Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 7

    అతను కాగితం అందుకుని జేబులో పెట్టుకుని "నేను ఎడ్రసు తెలుసా అని అడిగాను. తెలిస్తే చెప్పడం, తెలియకపోతే నోరు మూసుకుని వెళ్ళడం, మర్యాదస్తుల లక్షణం. మిగతా విషయాలన్నీ మీకు అనవసరం" అన్నాడు తీక్షణంగా చూస్తూ.

    "అదేమిటోయ్ అంత దురుసుగా మాట్లాడతావ్, ఆ అమ్మాయి ఎవరనుకున్నావ్? స్వయాన మా మేనమామ బావమరిదికి..."

    ఆయన మాటలు పూర్తి కాకముందే అతను ఆయన కాలరుపట్టుకున్నంత పని చేసి "ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా మీ దారిన మీరు వెళ్ళితే మంచిది" అన్నాడు బెదిరిస్తున్నట్లుగా చూస్తూ.

    "అ....లా...గే" అంటూ ఆయన అతని పట్టు వదిలించుకుని "ఎవరో రౌడీ వెధవలా వున్నాడు" అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

    కనుచీకటి పడుతోంది. అతను ఆ పెంకుటింటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు.

    "టక్...టక్..." అని మునివేళ్ళతో తలుపు తట్టాడు.

    "ఎవరూ?" లోపలినుండి అడిగింది శిల్ప.

    ఆమె తలుపు తెరచే లోపునే అతను అసహనంగా మరో రెండుసార్లు దబ దబ బాదేశాడు.

    "ఆమె తలుపు తెరచి అతన్ని చూస్తూనే కొయ్యబారిపోయినట్లు" నిలబడిపోయింది.

    "శిల్పా, వర్షిణి ఎక్కడ వుంది?" అడిగాడతను ఆత్రంగా.

    "వి...క్రమ్...నువ్వు...నువ్వు...బ్రతికే వున్నావా?" శిల్ప ఇంకా షాక్ నుంచి తేరుకోలేనట్లు చూస్తూ అడిగింది.

    "శిల్పా నాకు అర్జంటుగా వర్షిణి అడ్రస్ కావాలి" కటువుగా చెప్పాడు విక్రమ్.

    "ఎవరే వచ్చింది?" అడుగుతోంది లోపలినుంచి శిల్ప తల్లి.

    "విక్రమ్! నాకు తెలియదు. వర్షిణి ఎక్కడుందో....హాస్టల్ విడచిపెట్టాక ఒకే ఉత్తరం వ్రాసింది. అందులో వాళ్ళ నాన్నగారు త్వరలో ట్రాన్సఫర్ మీద ఆంద్ర వచ్చేస్తున్నట్లు వ్రాసింది. అంతకన్నా వివరాలు వ్రాయలేదు" గొంతు తగ్గించి గబగబా చెప్పేసింది.

    అతని మొహంలో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది. "మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరి ఎడ్రస్ అన్నా వుంటే ఇవ్వు" అన్నాడు.

    "అమ్మాయ్ ఎవరితోనే మాటలు!" ఆమె తల్లి లేచి వస్తున్నట్లు అడుగుల శబ్దం అవుతోంది.

    "నాకు తెలియదు విక్రమ్, నువ్వు హాస్టల్ కి వెళ్ళి ట్రై చేస్తే బెటర్" అంది కంగారుగా శిల్ప. అందులో నువ్వు వెంటనే వెళ్ళిపో అన్న వేడికోలుంది.

    "సరే రేపే వైజాగ్ వెడతాను" చెప్పి వెనక్కి తిరిగి చీకట్లో కలిసిపోయాడు.

    శిల్ప తల్లి వస్తూనే "ఎవరూ?" అంది.

    "వైజాగ్ లో మాతోబాటు చదువుకున్న అమ్మాయిల ఎడ్రస్ కోసంలే అమ్మా" అంది శిల్ప తలుపు వేసేస్తూ.

    "మాయదారి సంత, వేళా పాళా, సమయం, సందర్భం వుండక్కరలేదు" ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

    శిల్ప అప్రయత్నంగా గుండెలు మీద చేయివేసింది. "విక్రమ్ బ్రతికే వున్నాడు" ఆమె గుండె కొట్టుకునే వేగం ఆమెకే తెలుస్తోంది.

    "అమృతా, అమృతా..." హర్ష వెనక్కి తిరగకుండానే కాలితో తలుపు వేసేస్తూ, మరో చేత్తో టై వూడదీస్తూ ఆఫీసునుంచి హడావుడిగా లోపలికి వచ్చేశాడు.

    "రూం తలుపు తీసే వుంది. తిన్నగా బెడ్రూంలోకి వచ్చేసెయ్" చెప్పింది అమృత.

    "ఏమిటీ అప్పుడే రెడీనా?" హర్ష నవ్వుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెలుగులోంచి రావటంవల్ల అతడి కళ్ళు చీకటి అలవాటుపడ లేదు. ఆమె ఎదురొచ్చి అల్లుకుపోతూంటే, పట్టి దూరంగా జరిపి "ఇదేమిటి?" అన్నాడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ.

    అమృత అతని టీ షర్టు వేసుకుని, క్రింద అతని లుంగీ కట్టుకుని వుంది.

    "ఇదికూడా అర్ధం చేసుకోలేవా చిదంబరం?" బుంగమూతి పెట్టింది.

    హర్ష ఆమెని దగ్గరికి తీసుకుని చెవిలో గుసగుసలాడాడు....నువ్వు చెప్తే వినాలని.

    "పగలంతా నీ స్పర్శకి దూరంగా వుండలేక....నిజం మదనగోపాలా! నువ్వు నన్ను...రియల్లీ యూ ఆర్ కిల్లింగ్ మీ"

    అతను ఏమీ మాట్లాడలేకపోయాడు.

    ఆమెని కూడా మరి యిక మాట్లాడనియ్యలేదు.
   
                                                     *    *    *

    "కాఫీ" అతని ముందు కాఫీ కప్పు వుంచి, తను 'టీ' తెచ్చుకుంది అమృత.

    "నా కోసం కాఫీ కలిపాడా? ఈ పూటకి "టీ" ఇచ్చెయ్యాల్సింది" అన్నాడు హర్ష.

    "టీ" సిప్ చేస్తూన్న అమృత నవ్వి "హర్షా! ప్రేమంటే ఎదుటి వాళ్ళకోసం మన ఇష్టాల్ని చంపుకుని త్యాగం చేయడం కాదు! మన ఇష్టాలతోబాటు ఎదుటివాళ్ళ ఇష్టాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం. వాళ్ళ ఇష్టాలని కష్టపడైనా తీర్చాలనుకోవడం" అంది.

    అతను ఆమెవైపు ఆరాధనగా చూశాడు. ఎంత బాగా చెప్పిందీ సున్నితమైన విషయాలు ఇలా 'టచింగ్'గా చెప్పడం, చూపించడం ఈమెకి ఎలా పట్టుబడిందీ? లోకంలో అందరూ పుణ్యంకొద్దీ పురుషుడు అంటారు. మరి భాగ్యంకొద్దీ భార్య అనగా వినలేదే! ఇంటిని 'ఇల్లు'గా వుంచే భార్యలు ఎంతమంది? రోజంతా పడిన 'రొటీన్' టెన్షన్ అన్నీ మరిపించేదిగా ప్రశాంతంగా వుండే 'పొదరిల్లు' లాంటిది ఇల్లు.

 Previous Page Next Page