Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 5

    "ఆ....ఆ....అలా ఆవేశపడిపోకండి  మరి. ఇది మీ ఫ్యాక్టరీ. మీకు తెలియకుండానే గంజాయి పెరిగిందా? అని ఎక్సైజ్ వాళ్ళు అడుగుతారు. పోలీసువాళ్ళు ఎముకలు విరగగొడతారు. న్యాయస్థానంవాళ్ళు పధ్నాలుగేండ్లు రాజమండ్రికి అతిథిగా పంపిస్తారు.

    బుద్దిగా నోరు మూసుకుంటే....కళ్ళు కూడా మూసుకుంటే నా చెయ్యి బొడ్లోకి వెళ్ళదు.

    నా సంగతి మీకు తెలుసనుకుంటాను. అసలే నా చెయ్యి బహు చెడ్డది. మర్యాదగా మీ దగ్గరున్న  గంజాయి కాయల్ని  యిలా  యిచ్చి అలా వెళ్ళిపోండి" అంటూ దూకుడుగా ఒకడుగు ముందుకు వేశాడు దుర్గదాసు.

    అతని గురించి, అతని రాక్షసత్వం గురించి పరమశివానికి బాగానే తెలుసు, పళ్ళు పటపట కొరుకుతూ జేబులో దాచిన కాయల్ని తీసి దుర్గాదాసు పైకి విసిరేసి చీకట్లో కల్సిపోయాడు.

    దుర్గాదాసుకు, తన తండ్రికి జరిగిన సంభాషణంతా ఉదయ్ ఓ పొదచాటు నుండి విన్నాడు.

    ఏదో తప్పుపని పట్టాభి అంకుల్, మధుమూర్తి అంకుల్ చేశారు.

    తన తండ్రి మంచివాడు. చెడ్డపనులంటే కోపం తను చేయడు. అమ్మని, అక్కని తనను కూడా చేయనివ్వడు.

    ఊరంతా తన తండ్రి మంచివాడు అని అనుకోగా చాలాసార్లు విన్నాడు. అలా అందరూ తన తండ్రిని మెచ్చుకోవటం తనకు గర్వంగా వుంటుంది. అందుకే తను ఎప్పుడూ అసత్యం పలకడు, చేదు పనులు చేయడు. ఆ చిన్న మనస్సులో  ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా చోటుచేసుకున్నాయి.

    జరిగిన సంభాషణను  బట్టి  మరికొన్ని విషయాల్ని కూడ అర్ధం చేసుకున్నాడు ఉదయ్. ఆ తప్పు కూడదని గట్టిగా అంటే దుర్గాదాసు తన తండ్రిని కొడతాడు.

    పోలీసులకు తెలిపితే తన తండ్రిని కూడా జైల్లో వేస్తారు. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే  ఆ మొక్కల్ని తగలబెట్టాలి. ఆలోచిస్తూ చీకట్లో తండ్రిని అనుసరించాడు ఉదయ్.

    ఆ తరువాత రెండు రోజులపాటు  తండ్రి ముభావంగా, మౌనంగా వుండటం  ఆ పసి మనస్సుని గాయపరిచింది. ఏదో ఒకటి చేసి తండ్రి మునుపటిలా నవ్వుతూ వుండేలా చేయాలి.

    ఎప్పటిలా తండ్రిచేతి గోరుముద్దల్ని  తను తినాలి అంటే తప్పదు.
   
    పరమశివానికి తమవిషయం  తెలిసిపోయిందని పట్టాభి ,మధుమూర్తి  మరుసటిరోజే గ్రహించారు, నయానా, భయానా పరమశివం నోరు మెదపకుండా  కట్టడి చేయగలిగారు.

    సరిగ్గా  నాలుగు రోజులకు గంజాయి కాయలనుంచి  స్రవించిన పాలు నల్లటి జిగురులా తయారైంది.

    రాత్రికి రాత్రి ప్లడ్ లైట్ వెలుగులో పదిమంది నమ్మకమైన  కూలీల్ని పెట్టి గంజాయి జిగురును ప్రోగుచేయించి, అప్పటికప్పుడే  మొక్కల్ని పీకి ఓచోట కుప్పలా వేసి  పెట్రోల్ పోసి  తగులబెట్టించారు.

    ప్రోగుచేసిన జిగురును పాలిథిన్ బ్యాగ్ లో పార్సెల్ చేయించి మరుసటి రోజు రాత్రి సరిహద్దుల్ని  దాటించి, అవతలపార్టీకి  అందజేసే పథకాన్ని అతి జాగ్రత్తగా రూపొందించాడు పట్టాభి.

    పరమశివం భయంతో నోరు మెదపటం మానేసి అప్పటికి సరిగ్గా వారం రోజులు.

    ఆ మరుసటి రోజు రాత్రి గంజాయి  పార్సెల్స్ ని లోడ్ చేసుకున్న లారీనేషనల్ హైవే ఎక్కింది. పది కిలోమీటర్స్ ప్రయాణించే  వరకు ఎలాంటి అవరోధం ఎదురుకాలేదు.

    సరిగ్గా  పదకొండో కిలోమీటరు రాయి దగ్గరవుతుండగా  పోలీసు పెట్రోల్ కారు సైరన్, విజిల్ వినిపించి ఉలిక్కిపడ్డారు.

    ఆ లారీలో వున్న ఇద్దరు వ్యక్తులు వున్నకొద్దీ సైరన్ విజిల్ శబ్ధాలు  దగ్గర కాసాగాయి. ఇక తప్పదు, ప్రమాదం ముంచుకురానున్నదని  భావించిన ఆ లారీలోని వ్యక్తులు లారీని రోడ్డు దింపి, ఓ చోట ఆపేసి పెట్రోల్ టిన్నులు ఓపెన్ చేసి లారీ మీద విసురుగా చల్లి దూరంగా పరిగెడుతూ అగ్గిపుల్ల విసిరేశారు.

    అంతే....

    మంటలు భగ్గున  మింటికెగసాయి.

    పట్టాభి, మధుమూర్తి కలల్ని  చెదరకొడుతూ  ఆ మంటలుగంజాయి సంచుల్ని  చుట్టుముట్టాయి.

   
                               *    *    *

    సరిగ్గా అర్దరాత్రి కావటానికి  మరొక్క  నిమిషమే ఉందనగా ఆ వార్త పట్టాభిని, మధుమూర్తిని చేరుకుంది.

    ఆ ఇద్దరూ ఒక్కసారి కుప్పలాకూలిపోయారు. ఆ షాక్  నుంచి తేరుకునే  ప్రయత్నంలో  భాగంగానే__

    ప్రస్తుతానికి వస్తే....

    ఇప్పుడు  ఒళ్ళు పై తెలీకుండా  మధ్యపానంలో  మునిగిపోయారు.

    "కంపెనీ పేరుమీద అప్పులుచేసి ఆ పంటను  పెంచారు.

    ఇప్పుడేమయింది?

    "నాకేమిటో దిగులుగా వుంది."

    అన్నాడు పరమశివం బాధగా.

    "అసలిదెలా జరిగింది?

    పట్టాభి అనుమానంగా గొణిగాడు.

    "మన ముగ్గురికీ, దుర్గాదాసుకి, ఆ పదిమంది కూలీలకు  తప్ప మరెవరికీ తెలియదు.

    ఆ కూలీలు పిరికివాళ్ళు_కనుక బయటపడరు. ఇక దుర్గాదాసు  మనవాడే, ఇక మిగిలింది మన ముగ్గురమే. మనమెలాగూ చెప్పం. మరెలా ఇన్ ఫర్ మేషన్ పోలీసులకు చేరింది?

    మధుమూర్తి సాలోచనగా అన్నాడు.

    ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ  పరమశివం తప్పడని  ఆ ఇద్దరికీ గొప్ప నమ్మకం.

 Previous Page Next Page