కిచెన్ లోకి తీసుకెళ్ళాడు బాలు. అక్కడ ఓ యాభై మంది కుక్ లు రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారు. వంటల పోటీల్లో ఒలింపిక్స్ లాగా ఉంది వాతావరణం.
తయారవుతున్న సిరప్ లో వేలు ముంచి నాలికకు తాకించుకుని చూసి "బావుందిరా బేటా!" అన్నాడు బాలూ ఓ జూనియర్ కుక్ తో. అంతా ఓసారి సూపర్ వైజ్ చేసివచ్చి "ఒక టీ వేద్దామా!" అన్నాడు.
"తాగను" అన్నాడు కాశీ.
"కాఫీ"
"టీ, కాఫీ, సిగరెట్, పాన్... ఏవీ అలవాటు లేదు"
"నువ్వేం మారలేదన్నమాట! నీ ఖర్మ!" అని పెద్ద మగ్గులో టీ తెచ్చుకుని సిగరెట్ వెలిగించి ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడు బాలూ. కాశీ కూడా కూర్చున్నాడు.
"అయితే అమ్మాయిగారి చరిత్ర వినాలని ఉందన్నమాట!"
తలఊపాడు కాశీ.
"కాశీమజిలీ కథ ఒకటి చెబుతున్నట్లే ఉంటుందనుకో!"
ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు కాశీ.
డ్రమెటిక్ గా గొంతు సవరించుకున్నాడు బాలూ.
"ఐశ్వర్య రాజ్యశ్రీ ఇండియాకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది"
"అంతకు ముందు"
"అంతకు ముందంతా ఆమె అమెరికాలోనే ఉంది. అక్కడే పెరిగింది. తల్లీతండ్రీ చిన్నప్పుడే చనిపోయారు. తల్లి ముందు పోయింది. ఇప్పుడున్నామె సవతి తల్లి."
శ్రద్ధగా వింటున్నాడు కాశీ.
"అమెరికాలో న్యూయార్క్ లో పెరిగింది ఐశ్వర్య. న్యూయార్క్ అంటే నీకు తెలీదు. అక్కడి జనం చాలా ఫాస్టు. బాగా రూడ్ గా ఉంటారు. ఐశ్వర్యకి చదువుకంటే ఆటలంటే ఎక్కువ ఇష్టం. పొడుగు కాళ్ళు కదా. బాస్కెట్ బాల్ బాగా ఆడేది. వాళ్ళ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసింది కూడా. అలాగే టెన్నిస్ ఆడేది. ఛెస్ అంటే ప్రాణం. దానికి తోడుగా గోల్ఫ్... అలా గోల్ఫ్ ఆడటంలో ఓ గోల్ఫ్ కోర్సులో ఐశ్వర్యకి బాబ్ హోప్ తో పరిచయం అయింది.
"బాబ్ హోపా?" అన్నాడు కాశీ తికమకగా.
"అవును. బాబ్ హోప్. బాబ్ హోప్ తెలీదా?"
"తెలీదు"
కాశీ అజ్ఞానానికి జాలిపడుతున్నట్లు చూశాడు బాలూ. "అరె బాబ్ హోప్ తెలీదా! పెద్ద హాలివుడ్ స్టార్. మంచి కమెడియన్. సైడ్ ఫోజులో చూడు. నాలో కూడా బాబ్ హోప్ పోలికలు ఉన్నాయ్. మంచి కమెడియన్ అతను. బలే జోకులు చెబుతాడు. ఓసారి తను ఓ విమానంలో వెళ్తున్నాడుట. ఆ విమానం ఎంత పాత డొక్కు మోడలంటే అందులో టాయ్ లెట్స్ విమానం బయట ఉన్నాయట. ఇంకోసారేం చెప్పాడంటే..."
అతన్ని వారిస్తూ అన్నాడు కాశీ. "అసలు సంగతి చెప్పు బాలూ."
"వస్తున్నా. బాబ్ హోప్ మంచి ఆర్టిస్టూ, కమేడియనూ మాత్రమే కాక మంచి గోల్ఫ్ ప్లేయర్ కూడా. పైగా అతను అమెరికన్ ప్రెసిడెంట్లలో చాలా మందికి చాలా చాలా దగ్గర స్నేహితుడు. ఐసెన్ హోవర్ కి, నిక్సన్ కి, జార్జ్ బుష్ కీ, రొనాల్డ్ రీగన్ కి ఒకళ్ళని ఏమిటిలే. అందరూ అతని హ్యూమర్ నీ, గోల్ఫ్ నీ లైక్ చేసి ఫ్రెండ్ షిప్ చేస్తారు. చాలామంది ప్రెసిడెంట్లకు అతను పర్సనల్ గెస్టుగా ఉండేవాడు. ఓసారి రొనాల్డ్ రీగన్ గారి పరువు తీసేశాడు. రొనాల్డ్ రీగన్ తెలుసుగా. హాలివుడ్ హీరోగా ఉండి అమెరికాకి ప్రెసిడెంటు అయ్యాడు. రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు బాబ్ హోప్ అన్నాడూ "రీగన్ గనక ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయితే, పోస్టేజి స్టాంపులని కూడా వాల్ పోస్టర్ సైజులో టెక్నికలర్ లో వేయిస్తాడు" అని. దానికి రీగన్..."
"బాలూ" అన్నాడు కాశీ.
"ఓ... సారీ" అన్నాడు బాలూ. అని మళ్ళీ కథలోకి వచ్చాడు.
"ఓసారి ఓ పెద్ద గోల్ఫ్ కోర్సులో బాబ్ హోప్ ఆడుతున్నాడు. షాట్ కొట్టాలి. మధ్యలో చిన్న చెరువు లాంటిది ఉంది. బాల్ ఆ సరస్సులో పడకుండా అవతలివైపు ఉన్న హోల్ లో పడాలి. ఏ ఐరన్ తో కొడితే షాటు సరిగ్గా వస్తుందా అని ఆలోచిస్తున్నాడు బాబ్ హోప్. అయితే అక్కడే ఉన్న ఐశ్వర్య అది చూసి నవ్వింది. "ఏం బేబీ నవ్వుతున్నావ్?" అన్నాడు బాబ్ హోప్. "ఒక్క షాటుకి ఇంత ఆలోచిస్తున్నారే! నేను నేర్పించనా?" అంది. బాబ్ హోప్ నిటారుగా నిలబడి ఐశ్వర్యని ఎగాదిగా చూశాడు. "ఏమిటీ? నువ్వు నాకు గోల్ఫ్ నేర్పిస్తావా?"
"మీకు ఇంట్రెస్ట్ ఉంటే" అని అతని పక్కనే ఉన్న కాబ్బీ దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య. ఆ కాబ్బీ దగ్గర అమ్ములపొదిలాంటిది ఉంది. దాన్లో ఐరన్ లు అనబడే రకరకాల బాట్ లు ఉన్నాయి.
ఒక ఐరన్ తీసుకుంది ఐశ్వర్య.
'పక్కకు జరగండి!' అని బాబ్ హోప్ ని అదిలించి, తదేక దీక్షగా చూసి కొట్టింది.
బాల్ కేవలం నాలుగు అడుగుల దూరం దొర్లి బద్ధకంగా ఆగిపోయింది.
నవ్వబోయాడు బాబ్ హోప్.
ఆలోగానే అంది ఐశ్వర్య.
"నేర్పిస్తున్నా... గమనిస్తున్నారా... చేతకాని వాళ్ళు ఈ నెంబర్ ఐరన్ యూస్ చేస్తారు. ఇది యూస్ లెస్. బాల్ ఎంతో దూరం వెళ్ళదు. ఇదిగో ఈ ఐరన్ చూడండి" అని ఇంకో ఐరన్ తీసుకుని ఇంకో బాల్ పెట్టి ఎయిమ్ చేసి బలంగా కొట్టింది ఐశ్వర్య. అది ఆకాశంలో అంతెత్తున ఎగిరి సరస్సుని దాటి పక్కనే ఉన్న గుట్ట మీద పడింది.