Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 5


    రఘుకు కూడా కునుకు పట్టలేదు. పత్రిక తేవడం నేరంకాదే! ఎంత ఘోరం! ఎంత రాక్షసత్వం. నడివీధిలో ఎంత ధైర్యంగా తనను కొట్టాడు. తనను కొట్టాడు సరే. అసలు మనుషులేనా ఇక్కడ ఉంటున్నది. ఇంత చీకట్లో ఇంత అజ్ఞానంలో ఎలా జీవిస్తున్నారు జనం? ఎలా సహిస్తున్నారు జనం? బ్రిటీషిండియాలో ప్రజలు స్వాతంత్ర్యానికి చేరుకున్నారు. ఖాల్సాలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడుతున్నారు. ఈ ప్రజలు ఇంకా మధ్య యుగాల్లోనే నలుగుతున్నారు. ఇందుకు గురించి ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? ఇంత దౌర్జన్యాన్ని ఎలా సహించాలి?

 

    ఆ ఇంట్లోవున్న మూడు ప్రాణులూ నిద్రపోలేదు. అయినా తెల్లవారింది. వీరయ్యగారికి అమీను నుండి పిలుపు వచ్చింది. ఆ పిలుపు విని చిరచిర లాడేరు వీరయ్యగారు. లోలోన ఖస్సు బస్సుమని కూడా అన్నారు. కాని వెళ్ళక తప్పదని వారికి తెలుసు-వెళ్ళారు.

 

    అమీను సయ్యద్ జమాల్ వీరయ్యగారిని పిలిచేవాడు కాదు. తాసిల్దారు పిలిపించాడని తెలిసింది. తాను పిలిపించకుంటే తన అధికారానికి ఏదో లోపం అనుకున్నాడు. పిలిపించాడు. అమీన్ అంటే పోలీసు సబినస్పెక్టర్. కాని యీ జాగీరు అమీను కింద నలుగురే పోలీసులుంటారు. అతని జీతం ఇరవై అయిదురూపయీలు హాలీలు. అయినా తాసిల్దారుకు ఏమాత్రం తక్కువ కారాదని అతని మక్కువ. తాసిల్దారు పిలిస్తే పోతాడు. సలాం చేస్తాడు. నుంచుండే మాట్లాడుతాడు. అతడు చెప్పిన పని చేయాలి కాబట్టి చేస్తాడు. అయినా మనసులో ఏదో తహతాహ. తాను పోలీసు అమీను. తాసిల్దారుని తలదన్నాలని అభిలాష. అందుకే వీరయ్యగారిని పిలిచింది.

 

    వీరయ్యగారు పోలీసు స్టేషనుకు చేరేవరకు మంగలి రావఁడి మీద నిప్పులు కురుస్తున్నాడు అమీను.

 

    "ఏంబే, బేగంసాబ్ కు గడ్డ అయిందని ఎరికిలేవచ్చి కట్టు కట్టొద్దుబే మాదర్ ఛత్"

 

    "వస్తనే ఉంటినికద బాంచను. తాసిల్దారు దొరకు మాలిష్ చేసి వస్తాన్న. కాల్మొక్త."

 

    "జవాబ్బీ చెప్పుతవ్ బే హరామ్జాదే" అని లేచి కర్ర అందుకొని రావఁడి మీద పడ్డాడు అమీను. బలంకొద్ది కొట్టసాగాడు.

 

    "కొట్టకు బాంచను, కాల్మొక్త, తప్పయింది, ఇగనుంచి చేయను. మల్లచేస్తే పానాలు తీయిరి. బత్కనీయరి కాల్మొక్త. బేగంసాబ్ కు కట్టు కట్త" అని బ్రతిమాలుకున్నాడు కాని కదలడు. కర్ర విరిగేదాక కొట్టాడు అమీను. ముక్కలైన కర్ర పారేసి "జాన్ భంచత్ కట్టు కట్టుపో" అని అరచి కుర్చీలో కూలబడ్డాడు.

 

    మంగలి రావఁడు పొది అందుకొని అమీన్ ఇంటివైపు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిం తర్వాత చూచాడు అమీను వీరయ్యగారిని. చూచి అతడు అనుకోకుండానే సలామ్ చేశాడు. "మంగలోళ్ళకు భీ మస్తీ ఎక్కింది" అని ఉరిమాడు. తన అధికారాన్ని వీరయ్యగారు గమనించాలని అతని ఆతురత.

 

    "ఏమో? పిలిచినవట" వీరయ్యగారు అడిగారు.

 

    "అక్బార్ తెచ్చినోడు మీ అల్లుడట గద. వాడు ఊళ్ళో వుండేటందుకు వీల్లేద్. ఇయ్యాల యెల్లగొట్టండి. లేకుంటే బాగుండద్! జమానా1 బాగాలేదు. జనం చేతులుంటలేరు" అధికారం వ్యక్తం అయ్యే స్వరంతో అన్నాడు అమీను. అందుకు లోలోన సంతోషించాడు!

 

    వీరయ్యగారికి కోపం పొంగింది. అయినా అణచుకున్నారు. "తాసిల్దార్ సాబ్ తోని మాట్లాడిన. అంత ఫైసలైంది.2 నా అల్లుడు నా ఇంటికొచ్చిండు. యాడికి పోతడు? జర తాసిల్దార్ సాబ్ లోని మాట్లాడు, తప్సిల్గా3 చెప్పుతడు. నాకు జర పొలంకాడ పనున్నది. పోయొస్త" లేచి చరచరా సాగిపోతుంటే మండిపోయాడు అమీను. ఆ కోపం ఎవరిమీద తీర్చుకోవాలా అని అటూ ఇటూ చూస్తే తట్ట నెత్తినేసుకొని పోతున్న ఒక పల్లెవాడు కనిపించాడు.

 

    "కోన్ హైబే? ఎవడ్రా పోయెడిది?" అని అరచాడు.

 

    "నన్నా బాంఛను" పల్లెవాడడిగాడు.

 

    "ఇంకెవరి ననుకున్నావ్ బే మాదర్ ఛత్. రాబే ఇక్కడికి."

 

    పల్లెవాడు వచ్చాడు. చేతులు జోడించి దండం పెట్టాడు.

 

    "ఏమున్నది బే బుట్టల?"

 

    "ఏమ్ లేదు బాంచెన్" అని వట్టి బుట్ట చూపించాడు.

 

    "అది కాదుబే హరామ్జాదే ఏమి తెచ్చినవ్?"

 

    "కోళ్ళు తెచ్చిన బాంఛను"

 

    "మళ్ళ అమీన్ సాబ్ కేదిబే?"

 

    "యాడ మిగిలినయి కాల్మొక్త. ఊరి బయటనే పోలీసాయనొకటి గుంజుకొన్నడు. ఊళ్ళకొచ్చెటార్కల్ల మాస్కూరాయ నొకటి గుంజుకున్నడు. తాసిల్దార్ దొర బంగ్ల ముంగల జవాను పట్టుకున్నడు. బుట్టకోడి గుంజుకున్నడు. కాల్మొక్త. కాలు కడుపులు పట్టుకొని బుట్ట తెచ్చుకున్న బాంఛను. మల్ల తెచ్చినప్పుడిచ్చుకుంట. గులాపోణ్ణి. మూడు కోడి పిల్లలు తెస్తిని మూడు గుంజుకొనిరి ఏం చెయ్యమంటారు. కాల్మొక్త."

 

    "అరె భంచత్ అమీనుసాబున్నడని ఎర్కలేద్బే. కుచ్ నైజాన్తా. కోడిపిల్ల కావాలె. లేకుంటే కొట్లెస్తం లం...కొడక. ఏమనుకొన్నావ్ అమీన్ సాబంబే హడ్డీ నరమ్ కర్తా*" అన్నాడు.

 

    లేంది యాడనుంచి తెచ్చిద్దును బాంచను. గరీబోల్లం."

 

    "జవాచ్చీ చెప్పతన్ చే" అని చింతబరికే పుచ్చుకుని బాదసాగాడు.

 

    "లేవు. నీ బాంచను, తప్పైంది. మల్లొచ్చినప్పుడు తెచ్చిస్త, బత్కనీయరి కాల్మొక్త" అని మొత్తుకున్నాడు అతడు.

 

    అదేమి వినలేదు అమీను. చితక్కొట్టి కొట్లోపారేశాడు. తరువాత తలపాగా, కాళీ బుట్టా లాక్కొని వదిలేశాడు.
__________________________________________________________

1.కాలం. 2.పరిష్కారమైనది. 3.వవరంగా. *ఎముకలు విరకొడ్తా.    

 

    ఇదేం వింత గాదు! హైద్రాబాద్ లోనే ఇలాంటిది జరిగిందట ఒకసారి.

 

    మహబూబలీఖాన్ పిల్లవాడుగా ఉన్నప్పుడే రాజయినాడట. దివాన్ అన్ని వ్యవహారాలూ నిర్వహించేవారట! అతని బంధువులను తొమ్మిది మందిని కొత్వాళ్లుగా నియమించాడట దివాను. ఒక పల్లెవాడు ఎనిమిది సొరకాయలు తీసుకొని అమ్ముకోడానికి పట్నం వచ్చాట్ట. ఎనిమిదిమంది కొత్వాళ్ళు ఎనిమిది సొరకాయలు లాక్కున్నారు. తొమ్మిదో కొత్వాలుకు మిగలకుంటే ఆ పల్లెవాణ్ణి నానా యాతన పెట్టాడట. పల్లెవాడు వెళ్ళిపోతూ రాజభవనపు గోడలమీద ఇలా రాసిపోయాడట.

 

    "అంధేర్ నగరీ చౌపట్ రాజా
    ఆఠ్ హైఁకన్దూ నౌహైఁకొత్వాల్
    నవాబ్ బచ్చా దివాన్ లుచ్చా"


                                   *  *  *  *


    తల్లి పోయిన్నాటి నుంచీ మూతపడి ఉన్న పడక గదిని తెరిపించింది జానకి. శుభ్రం చేయించింది. అలికించింది. స్వయంగా ముగ్గులు పెట్టింది. ఎత్తైన పందిరి మంచం మీద పరుపు, శుభ్రమైన బట్ట వేసింది. రెండు మూడు కుర్చీలు అమర్చింది. దానిని రఘుకోసం కేటాయించింది.

 

    తన బావ ఎంతో మారిపోయాడు. చిన్నతనంలో వదరుబోతుగా ఉండేవాడు. ప్రస్తుతం మౌనంగా ఉంటున్నాడు. చిలిపిగా ప్రవర్తించేవాడు. తనను ఎంతో సతాయించేవాడు. తాను ఇసుకతో పిచ్చుకగూళ్ళు కట్టుకుంటే తొక్కేసేవాడు. తాను ఏడుస్తుంటే నవ్వేవాడు. సద్దుల బతకమ్మనాడు తాను కొత్త పరికణా, జాకెట్టూ వేసుకుంది. బతకమ్మను పేర్చింది. చెరువుకు వెళ్ళే సమయంలో పెద్దవాన వచ్చింది. తాను జోరున పడే వానను చూస్తూ గుమ్మంలో నుంచుంది. ఎక్కడ్నుంచి వచ్చాడో బావ వానలోకి పరిగెత్తాడు. వానపడుతుంటే గంతులు వేయసాగాడు. అలా నుంచుని ముక్కుమీది నుంచి జారే నీటిని నాలుకతో చప్పరించసాగాడు. ఇంతలో తాను కనిపించింది. వానలోకి రమ్మన్నాడు తనను. రానన్నది లాక్కెళ్ళాడు. తాను ఏడ్చింది. నెత్తిమీద రెండు వేశాడు నోరు మూయమని. తానింకా పెద్దగా ఏడ్చింది. తన ఏడుపు విని అత్తమ్మ పరుగెత్తుకొని వచ్చింది. బావను వానలోంచి లాక్కొని వచ్చి బాదింది. అయినా బావ కిక్కురు మనలేదు. కాని ఆ దెబ్బలు తనమీద పడుతున్నట్లనిపించింది తనకు. మూలకు కూర్చొని వెక్కెక్కి ఏడ్చింది. తనను వెక్కిరించాడు బావ. తానూ వెక్కిరించింది. మళ్ళీ పోట్లాట! అలాంటి బావ పెద్ద మనిషిగా మారిపోయాడు. గంభీరంగా మారిపోయాడు. ఎప్పుడూ ఏదో ఆలోచనలోనే ఉంటాడు. ఏమి ఆలోచిస్తుంటాడో తనకు అర్థంకాదు. కాని ఎందుకో అతనిని ఆ ఆలోచనలలో చూస్తుంటే తనకు గుబులు అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతుంటాడు. చదువుతున్నప్పుడు పుస్తకంలోనే మునిగిపోతాడు. తిండి, నీళ్ళు సహితం కోరడు. అందువలన బావకు ఏకాంత ప్రదేశం కావాలని గ్రహించింది. జానకి వేరే గది సిద్ధం చేసి అందులో ప్రవేశపెట్టింది.

 Previous Page Next Page