహెబ్ కొడుకు. బుద్ధిమంతుడు. పై కొస్తాడు" అన్నాడు ధర్మయ్య, నులక మంచం ఎత్తి గోడవారంగా పెడుతూ.

 

    "మళ్ళీ అక్కడ కూర్చుంటారేం? చాలా ఎండెక్కింది. భోజనానికి రండి!" వ్యాసపీఠం ముందు కూర్చోబోతున్న భర్తతో అన్నది సరస్వతమ్మ.

 

    "వడ్డించు! వస్తున్నా!" అంటూ వ్యాసపీఠం, భాగవతం తీసుకొని లోపలకు వెళ్ళాడు ధర్మయ్య.

 

    "అమ్మాయి ఏం చేస్తుందో?" అన్నాడు ముద్దకలిపి నోట్లో పెట్టుకోబోతూ ధర్మయ్య.

 

    "సరిగ్గా తిండీ తిప్పలు అమరుతున్నాయోలేదో బిడ్డకు. నెలరోజులకే కళ్ళుపోయినట్టనిపిస్తుంది" అన్నది సరస్వతమ్మ దిగులుగా.

 

    ధర్మయ్య తలెత్తి భార్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లడం చూశాడు.

 

    "అమ్మాయికేమే? హాయిగా చదువుకుంటూ, కులాసాగా స్నేహితురాళ్ళ మధ్యలో కాలం గడుపుతూ వుంటుంది" అన్నాడు ధర్మయ్య భార్యకు ధైర్యం చెప్పే ధోరణిలో. కాని మనస్సులో అతన్ని కూడా కూతురిమీద బెంగ బాధిస్తూనే వుంది.

 

    "ఉత్తరం వచ్చి ఎన్నాళ్ళయిందండీ?"

 

    "నిన్నేగా వచ్చింది?"

 

    "అవును! నా మతిమరుపు మండిపోనూ? నిన్న ఉత్తరం వచ్చిన సంగతి మర్చేపోయాను. ఇవ్వాళ వస్తుందని పొద్దుటినుంచీ ఎదురు చూస్తున్నాను" అన్నది సరస్వతమ్మ.

 

    ధర్మయ్య అన్నం తిని లేచివెళ్ళి మంచం మీద నడుం వాల్చాడు. కళ్ళు మూసుకుని కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు.

 

    సరస్వతమ్మ అన్నం ముందు కూర్చుని "పిల్ల ఇంకా అన్నం తిన్నదో లేదో!" అనుకొన్నది.


                                                                               6


    "దం మరోదం! మిట్ జాయెగం బోలో సుబహ్ శాం హరేరామ! హరేకృష్ణ"

 

    "అబ్బబ్బ! తల పగిలిపోతోంది" విసుక్కుంటూ చేతిలో పుస్తకం మూసి కిందపెట్టి లేచింది సునంద.

 

    గది తలుపులు మూసింది.

 

    అయినా రికార్డ్ వినిపిస్తూనే వుంది. మధ్య మధ్య అనేక గొంతులు రికార్డుతోపాటు కలిసి పాడుతున్నాయి పక్క గదిలో. ఆ గదిలోచేరిన ఆడపిల్లలంతా ఆ పాటపాడుతూ చేస్తున్న డ్యాన్స్ చూడకపోయినా కళ్ళకు కట్టినట్టువుంది సునందకు.

 

    పరీక్షలు దగ్గర పడుతున్నాయి. సునంద శ్రద్ధగా చదవటానికి ప్రయత్నిస్తున్నది. కాని రోజూరాత్రి ఇదే తంతుగా వుంది. ఏకాగ్రత కుదరడంలేదు. సునంద ఎవర్నీ ఏమీ అనలేకుండా వుంది. వాళ్ళంతా సునందను పుస్తకం పురుగ్గా చూస్తారు. బి.సి. నాటి భావాలని ఆమెను గేలిచేస్తుంటారు.

 

    సునంద లేచివెళ్ళి కిటికీ తలుపులు కూడా మూసింది. అయినా ప్రక్క గదిలో మ్రోగుతున్న రికార్డు, అమ్మాయిల గలగల నవ్వులూ వినిపిస్తూనే ఉన్నాయి.

 

    ఛ! వీళ్ళ అల్లరి భరించడం తనవల్ల కాదు. అల్లరికి కూడా ఒక వేళా పాళా అంటూలేదా? వీళ్లు అసలు చదువుకోటానికే పట్నాలకు వస్తున్నారా? ముందు అదే ఉద్దేశ్యం కావచ్చు. పట్నం వచ్చీరాగానే ఈ టెక్నికలర్ జీవితంచూసి ముగ్ధులై పోతున్నారు. చాలామండి పెడమార్గాలు పట్టి పోతున్నారు.

 

    వీళ్లు ఆర్జిస్తున్న విజ్ఞానం ఇదా? ఈ విజ్ఞానంవల్ల వీళ్ళ సంస్కారం పెరగటానికి బదులు తరిగి పోతుందేం?

 

    అందరి విషయంలో కాకపోవచ్చు. కాని ఎక్కువమంది ఇలాగే తయారవుతున్నారు. తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు.

 

    లోపం ఎక్కడుంది? తల్లిదండ్రుల పెంపకంలో వస్తోందా? లేక తరాలగా నాలుగుగోడలమధ్య మగ్గిన స్త్రీకీ స్వేచ్చ వచ్చేటప్పటికి దాన్ని ఎలా ఉపగించుకోవాలో తెలియక తికమక పడుతున్నదా!

 

    ఈనాటి సినిమాల ప్రభావం, చౌకబారు సాహిత్య ప్రభావం కూడా దీనికి కారణం కావచ్చు. విద్యా విధానంలో మరికొంత వుండి వుండవచ్చు.

 

    ఈనాటి విద్యార్ధిలోకం ఎందుకు వంటరితనం నుంచి పారిపోతోంది? ఎంతసేపూ సామూహికంగా తిరగటం, అల్లరి చెయ్యడంలోనే సమయాన్ని గడుపుతున్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచించటానికి భయపడుతున్నారు. ఎందుచేత? వారి భవిష్యత్తుకు ఓ నిర్దిష్టమైన గమ్యం లేకపోవడం కూడా కారణం కావచ్చును. వీరిలో మానసికంగా కల్లోల పరిచే అశాంతి ఏదో తావు చేసుకుంటూంది.

 

    "హరేరామ హరేకృష్ణ" సినిమా తనూ చూసింది. చూసి కొంత ప్రయోజనం గల సినిమా అనుకుంది. ఇలాంటి సినిమాలు రావడం ఎంతయినా అవసరం అనికూడా అనుకుంది! ఈనాటి యువతరం ఎందుకు హిప్పీకల్ట్ వైపుకు ఆకర్షించబడుతోందో చక్కగా చిత్రించబడింది. దానివల్ల కలిగే అనర్ధాలను చక్కగా చూపించారు అనుకుంది. కాని దాని ప్రభావం ఎక్కువమంది యువతీ, యువకులమీద మరోలా ఎందుకు పనిచేసింది?

 

    ఆ సినిమాలో చెప్పదల్చుకున్న విషయాన్ని సరిగా చెప్పలేకపోయారా? లేక చెడును మాత్రమే త్వరగా గ్రహించగలిగే మానవ మనస్తత్వమా దీనికి కారణం? ఈ పాట యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించింది. ఈ పాటను మరోలా ఉపయోగించుకుంటున్నారు.

 

    రికార్డు ఆగింది. సునంద బుర్రలో ఆలోచనల దారం తెగింది. రిలీఫ్ గా నిట్టూర్చింది. మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకొని చదవసాగింది.

 

    "నందామయా_గురుడ నందామయా
    ఉందామయా _ తెలుసుకుందామయా"

 

    సునంద నాలుగులైన్లు చదివీ చదవకముందే మళ్ళీ విన్పించింది.

 

    సునంద చేతిలో పుస్తకాన్ని విసిరి నేలకేసి కొట్టింది. దిగ్గున లేచి తలుపు తీసికొని బయటికి వచ్చింది.

 

    పక్కగది వాకిట్లో నిల్చుంది. అమ్మాయిలంతా పాటకు అనుకూలంగా ఊగిపోతూ తన్మయత్వంలో వున్నారు. లయగా అడుగులు వేస్తున్నారు. ఒకరి నడుంమీద ఒకరు చేతులువేసి ఊగుతూ డ్యాన్సు చేస్తున్నారు. సునంద చూస్తూ నిలబడింది. ఆమెను ఎవరూ గమనించలేదు. గమనించిన లలిత నిర్లక్ష్యంగా ఓమారు సునంద కళ్ళలోకి చూసి కళ్ళు తిప్పేసుకుంది.

 

    పాట ఆగిపోయింది. మళ్ళీ రాక్ అండ్ రోల్ రికార్డు వేసి డ్యాన్స్ ప్రారంభించారు.

 

    సునందకు "ఇక ఆపండి! ఏమిటీ అల్లరి?" అని అరవాలనిపించింది. కానీ ఏమీ అనలేకపోయింది.

 

    తనమాటను ఎవరూ పట్టించుకోరనీ, తనను అమ్మమ్మను చూసినట్టు ఎద్దేవగా చూస్తారనీ ఆమెకు తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయింది.

 

    ఒక్కసారిగా సునంద వీపుకు ఏదో గట్టిగా తగిలి కిందపడింది.

 

    సునంద గిర్రున వెనక్కు తిరిగి చూసింది. వరండాలో అల్లంత దూరంలో ఒక దానిమ్మకాయ కన్పించింది. వంగి చేతిలోకి తీసుకొని బయటికి చూసింది. గేటు దగ్గరగా రోడ్డుమీద కొందరు విద్యార్ధులు కన్పించారు.

 

    వసంత వచ్చి సునంద చేతిలోవున్న దానిమ్మకాయను లాక్కుంది.

 

    "అనార్ నీ సలీమ్ వచ్చాడేవ్? పిలుపు వచ్చింది" అంటూ గావుకేక పెట్టింది వసంత.

 

    సునందకు ఏమీ అర్ధం కాలేదు. తెల్లబోయి చూస్తూ నిల్చుంది.

 

    సులోచన రేగిన జుట్టును సవరించుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.

 

    రాక్ అండ్ రోల్ డ్యాన్సు ఆగిపోయింది. అమ్మాయిలందరూ బిల బిల మంటూ వరండాలోకి వచ్చారు.

 

    బరువైన ముడితో కర్చీఫ్ ఒకటి వచ్చి లలిత కాళ్ళముందు పడింది. సునంద అయోమయంగా ఆ కర్చీపు కేసి చూసింది.

 

    ఇద్దరి ముగ్గురి చేతులు ఆ కర్చీపు మీద పడ్డాయి. కర్చీపు లలితకే చిక్కింది. ముడి ఊడదీసి చూసింది. ఒక రాయిచుట్టూ చుట్టివున్న కాగితం ముక్కతీసి "మాలతి" అని చదివింది.

 

    జారిపోయిన పైటగాని, రేగిన జుట్టుగాని సవరించుకోకుండానే మాలతి పరుగులాంటి నడకతో గేటుకేసి నడిచింది.

 

    "గుడ్ లక్ మాలతీ!" వెనకనుంచి లలిత అరిచింది.

 

    సునంద ఇదంతా వింతగా చూస్తూ నిలబడిపోయింది.

 

    రోడ్డుమీద నుంచి చెవులు గింగురు మనేలా విజిల్ వినిపించింది.

 

    "హాయ్! లైలా! నీ మజ్నూ పిలుస్తున్నాడేవ్? చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నాడు పాపం!" అన్నది విమల.

 

    అందరూ గొల్లున నవ్వారు.

 

    లలిత గాబరాగా పరుగుతీసింది.

 

    "పడేవ్ జాగ్రత్త!" అంటూ వెనక నుంచి కేకలు.

 

    మిగిలిన నలుగురూ తమకు ఇంకా ఆహ్వానం రాలేదేమా అన్నట్టు వరండా చివరకు వచ్చి గేటువైపు చూస్తున్నారు.

 

    మళ్ళీ ఏదో వచ్చిపడింది. సునంద కళ్ళు తిప్పి చూసింది. అది దొండకాయ.

 

    "ఏయ్ దొండపండూ మీ కాకి వచ్చిందేవ్?" కెవ్వున అరిచింది విమల.

 Previous Page Next Page