Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 6

 

     పైకి నవ్వి "ఏం రిషీ బావుందా?" అని అడిగింది.

    "ఆ....శ్రి....త చాలా బావుంది" అన్నాడు రిషి.

    శ్రీజ చలాకీగా గుక్క తిప్పుకోకుండా ఆశ్రితతో ఎన్నో కబుర్లు చెప్పింది. హైమ, లేచి వెళ్తూ వెళ్తూ "రిషీ అమ్మాయిని రేపు హాస్పిటల్ తీసుకురా" అని చెప్పి వెళ్ళింది. హైమ అక్కడ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగం చేస్తుంది. శ్రీజ ఎన్నో పనులు చేస్తానంటుంది కానీ కుదురు లేక ఏ పనీ పట్టుమని పదిరోజులు కూడా చెయ్యదు. ఆమె తండ్రి కాళిదాసుకి నాటకాలు పిచ్చి, దానికి తోడు తాగుడు. ప్రతిరోజూ అర్ధరాత్రి పెద్ద గొంతుతో ఏ కృష్ణరాయభారం పద్యాలో పాడుకుంటూ ఇల్లు చేర్తాడు. అక్కడనించీ పెద్ద గొడవ.

    హైమని నాలుగు బాదడమో లేక ఆమె చేతిలో నాలుగు తినడమో చేస్తే కానీ పడుకోడు. ఇరుగు పొరుగుల్ని పడుకోనివ్వడు.

    రిషి ఆఫీసుకి వెళ్తూ ఆశ్రితతో చెప్పాడు "మీరు ఆ బ్రెడ్ తిని నేను వచ్చేసరికి కాస్త వంట చేసే ప్రయత్నం చూడండి. రాగానే డాక్టర్ దగ్గర కెళదాం!"

    ఆశ్రిత కూర్చున్న చోటునుండి లేవకుండానే అతన్ని పరీక్షగా చూసింది.

    రిషి కాస్త దగ్గరగా వచ్చి - "రాత్రి ట్రైన్ లో ఏం జరిగిందో గుర్తు వుందా?" అన్నాడు నెమ్మదిగా.

    ఆశ్రిత తల అడ్డంగా వూపి- "ఏం జరిగిందీ?" అంది.

    రిషి సిగ్గుపడి- "ఏక్సిడెంట్.... అంతే" అనేసి వెళ్ళిపోయాడు.

    ఆశ్రిత లేచి వంట గదిలోకి వెళ్ళింది. సీసాల్లోంచి పప్పులూ, ఉప్పూ, పంచదారా అన్నీ కనిపిస్తూనే వున్నాయి. ఆమె బియ్యం ఓ గిన్నెలో పోసి కడిగి స్టౌ మీద పెట్టింది.

    రిషికి ఆరోజు ఆఫీసులో అసలు పని చెయ్యబుద్ధి కాలేదు. ముసలి మేనేజర్ ఖళ్.... ఖళ్ మని దగ్గుతూ రాత్రి ఏక్సిడెంట్ గురించి ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నాడు.

    "అబ్బా...." అన్నాడు రిషి.

    "ఏమైంది?" మేనేజర్ కంగారు పడ్డాడు.

    "ఛాతీలో నొప్పి.... రాత్రి కాస్త దెబ్బ తగిలింది" నోటికొచ్చిన అబద్ధం ఆడాడు రిషి.

    "అయ్యో.... ఆఫీసుకెందుకొచ్చావు మరీ...." ఆయన సానుభూతి కురిపించాడు. ఆయనకి నలుగురు ఆడపిల్లలు పాపం! "వెళ్ళు.... వెళ్ళి రెస్ట్ తీసుకో. మా సౌభాగ్యాన్ని పంపించమంటావా కాస్త ఉడకేసి పెడుతుందీ" అన్నాడు. సౌభాగ్యం ఆయన పెద్ద కూతురు.

    రిషి కంగారుగా---- "ఒద్దండీ.... వంట చేసుకునే వచ్చాను" అన్నాడు.

    ఆయన వినిపించుకోకుండా- "మా సౌభాగ్యం చేతివంట తింటే ఇక జన్మలో విడిచిపెట్టవనుకో. మొన్న అరటి పువ్వుకూర వండింది. ఎలా వుందనుకున్నావ్?" అంటూ సౌభాగ్యం వంట గురించి పురాణం విప్పసాగాడు.

    "గుండెల్లో కలుక్కుమంటోంది. ఇక ఇంటికి వెళతాను" చెప్పాడు రిషి.

    "పోనీ సాయంత్రం సౌభాగ్యాన్ని...."

    "ఒద్దండీ సాయంత్రం భోజనం చెయ్యను" అనేసి రిషి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు.

    తను ఇంటికి తను వెళ్ళడానికే రిషికి చాలా బెరుగ్గా అన్పించింది. నెమ్మదిగా తలుపు తోసాడు. ఆశ్రిత నేలమీద చాప వాల్చుకుని పడుకుంది. ఓ పక్కకి తిరిగి పడుకోవటంలో జడ భుజం మీదుగా నడుమ పైనుంచి క్రిందికి దూకి అక్కడ కుదురుగా పరుచుకుని చెలియలి కట్టను తలపిస్తోంది. రిషి అలాగే ఓ క్షణం నిలబడి- "కుచ సీమ నటించుచు.... ఏటిదాటుతో తొడ నును వంపులో బడి తూలుచు....ఎరుగని కోర్కెల నెన్నో స్ఫురియించుచు...." అనుకున్నాడు.

    ఆమె కుడి చెంప మీదనున్న నల్లని పుట్టుమచ్చ అతని దృష్టిని ఆకర్షించి 'దృష్టి తగిలేనుసుమా!' అని హెచ్చరించింది. పక్కకి తిరగడంలో మెడ క్రింద ఏర్పడిన సన్నని దారి మూసుకుపోయి 'నో ఎంట్రీ' అంది. ట్రాఫిక్ జామ్ లో చిక్కుపడి పోయినవాడిలా అతని కళ్ళు అక్కడే ఆగిపోయాయి.

    ఎప్పటికయినా మార్గం సుగమం కాదా! అనుకుంటూ తెరుచుకోనీ తలుపు అరసి రానీ వలపు జ్ఞాపకం చేసుకున్నాడు.

    ఎవరో సప్త వర్ణాల పూవ్వులతో కూర్చిన బాణం ఎక్కుపెట్టారు.

    రిషి ఆగలేక అడుగు ముందుకి వేసాడు.

    బాణం గురి సూటిగా చూసి వదిలారు.

    రిషి ఆమె ప్రక్క కూర్చుని తన చేతిని ఆమె నడుం ఒంపులో వేసాడు.

    బాణం రివ్వున వచ్చి అతడికి తగలవలసిన తావునే తగిలింది.

    రిషి ఆగలేక ఆమె మీదికి వంగి ఆ పుత్తడిబొమ్మని తనవైపుకి తిప్పుకున్నాడు,

    ఆమె కళ్ళు తెరిచింది. రిషిని అంత దగ్గరగా చూసేసరికి ఆమె కనుపాపలు భయంతో పెద్దవయ్యాయి. చిగురుటాకుల్లా అల్లాడిపోతున్న పెదవులతో- "ఏమిటీ?" అంది.

    రిషి వెంటనే లేవబోయాడు.

    మనసుపెట్టి ఆపి- "నే చెప్పినట్లు విను" అంది. రిషి ఆమె మెడ క్రింద చేతిని వేసాడు.

    ప్రాణాలు పోతున్నంత సుఖంగా అన్పించింది. ఆ మెత్తదనానికి అతనికి భయంవేసింది. గబుక్కున తీసి కెవ్వున అరిచాడు.

    "ఏవైందండీ?" ఆశ్రిత అదాటుగా లేస్తూ అంది.

    రిషి గుప్పెట బిగించి ఆపకుండా అరుస్తూనే ఉన్నాడు.

    "అరె....ఏం జరిగింది?" ఆశ్రిత అతని గుప్పెట తెరుస్తూ అంది.

    అతను గుప్పెట విప్పగానే అందులోనుంచి కొనప్రాణాలతో బైటపడిన బల్లి క్రిందపడి జరజరా గోడవారకి వెళ్ళిపోయింది.

 Previous Page Next Page