"చూశారా! ఇది మరీ ఓవరాక్షన్ చేసే వాళ్ళ షాటు. ఓవరాక్షన్ అంటే మరేం కాదూ... ఇలా కొడితే చాలా దూరం వెళ్ళి టార్గెట్ ని దాటిపోతుంది. అందుకని..." అని ముచ్చటగా మూడో ఐరన్ తీసింది ఐశ్వర్య. ఎయిమ్ చేసింది. బాల్ ని కొట్టింది.
అది కాకతాళీయంగా వెళ్ళి హోల్ లో పడింది.
విజయగర్వంతో చూసింది ఐశ్వర్య.
"చూశారా! కరెక్ట్ షాట్ ఇది! ఈ ఐరన్తో కొట్టాలి! అన్ని రకాల షాట్సూ మీకు అర్థమయ్యాయా!" అంది ఆరింద లాగా.
"బాగా అర్థమయింది" అన్నాడు బాబ్ హోప్.
"ఏమిటి?" అంది ఆమె అనుమానంగా.
"మిడతంబొట్లు జాతకం చెప్పినట్లు మూడుషాట్లు కొట్టావు. అందులో ఒకటి దైవాధీనంగా వెళ్ళి హోల్ లో పడింది. ఆట నేర్పిస్తున్నావా. ఆటపట్టిస్తున్నావా అమ్మాయ్" అన్నాడు బాబ్ హోప్.
దొరికిపోయిన దొంగలా నవ్వేసింది ఐశ్వర్య.
తన కార్డు తీసి ఇచ్చాడు బాబ్ హోప్.
"అందులో నా పర్సనల్ నెంబర్ ఉంది. ఎప్పుడు కావాలన్నా నన్ను కలవచ్చు."
"మిమ్మల్ని ఆల్ రెడీ కలిశాను కదా!" అంది ఐశ్వర్య.
"మరి?"
"అమెరికన్ ప్రెసిడెంట్ ని కలవాలని ఉంది. ప్రెసిడెంట్స్ అంతా మీ పర్సనల్ ఫ్రెండ్సే కదా!"
తల వెనక్కి వాల్చి నవ్వాడు బాబ్ హోప్.
"యూ నాటీ గర్ల్! ఏం కావాలి మీకు? ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లెం? వీసా ఎక్స్ టెన్షన్? గ్రీన్ కార్డ్? యూ ఆర్ యాన్ ఇండియన్! నో?"
"అదికాదు"
"మరి?"
"ఐ వాంట్ టు బయ్ యాన్ ఐలాండ్! నియర్..."
"ఏమిటీ?"
"అవును అంకుల్! ఒక ద్వీపాన్ని కొనాలని ఉంది."
"ఎందుకూ?"
"అక్కడ ఒక కొత్త ప్రపంచం సృష్టించాలి. రోగాలూ, మరణాలూ లేకుండా దరిద్రం లేకుండా కష్టాలు లేకుండా భూమి మీదే స్వర్గంలాగా. దానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. దానికి మేం జెనెటిక్స్, రాబోటిక్స్ అన్నీ యూస్ చేస్తాం."
జాగ్రత్తగా అన్నాడు బాబ్ హోప్.
"మేం అంటే ఎవరు?"
"నేనూ లక్కీ - నా ఫ్రెండ్"
"తను కూడా ఇక్కడే ఉందా?"
"అదిగో అక్కడే నిలబడి నవ్వుతోంది."
"రమ్మను"
"లక్కీ కమ్!" అంది ఐశ్వర్య పెద్దగా.
లక్కీ వచ్చింది. షేక్ హాండ్ ఇచ్చింది.
"ఈ పిల్ల ఐడియా నీకు తెలుసా?" అన్నాడు హోప్.
"తెలుసు. ఐడియా ఇచ్చింది నేనే!" అంది లక్కీ.
"అది జరుగుతుందనే ఆశ ఉందా?"
"ఎవ్విరిథింగ్ ఈజ్ పాజిబుల్. సాధ్యంకాదేమో అనుకోవడం నిరాశావాదం. మాకు ఆశ ఉంది. వియ్ ఆర్ ద వరల్డ్!" అంది లక్కీ.
"సో యూ వాంట్ టూ మీట్ ద ప్రెసిడెంట్?"
"మోస్ట్ సెర్టెన్లీ"
మర్నాడే వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ తో మీటింగు ఏర్పాటయింది. మురిపెంగా చూశాడు ప్రెసిడెంటు వాళ్ళని. అంతకుముందే బాబ్ హోప్ వాళ్ళని గురించి చెప్పి ఉన్నాడు... "బిల్! ఫాంటాస్టిక్ టీనేజర్స్ ఇద్దరూ! జాబిల్లిని తెచ్చి జడలో పెట్టుకుందామనే ఆలోచనలు. కానీ సరిగ్గా గైడ్ చేస్తే దేవిల్ మేక్ యూ ప్రౌడ్! దే ఆర్ మై గర్ల్స్. టేక్ కేర్ ఆఫ్ దెమ్!" అన్నాడు.
మర్నాడు ఒక టాబ్ లాయిడ్ పేపర్లో పడింది వార్త.
"ఇండియన్ కిడ్స్ విన్ ప్రెసిడెంట్స్ హార్ట్!" అని.
ఆ తర్వాత ఇహ జూస్కో... అమెరికన్ ప్రెసిడెంటుకి ముద్దుబిడ్డ అయిపోయింది శ్రీ. ఆమెకి తోకలాగా లక్కీ."
"లక్కీ అంటే?" అన్నాడు కాశీ.
"లక్కీ అనేది ముద్దుపేరు. లక్ష్మి అసలు పేరు. చిన్నప్పట్నుంచి ఇద్దరూ క్లాస్ మేట్స్. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు."
"ఇంతకీ ఐశ్వర్యకి పెళ్ళయిందా?" అన్నాడు కాశీ హీనస్వరంతో. అలా అడుగుతున్నప్పుడు అతనికి తెలియకుండానే అతని గొంతు వణికింది.
బాలూ జవాబు చెప్పేలోపల చెట్టు మీద ఏదో శబ్దం వినబడింది.