రాత్రి భోజనాల సమయంలో వీరయ్యగారు తాసిల్దారు దగ్గర జరిగిన వృత్తాంతం తెలియపరచాడు.
రఘు చిరువ్నవ్వు నవ్వి భోజనంలో నిమగ్నుడైనాడు.
అది చిరునవ్వేగాని వీరయ్యగారి మీద పిడుగులా పనిచేసింది. ఏమనాలో అర్థంకాలేదు. భోజనంలో నిమగ్నుడైనాడు. "తాసిల్దారు సంగతి నీకు తెల్వదు. ఆయనగాని మనమీద చెయ్యెత్తలేడు. పత్రిక, ఖానూను ఈ రెండు యిడ్చి పెట్టు. అంత బాగానే ఉంటది."
"ఎందుకట్ల జంకుతడు ఆ రొండంటె తాసిల్దార్?"
"గుడ్లగూబకు చీకట్లంటే యిష్టం, వెలుగంటే భయం" అన్నాడు రఘు. వీరయ్యగారికి ఏమి అర్థంకాలేదు.
"అయితే ఏం చేద్దమంటవు?"
"వెలుగు తేవాలి. గుడ్లగూబ కండ్లు తెరవలేదు."
అయోమయంలో పడిపోయాడు వీరయ్యగారు. రఘు చెప్పింది అతనికి ఏమి అర్థంకాలేదు. అర్థం చేసుకోవడానికి ఆలోచనలో మునిగిపోయాడు.
సంభాషణ ఏమీ అర్థంకాక తినమకపడ్డది జానకి. దుఃఖం కూడా వచ్చింది. ఎందుకు తన బావ ఇలా మారిపోతున్నాడని!
ఇద్దరూ లేచారు. చేతులు కడుక్కున్నారు. వీరయ్యగారు ఆలోచిస్తూనే తన గదికి వెళ్ళిపోయారు. రఘు వెళ్తుంటే తువ్వాలు అందించింది జానకి. తువ్వాలు అందుకుంటూ కళ్ళలోకి చూచి చిరునవ్వు నవ్వాడు రఘు. ఆ నవ్వు స్నిగ్ధంగా ఉంది. జానకి ఎదలో వెన్నెల విరిసింది.
రఘు గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి అన్నం ముందు కూర్చుంది. రఘు చిరునవ్వు జానకి పెదవులమీద కనిపించింది. అన్నం తింటూ తనలో తానే నవ్వుకుంది. ఎందుకు నవ్వుతుందో తనకే అర్థం కాలేదు. బావను అర్థం చేసుకుంటానికి ప్రయత్నించింది. గుడ్లగూబ తనకేమి అర్థంకాలేదు. ఆమెకు అర్థం అయిందీ ఆనందాన్నిచ్చిందీ చిరునవ్వు. తన బావ ఎప్పటికీ నవ్వుతుండాలనిపించింది. గుడ్లగూబను మరచిపోవాలనుకుంది రాముని ప్రార్థించింది కూడా - తన బావ గుడ్లగూబను మరచిపోవాలని. భోజనం ముగించి అన్నీ సర్దింది. తన గదిలోకి వెళ్ళడానికి పోతుంటే బావ పిలుపు వినిపించింది. ఆ పిలుపులో ఆవిడకు పూలబాట కనిపించింది. గదిలో అడుగు పెట్టింది.
"రా జానకీ! కూర్చో" అని కుర్చీ చూపించాడు రఘు.
జానకి కూర్చున్నది.
"పట్నం నుంచి నీకోసం ఏమి తెచ్చిన్నో ఎరికేనా?" అడిగాడు.
బావకు తాను గుర్తున్నానని ఆనందపడింది. తన కోసం బావ చీరెలు తెచ్చాడనుకుంది. రిబ్బన్లు తెచ్చాడనుకుంది. సొమ్ములు తెచ్చాడనుకుంది. ఏదో విచిత్రమైంది తెచ్చాడనుకుంది.
"చెప్పంది ఎట్ల తెలుస్తది?"
"అట్లనా?" అని లేచి పెట్టె తెరిచాడు. పుస్తకాలు తెచ్చి జానకి ఒళ్ళో పెట్టాడు.
జానకి వింతగా చూసింది.
"చీరెలు, జాకెట్లు, సొమ్ములు తేలేదని పుస్తకాలు తెచ్చినని ఆశ్చర్యపడుతున్నవు కదు. "క్షీయంతే ఖిలభూషణాని శకలం వాగ్భూషణం భూషణం" అన్నాడు భర్తృహరి. నగలన్నీ నాశనం అవుతాయి కాని చదువనే నగ నాశనమయ్యేది కాదు. పుస్తకాలు చదువు. లోకం తెలుస్తుంది. వెలుగు కనిపిస్తుంది."
జానకికి ఏమీ అర్థం కాలేదు.
జానకి ఒడిలోంచి ఒక పుస్తకం తీసి "ఇది 'అమ్మ' అనే నవల. మాక్సిమ్ గోర్కీ అనే మహా రచయిత రాసింది. ప్రభుత్వం దీనిమీద నిషేధం విధించింది. ఏం? భయమైతున్నదా? ఫరవాలేదు. చదువు పేదల పాట్లు అర్థం అయితయి" అన్నాడు.
తరువాత "మాలపల్లి', ముత్యాల సరాలు', మహాప్రస్థానం", 'మహాత్ముని ఆత్మకథ' ఇంకా కొన్ని పుస్తకాలను చూపి వాటిని గురించి పరిచయం చేస్తూ, వాటిలోని విషయాలను సంక్షిప్తంగా వివరించాడు. 'మహా ప్రస్థానం' చదివేశాడు.
జానకికి వాస్తవంగా వెలుగు కనిపించింది. పుస్తకాలను చదవాలని నిశ్చయించుకొంది. పుస్తకాలు చదవడం బావకు యిష్టం కాబట్టి చదవాలనుకుంది. వెంటనే గుడ్లగూబ గుర్తుకు వచ్చింది. ధైర్యంచేసి అడిగేసింది 'గుడ్లగూబ ఏమిటని.'
నవ్వాడు రఘు. "పుస్తకాలు చదువు. నీకే అర్థం అవుతుంది. గుడ్లగూబ ఏమిటి? కాకులేమిటి? అది ఎలా బతుకుతుంది. కాకులను ఎలా చంపుతుంది?
కాకులూ తనకు తెలియనివి కావు. గుడ్లగూబ తనకు తెలియనిది కాదు. ఆ రెంటి మధ్యనున్న సందర్భం ఏమిటో - రహస్యం ఏమిటో తనకు తెలియదు. ఆ అర్థం వచ్చే చూపు చూచింది జానకి. అర్థం చేసుకున్నాడు రఘు. "అవును ఆరాటంగా ఉన్నది కద! అయితే చెప్పుత విను" అని ప్రారంభించాడు.
"భారత యుద్ధం ఎరికేనా?"
తెలుసు నన్నట్టు తల ఊపింది జానకి. కథ వినడానికి ఆసక్తి కనబరుస్తూ కూర్చుంది.
ఆ యుద్ధం అయిపోయింది. దుర్యోధనుడు తొడలు విరిగి పడి ఉన్నడు. చావంగా మిగిలిన ముగ్గురు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు వచ్చినరు. తొడలు విరిగిన రారాజును చూచినరు. దుఃఖపడినరు. అశ్వత్థామ పాండవులను నాశనం చేస్తనని శపథం చేసిండు. రారాజు సంతోషపడిండు. ముగ్గురు కలసి బయలుదేరిన్రు. తోవలో సాయంకాలం అయింది. ఒక మర్రిచెట్టు క్రింద పడుకున్నరు. ఇద్దరూ నిద్రపోయిన్రు. కాని అశ్వత్థామ నిద్రపోలేదు. పాండవులను ఎట్ల చంపాలెనా అని ఆలోచిస్తున్నడు. నిద్రరాలే. ఇంతట్లో ఆ చెట్టుమీదికి ఒక గుడ్లగూబ వచ్చింది. మర్రిచెట్టుమీదున్న కాకుల మెడలు కొరకసాగింది. అట్ల అన్ని కాకులను చంపింది. అప్పుడు అశ్వత్థామ ఆలోచించిండు. నిద్రలో ఉన్నయి గాబట్టి గుడ్లగూబ కాకులన్నింటిని చంపింది అనుకొని గుడ్లగూబవలె బయలుదేరిండు అశ్వత్థామ. పాంచాలు లందరిని చంపిండు. తెల్లారినాక అర్జునుడు అశ్వత్థామను పట్టుకొచ్చిండు.
"తెలిసిందా-తాసిల్దారు గుడ్లగూబ; ప్రజల అజ్ఞానం చీకటి, ఈ చీకటి ఉన్నంతసేపే తాసిల్దారు ఆటలు సాగుతాయి. అజ్ఞానం అనే చీకటిపోయి వెలుగువస్తే తాసిల్దారు గుడ్డివాడైపోతడు."
జానకి ఆ కథను గురించి ఇంకేదో అడుగుదామనుకుంటుండగా తలుపు తట్టిన చప్పుడు అయింది. రఘు లేచి తలుపు తెరిచాడు. "రావచ్చునా నండి లోపలికి" అన్నాడు ఒక అపరిచిత వ్యక్తి. రఘు జానకి వైపు చూచాడు. జానకి లోనికి వెళ్ళిపోయింది.
వచ్చిన వ్యక్తి బక్కపలచగా ఉన్నాడు. కోలముఖం కొనదేరిన ముక్కు, కళ్ళు చాలా పెద్దవి. వెంట్రుకలు పొడుగే అయినా సంస్కార హీనంగా ఉన్నాయి. బట్టలమీద అట్టే ధ్యాస ఉన్న వ్యక్తి కాదు. హాఫ్ షర్టు వేసుకున్నాడు. వయసు ఇరవై-ఇరవై ఐదు ప్రాంతం.
గదిలో ప్రవేశించి తనను తానే పరిచయం చేసుకున్నాడు. "నమస్కారమండి. నా పేరు నాగేశం. అందరూ నగేశ్ అంటారు. ఈ జాగీర్లో పత్రిక చదివిటోణ్ణి నేనొక్కణ్ణే. మీ కొరకు పత్రిక తెచ్చిన" అని బొడ్లోంచి పత్రిక తీసి రఘుకు అందించాడు.
పత్రిక అందుకొని "థాంక్స్" అని పత్రిక విప్పి హెడ్ లైన్సు చదివి పత్రిక మడిచిపెట్టి "నిలబడే ఉన్నరేమి?" కూర్చోండి" అని కుర్చీ చూపించి. "ఎట్ల తెచ్చిన్రు" అడిగాడు.
"రొండు కోసులున్నది ఖాల్స. ఆడికి పత్రికలు వస్తయి. రోజు ఆడికే పోయి చదివి వస్త. ఇయ్యాల మీకోసం తెచ్చిన. ఇక రోజూ తెచ్చిస్త"
జానకి తన గదిలోకి వెళ్ళి మేనువాల్చిందనేకాని నిద్రపట్టలేదు. నాగేశ్ ను చూస్తే ఆమెకు ఎందుకో భయంవేసింది. రఘు గదిలో జరిగే సంభాషణ వింటూంది.
"చాటుగనా?
"అవ్. మళ్ళీ ఏం చేస్తము? ఆ జమాల్ గాడు మిమ్ములను కొట్టిండట గద. వాణ్ణి చంపుత పొడిచేస్త. తయారుగున్న ఇగొ జంబియా సుత తెచ్చిన" అని బొడ్లోంచి జంబియా తీసి ఒరలోంచి లాగి రఘుకు చూపించాడు.
దీపం వెలుగుకు తళతళా మెరుస్తూంది జంబియా. అది రఘు గుండెలో మెరిసింది. కళ్ళలో మెరిసింది. మెదడులో మెరిసింది.
"చంపి?" ప్రశ్నించాడు రఘు.
"చంపి బెజవాడ పరారైత. ఒకని పీడ విరగడైతది. చంపుక తింటడు మందిని."
"మీరు చంపుతరు. పరారైతరు. తాసిల్దారు ఇక్కడున్నోళ్ళ ప్రాణాలు తీస్తడు, పగున్నోళ్ళందరిమీద పగ దీర్చుకుంటడు. ఏమి లాభమైతది?"
"అట్లయితే వాణ్ణి చంపుత. నేను చస్త. భగత్ సింగ్ నైత. జులుంచేసెటోణ్ణి చంపి చస్త. హాయిగా చస్త ఏమంటరు? అంతకంటే ఏమి చేయమంటరు?" ఆవేశంతో అన్నాడు. ఉద్రేకంలో ఉన్నాడు. వణికి పోతున్నాడు.
రఘు జంబియా తీసుకున్నాడు. ఒరలో పెట్టి దిండు కింద పెట్టాడు. లేచి తలుపు తీసి వచ్చాడు. తానొక సిగరెట్టు తీసుకొని నాగేశ్ కు ఒకటి అందించాడు. ఇద్దరూ కాల్చుకున్నారు. నాగేశ్ కుర్చీలో కూర్చున్నాడు. రఘు సిగరెట్టు కాలుస్తు గదిలో పచార్లు చేయసాగాడు. నాగేశ్ ఆవేశంలో ఉన్నాడు. ప్రాణాలను సహితం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఎలా చెప్పాలి. సరి అయిన మార్గంలో ఎలా పెట్టాలి? ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాడు. నాగేశ్ రఘును తదేకంగా చూస్తున్నాడు. అడుగులు వేస్తూనే "నాగేశ్ గారూ!" అన్నాడు.