Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 7

 
    రఘు చెప్పేదాన్ని వినడానికి సందిద్ధుడై కూర్చున్నాడు. రఘు అతని ఎదురుగా నుంచోని "నాగేశ్ గారూ! మీరు చిత్తశుద్ధి గలవారు. అంత పెద్ద త్యాగం చేయటానికి తయారుగున్నరు. కాని ఆవేశంలో ఆలోచన రాదు. కాస్త ఆలోచించి చూడండి. జమాల్ను చంపుతరు. ఇంకొక జమాల్ వస్తడు. కాని, మీరు పోతే మీవంటి చిత్తశుద్ధి గలవాడు ఇంకొకడు వస్తడా? ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నేతాజీ వరకు ఆవేశం వల్లనే ఉద్యమాలు కూలిపోయినవి. రత్నాలవంటి వీరులను కోల్పోయినది మన దేశం."

 

    నేతాజీ తప్పుచేశాడంటే సహించలేకపోయాడు నాగేశ్. "దొంగలుండి అంగ్రేజోళ్ళు దోచుకుంటాన్రు. నీతులు చెప్పుతే పోతారున్రి? యుద్ధమే చేయాలె. ఒక్కొక్క తెల్లోణ్ణి పట్టుకొని కొరకొర మెడలు కోయాల్నుండి" అని ఇంకేదో చెప్పాడు.

 

    నేతాజీ ఫాసిస్టులతో కలవడాన్ని గురించి ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు "మాకు నీవు నేతాజీవి, అంగ్రేజోడు తాసిల్దారు. ఎక్కడో జరిగిందాన్ని గురించి మనం ఇంత తీవ్రంగా వాదించుకోవటం బాగుండలేదు. ఇప్పుడు మనం ఈ విషయం ఆలోచించాలే" అన్నాడు రఘు.

 

    "మరి ఏం చేయమంటారో చెప్పండి. చంపమంటె తాసిల్దారునే పొడిచేస్త."

 

    "చంపటం చావడం తప్ప మనకేమి తెల్వదా?" కాస్త ఉద్రేకంగానే అన్నాడు రఘు.

 

    "వాండ్లు చేసెడిదది. వాండ్లకు తెలిసెడిదది. అట్లకాకుంటే మంత్రాలు చదువుదమ" ఉద్రేకంగానే జవాబు చెప్పాడు నాగేశ్.

 

    ఇదంతా వింటున్న జానకికి వీళ్ళిద్దరే పోట్లాడుకునే టట్లనిపించింది. గుండె దడదడ లాడింది. వెళ్ళి తండ్రిని లేపుదామనుకుంది. ఎవరిని -ఎవరు చంపుకుంటారో అర్థం కాలేదు.

 

    "నాగేశ్!" చిరునవ్వు నవ్వుతూ భుజం మీద చేయివేసి శాంతంగా అన్నాడు రఘు. అర్థం చేసుకో, చంపటం చావటం వ్యక్తులకు చెల్లుతుంది. అది జగడాలకు, ద్వేషాలకు, రోషాలకు, కావేషాలకు పరాకాష్ట. రక్తం చూచి రగులుతున్న ద్వేషం ఆరుతుంది. ప్రాణంతో పగ తీరుతుంది. అప్పటి నుంచి మరొక పగ మొదలై, ఆ అగ్ని కుటుంబాలను తద్వారా వంశాలను అలుముకొని నాశనం చేసి వదులుతుంది."

 

    "హింస పిరికితనానికి చిహ్నం. పలాయనానికి మరొక రూపం. అది ఉద్యమానికి బొత్తిగా పనికిరాదు."

 

    "ఉద్యమం ఏది? ఎక్కడ? ఎవడు? ఏదీ లేదు. ఇది నా వ్యక్తిగతమైన పగ తీర్చుకుంట; తేండి నా కత్తి నా దోవన నన్ను పోనీయండి. ఈ జీవితంలో మంచిపని చేయదలచిన, చేస్త. చావు అందరికి వస్తుంది. చస్త, తెండి నా కత్తి."

 

    ఉద్రేకంలో ఉన్నాడు నగేశ్. వణికిపోతున్నాడు. అతణ్ణి శాంతపరచడం ఎలాగో అర్థం కాలేదు. కత్తి తీసి చేతిలో పట్టుకొని. "నాగేశ్ ఉద్యమం నిర్మించాలె. మన పోరాటం వ్యవస్థతోగాని వ్యక్తితో కాదు. అజ్ఞానంలో ఉన్న ఈ ప్రజలను వెన్నుతట్టి లేపాలె. వారు తమ హక్కులను తెలుసుకున్నారో ఈ వ్యవస్థ దానంతట అదే తోక ముడుస్తుంది. నీ వంటి వీరుడు, నిస్వార్థపరుడు ఒక్కడుంటే ఉద్యమాన్ని నిర్మించి ఆ అగ్నిలో వీరు శలభాలవలే కాలిపోవటం చూచి ఆనందబాష్పం రాల్చగలను. కాక నీవు ఒక్కణ్ణి చంపి బలి అవుతానంటావా? ఉద్యమాన్ని బలి పెట్టిన వానివీ అవుతావు. ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటది. ఈ దోపిడి ఆగదు. ఈ ప్రజ ఇట్లనే నశిస్తరు. నువ్వు చంపుతనంటవ ఉద్యమం పుట్టుకనే చస్తది. నువ్వు చంపనంటవ ఉద్యమం పుట్టి పెరిగి నువ్వు చంపుతున్న వ్యవస్థను చంపుతది. ఊఁ ఇదిగో జంబియా! అందుకో. ఒక నిర్ణయానికిరా. నువ్వు చంపడానికి నిర్ణయించుకుంటె, పద, నేను నీ వెంట వస్త. ఇద్దరం బలి అవుదం."

 

    నాగేశ్ తలవంచి మౌనంగా నుంచున్నాడు. రఘు జంబియా కూర్చీమీద పెట్టి సిగరెట్టు వెలిగించి పొగ వూదుతూ మంచంలో కూలబడ్డాడు.

 

    మౌనం వెలిసింది. గదిలో నిశ్శబ్దత ఆవహించింది. పక్క గదిలో ఉన్న జానకికి ఇదంతా వింతగా తోచింది. ఒక నేల చెక్క కోసం, ఒక గేదె కోసరం, ఒక పట్టుదలకోసరం పోట్లాడుకొని ప్రాణాలు తీసుకున్న కథలు తాను కన్నది, విన్నది. కాని ఇదేమిటో ఎవరికోసమో పక్క గదిలో ఉన్న ఇద్దరు పోట్లాడుకుంటున్నారు!

 

    రఘు గదిలో లాంతరు మూడుసార్లు భగ్గుమని ఆరిపోయింది. గదిలో ఉన్న రెండు ప్రాణులూ ఆలోచనలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ గమనించలేదు. ఆలోచనల నుంచి మొదలు తేరుకున్న వాడు రఘు. చీకటిచూచి అగ్గిపుల్ల గీచి లాంతరు వెలిగించాడు. లాంతరు అందుకొని నాగేశ్ ను చూచాడు.

 

    నాగేశ్ కుర్చీలో కూర్చున్నాడు. ధారాపాతంగా కన్నీరు కారిపోతూంది. రఘు కరిగిపోయాడు. "నాగేశ్! ఎందుకట్ల ఏడుస్తవు?" అడిగాడు. నాగేశ్ లేచి నుంచున్నాడు. చేతులు జోడించాడు. కన్నీరు టపటప రాలుస్తూనే డగ్గుత్తికతో అన్నాడు.

 

    "భాయ్ జాన్! మీ విశ్వరూపం చూచిన. ప్రాణులమీద ఎంత దయ మీకు! ఉద్యమం మీద ఎంత అభిమానం! మీ దగ్గరికి రాకుంటే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యేవి. నేను ఆవేశంలో కొట్టుకపోయిన. నిజమైన మార్గం చూపినవు" అని రఘు చేతులు గట్టిగా పట్టుకొని - "నీవు కృష్ణునివి. నేను అర్జునుణ్ణి, సాగించు కురుక్షేత్ర సంగ్రామం. ఈ నాటికి నాయకుడు దొరికిండు, ఆజ్ఞాపించు. అగ్గిలో దూకుత" అని జంబియాతీసి బయట విసరబోయాడు. రఘు జంబియా తీసుకున్నాడు. "ఉంచుదాం. ఎన్నటికైన పనికిరావచ్చు" అని దాన్ని దిండు క్రింద దాచాడు.

 

    "అన్నా! ఇప్పుడు చెప్పు ఏం చేయమంటవు?" అడిగాడు నాగేశ్.

 

    "తమ్ముడూ! ప్రజలలో విజ్ఞానం వెదజల్లాలె. వారిని మేల్కొల్పాలె. నువ్వు వైతాళికుడవు."

 

    "నన్నేమి చేయమంటావో చెప్పు. నువ్వు అంతోనివి, ఇంతోనివి అనకు."

 

    "చదువు చెప్పాలె పీడితులకు తాడితులకు. వారిలో చైతన్యం కలిగించాలె. వారు మేలుకుంటే చాలు, వారే నాయకులు అవుతారు. మనం వారిని అనుసరించాలె అంతే."

 

    "వడ్డెర గూడెంలో బడి పెట్టిన, రాత్రి బడి. వయోజనులకు చదువు చెపుతున్న చాటుంగ."

 

    "చదువంటే, అక్షరాలుకాదు అరటి, ఆవు కాదు. అసలు అక్షరంలో ఏమీలేదు. ప్రపంచ జ్ఞానం కలిగించాలె. నేనుకూడా వడ్డెర గూడానికి వస్త రేపట్నుంచి."

 

    "మీరా! వడ్డెర గూడేనికి వస్తరా!" ఆశ్చర్యంగా అడిగాడు నాగేశ్.

 

    "ఏమి నేను మనిషిని కానా? రేపట్నుంచి నన్ను కూడ పిల్చుకపో."

 

    "సరే. మరి వస్త. శాన రాత్రయింది." అని వెళ్ళిపోయాడు నాగేశ్. అప్పటికి చంద్రుడు వచ్చేశాడు. నాగేశ్ మనసులోలాగే మహినిండా వెన్నెల పరచుకుంది.

 

    రఘు సిగరెట్టు వెలిగించి మంచంమీద మేను వాల్చాడు. అతని మనసు కూడా తేలిగ్గా వుంది. కన్ను మలిగింది.

 

    జానకికి నిద్ర పట్టలేదు. ఆవిడకు వారిద్దరి సంభాషణ ఇంకా వినిపిస్తున్నట్లే వుంది. ఇంకా ఆమె మెదడులో రింగుమంటూనే ఉంది. కొత్తగా ఆమెకు పరిచయం అయినాడు నాగేశ్! బక్కపల్చగా పొట్టిగా వున్న ఆ వ్యక్తి ఎంత ఉద్రేకం కనబరచాడు! అతని పంథా సరియైనది అనిపించింది ఆమెకు. తాసిల్దారును ఒక్క పోటుతో చంపేస్తే పీడ విరగడైపోయేది. రఘు వాదన ఆమె కేమీ నచ్చలేదు. నాగేశ్ ఎందుకలా లొంగిపోయాడు. నాగేశ్ గెలవాల్సింది. బావ తన బావ ఓడిపోవాలనుకుంటుందా? అవును ఓడిపోవాలి. నాగేశ్ జానకి మనసులో చోటు చేసుకున్నాడు.


                                   *  *  *  *


    తెల్లవారి తండ్రికి చాయ్ అందిస్తూ అడిగింది.

 

    "నాయ్నా! గుడ్లగూబంటే అర్థం తెలిసినాది?" అని.

 

    "తెలిసిందమ్మా. తెలిసింది. రఘు చెప్పినది అక్షరాల నిజం, కాని ఆపదలు కొని తెచ్చుకుంటున్నడు, మన మేం చేస్తం?"

 

    రాత్రి జరిగిన విషయాలూ, నాగేశ్ ఉద్రేకమూ తండ్రికి వివరింతామనుకుంది. తండ్రి మరికొంత చాయ్ అడుగుతే తేవడానికి లోనికి వెళ్ళిపోయింది.


                                       2


    తాసిల్దారుకు ఒక వింత కోరిక కలిగింది. అతని ఇల్లు లంకంతది. అయినా అది అందంగా కనిపించలే దతనికి. అందమైన ఒక మహా భవనం నిర్మించాలనుకున్నాడు. నాలుగంతస్తుల భవనం నిర్మించాలనుకున్నాడు. సుందర హర్మ్యం నిర్మించుకోవాలనుకున్నాడు. తన తరవాత తనకీర్తి శాశ్వతంగా ఆ భవనంలో నిలిచి ఉండాలనుకున్నాడు. మంచి చేయలేనివాడు మంచి భవనాలు కడ్తాడు. అవన్నా తనను బ్రతికిస్తాయని ఆశిస్తాడు. అందుకే ఆ చుట్టుపట్లలోనే కాదు, హైద్రాబాదులో సైతం లేనటువంటి భవనం నిర్మించాలనుకున్నాడు. నవాబులకు సైతం కన్ను కుట్టాలనుకున్నాడు. ఈ భవనాన్ని చూడడానికి దూర దూరాల నుంచి జనం రావాలనుకున్నాడు. ప్రత్యేకంగా హైదరాబాదు నుండి వాస్తు శాస్త్రజ్ఞులను పిలిపించాడు. వారికి విడిది, భోజనపు ఖర్చులు షావుకార్లు భరిస్తున్నారు. ప్లాను సిద్ధం అయింది. అందులోనే భవనం ఎంతో అందంగా కనిపించింది. తాసిల్దారు మురిసిపోయాడు. ముస్లిం వాస్తుశాస్త్రం ప్రకారం కమానులు, గుంబంద్ లూ ఉన్నా, అన్నింటినీ మించి అతనిని ఆకర్షించింది అంగణంలో అమర్చదలచిన హిందూ దేవాలయాల స్తంభాలు. అంగణం చాలా విశాలంగా ఉంది. అచ్చం దేవాలయ స్తంభాల మీదనే నిలిచి ఉన్నది. ఆ ఆలోచన తనకు వచ్చిందే. అందుకెంతో మురిసిపోయాడు. ఈ పేరు మీద దేవాలయాలను కూల్చవచ్చునని సంతోషించాడు. తనకు ఎదురు చెప్పే వాడుండడని అతనికి తెలుసు. అందరినీ పిలిపించాడు తాసిల్దారు. అంగణం జనంతో నిండి ఉంది. సాహుకార్లను మోతుబరి రైతులను మాత్రమే పిలిపించాడు.

 Previous Page Next Page