Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 7


    "ఇంతకీ మీకు ఈ బుద్ధి యెందుకు పుట్టినట్టు?" శ్రీధర్ సూటిగా అమూల్య ముఖంలోకి చూస్తూ అడిగాడు.


    అమూల్య చూపులు వాలిపోయి, ఎంత తీక్షణంగా ఉన్నాయ్ ఆ చూపులు. కళ్ళలోంచే దూసుకుపోయి గుండెల్లో దాగిన రహస్యాలను బయటికి లాగేలా ఉన్నాయ్! అమూల్యకు తమాషా అనుభూతి కలిగింది. బలంగా, తెల్లగా ఉన్న అతని చేతులుకేసి చూస్తూ కూర్చుంది.


    "చెప్పరేం?"


    "ఏమిటి?"


    "మీకు మా వూరు చూడాలనే దుర్భుద్ధి ఎందుకు పుట్టినట్టు?"


    "ఎందుకేమిటి? చూడాలనిపించింది. అంతే?"


    "అంతేనా?" అదోలా పలికింది శ్రీధర్ కంఠం.


    అమూల్య వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది.


    ఇతనికి తనలోని బలహీనత తెలిసిపోయింది. తెలిసి మరీ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? తనంటే ఇష్టం లేదా?? అతని ధోరణి చూస్తుంటే తను అనుకున్నంత మెత్తని వాడేం కాదు. తన ప్రేమను తిరస్కరిస్తే?


    తన ప్రేమను అతడు తిరస్కరిస్తాడా అసంభవం.


    తనకంటే ముందు ఎవరికైనా మనసిచ్చాడేమో? మరదలు పిల్ల ఉందేమో?


    అమూల్యకు ఊపిరి ఆడనట్టు అయింది. కిటికీ అద్దం దించింది. రివ్వున చల్లటిగాలి కారు లోపలకు తోసుకుని వచ్చింది. అమూల్య నైలెక్సు చీర వేసుకుని వుంది. పైట ఎగిరివెళ్ళి శ్రీధర్ ముఖాన్ని కప్పేసింది. అతను ముఖంమీద పడిన పైటను తొలగించబోయాడు.


    అప్పుడే గాభరాగా తన పైట లాక్కోబోయిన అమూల్య చెయ్యి అతని చేతికి తగిలింది.


    "సారీ" అన్నాడు.


    "ఎందుకూ. ఇంత మాత్రానికే ఓ ఆడపిల్ల పాతివ్రత్యం పోతుందా?" కిలకిల నవ్వింది అమూల్య.


    శ్రీధర్ ఆమె ముఖంలోకి చూశాడు. ముంగురులు గాలికి ఎగురుతున్నాయ్. కుడిచేత్తో వెనక్కు సవరించుకొంటున్నది. ఆమె ముఖం మీద నుంచి చూపుల్ని బలవంతంగా తిప్పుకున్నాడు.


    తన మనసు అదుపు తప్పకూడదు అంటే మానుతుందా? మనిషి చెప్పినట్టు మనసే వింటే ప్రపంచంలో ఇన్ని కథలు ఉండేవి కావేమో? మనిషికి ఇన్ని బాధలు ఉండేవి కావు.


    అమూల్యకు తనంటే ఇష్టం అని తనకు తెలుసు, కాని...కాని... తనేమిటో కూడా తనకు తెలుసు.


    "ఏమిటి ఆలోచిస్తున్నారు? నా గురించేనా?"


    "అబ్బే ఏంలేదు"


    "నాకు తెలుసు"


    "ఏమిటి?"


    "మీరు నాగురించే ఆలోచిస్తున్నారు" మళ్ళీ కిలకిల నవ్వింది. ఈ పిల్లకు ధైర్యం ఎక్కువ.


    కష్టం సుఖం తెలియకుండా పెరిగింది. ఆడా మగా తేడాలేని వాతావరణంలో స్వేచ్చగా పెరిగింది. ప్రపంచమంతా రంగుల మయమనీ, జీవితం ఒక మధుర స్వప్నమని భ్రమపడే వాతావరణంలో పెరిగింది. ప్రతి చిన్నదానికీ గలగల నవ్వడం అలా పెరిగిన వాళ్ళకే వస్తుంది.


    "హాయ్!హాయ్!" అంటూ చేతులు ఊపడం, టిస్టు డాన్సులు చేయడం యిదే వాళ్ళ ప్రపంచం. రంగుల ప్రపంచం మనుష్యులకు ఎన్నో సమస్యలుంటాయని వీరికి తెలియదు. జీవితం వీరికి ఓ థ్రిల్, సుందరస్వప్నం!


    "నేను మీ ఊరు రావడం మీకు ఇష్టం లేదా?"


    శ్రీధర్ గిర్రున చూశాడు.


    "లేదు."


    అమూల్య ముఖం చిన్నబోయింది.


    శ్రీధర్ కు జాలివేసింది.


    "ఎందుకని అడగరేం?"


    "చెప్పండి!" ముఖం ముడుచుకునే అన్నది.


    "మేము బీదవాళ్ళం. మా ఇంట్లో మీకు సౌకర్యాలు ఉండవు."


    అమూల్య మాట్లాడలేదు.


    "క్రింద కూర్చుని భోజనం చెయ్యాలి. మాది చిన్న ఇళ్ళు..."


    "యూ సిల్లీ నేను మీ ఇంటికి మర్యాదలు కోసం రావడం లేదు" అన్నది అమూల్య తేలికపడిన మనసుతో.


    "అదికాదు"


    "ఏదికాదు"


    "అది మరీ చిన్న పల్లెటూరు"


    "అందుకే చూడాలని..."


    "అక్కడి జనం మిమ్మల్ని వింతగా చూస్తారు. మీకు ఇబ్బందిగా ఉంటుందేమోనని"


    "రియల్లీ? ఇట్ విల్ బి ఎ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్."


    "మీలాంటి వారికి ప్రతిదానిలోనూ థ్రిల్లింగ్ కన్పిస్తుంది" మనసులోనే అనుకున్నాడు.


    "ప్యాంటూ షర్టూ వేసుకుంతారా?" వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధిస్తూ అడిగాడు.


    "ఏం వేసుకుంటే?"


    "మా ఊరి వాళ్ళు మిమ్మల్ని ఓ వింత ప్రాణిని చూసినట్టు చూస్తారు."


    "అంటే?"


    "అదే అచ్చం...చిన్నపిల్లవాణ్ణి "జు"కు తీసుకెళ్తే బోనులో ఉన్న జంతువుల్ని ఎలా చూస్తాడో..."


    "మార్వెలస్" చప్పట్లు కొడుతూ అన్నది.

 Previous Page Next Page