Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 6

    అందుకే వాళ్ళు  పరమశివాన్ని  అనుమానించలేదు.

    అప్పటికి అర్దరాత్రి దాటి రెండు గంటలయింది.

    ఇక నేవస్తానంటూ పరమశివం ఇంటిదారి పట్టాడు. ఆ ఇద్దరూ  ఇంకా కసిగా త్రాగుతూనే వుండిపోయారు.

    తండ్రి తలుపు తీసుకుని లోపలకు  వస్తున్నట్లు  గ్రహించాడు ఉదయ్.

    అప్పటివరకూ జేబులో భద్రంగా దాచుకున్న  పోలీస్ విజిల్ ను, భయంగా  చొక్కా పైనుంచే  తన గుప్పెట్లో  బిగించాడు ఉదయ్.

    పరమశివానికి  పడుకునేముందు కొడుకు నుదుటిమీద ప్రేమగా ముద్దు పెట్టుకోవటం  ఎప్పటినుంచో  వస్తున్న అలవాటు. ఆ అలవాటు ప్రకారమే పరమశివం కొడుకు  మంచం దగ్గరకు వచ్చి బెడ్ లైట్ వెలుగులో  కనిపిస్తున్న తన ముద్దుల కొడుకు ముఖంపైకి  వంగాడు.

    ఉదయ్ ఊపిరి  బిగపట్టాడు  తను చేసింది తప్పో_ఒప్పో తనకి తెలియదు, కాని ఒక తప్పు కాలిపోయింది. దానికి కారణం తనేనని పట్టాభి, మధుమూర్తి అంకుల్స్ తెలిస్తే?

    ఆ భయంతోటే ఉదయ్ నుదుటిమీద చెమటపట్టేసింది.

    కొడుకు నుదుటిని తాకిన  పరమశివం  తన పెదాలకు తడిగా, ఉప్పగా  తగలటంతో  ఓ క్షణం  ఉలిక్కిపడ్డాడు.

    అదే సమయానికి ఉదయ్ కూడా ఉలిక్కిపడ్డాడు.

    పరమశివం కనుబొమ్మలు ఆశ్చర్యంతో  పైకి లేచాయి.


                               *    *    *


    సరిగ్గా అదే సమయంలో -

    అక్కడ మామిడితోపులో -

    మనకింత నష్టం తెచ్చిపెట్టిన వాడెవడైనా సరే వాడ్ని ప్రాణాలతో బ్రతకనివ్వను.

    "వేటాడి, వేటాడి వధిస్తాను"

    పట్టాభి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయ్.

    "అది తెలుసుకోవాలంటే  ముందు పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసుని కొనేయాలి. అప్పుడు....వారికా ఇన్ ఫర్ మేషన్ అందించిన వారెవరు అయింది? ఎలా వచ్చింది? ఎప్పడొచ్చింది? అనే వివరాలు కొంతవరకు తెలియవచ్చు.

________________________________________________________________________________

    ఈ వ్యవస్థలో రాత్రికి  రాత్రి లక్షాధికారులు కావటం ఎక్కువ వడ్డీకి ప్రలోభపడి  మధ్యతరగతి  మిధ్యాజీవులు  మోసపోవటమూ  రెండూ సర్వసాధారణమే. అసత్యం చెప్పకూడదనుకుంటే  సత్యాన్ని  దగ్గరకు రానివ్వకూడదు.
   
    అన్యాయంగా  బ్రతకగూడదనుకుంటే  ఆకలికి భయపడకూడదు.

________________________________________________________________________________

    ఉదయం  తొమ్మిదిగంటలకే  ఒక పోలీస్ ని కొనేయటం జరిగిపోయింది.

    "రాత్రి ఓ లారీ తగలబడిపోయింది"

    పట్టాభి నాందీప్రస్తావనగా అన్నాడు.

    "అరే....మాకింకా తెలియదే?"

    పోలీస్ ఆశ్చర్యపోయాడు.

    పట్టాభి, మధుమూర్తి ఉలిక్కిపడ్డారు.

    "ఆ లారీలో గంజాయి వుందనే  అనుమానంతో మీ పెట్రోలుకారు వెంటాడింది"

    "మా పెట్రోల్ కారు నిన్న సాయంత్రమే చెడిపోయింది. రాత్రంతా అది స్టేషన్ ముందే వుంది."

    "అబద్ధం" మధుమూర్తి గట్టిగా  అన్నాడు.

    "మీరు డబ్బిచ్చారు. నిజం కావాలన్నారు. నిజానికి విలువ ఇవ్వకపోయినా డబ్బుకు విలువ ఇస్తాను.

    నేను చెప్పేది నిజమే.' పోలీస్ స్థిరంగా అన్నాడు.

    "మరి రాత్రి ఊరు శివార్లలో మీ పోలీస్ పెట్రోల్ కారు సైరన్, మీ విజిల్స్ వినిపించాయట"

    పోలీస్ నవ్వాడు.

    ఆ ఇద్దరికీ పిచ్చికోపం వచ్చింది.

    "చిన్నపిల్లల బొమ్మలుకూడా ఆ శబ్దాల్ని  సృష్టించగలవు."

    తేలికగా  అన్నాడు పోలీస్.

    "అంటే....నిజంగానే  మీకు గంజాయి లారీసంగతి  తెలియదా?" ఏ ఇన్ ఫర్ మేషన్ మీకందలేదా? మీరు దాడి చేయలేదా?"

    "లేదు....ఇంతకీ ఎవరిదా లారీ? ఎవరిదా గంజాయి? ఏమా కథ?"

    పోలీస్ తన సహజధోరణిలో ఆరాలోకి దిగాడు.

    "మేం నీకు డబ్బులిచ్చింది మేమడిగే ప్రశ్నలకు  సమాధానాలివ్వటానికి. నీవు ప్రశ్నలడగడానికి కాదు."

    అంటూ విసురుగా లేచి హోటల్ లోంచి బయటకొచ్చేశాడు పట్టాభి.

    ఆ వెనుకే మధుమూర్తి కూడా వచ్చేశాడు.

    ఇద్దరూ రోడ్డెంట నడుస్తున్నారు.

    పట్టాభి ఆలోచిస్తున్నాడు. తమకెవరయినా శత్రువులున్నారా అని.

    "ఏమాలోచిస్తున్నావు?" మధుమూర్తి దిగులుగా అడిగాడు.

    "మనకెవరన్నా శత్రువులున్నారా అని."

    మధుమూర్తికి  అప్పుడు గుర్తుకొచ్చాయి పోలీసు అన్న మాటలు.

    "కేవలం శత్రువులున్నారా  అన్నంతవరకే  ఆలోచించి లాభం లేదు. ఆ శత్రువులకు పిల్లలున్నారా అనే అనుమానం చివరివరకు ఆలోచించు."

    పట్టాభి నడుస్తున్నవాడల్లా చటుక్కున ఆగిపోయాడు.
 

 Previous Page Next Page