మూలకు కూర్చున్న నాంచారమ్మ కుమిలిపోతూంది. కొలిమిలో పెట్టి తిత్తితో ఊదినట్లుంది ఆమె పరిస్థితి. ఆమె మనోఫలకం మీద గురువయ్య ముసలాడు, భీముడు_గురువయ్య! ఎంత అవలీలగా బస్తాలు లోపల పడేశాడు. అవును స్వామి చెప్పింది నిజం. వాస్తవంగా ఆ భీముడు లేకుంటే!
ఆమెకు నారాయణస్వామి శవం కనిపించింది. తాను పక్కన ఏడుస్తున్నట్లనిపించింది.
తన మాంగల్యం కాపాడినవాడు భీముడు _ గురువయ్య. నిజంగా అతడు దేవుడు కాదుగదా! కాకుంటే స్వామి అలా ఎందుకంటారు! అతణ్ణి తాను తిట్టింది. నిజమే. అతడు మారు పలకలేదు. అదీ నిజమే. మాలవాడు మారుపలకగలడా!
అవును మాలవాడు! అతడు మాలవాడు!!
అది తలచుకునేవరకే ఆవిడకు గురువయ్య విషయంలో ఏర్పడ్డ గౌరవం అంతా కరిగిపోయింది.
తాను ఉన్నమాట అన్నది. అన్నందుకు కొట్టాడు భర్త. తాను చేసిన తప్పేమి? ఏం చేసింది తాను? ఎందుకు కొట్టాడు భర్త?
ఏదో లోపం ఉంది అనుకుంది. భర్త మనసెరిగి ప్రవర్తించలేకపోయాననుకుంది. అతనికంటే శాస్త్రాలు తనకు తెలియవనుకుంది. అతడు చెప్పిందే తనకు శాస్త్రం అనుకుంది. కొంగుతో కళ్ళు తుడుచుకుంది. లేచింది. వసారాలోకి నడిచింది. బల్లపీటమీద కూర్చున్న నారాయణస్వామి పాదాలంటి నమస్కరించింది.
"తప్పు నాది నాంచారూ" అన్నారు స్వామి గద్గద స్వరంతో.
"అట్లనకండి స్వామీ తప్పు నాది" అన్నది రుద్ధకంఠంతో నాంచారు.
"నాంచారూ!" అని చేతులు చాచారు స్వామి.
నాంచారు స్వామి బాహుబంధాల్లో ఒదిగిపోయింది.
4
గురువయ్య:-
గూడెంలో గుడిసె ఉంది.
గుడిసెలో పడుచు పెళ్ళాం ఉంది_లచ్చమ్మ.
తాటివనంలో కల్లుంది.
పాడుకోవడానికి పదాలున్నాయి.
దున్నుకోవడానికి 'ఇనాము' ఉంది.
కాజేయటానికి షావుకారు ఉన్నాడు.
గురుయ్య రెక్కలు దాచుకునే మనిషి కాడు. కూలి ఇస్తాం రాళ్ళు కొట్టమంటే గంటలో కొట్టి పడేస్తాడు. 'నీ వంతు వచ్చింది వెద్ది చేయా'లంటే పదాలు పాడుతూ చేస్తాడు. డబ్బు చేతిలో వున్నా లేకున్నా తాటి వనానికి వెళ్తాడు_ప్రతిరోజూ. చింతచెట్టుకింద, కాలువ పక్కన, తాటివనంలో వాడుకగా కల్లు పోస్తుంది బుచ్చమ్మ. కల్లు తాగి, పదాలు పాడుతూ ఇంటికి చేరుకుంటాడు.
ఆనాడు తాటివనానికి పోతుంటేనే తటస్థపడ్డది నారాయణస్వామి గండం. గండం గడిపించానని తెలీదు గురువయ్యకు. మామూలుగానే వెళ్ళాడు వనానికి. మోదుగాకు నోటికాడ పెట్టుకున్నాడు. బుచ్చమ్మ ముంతెడు కల్లు పోసింది. తాగాడు. అప్పటికే చీకటి పడింది. పదం పాడుతూ బయల్దేరాడు_
ఆ మాట లంటదే
అట్టనే అంటదే_కోడిపిల్ల.
గంగల తానాలు చేసినానంటదే.
కంసాలి చిన్నోన్ని కరిచినానంటడే
ఉప్పూ, మిరియం రుచి చూచినానంటదే
కొండల ఉడుకుతుంటె
కాశీ కైలాసం చూచినానంటదే
ఆ మాట లంటదే
అట్లనే అంటదే_కోడిపిల్ల.
పాడుతూ వస్తుంటే రామకిష్టయ్య ఇంటి ముందు జనం కనిపించారు. ఏమిటో చూతామని దూరంగా నుంచున్నాడు. రామకిష్టయ్య వణుకుతున్నాడు. పెండ్లానికి చెమటలు పట్టాయి. నోటమాట రావడం లేదు. విధవ బిడ్డ ఎంకమ్మ దుమ్ములో కూలబడి ఏడుస్తున్నదల్లా గురువయ్యను చూచి రాగయుక్తంగా.
"నాయనో గురువడొచ్చిండే" అన్నది.
రామకిష్టయ్యకు ప్రాణం లేచి వచ్చింది. "ఒరే గురువా! పాము దూలానికి పట్టుకొని ఉన్నదిరా! ఇంకోనికి చాతకాదురా! నువ్వే కొట్టాలిరా" అన్నాడు.
"పామొచ్చినాది! ఏది చూసొస్త" అని ఇంట్లోకి దూరాడు. అంతా తప్పుకున్నారు. లోపలివాళ్ళు బయటికి వచ్చేశారు. చూశాడు గురువయ్య! దూలం మీద ఉంది! తెల్లని త్రాచు!!
పడగ కనిపించలేదు కాని త్రాచని కనిపిస్తూనే ఉంది, ఒడుపు దొరకడం లేదెవరికీ. దూలందాకా ఎక్కి కొట్టడానికి గుండెల్లేవెవరికీ.
గురువయ్య పామును చూచాడు.
"దండం నాగమయ్యా! ఎల్లిపో, ఈడ ఏమున్నదని వచ్చినవు. కావల్నంతే కోమటాయన పాలు పోస్తడు తాగిపో" అని బయటికి వచ్చాడు. "అది నాగుబాము. నేను కొట్టనుండి. పామును కొడ్తే పిల్లలుండరట!" అని సాగిపోతుండగా అడ్డగించి బ్రతిమిలాడాడు రామకిష్టయ్య. రామకిష్టయ్య పెండ్లాం కాళ్ళు పట్టుకునేంత పర్యంతం బ్రతిమిలాడింది. రామకిష్టయ్య విధవ కూతురు ఎంకమ్మ గురువయ్య ముందొచ్చి నుంచుంది. ఎంకమ్మ పడుచుదే. పరువులు పెడుతున్న పరువంలో ఉంది. రజస్వల కాకముందే భర్త పోయాడు. పోతాడని తెలిసే చేశాడు రామకిష్టయ్య. కూతురుతోపాటు ఆస్తినీ ఇంట్లో పెట్టుకున్నాడు.
మిసమిసలాడే వయసులో ఉంది ఎంకమ్మ. ఎంకమ్మను గురించి చాలా పుకార్లున్నాయి.
ఆమె కళ్ళల్లో కాలం బుసలు కొడుతున్నది. ఎంకమ్మ గురువయ్య ముందుంది. పండువెన్నెల!
"భీమునోలె ఉన్నవు పామును కొట్టలేవా, హుఁ" అన్నది ఎంకమ్మ.
గురువయ్యలో అహం పడగ విప్పింది. "కర్ర తేరి. నిచ్చెన తేరి" అన్నాడు.
రామకిష్టయ్య దంపతుల ప్రాణం లేచివచ్చింది.
"కట్టె ఇగో, నిచ్చెనేసే ఉన్నది" అన్నాడు రామకిష్టయ్య.
కర్ర అందుకొని లోనికి వెళ్ళాడు గురువయ్య__ఒక్కడు__ఒంటరిగా. బయట జనం వింత చూస్తున్నారు, ఒక్కడూ అడుగు లోన పెట్టలేదు__అది మాలవాడు అడుగు పెట్టిన ఇల్లు!!!
గురువయ్య పామును చూచాడు. మనసులో ఏదో సంకోచంగానే ఉంది, అయినా కర్ర అందుకొని నిచ్చెనెక్కాడు.
గుండె గుబగుబలాడింది. ఒడుపు దొరకడం లేదు. పాము కదిలినట్లయింది.